కొన్నేళ్ల క్రితం సారంగ కోసం కాలమ్ రాయమన్నారు అఫ్సర్. “అంబేద్కర్ ఆలోచనలు” పేరిట రాయాలన్న ఊహ కలిగింది. కాని అవలేదు. ఇప్పుడు సారంగ తిరిగి ఆరంభమవుతోంది. అఫ్సర్ మీరు రాయాలన్నారు రెండు మూడురోజుల క్రితం. మాటలలో ‘సమాజంలో, సాహిత్యంలో అసహనం’ గురించి అన్నాను. ఇంకా కొన్ని అనుకున్నాను. ఇటీవల మధ్యతరగతి సాహిత్యంపై చిన్న చూపెందుకు అనే వ్యాసం ఆంధ్రజ్యోతి వివిధలో వచ్చింది. అది చదివిన వెలుగు రామినాయుడు సాహిత్యం మీద సమగ్రమైన పుస్తకం మీరు రాయాలన్నారు. అప్పుడు కలిగిన ఆలోచన ఈ కథాయానం అన్న భావన.
అంతేకాదు –
దాదాపు అరవై ఏళ్ల క్రితం సాహిత్యంతో నా సంబంధం కాకినాడ టౌన్ హాల్ గ్రంధాలయానికి వెళ్లటంతో ఆరంభమయిందనుకుంటాను. 13 వ ఏటనో అంతకు ముందో ఏదో ఒకటి రాయటం జరిగిందనుకుంటాను. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఏదో ఒకటి రాయని, చదవని రోజు లేదని నమ్మకంగా చెప్పగలను. మానవ జీవితాన్ని నమోదు చేసే పని సాహిత్యం ఆదినుంచీ చేస్తూనే ఉంది. దాన్ని ప్రభావితం చేసిందా? దానివల్ల ప్రభావితమయిందా సాహిత్యం? ఈ ప్రశ్నకి ఏ జవాబూ పూర్తి తృప్తిని ఇవ్వదు. ప్రభావితం చేయాలనే ఆదర్శం మాత్రం మనకు దగ్గరలోనే(స్థలకాలాలలో) పుట్టింది. పుట్టాక ఏం జరిగిందీ అన్నది అధ్యయనార్హం. సార్వజనీనం, సార్వకాలికం అనే భావనలు మాత్రం సాహిత్య గ్రంధాలలో చాలా కాలం నుంచి ఉన్నాయి. వాటిని మనం గుర్తుపట్టవచ్చు. ఇప్పుడు నాకు 70. నా ఆత్మీయులు కారా మాస్టారు రేపు లేదన్నట్లు పని చెయ్యాల్సిన వయసు వచ్చేసిందన్నారు. దాంతో సాహిత్యంలో నాకు అర్ధమైనవీ. ఆలోచనీయాలూ ఒకచోట పెట్టి నా పిల్లల, మనవల ఈడువారితో పంచుకోవాలనీ నాకన్న పెద్దలకు మనవి చేసుకోవాలనీ అనుకున్నాను. వివాదాస్పద విషయాల రాత, కీర్తికి దగ్గరదారి అనేది నాకూ తెలుసు. అలాగే తెగువ ప్రదర్శన(exhibition of boldness) ఉద్దేశ్యపూర్వకంగా చేయటం గురించి కూడా నాకు కొంత అర్ధమవుతుంది. నా ఆలోచనలు చెప్పుకుంటున్నపుడు అలా అనిపించే సాధ్యత ఉంది. నా దృష్టిలో నాది సత్యశోధనమే. చదివేవారికి ఎలాగైనా అనిపించవచ్చు. వివేచించితే నా ఆలోచన చర్చనీయమనైనా అనిపిస్తుందని నా నమ్మకం.
పోతే-
కథ అనేది ఒక సాహిత్య ప్రక్రియ కదా.. నవల వంటి చర్చార్హమైన ప్రక్రియ దృష్ట్యా మాటలాడితే సామాజిక విషయాలకి మరింత వెసులుబాటు ఉంటుంది కదా! లేకపోతే సాహితీయానం అనైనా అనవచ్చుకదా.. ఈ రకమైన ప్రశ్నలకు నా వివరణ ఈ శీర్షికలో లభిస్తుంది.
ప్రశ్నలు ఎవరైనా వేసినపుడు నా స్పందన ఉంటుంది. కాని వెంటనే చర్చలోకి దిగను. నా వివరణా సమయం ప్రశ్నని బట్టి ఉంటుంది. పాఠకులు వారిలో వారు చర్చించుకుంటే సంతోషం.
చివరగా-
ఈ శీర్షికన నా ప్రయత్నానికి పాఠకుల సహకారం లభించితే తెలుగు సాహిత్యం ప్రపంచ పరిణామాలను అర్ధం చేసుకునే క్రమానికి చిన్ని బాట వేసినట్టు నాకు అనిపించుతుంది. త్వరలో మొదటి వ్యాసం అందిస్తాను. నాకీ అవకాశం ఇస్తున్న సారంగకీ నాతోబాటు సహ ఆలోచన చేయబోతున్న సాహితీసమాజ హితాభిలాషులకీ ముందస్తు కృతజ్ఞతలు.
This intro sounds promising on teaching us many things.. Thanks in advance sir..
ఆశగా ఎదిరిచూస్తున్నాం …..
మీ ఆలోచనలు రాతల్లో చదవడానికై ఎదురుచూస్తున్నాము.