కథలు వింటే/చదివితే వ్యక్తి మెదడు ఎలా పనిచేస్తుంది? వినే/చదివే వ్యక్తులలో కలిగే స్పందనలు సమాజానికి ఉపకరిస్తాయా? ఈ ప్రశ్నలకు జవాబు వెతుకుతాయి సైకాలజీ, న్యూరోసైన్స్ వంటి శాస్త్రాలు.
కథలు చెప్పుకునే సమూహాలు సంస్కృతులూ భిన్నంగా ఉంటాయా? ఎక్కువ శాంతిగా సంస్కారంగా ఉన్నాయా? చదవటం ఎక్కువగా అలవాటు ఉన్న సమాజాలు మెరుగైనవా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతాయి ఆంత్రోపాలజీ, సోషియాలజీ వంటివి.
ఇటువంటి ప్రశ్నలతో చాలారకాల పరిశోధనలు జరిగాయి. అధ్యయనాలు జరిగాయి.
సరళంగా చెప్పుకోవాలంటే వాస్తవ అనుభవాన్ని ఒక కల్పిత(ఊహాజనిత) అనుభవంగా కథకుని మెదడు మారుస్తుంది. కల్పిత ఆనుభవాన్ని వాస్తవంగా మారుస్తుంది శ్రోత లేదా చదువరి మెదడు. మార్చటంలో కథకుడు సంతరించుకున్న జ్ఞానం పనిచేస్తుంది. స్వంత మనస్తత్వం పనిచేస్తుంది. ఉద్వేగాలు పనిచేస్తాయి. ఆలోచనలు, భావజాలం, ఆదర్శాలు, విశ్వాసాలు వంటివి పనిచేస్తాయి. శ్రోత/ చదువరి విషయంలో అతని జ్ఞానం, ఉద్వేగాలు, ఆలోచనలు, భావజాలం, ఆదర్శాలు, విశ్వాసాలు వంటివన్నీ ప్రభావితమవుతాయి. అలాగే వాటన్నింటితోనూ అతను కథ వింటాడు/ చదువుతాడు.
ఇది ఒక అవగాహన.
ఈ శీర్షికన వచ్చిన రెండవ వ్యాసంలో నేను కథాతరంగాలు సంకలనానికి రాసిన ఒక ముందుమాటను ఉటంకించాను.
ఆ కీలకాంశం ఏమిటీ- అంటే
నాకు వచ్చిన ఆపద మరొకరికి రాకూడదు.
నేను నేర్చిన మెలుకువ మరొకరికి ఉపయోగపడాలి.
నాకు కలిగిన నొప్పి మరొకరికి కలగరాదు.
నేను పొందిన ఆనందం మరొకరు పొందాలి.
కథ చెప్పటంలోని సమూహ క్షేమకాంక్షపై పరిశోధించిన lisa cron ఇలా అంటారు. “జరగబోయే దానిని ముందుగా గ్రహించ గలగటమే, దానికి తోటివారిని సిద్ధం చెయ్యటమే కథకి మూలం.” ఆమె ఒక ఉదాహరణ చెపుతారు. నియాండర్తల్ మానవుడు అంతకుముందే ఒక రకమైన పళ్లను తిని చనిపోయిన వాని గురించి తోటివారిని హెచ్చరిస్తూ కథలా చెపుతాడు. ‘ఇవి విషం పళ్లు. తినకండి’ అని చెప్పటానికి బదులు అది కథగా చెపుతాడు.
“మేమిద్దరం వెళ్తున్నాం. నేను ఏదైనా పురుగూ పుట్రా వస్తుందని గమనిస్తూ ముందు నడుస్తున్నాను. ఇంతలో ఒక పాము చరచరా పాకటం కనిపించింది. వెంటనే దానికి దణ్ణం పెట్టాను. వాడికి చెపుదామని వెనక్కి తిరిగాను. కనిపించలేదు. గాభరా వేసింది. మనసేదో కీడు శంకించింది. అరుస్తూ వాడికోసం వెతుకుతూ వచ్చినదోవలో వెళ్తున్నాను. జమ్మిచెట్టు దాకా వెళ్లాను. అక్కడ పడున్నాడు. అటూఇటూ చూసాను. పాము జాడకనపడలేదు. ఏదైనా మెకం అయితే చంపేసి అలా వదిలెయ్యదు కదా.. పైగా ఎక్కడా రక్తం లేదు. మెల్లిగా అడుగులు వేసుకుంటూ దగ్గరకు వెళ్లాను. చేతిలో కర్ర సిద్దంగా ఉంచుకున్నాను. హఠాత్తుగా ఏదో కదిలినట్టయింది. ఒళ్లు జలదరించిది. మెల్లగా పక్కకి చూసాను. జింక. ఊపిరి సలిపినట్టయింది. అది అక్కడున్న మొక్కని వాసన చూస్తోంది. ఆ మొక్కకి ఏవో పళ్లున్నాయి. గమ్మత్తైన వాసన. ముగ్గినట్టునిపిస్తోంది. జింకలు ముగ్గినవి తినవా!? తర్వాత చూదాం అనుకున్నాను. వాడి దగ్గరకి వెళ్లాను. వాడి నోట్లో ఈ పండుంది. అదే వాసన. జింక వాసన చూసి వదిలేసిందే అదే. ఇది తినటం వల్లనే వాడు చనిపోయాడు.”
ఇలా ఘటనాక్రమం చెపుతాడు. భాష వస్తే భాషలో.. లేకుంటే సౌంజ్ఞలలో. అది తినరానిదని ఒకరికి ఒకరు చెప్పుకుంటారు.
“మనందరినీ ఒకటిగా ఉంచి మన ప్రాణాలను కాపాడే ఒక ప్రత్యేక సమాచారాన్ని పంచే పద్దతి నుంచే కథ పుట్టింది.” అంటారామె. కథగా చెప్పటంలో సమాచారంతోబాటు ఉద్వేగాలు ఉంటాయి. అందులో ఆసక్తి ఉంటుంది. అందువల్ల అది జ్ఞాపకంలో చాలాకాలం ఉంటుంది.
స్టాన్ఫర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆప్ బిజినెస్ మార్కెటింగ్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న జెన్నిఫర్ ఆకర్ అనే ఆమె సమాచారం కన్న కథ 22 రెట్లు ఎక్కువ జ్ఞాపకముంటుంది అంటుంది.
కథలు వినే/ చదివే సమూహాల గురించి కొన్ని పరిశోధనలు చేసారు.
ఫిలిప్పైన్స్ లోని ఒక గిరిజన తెగ అగ్తా. వారింకా వేట- సమీకరణ జీవన విధానంలో ఉన్నారు. వారి మీద ఒక అధ్యయనం జరిగింది. సామాజిక సహకారాన్ని పెంచటంలో.. సామాజిక నియమాలను అలవరచటంలో కథల పాత్ర ఏమిటి? గుంపు నుంచి కథకులకి లభించే ఆదరణ ఎందుకు? వారికి పట్ల ఆకర్షణ, వారితో కలిసి జీవించాలనుకోటం ఎందుకు? ఇలాంటి వాటిని అవగాహన చేసుకుందుకు లండన్ యూనివర్సిటీ కాలేజీకి చెందిన మానవశాస్త్రవేత్త డేనియల్ స్మిత్ ఆధ్వర్యంలో ఈ అధ్యయనం జరిగింది. తాయిలాండ్, మలేసియా, ఆఫ్రికా ఇంకా మరికొన్ని చోట్ల వేట మీద జీవించే 7 సంస్కృతులలో చెప్పుకునే 89 కథలు సేకరించారు. “ఈ కథలన్నీ పరస్పర సహకారం, సమఅనుభూతి(Empathy) న్యాయం గురించే బోధించుతున్నాయి. కొన్ని కథలు స్త్రీపురుష సమానత్వం గురించి కూడా ఉపదేశిస్తున్నాయి.” అని వారు తేల్చారు. కథకి ఉన్న శక్తిని, ఉపయోగాన్ని తేల్చుకుందుకు ప్రయోగాలు జరిపారు పరిశోధకులు. అగ్తా తెగలోని 18 గ్రామాల నుంచి 1250 మందిని తీసుకున్నారు. రెండు గుంపులుగా చేసారు.
తమకున్న వనరును జనం ఎలా పంచుకుంటారు.. ఆ పంపకంలో కథలు వినే అలవాటున్నవారి మీద ప్రభావం ఏమిటి? ఇవి అధ్యయనాంశాలు. మొదటి ప్రయోగంలో రెండు గుంపులకి చెందిన 297 మందిని ప్రశ్నించారు. వాళ్ల గుంపులలోని కథకులని ఎన్నుకోమన్నారు. ఏగుంపులో ఎక్కువ కథకులున్నారో ఎవరు బాగా చెపుతున్నారో లెక్కగట్టారు.
మరో 290 మందికి ఒక్కొకరికి 12 టోకెన్లు ఇచ్చారు. ఒక టోకెనుకి సుమారు వందగ్రాముల బియ్యం లభిస్తుంది. పరిశోధకులు రహస్యంగా 12 మందిని ఎంచుకున్నారు. ఈ 12 మందిలో ఎవరికైనా గాని అందరికీ గాని తతిమ్మా వాళ్లు తమవద్ద ఉన్న బియ్యం టోకెన్లు అన్నీగాని కొన్నిగాని ఇవ్వవచ్చు. లేదంటే అన్నీ తమవద్దే ఉంచేసుకోవచ్చు. ఈ 290 మందీ ఒక్కొకరే వచ్చి పరిశోధకుల సమక్షంలో తమ నిర్ణయాలు స్వతంత్రంగా తీసుకోవాలి.
అనుకున్నట్టే 62.6 శాతం మంది తమ బియ్యం టోకెన్లు తామే ఉంచేసుకున్నారు. మిగిలిన వారు పరులతో పంచుకున్నారు. వారిని లెక్కకట్టారు. పరిశోధకులు తేల్చుకున్నదేంటంటే “బాగా కథలు చెప్పే వారున్న గుంపులో సభ్యుల ఎక్కువ ఉదారంగా ఉన్నారు. వారిలో పరస్పర సహకారం ఎక్కువగా ఉంది.”
రెండవ ప్రయోగంలో అదే 18 గ్రామాలకు చెందిన 291 మందిని ప్రశ్నించారు. మీరు ఎవరితో జీవించటానికి ఇష్ట పడతారు? గరిష్టం 5 మందిని ఎంచుకోమన్నారు. 857 పేర్లు వచ్చాయి. వారిలో వేట, చేపలు పట్టటం, సేకరణ వంటివాటిలో పేరున్న వారున్నారు. చిత్రంగా వారికన్న కథకులకి ఎక్కువ ఓట్లు వచ్చాయి. తిండి కన్నా కూడా కథని మనుషులు ఒక్కోసారి ఎక్కువ ఇష్టపడతారనటానికి ఇది ఒక సూచన.
18 గ్రామాలలోనూ కథకులకి తతిమ్మావారి కంటె ఎక్కువ సంతానం ఉన్నారు. అంటే కథలు చెప్పేవాళ్లతో సహచర్యానికి ఎక్కువమంది ఇష్టపడ్డారు. ఇంకో బలమైన వివరణ ఏంటంటే కథకుని కుటుంబాన్ని సమూహం అన్నివిధాలా ఆదుకుంటుంది. వస్తువులూ సంపదా సమకూరుస్తుంది. దానివల్ల కథకుని సంతానానికి సమాజ వనరులలో కాస్త అధిక వాటా లభిస్తుంది. పరిశోధకులు మాటలలో తేల్చినదేమంటే “కథ చెప్పటం ‘ఖర్చు’తో కూడిన తత్వం. తమ తత్వాన్ని అమలులో పెట్టటానికి, ప్రదర్శించటానికీ, మేధోమధనం చెయ్యటానికీ తగు సమయం, శక్తి వెచ్చించాలి” (“Storytelling is a costly behavior,” write the researchers, “requiring an input of time and energy into practice, performance and cognitive processing.”)
ఈ పరిశోధనలో తేలిన అంశాలు ఆధారంగా నా ఆలోచనలు కొన్ని మరో సందర్భంలో చెపుతాను.
“కథలు మనం వేరే చోట ఉన్నట్లు అనిపింపజేస్తాయి. నిజమైన ఉద్వేగాలకి లోనుచేస్తాయి. ప్రవర్తనా స్పందనలు(behavioural responses) కలిగిస్తాయి” అంటారు పమీలా బి. రూట్లెడ్జి అనే మనస్తత్వ శాస్త్రజ్ఞులు. సులువుగా అర్ధమవాలంటే బూతుకథలు చదువుతున్నపుడు శరీరంలో మార్పులు కలగటం మనలో చాలామందికి తెలిసినదే. కథలో పాత్రల కష్టాలకు కన్నీరు రావటం చాలామంది అనుభవించే ఉంటాం. డోస్టోవిస్కీ నేరమూ-శిక్షా చదివి నాకు కలిగిన అనుభవం తమకూ కలిగిందని కొందరు మిత్రులు నాకు చెప్పారు. ఫలానీ కథ చదివి నాకీ హత్య చేయాలనిపించింది అని చెప్పే నేరస్తుల వార్తలు మనం చదువుతూనే ఉన్నాం.
మనస్తత్వ నిపుణులు చెప్పే, మనం కూడా అంతో ఇంతో అనుభవించిన ఈ విషయాలకు న్యూరోసైన్సు ఏమంటుంది? పుస్తకంలో పాత్రలు మెదడులో కలిగించే జీవ ప్రతిక్రియ ఏమిటి? అది ఎంతకాలం ఉంటుంది?
ఎమొరీ విశ్వవిద్యాలయంలో న్యూరో సైంటిస్టు గ్రెగరీ బెర్న్స్ ఆధ్వర్యంలో కొన్ని ప్రయోగాలు జరిగాయి. “కథలు మన జీవితాలను దిద్దుతాయి. ఒక్కోమారు ఒక వ్యక్తిని నిర్వచించటానికి సహాయపడతాయి.” అంటారు బెర్న్స్. “కథలు మెదడులోకి ఎలా ప్రవేశిస్తాయి దానిని ఏం చేస్తాయి? ఇది మనం అర్ధం చేసుకోవాలి.”
వారు fMRI (functional Magnetic Resonance Imaging) అనే యంత్రాన్ని ఉపయోగించారు. కథ చదువుతూ ఉండగా మెదడులో జరిగేదాన్ని తెలుసుకోటం కోసం అంతకుముందు ఈ యంత్రంతో కొన్ని ప్రయోగాలు జరిగాయి. బెర్న్స్ ప్రయోగం దానికన్న భిన్నమైనది. 29 మంది విద్యార్ధులపై ప్రయోగాలు చేసారు. 19 రోజులు వరసగా ఇవి జరిగాయి. రాబర్ట్ హారిస్ 2003లో రాసిన పోంపెల్లీ నవలను తమ ప్రయోగానికి తీసుకున్నారు. ఇందులో కథ కట్టిపడేస్తుంది.
మొదటి 5 రోజులు ఉదయమే విద్యార్ధుల విశ్రాంతిస్థితిలో ఉన్న మెదడుని స్కాన్ చేసారు. ఆ తర్వాత ఇంచుమించు 9 అధ్యాయాలు చదవమన్నారు. ఒక్కో దానిలో 30 పుటలున్నాయి. అవి 9 రోజులలో సాయంకాలం పూట చదవించారు. తమకిచ్చిన అధ్యాయాన్ని చదివి ఉదయమే రమ్మన్నారు. వారు నిజంగా చదవారో లేదో కొన్ని ప్రశ్నలు వేసి నిర్ధరించారు. తర్వాత మెదడు స్కానింగ్ చేసారు. అంటే చదవటం ముగిసి విశ్రాంతి స్థితిలో ఉన్న మెదడుని స్కాన్ చేసారు. అలా 9 రోజులు చదవటం, మర్నాడు ఉదయం స్కానింగ్ జరిగాయి. మరో 5 రోజులు స్కానింగ్ చేసారు. ఫలితాలు అధ్యయనం చేసారు. భాషని స్వీకరించటానికి పనికొచ్చే మెదడులోని ప్రదేశం left temporal cortex. ఇది కథ చదివిన మరుసటిరోజు ఉదయం ఉద్రిక్త స్థితి(heightened connectivity)లో ఉంది. “ప్రయోగంలో ఉన్నవారు ఆ సమయానికి చదవకపోయినా ఆ స్థితి కొనసాగింది” అంటారు బెర్న్స్. “కొంచెం ఉపమాలంకారంగా చెప్పాలంటే కథలు మనలని ఇంకొకరిలోకి పరకాయప్రవేశం చేయిస్తాయి. ఇది మన అనుభవంలో ఉన్నదే. ఈ ప్రయోగం వల్ల మనకి అర్ధమయేదేమంటే బయలాజికల్ గా కూడా కొన్ని మార్పులు జరుగుతాయి. ఈ మార్పులు ఎంతకాలం ఉంటాయన్నది ఇంకా తెలియదు. కాని మనిషికి నచ్చే కథ అతని మెదడు లోని జీవచర్యపై చాలాకాలం బలమైన ప్రభావం చూపిస్తుందన్నది వాస్తవం.”
వినేవారి మనసు మీదా మెదడు మీదా జరిగిన ఈ అధ్యయనాల సారాంశం లోగడ మనకి కాస్తో కూస్తో తెలిసినదే. శ్రీశ్రీ కష్టజీవికి అటూయిటూ నిలిచేవాడే కవి అని చమత్కారంగా చెప్పినా… రామాయణం మన కుటుంబ వ్యవస్థని బలంగా నిలిపిందన్నా… అవి రెండు భిన్నాభిప్రాయాలుగా అనిపించవచ్చు. కాని విన్న కథ మనిషినీ అతను నివసించే సమాజాన్నీ ప్రభావితం చేస్తాయనే గ్రహింపుకి సంబంధించినవే. ఆ గ్రహింపునుంచి పుట్టినవే. వ్యక్తులు తమ తమ భిన్న గ్రహింపులను ఇతరులకి అందించాలన్న ప్రేరణ కూడా ఈ గ్రహింపే ఇస్తుంది.
విన్నవారూ చదివిన వారి మధ్య తేడా తర్వాత మాటలాడుకుందాం.
ఇంతవరకూ కథ కథానికల పోలికల గురించి చర్చించుకున్నాం. సమాజంపై ప్రభావం, మెదడుపై ప్రభావం గురించి ఆలోచించాం.
ఇక కథానికకీ కథకీ ఉన్న తేడాల గురించి ఆలోచిద్దాం. మధ్యమధ్యలో నవల అనేది కూడా కథ గురించి మాటాడేటపుడు వచ్చింది. అవి రెండూ వేరువేరు కదా అనే ప్రశ్న వస్తుంది. దానికి జవాబు వెదుకుదాం.
బావుంది !