కథలలో దాగివున్న అంతఃసూత్రం

 ఒక రచయిత తెలిసినా, తెలియక పోయినా – వారి కథలు అక్కడక్కడా చదివినా కూడా – ఒక సంపుటిలో ఆ రచయిత కథలన్నీ ఒకేసారి చదివినప్పుడు, ఆ రచయిత అంతర్గతం తెలిసి వస్తుంది. రచయిత సబ్ కాన్సియాస్ మైండులో దాగి వున్న భావమేదో హారంలో తీగలా పాఠకుడి తోస్తుంది. ఎంతో వైవిధ్యంగా వున్న కథలలో కూడా ఇదిగో ఈ రచయిత ఈ విషయాన్ని ప్రధానంగా చేసుకుని కథలు వ్రాస్తున్నాడు – ఇదే ఈ కథలలో అంతఃసూత్రం – అని ఓ చదువరే చెప్పగలుగుతాడు.

‘రైటర్స్ వర్కషాప్’ గ్రూపులోని మంచి చదవరులైన కొద్దిమంది రచయితలకి వచ్చిన ఈ ఆలోచన పుస్తక సమీక్ష సీరీస్ కి దారితీసింది. అందులో విజయ కర్రా కథల సంపుటి ‘ఆ ఒక్కటి – మరికొన్ని కథలు’ ఎంచుకుని ఫిబ్రవరి ఒకటవ తారీఖున జరిగిన సమావేశంలో గ్రూప్ మెంబర్స్ చర్చించారు. ఆ చర్చలో పాల్గొన్న వారి అభిప్రాయాలని ఇదిగో ఇక్కడ యధాతథంగా మీకోసం.

రచయిత్రి విజయ కర్రా కథా సంకలనం  ‘ఆ ఒక్కటి మరికొన్ని కథలు’ పై మా సమీక్ష  

https://magazine.saarangabooks.com/%e0%b0%86-%e0%b0%92%e0%b0%95%e0%b1%8d%e0%b0%95%e0%b0%9f%e0%b0%bf/

 శివ సోమయాజుల – విజయ గారు తెలుగు సాహిత్యమే కాదు, ప్రపంచ సాహిత్యం విస్తృతంగా చదివారని నా అభిప్రాయం. కథనంలో మంచి టెక్నిక్ వుంది. ఆ టెక్నిక్, మరింక క్లుప్తతని పాటిస్తూనే గాఢమైన సన్నివేశాల ద్వారా పాఠకుడిని కథలో నడిపించే విధానం… మనం తరచుగా చదివే తెలుగు కథలలో కనిపించవు. అది ఒక కాన్సియస్ ఛాయిస్ మరింక స్టడీడ్ టెక్నిక్ అని నాకనిపించింది. భాషపైన మంచి పట్టుతో పాటు వర్ణనద్వారా ఇక ఏం జరగనుంది అనే ఒక ఎట్మాస్పియర్ సృష్టించి అందులో కథ నడపడం – ఇవన్నీ తన కథలలో కామన్ గా కనిపించే ధీమ్స్. అల్లరి తమ్ముడు, ఉగాది వచ్చి వెళ్లింది, నల్లమందులాంటి కథలు నోస్టాల్జియా కూడిన స్లయస్ ఆఫ్ లైఫ్  కథలు. ఆర్.కె. నారాయణ్ మాల్గుడి డేస్ లాంటి కథలు.

నాకు చాలా నచ్చిన కథలలో విజయ గారి సిగ్నేచర్ కథ ‘ఇంటికి రా’ ఒకటి. మానవీయ కోణంతో కూడిన ఆ ‘ఇంటికి రా’ అన్నది ఒక యూనివర్షల్ మెసేజ్. నాకు మరో ఇష్టమైన కథ సాక్షి. తీసుకున్న సబ్జెక్ట్ , చెప్పిన టెక్నిక్, చివరిలో  కథ కలిగించిన షాక్ – ఒక పర్ఫెక్ట్ బ్లెండ్.

నా మటుకు డయాస్పోరా కథ అంటే మన మాతృదేశ సంస్కృతితో, మనముంటున్న దేశ సంస్కృతి కలిసినప్పుడు వొచ్చే ఒక యునీక్ ప్రాబ్లం కథగా రాసినప్పుడు వచ్చే కథే నిజమైన డయాస్పోరా కథ. అలాంటి కథలు చాలా అరుదుగా చూస్తాం. ఆ లెక్కన విజయ గారి రెండు కథలు ‘ద డే బిఫోర్’, ‘విండో షాపింగ్’ ప్యూర్ డయాస్పోరా కథలు. ‘ద డే బిఫోర్’ లో యువకుడి కరియర్ ఛాయస్ వలన వొచ్చే సంగర్షణ, అలాగే ‘విండో షాపింగ్’ లో యువకుడు ఎదురుకున్న ప్రలోభాలు రెండు సంస్కృతుల మధ్య జరిగే యునీక్ సంగర్షణల నుండి వచ్చిన కథనాలు. ఈ సంకలనంలో అన్ని కథలు కూడా చక్కని భాషతో, మంచి టెక్నిక్ కలిసి… హాయిగా చదివించే కథలు.

శ్రీనిధి –  ‘ఆ ఒక్కటి’ పుస్తకంలోని కథలన్నీ చదివాను. కొన్ని నచ్చిన కథలు మళ్ళీ మళ్ళీ  చదువుతుంటాను.  విజయ గారి కథల్లో వాక్యాలు నాకు చాలా ఇష్టం. చానా తూకంగా రాస్తారు. ఒక్క పదం కూడా అనవసరంగా అనిపించదు. ‘చక్కని తండ్రికి చాంగుభళా’ నాకు చాలా నచ్చిన కథ. సౌందర్యమంటే కృష్ణుడని ఎన్నో సార్లు చదివాము. కానీ శివుడిపై ఇంత అందమైన కథ చదవడం ఇదే మొదటిసారి.  కథలో వర్ణనలు  చదువుతుంటే అక్కడే వుండి  పెళ్లి వేడుకలు చూస్తున్న భావం కలుగుతుంది. మరో కథ – మోహన వంశీ, నాకు చాలా ఇష్టమైన కథ. కృష్ణుడు నాకు ఒక ఆప్తుడిలా, స్నేహితుడిలా అనిపిస్తాడు, అందుకే ఈ కథ మళ్ళీ మళ్ళీ  చదువుకుంటాను. రాసలీల అంటే మనం ఒకలా ఆలోచిస్తాము. ఈ కథలో ఎంతో స్వచ్చంగా అందంగా చూపించారు. ఈ కథలో నృత్య వర్ణనలో రచయిత్రి ఉపయోగించిన పదాలు, వాక్యలు చాలా ప్రత్యేకం. అవి రాయడం అందరికి అంత సులువు కాదు.

ఎవరైనా తెలుగులో ఏ పుస్తకం చదవాలి? అసలు మంచి పుస్తకాలు ఉన్నాయా? అని అడిగే వారికి ధీటైన జవాబు ‘ఆ ఒక్కటి’ కథ. అందులో రాసిన పుస్తకాలని చదివి ఆ కథ చదివితే ఇంకా బావుంటుంది. ‘నన్ను మరచిన వేళ’, ‘రీచ్ అవుట్’ అందరూ చదవాల్సిన కథలు. ‘దిల్ ధడక్ నే దో’ నా ఆల్ టైమ్ ఫ్యావరేట్.

 

పాణిని జన్నాభట్ల – ఏడాది క్రితం విజయ గారి కథలు చదివి నా అభిప్రాయం ఫేస్బుక్ పై పంచుకున్నాను. మిత్రులు అన్నట్టుగా, కథలు చదువుతుంటే వాక్యాలు సాఫీగా సాగిపోతాయి. రచయితతో పరిచయమున్నా, లేకపోయినా వారి కథలు మొదటిసారి చదివినపుడు ఒక షాక్ వేల్యూ ఉంటుంది. చదివే కొద్దీ మనకి రచయిత  తెలుస్తాడు. మొదటి నుండి చివరి వరకూ ఆగకుండా చదివించిన కథలు. శ్రీనిధి చెప్పినట్టుగా, నాకు కూడా ‘మోహన వంశీ’, ‘చక్కని తండ్రికి చాంగు భళా’ కథలు బాగా నచ్చాయి. ఎందుకంటే, ఎంచుకున్న అంశాలు కత్తిపై సాములాంటింవి.  భాష ప్రధానమైన కథలు. పాఠకుడు కనెక్ట్ అవ్వాలంటే ఆ వాతావరణంలోకి తీసుకెళ్లే భాష కావాలి. ఆ రెండు కథల్లోనూ నన్ను ఆ ఆవరణలోకి తీసుకెళ్లారు. ఆ దృశ్యాలు, వాసనలు, చప్పుళ్ళు చదువుతుంటే చూసిన అనుభూతి కలిగింది. విండో షాపింగ్, పూర్తిగా భిన్నమైన జానర్. ఈ కథలు ఒకే రచయిత రాసారంటే నమ్మశక్యంగా అనిపించదు. చక్కని భాష, కథని దృశ్యం చేసి చూపించ గలిగే సామర్థ్యం వున్న ఈ రచయిత్రి ఒక చారిత్రక నవల రాస్తే చదవాలని నా కోరిక.

 

నారాయణస్వామి శంకగిరి – సాహిత్యం అంటే అభిరుచి ఉన్న పాఠకులు తప్పక చదవాల్సిన కథలని అనేక వేదికలపై చెప్పాను. విజయ గారితో  మొదటిసారి నా పరిచయం ‘ఇంటికి రా’ అనే కథతో మొదలయ్యింది. అద్భుతమైన కథ. అలా వస్తుపరంగా, శిల్పపరంగా కథ చాలా నచ్చి, వెంటనే విజయగారికి అభినందనలు తెలియజేసాను. తానా పత్రిక సంపాదకుడిగా కథల రివ్యూ అవసరమైతే నా సహకారం అందజేస్తానని చెప్పను. విజయగారు సహృదయంతో కొన్ని కథలు నాతో కలిసి పనిచేసారు. అందుకు వారి కథల పట్ల నాకు అవగాహన ఉంది. కథల ఎంపికలో వైవిధ్యం చూపిస్తారు, రచనపై ఎంతో శ్రద్ద పెడతారు. నేను గమనించిన ఇంకో విషయం ఏమిటంటే కథల్లో అంతఃసూత్రంగా కుటుంబ విలువలు కనిపిస్తాయి. చక్కటి భాష, సాఫీగా సాగే వాక్యంతో పాఠకుడిని చదివింపజేసే ఉత్తమ కథలు.

 

కొత్తావకాయ సుస్మిత – నేను విజయ గారి కథలన్నీ చదివాను. అందులో నాకు చాలా ఇష్టం అయిన  రెండు కథల గురించి మాట్లాడుతాను. ఒకటి విండో షాపింగ్. ఆ కథని మా అబ్బాయి ఇంగ్లీష్ ట్రాన్స్‌లేషన్ చేసాడు. కథకి సంబంధించిన సంభాషణలు మా మధ్యన తరచుగా జరిగేవి. ఆ ప్రయత్నంలో మేమిద్దరం రెండు విషయాలు తెలుసుకున్నాము. మా అబ్బాయికి కథలో ప్రోగ్రెషన్ చాలా నచ్చింది. కథలో ప్రోటోగానిస్ట్  చేసేది నేరమైనా, అలాంటివాడు ఎవడైనా జీవితంలో బాగుపడితే, పని శ్రద్ధగా చెయ్యాలనే నైజం వాడిని ముందుకు తీసుకెళుతుందని అన్నాడు. నాకు తను కథని అర్థం చేసుకున్నా విధానం ఆ ఎనాలిసిస్ ఆశ్చర్యంగా అనిపించింది. నాన్న బదులు అమ్మ లేకపోతే కథ వేరేలా ఉండేది కదా అన్న వాడి ఆలోచన కూడా కథని ఒక రచయిత ఎంచుకున్న క్రియేటివ్ ఛాయిస్ అనేదాన్ని మరో కొత్త కోణంలో చూడడం నేర్పిందనిపించింది.

‘ఆ ఒక్కటి’ నాకు నచ్చిన ఇంకో కథ. సులువుగా కనిపించే చాలా కాంప్లెక్స్ కథ. తెలుగు సాహిత్యంపై పరిశోధన చేసేవారు తప్పకుండా చదవాల్సిన కథ. అందులో పేర్కొన్న పుస్తకాలు చాలా మటుకు నేను చదివాను. తను రాసిన అన్నీ కథలు ఒక ఎత్తు ‘ఆ ఒక్కటి’ ఒక ఎత్తు. విజయ ఆ కథని మించే కథ రాయాలని నా కోరిక.

 

మధు పెమ్మరాజు – వస్తువైవిధ్యం, వర్ణన, వచన కవిత్వం, ఆశావహదృక్పథం, ముగింపు …  ఇవి నాకు విజయగారి కథలలో ప్రత్యేకంగా కనిపించినవి.

నాకో అలవాటుంది, కథ చదువుతూ మధ్యలో ఎన్ని పేజీల కథ అని లెక్కేసుకుంటాను, విజయ గారి పుస్తకంతో ఆ అవసరం కలగలేదు. క్లుప్తత పాటించే నియంత్రణ, వచనంతో పాటు కవిత్వంలో అభినివేశం ఉన్నవారికి సహజ గుణం. కథ మొదలవగానే కథావరణలోకి చేరుకుంటాము, ఇక బిగువుగా సాగే కథనంతో మనమూ ఒక పాత్రగా మారిపోతాము. తర్వాత ఏం జరుగుతుందా అనే ఆసక్తితో పేజీలు తిరగేస్తూ అనూహ్యంగా ముగిస్తాము. కవిత్వపు అంచున దోబూచులాడే వచనం, తిరిగి చదివంపజేసే వర్ణనలు, ఇంచుమించు అన్ని కథల్లో తర్వాత ఏం జరుగుతుంది, ఎలా ముగుస్తుందనే సన్నటి ఉత్కంఠ వెంటాడుతుంది.

కథనం ఒక ఎత్తైతే, ముగింపు వీరి ప్రత్యేకత. సాధారణంగా సాగే ‘గోదావరి తీరం’ కథ ముగింపు వాక్యం (పరోక్షంగా అయితేనేమి గొప్ప వ్యక్తిని పరిచయం చేసింది) చదవగానే మానవీయ విలువలపై తిరిగి నమ్మకం కలుగుతుంది. ‘దిల్ ధఢక్ నే దో’ చాలా ముఖ్యమైన కథని నా అభిప్రాయం, రోజూవారి చికాకులు మధ్య ఏళ్లుగా కాపురం చేస్తున్న మనుషులు మసకబారిన కంటితో ఒకరినొకరు చూసుకుంటారు. అలా వదిలేస్తే ఎక్కడికి చేరుకుంటాయో అందరికీ తెలుసు. మనని మనం కాసేపు పక్కన పెడితే, మసకని తుడిచెయ్యడం కష్టం కాదని చెప్పే క్యూట్ స్టోరీ. ‘రీచ్ అవుట్’ లోని అందరూ కలిసి సమస్యని పరిష్కరించిన విధానం చాలా నచ్చింది. ‘నల్లమందు’ ఇంతకు మునుపు ఎప్పుడూ చదవని తాజా కథనం. అపరిచితుడు ఇంచుమించు ‘దిల్ ధడక్ నే దో’ లాంటి ఫ్రెష్ ఫీలింగ్ చూపించే కథ. ఇంటికి రా! ముగింపు ఉలిక్కిపడేలా చేసింది. పూర్తి సంతృప్తిని కలిగించిన పుస్తకం – ‘ఆ ఒక్కటి మరికొన్ని కథలు’.

 

అంతఃసూత్రం:

మొదటి పేరాలో చెప్పుకున్నట్లు… ఈ  కథా సంకలన సమీక్షలో అందరికీ నచ్చే కొన్ని కామన్ కథలు, వ్యక్తీకరించిన భావాలు కథలలో అంతఃసూత్రాన్ని వెన్న తీసినట్లుగా బయటకి తెచ్చే అవకాశాన్ని కలిగించాయి.

ఇంటా బయటా తనవైన సమస్యలతో వున్న ఆధునిక స్త్రీని అర్థం చేసుకుని అండగా నిలిచే ఓ పురుషుడు –  తోటి మనిషిని అర్థం చేసుకునే ప్రయత్నంలో మార్పు మనవైపు నుండి కూడా జరగితే పరిస్థితులు చక్కనవుతాయి కదా అన్న ఒక ఆలోచన – ఇవన్నీ కలిసి ‘ఆ ఒక్కటి మరికొన్ని కథలు’ రచయిత కథలలో ‘ఆశావాదం’ అంతఃసూత్రంగా కనబడుతుంది. ఈ కథా సంకలనంలోని కథలన్నీ చదివితే మీరు కూడా మాతో ఏకీభవిస్తారని మా నమ్మకం.

పుస్తకం కావాలనుకునే వారికి ఈ క్రింది వివరాలు ఉపయోగపడతాయి:

‘ఆ ఒక్కటి మరికొన్ని కథలు’ – కథా సంపుటి

రచన . విజయా కర్రా / MRP-200

ఛాయా రిసోర్స్ సెంటర్ ప్రచురణ , హైదరాబాద్

ఫోన్:  9848023384 (postal free)

OR

From Amazon India: with a discounted rate

OR

With in USA – email to  vijayakarra.katha@gmail.com 

మధు పెమ్మరాజు

మధు పెమ్మరాజు నివాసం హ్యూస్టన్ దగ్గరలోని కేటీ నగరం. శీర్షికలు, కధలు, కవితలు రచించడం, సాహిత్య కార్యక్రమాలు నిర్వహించడం, పాల్గొనడం వీరి హాబీలు. వీరి రచనలు కౌముది, కినిగే, ఆంధ్రజ్యోతి, చినుకు, వాకిలి, సారంగ పత్రికలలో ప్రచురించబడ్డాయి.

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • రొటీన్ నుండి భిన్నంగా వున్న సమీక్ష – మిత్ర రచయితల అభిప్రాయాలు అన్నీ ఒకే చోట చదువుకోవడం బాగుంది. ఇదే నా మొదటి పుస్తకావిష్కరణ అనిపించింది. అందరికీ కామన్ గా నచ్చిన కథలు, కొందరికి ప్రత్యేకంగా నచ్చిన కథలు, కారణాలు ఆసక్తిగా ఇన్స్పైరింగ్ గా వున్నాయి. సమీక్షలో పాల్గొన్న మిత్రులకి, ప్రచురించిన సారంగ పత్రికకి అనేక ధన్యవాదాలు !

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు