కనపడని నక్షత్రాల్లారా!

ఈ కనపడని నక్షత్రాలు

ఒకప్పుడు

విత్తనాలేమో

నేలలో ఇంకకముందే

మరణించాయనుకుంటా.

ఎందరో మాయమవుతున్నారు.

 

ఆకాశంలో నక్షత్రాలుగా మారిపోతే మాత్రం

జరిగేదేముంది?

కాలుష్య నగరంలో అవి కూడా

కనపడవు.

‘ఇంకెంతో జీవితం మిగిలి ఉంది.

ఇంకా సాధించాల్సిందెంతో ఉన్నది

రాత్రి తర్వాత ఉదయం రాక తప్పదు’

ఈ మాటలు విని

బీభత్సం చూసిన ప్రకృతి

నవ్వుకుంటుందేమో!

 

ఈ కనపడని నక్షత్రాలు

ఒకప్పుడు

విత్తనాలేమో

నేలలో ఇంకకముందే

మరణించాయనుకుంటా.

భూమి ఛేదించుకోకముందే

విత్తనాలు శవాలై తేలాయి

ఆకులు తొడగకముందే

అంతర్ధానమయ్యాయి.

పంటను వాగ్దానం చేశాయి

కాని వర్షపు చినుకులే రాలలేదు

నెత్తుటి  ధారలు

రాత్రింబగళ్లూ కుండపోతగా

కురుస్తూనే ఉన్నాయి.

కవుల విషాదగీతాలు,

ప్రవాస గానాలు

ప్రవహిస్తూనే ఉన్నాయి..

 

సినిమా హీరోలైనా కాకపోతిరి

మీకోసం జనం కొట్టుకుచచ్చేవారు

ఉత్తుత్తి ఫైటింగ్ తో అలరిస్తే

మిమ్మల్ని చూసేందుకు

తొక్కిసలాటలో అమరులయ్యేవారు.

 

పోనీ మంత్రవిద్య నేర్చుకుని

ఉపన్యాసాలతో ఉర్రూతలూగించారా

అదీ లేదు

మీ నినాదాలేమీ ఉన్మాదుల్ని

సృష్టించలేదు సరికదా

పసిపాపల్ని

మృత్యుయుద్దం వైపు

నడిపించాయి.

 

కనీసం గుళ్లూ, గోపురాలూ కట్టించి

విగ్రహ ప్రతిష్టాపనలు చేయలేదు.

మీ కోసం వచ్చి నదుల్లో

జనం కొట్టుకుపోయేవారు.

జనం నమ్మకాలంటే

మీకు తక్కువ అంచనా

 

బూటకపు వాగ్దానాలు చేయడం కూడా

చేత కాదు

ఓట్ల వర్షంతో గద్దెనెక్కేవారు.

మనిషిని మనిషి మోసగించే

కళ రానప్పుడు

పిచ్చిడొంకల్ని, గుట్టల్ని ప్రేమించక ఏమి చేస్తారు?

 

ఉన్నఊరు వదిలి, బంధాల్ని విడిచి

వెళ్లడం గొప్పేమీ కాదు.

ఇక్కడ అంతా అలాగే వెళ్లి

విదేశాల్లో డాలర్లు ఆర్జిస్తున్నారు

మీరేమో పిచ్చిగా

చంపే, చంపుకునే

మార్గాన్ని ఎంచుకున్నారు

 

మీకు కులం, మతం అవసరం లేదేమో

ఇక ఎలా బతకాలనుకున్నారు..?

అందమైన మార్కెట్ జలతార్ల మధ్య

జీవించడమూ మీ తరం కాదు.

 

మీకు దేశ భక్తి ఉందో లేదో తెలియదు

ఏ దేశం కోసం

ఏ దేశంతో యుద్దం చేస్తున్నారో

తెలియదు.

కేశవా, నీ నామస్మరణే మాకు పుణ్యం

నీవు మాత్రం కనపడని

నక్షత్రమై వెలిగిపో!

*

చిత్రం: రాజశేఖర్ చంద్రం 

కృష్ణుడు

వారం వారం ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఢిల్లీ నుంచి కాలమ్ రాసే ఎ. కృష్ణారావు, అడపా దడపా కవితలు రాసే కృష్ణుడూ ఒకరే. జర్నలిస్టుగా 34 సంవత్సరాల అనుభవం ఉన్న కృష్ణుడు కవి, సాహితీ విమర్శకుడు కూడా. ఇండియాగేట్, నడుస్తున్న హీన చరిత్ర పేరుతో రాజకీయ వ్యాసాల సంకలనాలు వెలువరించిన కృష్ణుడు ఇంకెవరు, ఉన్నట్లుండి, ఆకాశం కోల్పోయిన పక్షి అనే కవితా సంకలనాలను వెలువరించారు.

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • కృష్ణారావు గారు ఇవ్వళ్ళ్టి దేశ పరిస్తితిని చాలా సరిగ్గా చిత్రీకరించారు.

    “మీకు దేశ భక్తి ఉందో లేదో తెలియదు

    ఏ దేశం కోసం

    ఏ దేశంతో యుద్దం చేస్తున్నారో

    తెలియదు.”

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు