కథ చెపుతూంటే .. వింటూంటే ..

ఆంగ్ల కథా చర్చలోని కొలబద్దలతో మన తెలుగు కథని కొలవటం, పరిణామాన్ని అర్ధం చేసుకోటం లోగడ జరిగిందని నా పరిశీలన. నేను కొంత భిన్నంగా ఆలోచిస్తున్నాను.

1. నేనీ వ్యాస పరంపర తలపెట్టినపుడు sensational అవుతుందనే ఊహ లేదు. కాని కొంతమంది అయినా చదువుతారని మాత్రం అనుకున్నాను. సీరియస్ అంశాలకు పాఠకులు తక్కువే అని నాకు తెలుసు. కథాప్రహేళిక అనే పేరిట కథల మీద పాఠకుల స్పందన అర్ధం చేసుకోవాలని 1992లో ప్రయత్నించాను. కొన్ని తేలిక కథలు కొన్ని లోతైన కథలు రాసాను. పాఠకులను కదపటం కూడా లక్ష్యం చేసుకున్నాను. దానికి మాధ్యమం అచ్చు పత్రిక. దానికి మంచి స్పందనే లభించింది. ఈ పాతిక ఏళ్లలో చాలా వేగంగా మార్పులు వచ్చాయి. అనేకమంది పాల్గొని తమ అభిప్రాయాలు పంచుకోవచ్చు. తమ జ్ఞానాన్ని పెంచుకోవచ్చు. అలాంటి మాధ్యమం వచ్చింది. చదువుకున్న వారి సంఖ్య పెరిగింది. వారిలో సాంకేతిక విద్యావంతులు పెరిగారు. ఈ పరిణామాల వల్ల లోతుగా ఆలోచించేతత్వం పెరుగుతుందని అనుకున్నాను. కాదంటే ఆశ కూడా పడ్డాను. దానికి బదులుగా గతం గురించి జబ్బలు చరుచుకునేవారు పెరిగారు. గతంలో అనుభవించిన దుఃఖాన్ని పంచుకునీవారూ పెరిగారు. గతమాధుర్యానికి గిరాకీ పెరిగింది. అలాంటి వారి రాతల్లో వీరావేశం ఉంటుంది. దుఃఖోద్విగ్నత ఉంటుంది. బంగారు గతాన్ని కోల్పోయామనే వేదన ఉంటుంది. ఇటువంటి వాటికి ఉద్వేగాలను కదిలించే శక్తి సహజంగానే హెచ్చు. ద్వేషం కూడా ఒక ఉద్వేగమే. ద్వేషానికి ప్రతిద్వేషమూ ఉంటుంది.  దానాదీనా సాహిత్యంలో దానికి చప్పుడు ఉంటుంది. ఆవేశకావేషాలూ ప్రకటితమవుతాయి. ఇది ఓ వాస్తవం. ఇలాంటి సందర్భంలో ఉన్నాం మనం. ఇది నా పరిశీలన. ఈ స్థితిలో ఆలోచింపజేయాలనుకునే వారు ఉత్సాహపడే అవకాశం తక్కువే. కథ పుట్టినప్పటి నుంచి నేటి తెలుగు కథ వరకూ జరిగిన పరిణామాలను నాకు అర్ధమైనమేరకు చెప్పాలని ఉంది. అంతస్సూత్రం పట్టుకోవాలని ఉంది. ఓపిక ఉన్నంతకాలం నా ఈ ప్రయత్నం కొనసాగిస్తాను.

  1. కాకపోతే- చాలా బాగా చదువుకున్న వారు కొంత స్పందించారు. వారికి కావలసిన విధంగా రాయటమంటే అది నాశక్తికి మించినపని. సమర్ధులు చేపట్టనపుడు నాబోటివారు చేతనైన విధంగా ప్రయత్నం చేస్తారు. మేధోరంగంలో కదలికకి మనిషి ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నానికి సాహిత్యం ఒక వాహికయే కాదు సూచిక కూడా. దాని పాత్ర, పరిమితులూ అర్ధం చేసుకోటానికి ఈ కథాయానం ఆరంభించాను.
  2. నేను ప్రశ్నలు వేసుకుంటున్నాను. జవాబులు వెతుక్కుంటున్నాను. నేనిచ్చుకునే జవాబులు కొన్ని. పుస్తకాలలో దొరికేవి కొన్ని. ఇంటర్నెట్టులో దొరికేవి కొన్ని. లోగడ కథాతత్వం మీద రాసిన మన వారు పుస్తకాల మీద ఆధారపడ్డారు. ఆ పుస్తకాలు మనకన్న ఎక్కువ పరిశీలనాతత్వంతో ఆంగ్లంలో రాసినవి. గొప్పవారిగా గుర్తించబడ్డవారి అభిప్రాయాలను దాదాపు ప్రామాణికంగా తీసుకుని ఆలోచించే పద్దతి వారిది. వారిని ఉటంకించటం వల్ల తమ వాదనకి పుష్టి చేకూరుతుందన్న భావన ఉంది. అది సహజం కూడా. ఇంకా లోతుగా అధ్యయనం చేయదలుచుకున్న వారికి ఆ అభిప్రాయాలను చర్చించటానికీ ఈ ఆధారాలు, ఉటంకింపులూ ఉపయోగపడవచ్చు.  భిన్నంగా ఆలోచించేవారంటారు. వారు ఖండన మండనలు చేయాలనుకుంటారు. తమ వాదనలను ప్రోది చేసుకోటానికి ఇతర ఆధారాలను వెతుక్కోవచ్చు.  ఇది నేను అర్ధం చేసుకున్నాను. ఆ పద్దతిలో ప్రసిద్ధుల ఆలోచనలను పరిచయం చేయగలుగుతాం. నేను ఉండబట్టలేక కథలు రాసినవాడిని. ప్రశ్నలు కలిగినపుడు ఆలోచించుకుంటూ చదువుకుంటూ తెలుసుకుంటూ వ్యాసాలు రాసినవాడిని. నేను చదివిన చదువుకీ చేసిన ఉద్యోగానికీ ఏమాత్రం సంబంధం లేని పని ఇది. నా విద్యార్హత కూడా తక్కువ. ఎలాంటి శిక్షణా లేదు నాకు. కనక వ్యాసరచనలో పాఠకులని ఎలా భాగస్వాములను చేయాలో ఆ skill set ఏమిటో నాకు తెలియదు. కాని ఆంగ్ల కథా చర్చలోని  కొలబద్దలతో మన తెలుగు కథని కొలవటం, పరిణామాన్ని అర్ధం చేసుకోటం లోగడ జరిగిందని నా పరిశీలన. నేను కొంత భిన్నంగా ఆలోచిస్తున్నాను. అదేమిటో క్రమంగా ఇది చదివేవారికి అర్ధమవుతుంది. )

కథకీ  – కథానికకీ ప్రదానమైన పోలికలు 1. చెప్పేవాడు వినేవాడూ అనే ఇద్దరు రెంటిలోనూ ఉండటం 2. చెప్పాలన్న తహతహ వినాలన్న తహతహ .

  1. ప్రదానమైన భేదాలు 1. మాటలో చెప్పటం రాతలో చెప్పటం 2. చెప్పేవానికీ వినేవానికీ ఉండే సంబంధంలో అనేక వ్యత్యాసాలు. రెండూ కల్పన ప్రధానమైనా కథానికకి వాస్తవాలు ప్రధాన కేంద్రం.. కథకి ఊహలు ప్రధాన కేంద్రం.

అన్ని సంస్కృతులలోనూ విశ్వవ్యాప్తంగా కథలు చెప్పుకోటం అనే లక్షణం ఉందంటారు  మానవ శాస్త్రజ్ఞులు(anthropologists).  అది ఒక సామాజిక అవసరమని వివరిస్తారు సమాజ శాస్త్రజ్ఞులు (sociologists).  కథలు చెప్పుకోటం అనేది మానవ సమాజ నిర్మాణంలో,  ప్రస్థానంలో కీలకమైన పాత్ర వహించిందన్నది అందరూ గుర్తించిన అంశం. ఇదంతా చెప్పుకున్నాం. కథలు చెప్పేవాళ్లకి ఉండే మేధోసామర్ధ్యాలను కలబోసుకున్నాం. వారికి లభించిన ప్రాధాన్యత దాని పరిణామాలు చూసాం.

మరి- కథలు చెప్పేవాడు ఎందుకు చెపుతాడు?

నేనెందుకు రాస్తున్నాను – అన్న ప్రశ్న ఇచ్చి విశాఖ రచయితల సంఘం సభ్యుల చేత రాయించారు రావిశాస్త్రి. అది జిజ్ఞాస నుంచి పుట్టిన ప్రశ్న కాదు. రావిశాస్త్రి గారి ప్రాపంచిక దృష్టికోణం నుంచి పుట్టిన ప్రశ్న అది. సమాజం గురించి రాయాలన్నది ఆయన జవాబు.  దాన్ని మనం ఆదర్శం అనొచ్చు. ఆ ఆదర్శం వైపు రచయితలని నెట్టాలన్న ఆకాంక్ష కూడా ఉండి ఉండవచ్చు. అంతెందుకు..  ధనం కోసం. కీర్తి కోసం వంటి జవాబులు మనమే ఇచ్చెయ్యగలం. సరదా అని కొందరు అనవచ్చు. నాకేదో పూనినట్టుంటుంది అంటారు కాళీపట్నం రామారావు రాసినప్పటి స్థితిని గురించి. కథలు రాసే నేటి కథకులని విచారించితే దానిలో ఏదో ఆనందం ఉందని వారు చెప్పవచ్చు. చెప్పకుండా ఉండలేకపోవటమని కూడా జవాబు రావచ్చు. ఇవన్నీ తమ చర్యలపై.. వాటి ఫలితాలపై.. కథకుల అభిప్రాయాలు మాత్రమే.

ఒక మానవ ప్రాణి కథ చెప్పాలని లేదా రాయాలని ఎందుకు అనుకంటుంది? అందులో ఏమైనా జీవలక్షణం ఉందా? ఈ ప్రశ్నకి ఇవన్నీ సమగ్రమైన సమాధానం ఇవ్వవు.

తమ ఊహలను పంచుకోవాలనిపించటం అనే ఒత్తిడి ప్రాణిపై పనిచేస్తుంటుందని నేననుకుంటున్నాను. ఇది కూడా పూర్తి సమాధానం ఇవ్వదు. మరికొన్ని ప్రశ్నలు పుడతాయి. ఆ ఊహలు ఎందుకు కలుగుతాయి? ఆ ఒత్తిడి ఏమిటి?

మాఊర్లో నా చిన్నతనంలో కరెంటు ఉండేది కాదు. వీధిలో వరసగా మంచాలు వేసుకుని పడుకునీవాళ్లం. కబుర్లు. కథలు. ఆకాశంలో కొలువుతీరిన నక్షత్రాలు. పక్కనుంచి చెరువుగాలి. అలాంటి సమయంలో -ముసిలమ్మ నూలు వడుకుతోంది చూడండ్రా – అనేవాడు ఎవడో ఒకడు.  ఆకాశంలోకి చూసేవాళ్లం. కుప్పలు కుప్పలుగా పోసిన తారలలో అతనికి కనిపించిన ఆకారాన్ని కొంతసేపటికి మేమంతా చూసేవాళ్లం. ఇంకొకడు –కాదెహే అది ముసిలమ్మని మంచం మీద కూర్చోబెట్టి మోస్తున్నారు- అనేవాడు. కొంతసేపు వాడు వివరిస్తే  మాకు అదీ కనిపించేది. ఇది చెల్లాచెదురుగా ఉన్నవాటిలో ఒక మాదిరి (నమూనా)ని గమనించటం. బూదరాజు రాధాకృష్ణ గారు ఈ pattern recognitionని విన్యాస జ్ఞానం అన్నారు.

ఈ విన్యాసజ్ఞానమే  కథ చెప్పే ప్రేరణ అవుతుందంటుంది సైన్సు. దానిని ఇలా వివరిస్తుంది.

కనిపించే వస్తువులలో–చెట్టు, పిట్ట, ముఖం వంటి వాటిలో- ఒక మాదిరిని మెదడు గుర్తిస్తుంది. అదేవిధంగా వినే శబ్దంలో మాదిరిని గుర్తిస్తుంది. ఈ గుర్తించటమనే ప్రేరణ(ఉబలాటం)(impulse) ఎంత బలమైనదంటే -వాస్తవంగా లేని వాటిలో కూడా- ఏదోఒక నమూనాని మెదడు గుర్తిస్తుంది.  దాని వివరణలో పుట్టేది కథ. ఇంద్రియ గ్రాహ్యజ్ఞానం(collected data) నుంచి మెదడు ఒక నమూనా(pattern) గుర్తిస్తుంది. దానిని  తోటివారితో పంచుకోవాలనే ఉబలాటం కలుగుతుంది. ఈ నమూనాని ఇతరులకి తెలియజెప్పటానికి కథలు కడతారు. లేదా ఆ తెలియజెప్పడమే కథ.(ఇంటర్నెట్టులో లభించిన ఈ వివరణ నాకు సమ్మతంగా అనపించింది)

ఈ విన్యాసజ్ఞానంపై 1944లో స్మిత్ కళాశాలలో ఒక ప్రయోగం చేసారు. ఈ విషయంపై అది ఒక మైలురాయిగా భావిస్తారు. 34 మంది విద్యార్ధులకి ఒక లఘుచిత్రం చూపించారు. రెండు త్రికోణాలు ఒక వృత్తం ఆ చిన్ని సినిమాలో ఉన్నాయి. అవి ద్విమితీయ తలంపై కదులుతున్నాయి. అవి కాక ఒక దీర్ఘ చతురస్రం కూడా ఉంది. దానికి ఒక వైపు కొంత ఖాళీ ఉంది. అది మాత్రం కదలటం లేదు. ఈ సినిమా చూసి ఏం జరుగుతుందో చెప్పమని అడిగారు. కేవలం ఒక్కరు మాత్రం ఒక తలంమీద కదులుతున్న జ్యామితి రూపాలుగా(geometric shape) గుర్తించారు. మిగిలినవారంతా చిత్ర విచిత్రమైన కథలు చెప్పారు. ‘పోట్లాడుతున్న ఇద్దరు మగవాళ్లు ఆ త్రికోణాల’ట. అందులో ‘పెద్ద త్రికోణం ఏడిపిస్తూంటే దాన్నించి తప్పించుకుంటున్న స్త్రీ’ ఆ వృత్తంట.  ఇదొక కథ. నిర్జీవ రూపాలుగా గుర్తించటానికి బదులు …. సజీవ ప్రాణుల మధ్య  తమ ఎఱుకలో జరుగుతున్న జీవితాన్ని చూసారు. ‘విషాదంగా ఉంది’ట వృత్తం. ఆ వృత్తమూ, చిన్న త్రికోణమూ ‘అమాయకమైన యువ ప్రాణుల’ట. ‘పట్టరాని కోపంతో, ఉద్విగ్నతతో కళ్లుమూసుకుపోయింది’ట పెద్ద త్రికోణానికి. ఇలాంటి వివరణలు చేసారు ఆ ప్రయోగంలో పాల్గొన్నవారు.

ఈ ప్రయోగంలో తేలిన అంశం కథకీ కథానికకీ వర్తిస్తుంది. రెంటిలోనూ మానవప్రాణి మెదడులో జరిగే చర్య ఒకటే. కథకీ కథానికకీ వర్తించే మరో ప్రధానమైన అంశం రెండు పరస్పర ఆధారిత భౌతిక అస్తిత్వాలు. అంటే  రెండు మెదడుగల ప్రాణుల మధ్య జరిగే పరస్పర చర్య.  చెప్పే ప్రాణి లేకుండా వినే ప్రాణి ఉండదు. అంటే చెప్పటం లేకుండా వినటం ఉండదు. వినటం లేకుండా చెప్పటం ఉండదు. ఈ పరస్పరచర్య ప్రతిఫలనమే కథ.

కథ చెప్పే లేదా రాసేవారి గురించి ఇప్పటి వరకూ చర్చించుకున్నాం. వినే లేదా చదివేవారి గురించి చూద్దాం. ఎందుకు వినాలనుకుంటారు,, దానికి సైన్సు వివరణ ఉందా.. వినేవారిపై ప్రభావం ఏమిటి? అసలు వినేవారు అని ప్రత్యేకంగా ఉంటారా?

చిన్నప్పుడు చుక్కలు చూస్తూ ఒకరు రాట్నం వడికే ముసిలమ్మని చూసి.. మిగిలిన వారికి చూపిస్తే వాళ్లలో చాలామంది అవును నిజమే అనేవారు కదా!  మొదట చూసి చూపించిన వాడు కథకుడు అనుకుందాం. తర్వాత ఆ చుక్కల్లోనే అతను చెప్పినదాన్నే చూసేవారు శ్రోతలు అనుకుందాం.  ఆ శ్రోత కూడా కల్పనలో భాగమవుతున్నాడు. అంటే కథ చెపుతున్నాడు. కథకునిగా రూపాంతరం చెందాడన్న మాట.

ఒకడు ఇంకొకడితో మూడోవాడి గురించి ఒక కుతూహలకరమైన సమాచారం చెపుతాడు. అది చెడే కానవసరం లేదు. వాడు బాణం వేస్తే ఒక తాటిచెట్టు కూలింది అని చెప్పాడనుకుందాం. విన్నవాడు వేరొకడితో వాడి బాణం దెబ్బకి ఏడు తాటిచెట్లు కూలాయి అంటాడు. ఆ వేరొకడు ఒక్కమారుగా కూలాయి అంటే ఆ కూలినపుడు అక్కడి జంతువులు చచ్చాయనో లేదంటే కకావికలైనాయనో చేరుస్తాడు. విన్న వారందరూ కూడా చిలవలూ పలవలూ కల్పిస్తున్నారు. అంటే కథలు చెపుతున్నారన్నమాట.

మూడోవాడి గురించి సమాచారం ఇవ్వటాన్ని లోతుగా చూస్తే అది వదంతులు.. ఊసుపోక కబుర్లూ.. డచ్చీలు కొట్టటం.. గాసిప్పులూ.. కోవలోకి చేరుతున్నట్లు అనిపిస్తోంది గదా.. రాబిన్ డంబర్ అనే పరిణామ శాస్త్రజ్ఞుడు కథామూలాలు గాసిప్ లో ఉన్నాయని కూడా వాదిస్తాడు. ఆది నుంచి ఈనాటివరకూ ఉన్న సామాజిక అభ్యాసం గాసిప్. ప్రపంచంలో 65 శాతం బహిరంగ సమావేశాలలో జరిగేది ఊసుపోక కబుర్లేనని ఒక సర్వే చెపుతుంది. అంటే  అందరూ కథకులేనన్న మాట.  చెప్పటం మౌఖికంగా జరిగితే వినేవారు కథకులవుతున్నారని వాదనను సులువుగా ఒప్పుకోవచ్చు.

మరి చదివేటపుడు? రాసేటపుడు?

కథకీ కథానికకీ తేడాలు గురించి వివరంగా మాటాడుకునేటపుడు లోతుగా పరిశీలించుదాం. ప్రస్తుతానికి చదవినవాడు కూడా కథకుడు అవుతాడు అనుకుందాం. ఎలాగ? ఒకరు రాసిన కథ చదువుతూ తన అవగాహన మేరకు అందులో సమాచారంతో.. తనకున్న వ్యక్తిగత ఇష్టాయిష్టాలతో.. రచయిత ఉద్దేశిత లక్ష్యానికి భిన్నంగా వేరే కథ కట్టుకుంటాడు చదువరి. అంటే భిన్నంగా ఆలోచిస్తాడు. నేరుగా చదువరి మాటాడాడనుకోండి.. చదువరి రాసినదానిని రచయిత చదివాడనుకోండి.. రచయితకి అది తెలుస్తుంది. చదువరికి కథ నచ్చిందంటే.. ఇదేంటీ.. నేనిలా రాయలేదే.. అని బిత్తరపోయే అనుభవం చాలామంది రచయితలకి కలిగుంటుంది. వాడు నచ్చలేదంటే వక్రభాష్యం చెపుతున్నాడని కోపం రావచ్చు.

ఎందుకలా జరిగింది? నేను సరిగా రాయలేకపోయేనా అనే విచికిత్స కూడా రచయితకి కలుగుతుంది. ‘చెట్టుని చూస్తే దాని ఆకులు గాలికి కదులుతుంటే పువ్వులు రాలుతుంటే పదిమందికీ ఒకేలా అనిపించదు. అది సజీవమైనది కనక. అదే ఒక భవంతిని చూస్తే అందరికీ ఒకేలా కనిపిస్తుంది. ఎందుకంటే అది నిర్మాణం కనక. అంటే నిర్జీవమైనది కనక.’ ఇలా ఒక పాటర్న్ (ఇక్కడ సిద్ధాంతం) కనిపెడతాడు ఆలోచనాపరుడైనవాడు. అతని సిద్ధాంతం ఎంతవరకూ నిలుస్తుంది అన్న చర్చ పక్కన ఉంచుదాం. శ్రోతలాగే చదువరి కథకుడవుతాడు అనే అంశానికి పరిమితమవుదాం. చదివేటపుడు ఒక కల్పిత అనుభవాన్ని వాస్తవ అనుభవంగా రూపొందిస్తుంది మెదడు అని పమీలా బి. రూట్లెడ్జి అనే మనస్తత్వ శాస్త్రజ్ఞులు చెపుతారు.

కథలు చెప్పే జంతువు మానవుడు(story telling animal) అంటూ ఓ పుస్తకం రాసారుట Jonathan Gottschall. అందులో ఏముందో నాకు పూర్తిగా తెలియదు. వినేవారు(శ్రోతలు) కథకులే. ఇరువురి మెదడులో జరిగే చర్య ఒకటే అని సైన్సు చెపుతుంది. చదువరి -రచయిత అన్న స్థితికి పరిణామం చెందాక కొంత తేడా ఉన్నా ఆలోచిస్తే మానవుడు కథలు కట్టే జంతువే అని తేలుతుంది.

కథకీ కథానికకీ తేడాల గురించి వచ్చే సంచికలో మాటాడుకుందాం. అలాగే చదవటం వల్ల సమాజంలో వ్యక్తిలో వచ్చే మార్పుల గురించి జరిగిన శాస్త్రజ్ఞల ప్రయోగాలు వారి ప్రతిపాదనలూ కూడా చూదాం.

వివిన మూర్తి

తెలుగు సాహిత్యంలో పరిణత వాణి వివిన మూర్తి సాహిత్యం. కథ, నవల, విమర్శ అనే మూడు బంధాల మధ్య రచనతో పాటు ఆచరణని జీవనమార్గంగా సూచిస్తున్న బుద్ధిజీవి.

9 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మూర్తి గారూ!

    విషయాన్ని ఆసక్తికరంగా చెప్తున్నారు, కొన్ని సిద్దాంతాలు వివాదాస్పదమే అయినప్పటికీ.

    “చదివేటపుడు ఒక కల్పిత అనుభవాన్ని వాస్తవ అనుభవంగా రూపొందిస్తుంది మెదడు అని పమీలా బి. రూట్లెడ్జి అనే మనస్తత్వ శాస్త్రజ్ఞులు చెపుతారు”

    రాసేప్పుడు దీనికి సరిగ్గా వ్యతిరేకంగా వాస్తవ అనుభవాన్ని ‘కల్పిత’ అనుభవంగా రూపొందించాలేమోగా రచయిత మెదడు?

    కా.రా గారూ , మీరు కూడా ఇంతకు ముందు అన్నారు- ఉన్నది ఉన్నట్టు రాయటం కాదు రచయిత చెయ్యాల్సింది అని. (కా.రా ‘కథా కథనం ‘ లో కూడా ఇదే రాశారు).

    ఓ కథ విజయవంతం అవ్వటంలో రచయితకుండే ఈ ‘కల్పిత’ సామర్ధ్యం చాలా ముఖ్య పాత్ర పోషిస్తుందేమో అని – ఈ అడగటం.

    • కల్పనా సామర్ధ్యం చాలా ప్రధానమయింది ,ురేష్. దానిగురించి ఇంతకు ముందు వ్యాసంలో వివరంగా రాసాను. దానికి కావల్సిన మేధోసామర్ధ్యాలను వివరంగా చెప్పాను. కాకపోతే కథ విజయవంతం అవటం అంటే ఏమిటి ? రాసే కథానికకి చేరాక ఈ అంశం పై వివరంగా రాస్తాను.

  • మంచి వ్యాసమండీ. చెప్పడం, రాయడం-చదవడం అనే తేడాలు చూసేప్పుడు స్థల కాలాల తేడా ఉంటుందేమో అని సందేహం. జస్ట్,లౌడ్ థింకింగ్.
    చెప్పేటప్పుడు స్థలకాలాలు దాదాపు ఒకటే. ఎదుటి వ్యక్తి హావభావాలు తెలుస్తూ ఉంటాయి. దానికి అనుగుణంగా మనం చెప్పే విధానం, టోన్, పిచ్ మారుతూ ఉంటాయి. రాయడమంటేనే ఎంతో కొంత కృత్రిమత్వం వస్తుంది. ‘కాన్షియస్’ అవడంలో ఉండే ఇబ్బందులన్నీ వస్తాయి. పాఠకుడు/పాఠకురాలు తన కాలంలో తన స్థలంలో తన చేతనలో చదువుతారు.(వాక్యాన్ని జెండర్ న్యూట్రల్ చేయడమనే కాన్షియస్ నెస్ నుంచి వచ్చిన తిప్పలు) చేతన రెండు సందర్భాల్లోనూ సబ్జెక్టివ్ అయినప్పటికీ స్థలకాలాలతో వచ్చే తేడా అదనం.
    పైగా మాట అంటే ధ్వని ప్రాధమికం, లిపి ద్వితీయం. మొదటిదాన్ని రెండోది ఎన్నటికీ పూర్తిగా రీప్లేస్ చేయలేం. ఎంత మాండలికంలో -వ్యవహారికంలో ప్రయత్నించినా మహా అయితే దానికి దగ్గరిగా రాగలమేమో కానీ ధ్వనులను అందులోని ’దగ్గరితనాన్ని‘ రాతలో పూర్తిగా పూరించలేం. పుస్తకాలెన్నటికీ అమ్మమ్మలు కాలేవు.
    ఇక మీ వీధిలైట్ల కింద ఆరుమంచాల అనుభవం చూస్తే కాలం మన సమాజంలో ఇంత మెల్లగా ప్రవహించిందా అనే అనుమానం వస్తోంది. రెండు వేర్వేరు జనరేషన్స్కి చెందిన మన అనుభవాలు దాదాపు ఒకేరకంగా ఉండడం చూస్తే సమాజగమనం మందకొడిగా సాగింది అనేదానికి సూచిక అనిపిస్తోంది. బహుశా ౯౦ల(నైన్టీస్) గెంతుకు ముందు దాని గమనం పెళ్లినడకలా అందులోనూ ఎదుర్కోళ్లలా ఉందేమో అనిపిస్తుంది.

    • సంతోషం రామ్మోహన్ గారూ .. తర్వాత వ్యాసాలలో రాయటం చదవటం అనే స్తితి గురించ విపులంగా వస్తుంది. ఇంక మార్పు లంటారా గడచిన వందేళ్లని తీసుకుంటే వెయ్యేళ్ల కాలంలో వచ్చిన మార్పులకన్న అమిత వేగం చూడవచ్చు. పాతికేళ్లు తీసుకుంటే వందేళ్లలో మార్పుల కన్న చాలా వేగవంతమైనవి. ౯౦ లది గెంతుగా నేను భావించను. మరోమారు నా ఆలోచన చెపుతాను. మీవంటి వారు చదువుతున్నారని తెలిస్తే కాస్త ఉత్సాహంగా ఉంటుంది.

  • ఊహతో ఖాళీలని పూరించుకోవడం , లేక ఊహ ద్వారా ఒక దృశ్యానికి తనదైన అర్థాన్ని జత చెయ్యడం యిదే కథకి మూలం .నిజానికి మానవ జ్ఞానంమొత్తంఅటువంటిదే.అందుకే అన్నీ కథనాలే, కథలే పేర్ల మార్పు అంతే. ఏమంటారు వివిన మూర్తి గారూ

    • అవునండీ ఒకదశలో క్రోడీకరణ (క్లాసిఫికేషన్)అవసరం. అప్పుడు వేరే వేరే పేర్లు వాడుక చేసుకుంటాం. చేసిన ఊహలను చెప్పిన కథనాలనూ మానవుడు కొత్తగా గ్రాహ్యమైనదానితో తిరిగి తిరిగి పరిశీలించుకుంటాడు. కల్పనల నుంచి తన జీవితాన్ని ఎలా మెరుగుపరుచుకుంటాడు. అలాగే కల్పనల నుంచి వాస్తవాలను విడదీసుకుంటాడు. ఆ క్రమంలో కూడా మానవుని లక్ష్యం జీవితాన్ని మెరుగుపరుచుకోటమే. కాకపోతే సమాజం సంక్లిష్టమవుతున్నకొద్దీ దృశ్యం మారుతుంది. పాత అవగాహనతో అటాచ్మెంటు పెంచుకునేవారుంటారు. ఆ అవగాహనతో ప్రత్యేకంగా లాభపడే బృందాలుంటాయి. వారూ వీరూ కలిసి పాత అవగాహనని నిలబెట్టటానికి కొత్త కథనాలను కల్పిస్తారు. మనిషి భయాలను వాడుకుంటారు. దైవం ఒక ఆలోచనా స్వభావం కోల్పోయి కొన్ని బృందాలకు అదికారం స్థిరం చేసే స్వభావం సంతరంిచుకుంటుంది. శర్మ గారూ ఇదీ నా అవగాహన. అనాది ఆటవికదశలో ఉన్న కథనాలకు ఉండే స్వచ్ఛత అమాయకత్వం సంక్లిష్ట సమాజాలలో కొరవడుతుంది. అయినా మానవుడు తన బ్రతుకుని మెరుగుపరుచుకోటానికి కథల మీద ఆదారపడక తప్పదని నేననుకుంటున్నాను. అంటే కొన్ని ఊహలతోనే వాస్తవస్థితిని మార్చుకుంటాడు. నేనీ కథాయానంలో నా అభిప్రాయాన్ని పరిశీలించుకుంటున్నాను.

      • వివినమూర్తి గారూ, క్రోడీకరణ అంటే codification
        వర్గీకరణ అంటే classification
        మీరేమో క్రోడీకరణ అని బ్రాకెట్లో క్లాసిఫికేషన్ అన్నారు.
        ఈ రెంటిలో ఏదని మీ ఉద్దేశం?

      • పోరపాటున క్లాసిఫికేషన్ అని టైపుచేసాను. కోడిపికేషన్ నా అభిప్రాయం. అచ్చుతప్పుకి మన్నించగలరు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు