కథల్లో కనిపించే కవి సంపత్

వ్యవసాయంలోకి దిగిన సంపత్ కుమార్ కు కండ్లముందర్నే మల్ల మల్ల తడిసిన ధాన్యం గురించి తెలుసు.

‘ఆకులు గాలికి కదలినప్పుడల్లా వెన్నెల వెలుగుల పాదాలు భూమిపై నృత్యం చేస్తున్నాయి..’

‘ఒక శిల్ప కళాఖండం మసక వెల్తురును అరువు తెచ్చుకుని మీద చల్లుకుని ఎంతో అందంగా కనిపిస్తోంది..’

సాధారణ కథకుల్లో ఇలాంటి వాక్యాలు మనకు కనపడవు. కథకుడు కవి  అయితే, భావుకుడు అయితే ఆయన రాసే కథలో శైలి కథనాత్మకంగా ఉంటుంది. ఆ కథ వాస్తవిక జీవితం నుంచి వచ్చినట్లయితే, కథనం హృదయంలోంచి వచ్చినట్లుంటుంది. మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని మన మనసులోకి తీసుకుని చలించకపోతే ఆ వాతావరణంలోని బతుకులు జీవితంలోంచి వచ్చినట్లు మనకు తెలుస్తుంది. సంపత్ కుమార్ కూడా అలాంటి కథకుడు. కవి కూడా కనుక ఆయన కథనాలను కవిత్వం మేలిముసుగులా అలంకరిస్తుంటుంది.

సంపత్ కుమార్ నాకు చాలా సంవత్సరాలనుంచీ తెలుసు. ఢిల్లీలో పచ్చికబయళ్ల మధ్య శాంతిపథ్ అనే విశాలమైన రహదారిలో ఉన్న కెనడియన్ హై కమిషన్ లో చాలా రోజులు పనిచేశారు. అప్పుడప్పుడూ సాహితీ సమావేశాల్లో కనపడే సంపత్ కుమార్ కళ్లలో విలక్షణమైన మెరుపు కనపడుతుంది. ఆ మెరుపు నిజాయితీ అని నాకు చాలా కాలం తర్వాత అర్థమైంది. మనసులోని ప్రేమను, బతుకులోని తీపిని కోరుకునే సంపత్ 37 సంవత్సరాలుగా ఢిల్లీలో ఉన్నప్పటికీ దేశ రాజధానిలో చాలా మంది పెద్ద మనుషుల్లాగా మంచి ఇళ్లలో స్థిరపడే అవకాశాలున్నప్పటికీ ఆయన తాను పుట్టి పెరిగిన అదిలాబాద్ కు వెళ్లిపోయారు. నిర్మల్ లో ఇల్లు కట్టుకుని వ్యవసాయం చేస్తూ చుట్టూ ఉన్న పేదలకు ఏదో రకంగా సహయపడుతూ అక్కడి జీవితాలను గమనిస్తూ అప్పుడప్పుడూ వాటిని కథలుగా మలుస్తూ ప్రకృతితో, అడవితో మమేకమై జీవిస్తున్నారు. అందుకే ఆయన కథల్లో ఆయన కళ్లలోని మెరుపులా జీవం తచ్చాడుతూ ఉంటుంది.

ఆయన తొలి కథల సంకలనం ‘లియోసా’లో పర్యావరణం, సజీవ మానవ సంబంధాలు,  ఆత్మసౌందర్యం, సమాజంలోని ఘటనలు జీవితాలపై చూపే ప్రభావం,సున్నితమైన ప్రణయం గోచరించాయి. ‘పెన్నులు’ పేరుతో రాసిన మరో కథా సంపుటిలో ఆయన అనేక దేశాలు తిరిగినప్పుడు బస చేసిన హోటళ్లలోంచి గుర్తుగా సేకరించిన పెన్నుల్లో రకరకాల జీవితానుభావాలు, జలపాతపు సొగసులు, రాజకీయ సంక్షోభాలు, పగిలిపోయిన జీవితాలు, ద్రవ్యోల్బణం సృష్టించిన కల్లోలాలు కథలుగా పరుచుకున్నాయి. కథకుడు సమాజాన్ని లోతుగా అధ్యయనం చేయకపోయినా, లేక సమాజంలో భాగం కాకపోయినా ఇలాంటి కథలు రాయలేడు.

తాజాగా ఆయన మరో కథా సంకలనం ‘నా నుంచి మన వరకు’, చిరు నవల ‘కదలికలు’ వెలువడ్డాయి. ఆయన ‘కదలికలు’ నవల లో మనం ఢిల్లీ, ఆగ్రా, ఖజురహో వంటి పర్యాటక ప్రాంతాలను ఎవరి సహాయం లేకుండానే మనం చూసి రావచ్చు. నేపాల్ లో భూకంపం జరిగినప్పుడు దౌత్య కార్యాలయం టీమ్ సభ్యుడుగా ఉన్నందువల్ల భూకంప భీభత్సాన్ని ఆయన అనుభవించి రాసినట్లుంది.

సంపత్ కుమార్ కథా సంకలనం ‘నా నుంచి మన వరకు’ లో 14 కథలున్నాయి.  పంజాబ్ లోని పాక్ సరిహద్దుల్లో భద్రత అక్కడి జీవితాల్లో సృష్టించిన అభద్రత, పంజాబ్ భౌగోళిక రాజకీయ వాస్తవాలు, కెనడియన్ హై కమిషనలో టామ్ అనే స్నేహితుడితో ఏర్పడిన సరిహద్దుల్లేని స్నేహ సౌహార్ధ్రత, శాంతిపథ్ లో దౌత్య కార్యాలయాల నీడల్లో తచ్చాడే అగ్ర రాజ్యాల ఆధిపత్య వ్యూహాలు, దుబాయ్ వలస జీవితాలు, గిట్టుబాటు లేని తెలంగాణ వ్యవసాయ జీవితాలు, ఎన్నికల్లో గెలిచినా గ్రామాల్లో స్త్రీలపై కొనసాగే పురుషాధిపత్యం, కాంట్రాక్టర్లు, అధికారులు కుమ్మక్కై అడవిని కొల్లగొట్టడం  ఈ కథల్లో మనను కదిలిస్తాయి. ఒక కథకుడుగా ఆయన ఢిల్లీ నుంచి పల్లెలకు పోతున్నకొద్దీ ఆయన కథల్లో  సాంద్రత, నాణ్యత, అలముకున్న మట్టి పరిమళంతో పాటు స్వచ్ఛమైన మాటల్లో  పునీతమైన భాష ను కూడా మనం గమనించవచ్చు.

‘ఎంత చేసినా మనసుల్లోకి తొంగి చూడలేం, మాయమర్మాల్ని కనిపెట్టలేం.’.అని ఆయన ఒక సందర్భంలో మనుషుల దుర్మార్గపు ఆలోచనలను పసికట్టినట్లు రాశారు.

‘ దేశ ప్రధానమంత్రి తన భార్యతో రాజ్ పథ్ సందర్శించారు’ అన్నది పత్రికల్లో వచ్చే ఆరు పదాల చిన్న వాక్యమే, కాని ఆ 15 నిమిషాల పర్యటన, అందుకు జరిగే తయారీ, పనులు,సంక్లిష్టత ఎంత ఉంటుందో సాధారణ మనుషులు ఊహించలేరు. కాని సంపత్ కథ చదివితే జీవితమంతా సత్యం, అహింసలు, సాధారణత్వం బోధిస్తూ ఆచరించిన మహాత్ముని స్మారక ప్రదేశాన్ని దర్శించడానికి వెనుక కొన్ని వందల జీవితాల సంఘర్షణ అర్థమవుతుంది.

‘ప్రేమ నీ లోపలుంటే మాకెలా తెలుస్తుంది? మాకు తెలిసిన భాషలో చెబుతేనే కదా నీ ప్రేమ మాకు తెలిసేది..’ అని నానమ్మకు ఇంగ్లీషు నేర్పిన మనవరాలి గురించి రాసిన కథ కాలంతో మారాల్సిన వృద్దుల గురించి చెబుతుంది. కరోనా టైమ్ లో ఒకళ్లను మరొకరు కాపాడుకోవాలని తపించిన భార్యా భార్తల గురించి మరో అద్భుతమైన కథ రాశారు ఆయన.

సంపత్ నిర్మల్ వెళ్లాక ఖానాపూర్ అంగల్లను చూసిండు. పొల్లగాల్లను కలిసి దూపతీర్చుకుండు,  తాతీల్లను అనుభవించిండు. చిన్నప్పటి కథల్ని బగ్గ యాదికచ్చి మస్తు ఖుషయిండు. నుమాయిష్ లు, గారడాటలు, బుడ్డేర్ ఖాన్లను చూసిండు.ఎన్నికలు జోరుగైతే, ఓటేసే ముందు ఇండ్లళ్లకు సీసాలు, చికెన్ పాకెట్లు, పచ్చనోట్లు, అరిసెటోళ్లకు బిర్యానీలు, బత్తాలు రావడం గమనించిండు. వ్యవసాయరంగంలోని సంక్షోభాన్ని స్వయంగా అనుభవించిండు.

‘నువ్వచ్చి ఏంజేస్తవ్? ఊరి రాజకీయం నీకేం తెలుస్తది, సప్పుడు జెయ్యక ఇంట్లుండు. మీటింగ్ పనులు నేను జూసుకుంటా’ అని ఒక భర్త తన భార్య అయిన మహిళా సర్పంచ్ తో అంటడు. ‘జిమ్మెదారి నాదైతది గదా, పాతకాలం బోతున్నది. మీరే రాజరికం జేస్తే మేమప్పుడు ఉషారయ్యేది.బొమ్మలెక్క ఇండ్లల్ల కూసుండుమంటరా, గిట్టనడది ఇప్పటి నుంచి’ అని భార్య ప్రశ్నిస్తుంది.. ఈ కథ గ్రామాల్లో స్త్రీలలో వస్తున్న,రావాల్సిన చైతన్యాన్ని చిత్రిస్తుంది.

వ్యవసాయంలోకి దిగిన సంపత్ కుమార్ కు కండ్లముందర్నే మల్ల మల్ల తడిసిన ధాన్యం గురించి తెలుసు. వర్షం ధారలు రైతుల తలలపై పడి వాళ్ల కన్నీళ్లను కలుపుకుని గింజలపై పడితే, వడ్ల మొలకలు  సంచుల రంధ్రాల్ల కెళ్లి బయటకు తొంగి సూస్తే లబోదిబో మొత్తుకోవడమూ తెలుసు

వరి పంటది కూడా ఒక జీవితం అంటాడు  సంపత్.  ‘మూడు లోకాలని కలుపుకుని పెరుగుతదీ పంట. భూలోకం, నీళ్ల లోకం, పై లోకం, ఆకులు సూర్యుని వెలుతుర్ల దినమంతా తానాలు చేసుకుంటే కణజాలాలు ఫ్యాక్టరీల తీరుగా పనుల్జేసుకొంటవోతయ్. గాలికి సంతోషంగా ఊగిపోకే అంటూ అప్పుడప్పుడు పురుగులు తిష్ట వేసుకుని కూసోని గాలికి అవి సుగ ఆకుల్తోటి ఉయ్యాలలూగుడు, రోగాల్ని అంటించుడు, గిట్ల పంట ఒక్కొక్క పాముని తప్పించుకుంటూ చిన్న చిన్న నిచ్చెనలెక్కి ఆరోగ్యంగా నిల్చుండుడు.. పంట చేతికచ్చేదాకా కైలాసమాటనే…’ అని అద్భుతంగా అభివర్ణించాడు.

‘ఆకుపచ్చ రంగునుండి బంగారు రంగుకి ముత్తైదువలా పెయ్యంతా పసుపురంగు సూస్తుండే నా కండ్లల్ల తడి, తృప్తి. గింజల బరువుతో మెడ వంటి సర్దుకుంటున్నై, ఒక్క గింజకు గిన్ని గింజల్ని వాపసిస్తున్నై, ప్రేమతో వెన్నుల్ని తాక్కుంటా నాల్గడుగులేసినా, పెయ్యినిండ సంబరం..’ అని ఒక రైతులా మురిసిపోతాడు సంపత్ కుమార్.

ఇది కవిత్వమా, కథా? చెప్పగలరా?

*

కృష్ణుడు

వారం వారం ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఢిల్లీ నుంచి కాలమ్ రాసే ఎ. కృష్ణారావు, అడపా దడపా కవితలు రాసే కృష్ణుడూ ఒకరే. జర్నలిస్టుగా 34 సంవత్సరాల అనుభవం ఉన్న కృష్ణుడు కవి, సాహితీ విమర్శకుడు కూడా. ఇండియాగేట్, నడుస్తున్న హీన చరిత్ర పేరుతో రాజకీయ వ్యాసాల సంకలనాలు వెలువరించిన కృష్ణుడు ఇంకెవరు, ఉన్నట్లుండి, ఆకాశం కోల్పోయిన పక్షి అనే కవితా సంకలనాలను వెలువరించారు.

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు