కథా రచయితకి ఇగో పెద్ద అడ్డంకి: ఆర్. ఎం. ఉమా

ఆర్.ఎం.ఉమామహేశ్వరరావు.. తెలుగు కథ కోసం కృషి చేస్తున్న దొడ్డ చేయి ఆయనది. ముత్యాల్లాంటి 10 కథలు రాసి కథకుడిగా తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు. ఎందరో మేలిమి కథకుల రాతలకు సారథిగా, వారధిగా నిలిచారు. కథల కోసం పనిచేయడం తన బాధ్యత అని తలచి ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. తనకు నచ్చిన కథల గురించి సారంగ వెబ్ మ్యాగజైన్‌లో ‘కథాసమయం’ శీర్షిక నిర్వహించి వ్యాసాలు రాశారు. వాటిని సంకలనం చేసి ఇటీవల ‘కథాసమయం’ పేరుతో పుస్తకం తెచ్చారు. ఈ సందర్భంగా ఆయనతో ముఖాముఖీ..

  • నమస్తే సార్! ‘కథాసమయం’ పుస్తకానికి సంబంధించి మీకు మేల్తలపులు. ఆ శీర్షిక నేపథ్యం గురించి చెప్పండి.

‘కథాసమయం’ నేపథ్యం అంటే పదేళ్లు వెనక్కి వెళ్లాలి. అప్పట్లో సారంగ వెబ్ మ్యాగజైన్ మొదలైంది. సారంగ కోసం ఏదైనా రాయమని కల్పన రెంటాల నన్ను అడిగింది. నేను కథ గురించి తప్ప వేరేమీ రాయలేను. ఆ సమయంలో కొత్తగా రాస్తున్నవారి కథల గురించి రాస్తే ఎలా ఉంటుందని ఒక ఆలోచన వచ్చింది. అఫ్సర్‌కి చెప్తే బాగుంటుందన్నాడు. సామాన్య రాసిన ‘పుష్పవర్ణమాసం’ నాకు భలే నచ్చిన కథ. దాని గురించి రాసి అఫ్సర్‌కి పంపాను. ఆయనే ‘కథాసమయం’ అని పేరు పెట్టి ఆ వ్యాసం ప్రచురించాడు. 

  • అప్పట్లో నాలుగు వ్యాసాలు రాశాక ఆపేశారెందుకు?

నేను బద్దకస్తున్ననే విషయం ఒప్పుకోవాలి. ఉద్యోగం తప్ప వేరే ఏదీ ప్లాన్‌డ్‌గా చేయలేను. నాలుగు వ్యాసాలు రాశాక నాకు ఇబ్బంది వచ్చింది. ఫలానా కథ మీద రాయొచ్చు కదా అంటూ కొందరు ఒత్తిడి తెచ్చారు. నా మనసుకు దగ్గరైన కథ మీద రాయగలను తప్ప ఎవరైనా ఒత్తిడి చేస్తే, కనీసం ఆ కథ కూడా చదవలేను. అలా కొందరి నుంచి ఆ ఒత్తిడి రావడంతో ఆపేశాను. ఆ తర్వాత 2022లో అఫ్సర్ మరోసారి రాయమని అడిగాడు. ఆ సమయంలో నేను కూడా కొంతకాలం కథలకు దూరంగా ఉన్నాను. ముఖ్యంగా కొత్త కథకుల కథలు ఎక్కువగా చదవలేదు. మరోసారి ‘కథాసమయం’ ద్వారా వాళ్ల కథలు చదివే అవకాశం దొరికింది. దాంతో మళ్లీ రాయడం మొదలుపెట్టాను.

  • ఇటీవల తెలుగులో మంచి కథలు రావడం లేదన్న వాదన ఒకటి మొదలైంది. దాని గురించి మీరేమంటారు?

కొత్తగా రాస్తున్నవారి కథలు వెబ్‌లో ఎక్కువగా వస్తున్నాయి. అయితే‌ నేను కంప్యూటర్‌లో కథలు చదవలేను. వాటిని ప్రింట్ తీసుకుని, ఒక పుస్తకంలా మార్చి చదువుతుంటాను. మంచి కథలు ఏవైనా ఉంటే పంపమని తెలిసినవారిని అడుగుతుంటాను. ఈ మధ్యలో కొన్ని కథల పోటీలకు నిర్ణేతగా కూడా ఉన్నాను. ఆ సమయంలో కొందరి అభిప్రాయం ఏంటంటే, తెలుగులో మంచి కథలు రావడం లేదని. కొందరు తాము రాసిన ముందుమాటలో ఈ విషయం రాయడం, మంచి కథలు రాలేదని పోటీలో బహుమతులు రద్దు చేయడం, ఒకే బహుమతి నలుగురికి పంచడం లాంటివన్నీ గమనించాను. అది నాకు సరికాదనిపించింది‌.‌ నిజానికి మంచి కథలు వస్తున్నాయి. కొత్త తరం రచయితలు  బాగా రాస్తున్నారు. అయినా ఎందుకు అలాంటి అభిప్రాయంతో ఉన్నారన్న ఆలోచనతో నాకు నచ్చిన కథల్ని ‘కథాసమయం’ ద్వారా పరిచయం చేశాను.

  • ‘కథాసమయం’ కోసం కథల ఎంపిక ఎలా జరిగింది?

నేను వెబ్‌ మేగజైన్స్ ఎక్కువగా ఫాలో కాను. కొందరు సన్నిహితుల్ని అడిగి కథలు తీసుకుంటాను. వాళ్ల ద్వారా వచ్చిన కథల్ని చదివి, అందులో నాకు నచ్చిన కథల గురించి రాశాను. దీంతోపాటు కొన్ని కథాసంకలనాలు కూడా చదివాను. ఫలానా వాళ్ల కథలే చదవాలి, వాటి గురించే రాయాలన్న నిబంధనలేమీ పెట్టుకోలేదు. ఈ వ్యాసాల తాలూకు కథల రచయితల్లో చాలామంది నాకు వ్యక్తిగతంగా తెలియదు. పుస్తకం వచ్చే క్రమంలో వాళ్లకు ఫోన్ చేసినప్పుడే వాళ్ల వివరాలు తెలిశాయి.

  • కథాసమయం వ్యాసాల్లో సగం దాకా చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లా రచయితల కథలున్నాయి. అందుకేదైనా ప్రత్యేక కారణం ఉందా?

బహుశా నా జీవితానికి ఆ ప్రాంతాలు దగ్గరగా ఉండటం కారణం కావచ్చు. నిజానికి నేను వెతికింది తెలంగాణ ప్రాంత కథలు. తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనం బలంగా ఉన్న సమయం ఇది. అక్కడి నుంచి కథాసంకలనాలు వస్తున్నాయి. వాళ్ల కథలు వాళ్లు వేసుకుని, వాళ్ల గొంతు వినిపిస్తున్నారు. ఆ కథల్ని నేను మిస్ అవ్వకూడదు అనిపించింది. అయితే నేను ఒక పద్ధతిలో కథల్ని వెతుక్కోలేదు కాబట్టి నాకు తృప్తిగా అనిపించే కథలు ఎక్కువ దొరకలేదు. నా వ్యాసాల్లో కొన్ని ప్రాంతాలు, కొన్ని వర్గాలు మిస్ అయ్యి ఉండొచ్చు. అయితే అది కావాలని చేసింది కాదు.

  • ‘కథాసమయం’లోని వ్యాసాలు విమర్శలా? ఆ రచయితలకు ప్రశంసలా?

ఈ వ్యాసాలు విమర్శ కాదు. ఒకరకంగా ప్రశంసే. ఇది విమర్శ కాదని ఎందుకన్నానంటే, సాహిత్య విమర్శకు కొన్ని ప్రమాణాలు ఉంటాయి. వాటితోనే విమర్శ చేయాలి. ఇందులో నేనలా చేయలేదు. నాకు నచ్చిన కథల్ని పరిచయం చేస్తూ, ఆ కథలో నాకేం నచ్చిందో చెప్పాను. దీన్ని పరామర్శ అనొచ్చు. ఎక్కువగా కొత్త రచయితల కథల గురించే రాయాలని అనుకున్నాను. 2013లో నేను ఈ వ్యాసాలు రాసేనాటికి మెహెర్, సామాన్య లాంటివారు కొత్త. ఇప్పుడు వాళ్లు అందరికీ తెలిశారు. మిగిలినవారిలోనూ కొందరు నేను రాసే సమయానికి కొత్త కథకులైనా ప్రస్తుతం గుర్తింపు పొందారు.

  • కథాసమయంలో ఎక్కువ కథలు పల్లె నేపథ్యంలోనివే ఉన్నాయి. ఆ జీవితాల పట్ల మీకున్న ఇష్టమే కారణమా?

పల్లె మీద మనకు సహజంగానే ఇష్టం ఉంటుంది. అదే కారణం. అయితే నగర జీవితాన్ని విస్మరించలేదు. శ్రీఊహ ‘ఇసుక అద్దం’, చరణ్ పరిమి ‘కాలింగ్ సప్తవర్ణం’ కథలు నగర నేపథ్యంలోనివే. పూర్తిగా వీటితో సంబంధం లేకుండా కొత్తావకాయ సుస్మిత రాసిన సైన్స్ ఫిక్షన్ కథ గురించి కూడా రాశాను. అర్బన్ కథల విషయంలో నాకొక అసంతృప్తి ఉంది. నగర జీవితానికి సంబంధించిన కథను మనం ఇంకా సంపూర్ణంగా రాయలేదనిపిస్తోంది. నగరంలోని కొన్ని ప్రాంతాలు చూపించి, కొన్ని సంభాషణలు రాస్తే అర్బన్ కథ అయిపోతుందని అనుకుంటారు. అది మాత్రమే సరిపోదు. పల్లెలతో పోలిస్తే నగర జీవిత విధానం వేరుగా ఉంటుంది. దానికంటూ ప్రత్యేకమైన ఫిలాసఫీ ఉంటుంది. అది కథల్లోకి రావాలి. నగర జీవితాల్లోని సంఘర్షణను చెప్పాలి‌. కుప్పిలి పద్మ రాసే కథల్లో అది కనిపిస్తుంది. ఆ తర్వాత వంశీధర్‌రెడ్డి రాసిన కొన్ని కథల్లో అసలైన నగర జీవితం, దాని ఫిలాసఫీ కనిపిస్తుంది‌. ఈ మధ్య కాలంలో నేను చదివిన కథల్లో శ్రీఊహ రాసిన ‘ఇసుక అద్దం’లో నగర జీవితం కొంత కనిపించింది. కొత్త కథకులు ఈ అంశంపై దృష్టి పెడితే మరిన్ని మంచి కథలు వస్తాయి.

  • మీరు రాసిన వ్యాసాల్లో భిన్న వర్గాలకు చెందిన కథలు ఉన్నాయి. ‘ఫాతిమా’లో ముస్లింలు, ‘దేహయాత్ర’లో దళిత క్రైస్తవులు, ‘పురుడు’లో లంబాడీలు.. ఈ వర్గాల కథలను కావాలనే ఎంచుకున్నారా?

నేను కొన్ని దశాబ్దాలుగా కథలు చదువుతున్నాను. ఆ సమయంలో కొన్ని వర్గాల నుంచి కథలు రాలేదే అన్న అసంతృప్తి ఉండేది. ఆ వర్గాల నుంచి కథలు వస్తే చాలా ఆత్రంగా వెతుక్కుని చదువుకుంటాను. పద్దం అనసూయ రాసిన ‘మూగబోయిన శబ్దం’ అనే కథ ఉంది. ఇతర కథాసంకలనాల్లో వచ్చే కథల్ని, ఆ కథను పక్కపక్కన పెట్టి చూసినప్పుడు ఆ కథకీ, ఇతర కథలకూ సంబంధమే ఉండదు. చాలా భిన్నంగా ఉంటుంది. మనం అనుకునే కథా లక్షణాల్లో ఆ కథ ఇమడకపోయినా, మనకు తెలియని జీవితం గురించి భలే అద్భుతంగా చెప్పిన కథ అది. రమేశ్ కార్తిక్ నాయక్, పద్దం అనసూయ, మల్లిపురం జగదీశ్ రాసిన కథలు ఇలాంటివే! వాళ్లు ఆ జీవితాలను లోపల్నుంచి చూసి కథలు రాశారు. బయటి నుంచి మనం ఎంత చూసినా వాళ్లు చెప్పినంత అందంగా మనం చూడలేం. అందుకే వాటి గురించి ఇష్టంగా రాశాను. అలా మనం చూడని చాలా జీవితాలు సాహిత్యంలోకి రావాలి.

  • తెలుగు సాహిత్యంలోకి అలా రావాల్సిన జీవితాలు ఇంకా ఏం ఉన్నాయి? 

సముద్రాన్ని తెలుగు కథ చాలా మిస్సయ్యిందని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఈ మధ్య విశాలాక్షి మాసపత్రికలో ‘సముద్రం’ అనే అంశం మీద కథలపోటీ పెట్టారు. ఆ‌ విషయం తెలిసి చాలా సంతోషపడ్డాను. పత్రిక ఎడిటర్ ఈతకోట సుబ్బారావుకు ఫోన్ చేసి ఆ కథలు అడిగి తెప్పించుకొన్నాను. తెలుగు నేలకు చాలా విశాలమైన సముద్రతీరం ఉంది. అది తెలుగు సాహిత్యంలో బలంగా రాలేదు. స.వెం.రమేశ్ రాసిన ‘ప్రళయకావేరి కతలు’ కూడా పులికాట్ సరస్సులోని తీరం కథలు లేదా ఆ దీవుల్లోని రైతుల కథలు. సముద్రంతో ముడిపడిన జీవితాల గురించి తెలుగు సాహిత్యంలో ఎక్కువ కథలు రాలేదు. మనకు తెలిసింది మత్స్యకారులు. వాళ్లు సముద్రం మీద వేటకు వెళ్తారు. వాళ్లలో చదువుకున్నవాళ్లు తక్కువ. అందుకే అక్కడి నుంచి కథలు రాలేదు. అలాగే నదులు, చెరువుల్లో చేపలు పట్టేవారు యానాదులు. వాళ్ల గురించి కూడా ఎక్కువ కథలు రాలేదు.

చెంచుల కథలంటే అప్పుడెప్పుడో చింతా దీక్షితులు రాసిన రెండు కథలే మనకు తెలుసు‌. నంద్యాల జిల్లా సున్నిపెంటకు చెందిన ఓ వ్యక్తి అమ్మనుడి మాసపత్రికలో ‘చెంచు కథలు’ సిరీస్ రాశారు. చింతా దీక్షితులు రాసినవి గొప్ప కథలే అయినా అవి బయటి నుంచి చూసి రాసిన కథలు. చెంచుల జీవితాన్ని లోపలి నుంచి చూసి రాస్తే ఆ కథల తీరు అద్భుతంగా ఉంటుంది. యానాదుల నుంచి మేం తొలి కథ రాశాం, లేదా ఫలానా వర్గం గురించి తొలి కథ మాదే అని కొందరు చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఆ వర్గాల నుంచి కథలు వస్తే అప్పుడు ఆ జీవనం యథాతథంగా మనకు తెలుస్తుంది.

  • ఆ వర్గాల నుంచి కథలు రావాలంటే ఏం చేయాలని మీ అభిప్రాయం?

ఆ వర్గాలతో కథల వర్క్‌షాప్స్ నిర్వహించాలి. విరసం కొన్ని వర్క్‌షాప్స్ నిర్వహించింది. అయితే అవి కొంత పరిధిలోనే జరిగాయి. ఆ పరిధి దాటి వెళ్లలేదు. తిరుపతిలోని ట్రాన్స్‌జెండర్స్‌తో కొన్ని రోజులు పనిచేసే అవకాశం నాకు వచ్చింది. వాళ్లు అంత తొందరగా నోరు తెరవరు. వాళ్ల గురించి మనకు తెలిసింది తక్కువ. వాళ్లకూ కోరికలుంటాయి, ఆకాంక్షలుంటాయి. అవి వాళ్లే రాయగలరు. ట్రాన్స్‌జెండర్ల గురించి ఎవరో ఒకాయన కథలు రాసి పుస్తకం వేశారు. అయితే అవి బయట నుంచి చూసి రాసిన కథలే! వాళ్ల నుంచి కథలు రావాలంటే రచయితలు వారిలో నమ్మకం కలిగించాలి. వర్క్‌షాప్స్‌కి వాళ్లను పిలిచి, వారిలో నమ్మకం పెంచి, వారి చేత కథలు రాయించాలి.

  • ‘మాండలికం ఎంత సరళంగా ఉంటే అంత ఎక్కువ కాలం ఉంటుంది. ఎక్కువమందికి చేరుతుంది’ అని మీరు ఒక వ్యాసంలో రాశారు. మాండలికాన్ని సరళీకరించడం అంటే?

మాండలికాన్ని నేను చాలా ఇష్టపడతాను. మాండలికం తెలుగు సాహిత్యానికి చాలా ఉపయోగపడింది. 1970లో తెలంగాణ నుంచి అల్లం రాజయ్య కథలు రాశారు. నామిని సుబ్రహ్మణ్యం నాయుడు కంటే ముందే తిరుపతి నుంచి పులికంటి కృష్ణారెడ్డి చిత్తూరు మాండలికంలో వరసగా కథలు రాశారు. రాజయ్య గారి ‘అగ్నికణం’ చదివేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను. కృష్ణారెడ్డి కథల్లో కూడా కొన్ని క్లిష్టమైన పదాలు ఉన్నాయి.

యాసను పలికినట్లుగా యథాతథంగా రాయడం వల్ల చదివేటపుడు ఇబ్బంది ఎదురవుతుంది. ‘అ’ కారానికి, ‘ఎ’ కారానికి నడుమ మనకు అక్షరం లేకపోవడం వల్ల బహుశా ఈ సమస్య ఎదురవుతోంది. మాట్లాడేటప్పుడు చాలా మాటలు సంధి చేసుకుంటాం. రాసేటప్పుడు విడదీసుకుంటే చాలు సరళం అవుతాయి. ‘నేను పొయ్యెప్పిటికి ఆయప్ప తింటుణ్యాయాడ్లే’ అనే వాక్యంలో చివరి పదం పంటికింద రాయిలా అడ్డుకుంటుంది. ‘తింటున్నేడులే.. తింటున్నాడులే.. తింటా ఉండినాడులే’ tense మారిపోకుండా జాగ్రత్తపడితే చాలు అనుకుంటాను. ప్రాంతాన్ని బట్టి ఆ మాటను తాము పలికినట్లుగా చదువుకుంటారు. పలుకులోని సౌందర్యం దెబ్బతినదు.

నామిని ఆ మాండలికాన్ని సరళం చేశారు. అందుకే అన్ని ప్రాంతాలవారూ ఆ కథల్ని చదువుకోగలిగారు. నామిని కథలు అందరికీ నచ్చడానికి అందులోని జీవితంతోపాటు ఆ భాష కూడా కారణమే! మాండలికం చదివేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటే ఆ కథ ఎక్కువ కాలం నిలిచి ఉంటుంది. ఎక్కువమందికి చేరుతుంది. అలా సక్సెస్ అయిన కథలు చాలా ఉన్నాయి.

  • ప్రస్తుతం వస్తున్న కథలపై మీ అభిప్రాయం?

ఒకప్పుడు మానవ సంబంధాలకు సంబంధించిన కొన్ని అంశాలను మాత్రమే కథలుగా రాసేవారు. అది కూడా ఒక కోణంలోనుంచే రాసేవారు. పేదరికం కథాంశం అయితే, దాని పట్ల సానుభూతిని చూపే కథలే వచ్చేవి. పేదరికంలోని సౌందర్యాన్ని కూడా చెప్పొచ్చు అని తర్వాత్తర్వాత రాసిన కథల్లో కనిపిస్తుంది. దాని అర్థం పేదరికాన్ని గ్లోరిఫై చేయడం కాదు. పేదరికం అంటే ఏడుస్తూ ఉండటం కాదని కథల ద్వారా చెప్పడం.

ఇప్పుడు కథా విస్తృతి పెరిగింది. జీవితాన్ని యథాతథంగా చెప్పడంలో కొత్త కథకులు ముందున్నారు. వస్తుపరంగా భిన్నమైన అంశాలు తీసుకుంటున్నారు. దాన్ని చెప్పడంలోనూ కొత్త రకమైన శిల్పాన్ని ఎంచుకుంటున్నారు. కథ ఇలాగే ఉండాలన్న నిబంధన ఇన్నాళ్లూ ఉండేది. కథకులు ఆ గీతల్ని చెరిపేసి కొత్తగా రాస్తున్నారు. కొత్తతరం బాగా చదువుతున్నారు. వాళ్ల వల్ల తెలుగు సాహిత్యానికి రెక్కలు వచ్చాయని అనిపిస్తుంది.

  • తెలుగులో కథా విమర్శ తగ్గిపోతోందనే మాట వినిపిస్తూ ఉంది. దానిపై మీ అభిప్రాయం ఏమిటి?

సాహిత్యంలో విమర్శ అనేది ఒక ప్రక్రియ. దానికి తగ్గ పరిశోధన చేయడం, చదవడం అవసరం. గతంలో వల్లంపాటి వెంకటసుబ్బయ్య విమర్శ రాసేవారు. ఆ తర్వాత తిరుపతిరావు విమర్శ చేస్తున్నారు. అయితే ఆయన కూడా తెలుగు కథ, నవలను అంత సీరియస్‌గా ఫాలో అవడం లేదు. బహుశా ఆయనకేదో అసంతృప్తి ఉందని నాకనిపిస్తోంది. దాన్ని పోగొట్టేలా మంచి రచనల్ని ఆయన దృష్టికి తీసుకెళ్లడం అవసరం. పైగా మన దగ్గర విమర్శ అంటే పొగడ్తలు లేక తెగడ్తలు. అలా కాకుండా సీరియస్‌గా విమర్శ చేయడం అవసరం. రచయితలు కూడా దాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించాలి.

తెలుగులో ఉన్న పెద్ద లోపం ఏంటంటే, కథకు ఎడిటర్స్ లేకపోవడం. ఎడిటర్స్ అంటే పత్రికల్లో ఎడిటర్స్ కాదు. ఒక కథను ఎన్ని రకాలుగా ఎడిట్ చేయాలో చూసి, రచయితలకు సలహా ఇచ్చేవాళ్ళు అవసరం. రచయితలు కూడా వారి సూచనల్ని స్వీకరించాలి. అంతేకానీ, ఒకసారి కథ రాసేశాక ఒక్క అక్షరం కూడా మార్చకూడదు అని అనుకుంటే మంచి కథలు తయారుకావు. ఒక్కో కథ పదిసార్లు రాసినా తప్పేమీ కాదు. యూరోపియన్ సాహిత్యంలో పుస్తకాలకు ఎడిటర్లు ఉంటారు.‌ రచయితలు పుస్తకం వేసే ముందు వాళ్ల సూచనలు తీసుకుంటారు.

నామిని రాసిన కథల కన్నా చించేసినవే ఎక్కువ. ఆయన కథ రాసే తీరు భలే బాగుంటుంది. ఆయన ఒకేసారి కథ మొత్తం రాస్తారని అనుకునేవాణ్ని. కానీ ఆయన కథ ఎన్నో రకాలుగా ఎడిట్ అయ్యి, ఆ తర్వాతే బయటకు వస్తుందని ఆయన చెప్తేనే నాకు తెలిసింది. ఒక్కసారి రాసేసి, ఇక ఇంతే అని రచయితలు అనుకోకూడదు. ముఖ్యంగా ఇగో అస్సలు ఉండకూడదు. ఎడిటర్స్ చెప్పే సూచనలు పాటించే ప్రయత్నం చేయాలి. దాని వల్ల వాళ్లకే మేలు జరిగి, మంచి కథలు బయటకొస్తాయి.

  • ‘కథాసమయం’ తర్వాత ఏమైనా రాయాలన్న ఆలోచన ఉందా?

తెలుగులో ఒకటి, రెండు కథలు రాసి ఆపేసినవారు ఉన్నారు. ఒక కథతోనే ప్రాచుర్యం పొంది, ఆ తర్వాత కథలు మానేసినవారూ ఉన్నారు. అలాంటి వారి కథల్ని సేకరించి, వాటి గురించి రాయడం, వాటిని ప్రచురించడం చేయాలని ఉంది.

“కథాసమయం ” ప్రతులు దొరికే చోటు:
అన్ని ప్రముఖ పుస్తకాల షాపుల్లో.

ఇంకా
ఆర్.ఎం.ఉమామహేశ్వరరావు
20-3-131/ఎ 1, శివాజ్యోతినగర్, తిరుపతి – 517507.
ఫోన్ : 9985425888

*

విశీ

తెలుగు కథాలోగిట్లో ఇప్పుడిప్పుడే అడుగు పెడుతున్న పసిపిల్లాడి ఛాయ నాది. కథలు చదవడం, చదివించడం ఇష్టమైన పనులు. మంచి కథ గురించి నావైన నాలుగు మాటలు చెప్పడం బాధ్యతలా భావిస్తాను. మన చుట్టూ ఉన్న భిన్న అంశాలను నాదైన కోణంలో చూపించేవే ఈ మైక్రో కథలు.

9 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మంచి విషయాలు చెప్పారు…
    విమర్శ గురించి.. యువ కథకులు దృష్టి సారించాల్సిన అంశాలపై… కథలు రాసే పద్ధతులపై.. అనుసరించాల్సిన విధానాలపై …
    బాగుంది ఇంటర్వ్యూ…
    శుభాకాంక్షలు…

  • మంచి ఇంటర్వ్యూ వంశీ.
    ఉమా ఇచ్చిన జవాబులు చాలా క్లారిటీ గా వున్నాయి.
    నిజమే..
    నామిని కథలని తెలుగు వాళ్లందరూ చదవగలరు.
    అదే నాగప్పగారి సుందర్రాజు కథలు ఎంత గొప్ప వైనా అందరినీ చేరకపోవడానికి మాండలీకాన్ని సాన పట్టకపోవడం.
    మాండలీకంలోని మాధుర్యం చెడకుండా అందరిచేత చదివించడం అదొక చాకచక్యమైన విద్య. అందరికీ అబ్బదు.

  • నేను గతంలో తెలంగాణ మాండలికంలో కథ రాసేటప్పుడు కేవలం మాటలకు మాత్రమే మాండలిక భాషను పరిమితం చేసేవాడిని. అయితే మా ఊరి భాషను రికార్డ్ చేయాలన్న ఆశతో “తండ్లాట” కథను పూర్తిగా (కథనం, మాటలు కూడా) మాండలికంలో రాశాను. మా వైపు వారు యాభై ఏళ్ళ క్రితం నాటి పదాలు గుర్తు చేశావు అని అంటే, ఇతర ప్రాంతాల వారు కథ చదివేందుకు రెండు రోజులు పట్టింది అన్నారు. అప్పుడు నేను తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ద్వారా (ఎక్కువ మంది పాఠకులకు కథ చేరాలంటే మాండలికం సరళంగా ఉండాలని చెప్పిన విషయం) కరక్టేనని తెలియడం సంతోషంగా ఉంది. మంచి ఇంటర్వ్యూ, చాలా విషయాలు చర్చించి రాస్తున్న వారికి, రాయాలనుకునే వారికి ఒక క్లారిటీ ఇస్తున్నట్టుగా సాగింది. ఇరువురికీ శుభాభినందనలు.

  • ఇప్పుడు urgent గా ‘మూగబోయిన శబ్దం’ చదవాలి నేను. ఇలాంటి పది ఇంటర్వ్యూలకు సరిపడా సమాచారం వుంటుంది ఆయన దగ్గర. కథలు ఎందుకు రాయడంలేదో అడగాల్సింది కదా. Thanks for the interview Sai 😍💐

  • చరణ్… ఉమామహేశ్వరరావు కథలంటే మా లాంటి వాళ్లకు పాఠాల్లాంటివి. భాష, శిల్పం, వస్తువు వైవిధ్యంగా ఉంటాయి. జీవిత మూలాన్ని, వాస్తవికంగా వివరిస్తారు. వారి వ్యాసాలు చదివినా, ఇప్పుడు పుస్తకంగా వస్తున్నందుకు చాలా సంతోషం. నువ్వు ఇంటర్వ్యూ చేసినందుకు మరింత ప్రేమ.

  • ఉమామహేశ్వరరావు కథలంటే మా లాంటి వాళ్లకు పాఠాల్లాంటివి. భాష, శిల్పం, వస్తువు వైవిధ్యంగా ఉంటాయి. జీవిత మూలాన్ని, వాస్తవికంగా వివరిస్తారు. వారి వ్యాసాలు చదివినా, ఇప్పుడు పుస్తకంగా వస్తున్నందుకు చాలా సంతోషం. ఇంటర్వ్యూ బావుంది.

  • సారంగా చాలా మంచి ప్రయత్నానికి వేదిక అయింది.

    ఇందుకు కేంద్రంగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు.

    సాహిత్యాన్ని పరిపుష్టం చేసేందుకు అవసరమైన అనేక సూచనలను ఈ ఇంటర్వ్యూలో ఉమామహేశ్వరరావు గారు చేశారు

    ఇంటర్వ్యూ ద్వారా చాలా మంచి విషయాలను తెలియ చేసిన వంశీ గారు అభినందనీయులు

    ఈ కథలు వెలువడటంలోనూ, వాటిని పరిచయం చేయడంలో ఒక సామాజిక క్రమం కూడా కనిపిస్తుంది.

    అర్ఎం ఉమా మహేశ్వరరావు గారు విలువైన విమర్శకుడు అనే విషయం కందుకూరిపై విమర్శనా వ్యాసం రాసినప్పుడే గ్రహించాను (అంతకు ముందు విమర్శనా వ్యాసాలు రాయలేదని కాదు. సీమ కథా కోకిల అంటూ మధురాంతకం రాజారాం కథలను విశ్లేషిస్తూ రాసిన వ్యాసాన్ని కూడా గమనించాను)

    కథా సమయం పుస్తకం ద్వారా సాహిత్య విమర్శకుడిగా ఆర్ఎం ఉమా మహేశ్వర రావు గారు ధ్రువీకరించుకున్నారు.

    కథా సమయం పుస్తక రచయితగా తనకు తాను స్వీయ ప్రకటన చేసుకున్నట్టు కేవలం ఆ కథలను పరిచయం చేసే వ్యాసాలు కావు ఇవి.

    సాహిత్య విమర్శనా రంగంలో కథా సమయం మంచి చేర్పు.

    నవల సాహిత్యంలో ఎన్. వేణుగోపాల్ గారి నవలా సమయం వలె కథా సాహిత్యంలో ఆర్మ ఎం ఉమా మమేశ్వరరావు గారి కథా సమయం ప్రాముఖ్యతను కలిగినదిగా భావిస్తున్నాను.

  • కథల గురించి ఉమన్న ఆలోచనలు రాతరులకు విలువైన పాఠాలు. సబ్జెక్టుకి సంబంధించి ముఖ్యమైన ప్రశ్నలతో ఇంటర్వ్యూ చేశావు, అభినందనలు వంశీ.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు