కనువిప్పు కలిగించే Incendies!

కాలంతో పాటు గతం కేవలం పాతబడదు. అది దాని భావావేశ శక్తిని పెంచుకోవడమో తగ్గించుకోవడమో చేస్తుంది కూడా. మన జ్ఞాపకాల్లో స్పష్టంగా ఉన్న గతం ఐతే రంగు ముదిరి, క్రమంగా ఓ రూపు లోకి వస్తున్న మన కథకి అనుగుణంగా వంగి సర్దుకుంటుంది. అవసరం ఐతే ఈ క్రమంలో కొన్ని వాసనల్ని పోగొట్టుకుంటుంది కూడా. అలా సర్దుకోలేని గతం ఓ పుండులా ఉండిపోయి కదిలించినప్పుడు మనల్ని మెలికెలు తిప్పుతుంది. మరి మనకు తెలియని మన గతం? మన తల్లిదండ్రుల కధలు, మన రక్త సంబంధుల చరిత్ర మనకు కేవలం సమాచారం. కానీ ఆ గతాల్లో హింసో, అణచివేతో, పంటి బిగువున భరించి జీవితాంతం మనకు అంతగా తెలియకుండా వారు మోసిన వేదనో ఉంటే ఉన్నపళంగా అవి మనల్ని నిర్వచించేంత శక్తిని సంతరించుకుంటాయి. అప్పటివరకూ అనుకుంటున్నట్టు మనం కేవలం ఈ కాళ్ళు చేతులు ఆడించేందుకు బుర్రలో ఉన్న కాస్త చైతన్యాలం మాత్రమే కాదనీ, రక్తపు మరకలతో మరో మనిషి శరీరంలోంచి ఓ లేత మాంసపు ముద్దగా బైటపడి మొదలైన కొనసాగింపులమనీ గుర్తు వస్తుంది. అటువంటి కనువిప్పు చుట్టూ నడిచే సినిమానే Incendies.

Nawal (Lubna Azabal) తాను చనిపోయాక తన పిల్లలకు అప్పగించమని తన వీలునామాలో కొన్ని చిత్రమైన విషయాలు పొందుపరుస్తుంది. వారు అనుకుంటున్నట్టు తమ తండ్రి చనిపోలేదని, తమకు ఓ సోదరుడు కూడా ఉన్నాడని, వెతికి ఇద్దరికీ అందివ్వమని ఓ రెండు ఉత్తరాలు సిద్ధం చేసి పెడుతుంది. ఇక ఈ అన్నా చెల్లెళ్లకు అదో Odyssey అవుతుంది. ఎందుకంటే Nawal పుట్టింది కెనడాకి చాలా దూరంగా ఉన్న ఓ మిడిల్ ఈస్ట్ దేశం. అక్కడి ఆమె గతాన్ని వెలికి తీస్తేనే ఈ ఇద్దరి ఆచూకీ తెలిసే అవకాశం వుంది. కొడుకు Simon కి ఇదంతా ఓ హాస్యాస్పదమైన వ్యవహారంలా అనిపిస్తుంది. ఆ గతాల్ని తవ్వుకోవటం అతని దృష్టిలో ఓ వృధా ప్రయాస. కూతురు Jeanne మాత్రం ఈ ప్రయాణానికి సిద్ధపడుతుంది. లిబియా ని తలపించే ఆ పేరు ప్రస్తావించబడని దేశంలో Jeanne ప్రయాణం మొదలయ్యి ఒక్కో వివరం, ఒక్కో సంఘటనగా తన తల్లి తాలూకు గతము, వ్యక్తిత్వమూ మెల్లగా ఆమెకు స్పష్టమవుతాయి. బ్రతికి ఉన్నప్పుడు తన తల్లి పొంతన లేని అయోమయం వెనక ఎన్ని సంవత్సరాల వ్యధ ఉందో ఆమెకు అవగతం అవుతుంది.

సినిమాటోగ్రాఫర్ Andre Turpin ఈ మిడిల్ ఈస్ట్ దేశాన్ని మనకు కూడా ఒక outsider perspective లోంచే చూపిస్తాడు. ముదురు ఎండ, ఎడారి మధ్యలో రోడ్డు మీద గంటకొకసారి కానీ కనబడని వాహనాలు, ఆ ముందు రోజే బాంబులతో ధ్వంసం చేయబడి ఇంకా పొగలు కక్కుతున్న బిల్డింగులు, వెరసి స్వల్ప విరామం కోసం నిద్రపోతూ మళ్ళీ ఎప్పుడు విరుచుకుపడుతుందో తెలియని యుద్ధభూమి గా దాన్ని చిత్రీకరిస్తాడు. క్రిస్టియన్, ముస్లిం మూకల మధ్య రక్తపాతం నడుమ చెల్లాచెదురైన దేశంలో ఆ యుద్ధపు వేడి, వాసన, Nawal ను మొదట పొగలా కమ్మి మెల్లగా దహించడం మొదలుపెడతాయి. ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ నెత్తుటి మరకల్ని తడుముతున్న Jeanne కు ప్రపంచ పటంలో ఇటువైపు జీవితం తన విశ్వరూపాన్ని కనబరుస్తుంది. Jeanne కు మహా ఐతే కెనడాలో లెఫ్ట్ వింగ్ రైట్ వింగ్ ప్రొటెస్ట్ లు పరిచయం ఉంటాయేమో. మిడిల్ ఈస్ట్ సివిల్ వార్ ల గురించి గార్డియెన్ లాంటి పత్రికల్లో వ్యాసలు చదివి ఓ చిన్నపాటి నరకాన్ని ఆమె ఊహించుకుని ఉండచ్చు కూడా. ఐతే ఇక్కడ ఈ దేశానికి స్వయంగా వచ్చి ఆ నెత్తురు తడిసిన నేలలో తన గతాన్ని తవ్వేప్పుడు ఆమె పూర్వ జ్ఞానం కేవలం ఓ సిరా మచ్చ అనీ, ఒక పేరాగ్రాఫులో మనం చదివే జైలు శిక్ష అన్న పదం వెనుక ఓ ఊహింపశక్యం కాని అనంతకాలపు కాల బిలం ఉంటుందని ఆమెకు అర్ధమవుతుంది.

చిత్రం ముందుకు నడిచే కొద్దీ Narwal గురించి ఆశ్చర్యపరిచే విషయాలు బైట పడుతుంటాయి. దాదాపు డిటెక్టివ్ థ్రిల్లర్ తరహా స్ట్రక్చర్ ఉన్న ఈ సినిమా చివరి వరకూ మనల్ని ఉత్కంఠ కి గురించేస్తూనే ఉంటుంది. అందుకు కాస్త plausibility ని వెల చెల్లించాల్సి వచ్చినా Villeneuve వెనక్కి తగ్గడు. గ్రీకు పురాణ కధల్లో లాంటి absurd మలుపులు వాస్తవ ప్రపంచపు మత కల్లోలాల మీద వ్యాఖ్యానిస్తున్న ఈ సినిమాకి అతుకుతాయా? ఇక్కడైతే అవుననే చెప్పాలి. అసలు ఒక మనిషి మతాన్ని బట్టి అతన్ని పెట్రోలు పోసి తగలెట్టాలా వద్దా అని నిర్ణయించడం ఎంత absurd? అలాంటి వాస్తవికత లోంచి పుట్టే కధల్లో నాటకీయతని ఇంకాస్త  విస్తరించి అల్లే ఇలాంటి మలుపులు అతిశయోక్తులు కాబోవు. పైగా దర్శకుడు Villeneuve ప్రతిభ ఇక్కడ చక్కగా ఉపకరిస్తుంది. ఉదాహరణకి Narwal కాలంలో మత మూకల హింసను చూపించేప్పుడు చాలా వరకూ వాటిని పాయింట్ ఆఫ్ వ్యూ  లోంచే చూపిస్తాడు. ఆ హింసను అతను underline చేయకపోవడం వల్ల అది ఆ దేశపు మామూలు వ్యవహారంలా చూపించడంలో సఫలం అయ్యాడు. అలా హింస అక్కడ అప్పుడప్పుడూ విరుచుకుపడే ఒక రాక్షసిలా కాకుండా ఆ దేశపు అనుదిన జీవనంలో అంతర్భాగంగా చూపించడం వల్ల ఓ సన్నటి విషాదం, పల్చటి భయం కథ అంతా కమ్ముకుంటాయి. Thats how you set the mood of a film. But enough about the technique.

యుద్ధం ఒక వెర్రితనం. ఆ వెర్రితనం మధ్యలో నిలబడి మానవ సంబంధాల కోసం పాకులాడిన Narwal ని ఆమె దేశపు మత కలహాలు విచ్చిన్నం చేస్తాయి. ఐతే అంతటి పరీక్షా ఆమె చిత్తాన్ని మరింత ధృడం గానూ, ఆమె మనసుని మరింత సున్నితంగానూ చేస్తాయే తప్ప Narwal ఆత్మను చెరపట్టలేకపోతాయి. “Sometimes it’s good to not know” అంటాడు Narwal గురించి అడగబోయిన Jeanne తో అక్కడి పాత జైలర్. భయంకరమైన నిజాలు మనల్ని నాశనం చేస్తాయా? శరీరంపై, ఆత్మపై మోయలేని బరువుని మోపుతాయి నిజమే. కానీ వాటన్నిటిగుండా నడిచిన Narwal చివరి ఉత్తరాల్లో ప్రేమ, వెచ్చదనం కాక వేరేమైనా ధ్వనిస్తాయా? మానవ చరిత్రలో అపారమైన హింస ఉన్నది నిజమే. ఆ హింసకు తర్వాత మనం నెమ్మది నేర్చుకున్నాము. నేర్చుకోగలము. ఆ మిడిల్ ఈస్ట్ దేశంలో తన గతాన్ని వదిలేసి వేరెక్కడో ప్రశాంతంగా బ్రతికిన Narwal ఇందుకు సాక్ష్యం. Our past can be an indication of how wrong things can go. మన దేశాల సంస్కృతుల చరిత్రల్లో హింసను, అణచివేతను మనం తవ్వి తీరాలి. అవి మన ఆత్మల్ని బీటలు తీయించినా సరే. మన మానవత్వపు అంచుల్ని ఎరిగినవాళ్ళమై, ఒకరికి ఒకళ్ళం ఎంతెంత నరకాల్ని ఇచ్చి పుచ్చుకోగలం అన్న విషయాల్ని గుర్తుంచుకోవాలి. యుద్ధానికి పూర్వం ఉండే అమాయకత్వం, యుద్ధం తర్వాతి నిర్మలత్వం ఒకటి కావు. ఆ పశ్చాత్తాపాన్ని తనలో పొందు పరుచుకున్న గతం అనుభవాల అవసరాన్ని bypass చేసి మనకు చాలా పాఠాలు నేర్పిస్తుంది. అవి తవ్వడానికి ధైర్యం ఐతే చాలా కావాలి మరి.

*

స్వరూప్ తోటాడ

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • Excellent movie with a great shock factor. War changes human lives to an unbelievable extent

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు