కథనాత్మకత ‘లేదాళ్ళ’ కవిత్వ బలం

‘కందిలి’, ‘మౌనమూర్తి’, ‘అమ్మకు  ఓ జత చెప్పులు కొనాలి’ అనే మూడు కవిత్వ సంపుటుల కవి లేదాళ్ళ రాజేశ్వర రావు.. వరంగల్ జిల్లా దామెర మండలం, కోగిలవాయి గ్రామానికి చెందిన కవి –  పెరిగింది మాత్రం మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని ద్వారక.  ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడుగా ఒక వైపు తన బాధ్యతను నిర్వర్తిస్తూనే మరోవైపు సాహిత్య సృజన చేస్తున్న అతి సాధారణమైన మనిషి. ఈ విషయం తన కవిత్వం చదివితే అర్థమవుతుంది. సమాంతరంగా తన కథనాత్మక శైలి మన పెయికి ఇముడుతుంది.
*
యాప పుల్ల 
ఒకప్పుడు బతకడమే గగన సదృశ్యమయ్యేది 
నాన్న ఎవుసానికి 
అమ్మ ఒక్కొక్క ఆభరణమూ
అవుసల వాళ్ళింటికి వెళ్లినప్పుడు
 పోనీలే !
ఈ ఏడైనా నా పిల్లల కడుపు నిండుతుంది అనుకునేది 
పెద్ద బాయి మోటారుకు రిపేరు వచ్చినప్పుడల్లా 
నాన్న అమ్మ ముఖంకేసి చూసేవాడు
 ఇంకా ఏమైనా మిగిలి ఉన్నాయా అన్నట్లు 
అమ్మ నవ్వుతూ 
ఆ రెండు గుండ్రని లోహపు బిల్లల్ని మాత్రం 
బహు జాగ్రత్తగా గుండెల్లో దాచుకునేది 
నాన్న అడగడు గానీ !
పోతూ పోతూ కాలగమనంలో అమ్మకు కొత్త ఆభరణాలొచ్చి చేరాయి 
ముక్కుకూ చెవులకూ
చిల్లులు పూడుకు పోకుండా వేప పుల్లలు!!
పూడుకు పోనిచ్చేదే అమ్మ వాటిని 
ఎప్పటికైనా 
ఏ కొడుకైనా 
వాటిని నగతో 
పూరించక పోతాడా అనే ఆశ కాబోలు!!
*
ఎత్తుగడ ఒక ‘స్టేట్మెంట్’ అవుతుంది. ఇక్కడ ఇది ఒక సత్య ప్రవచనం. కవి వస్తువును చూస్తున్న దృష్టి కోణం వైవిద్యమైనది. సాధారణంగా మెజారిటీ కవులు ఒక వస్తువును ఎంచుకున్నప్పుడు దానికి ఉన్న సాధ్యమైనన్ని సకల పార్శ్వాలను తడుముతూ లేదా ఎంపిక చేసుకున్న భిన్న కోణాలను  స్పృశిస్తూ వస్తువును దాటిపోకుండా కవిత్వం చేయడానికి ప్రయత్నిస్తారు. లేదాళ్ళ వస్తువును డీల్ చేయడం కొత్తగా అనిపిస్తుంది. కవి ఉపాధ్యాయుడు కూడా కాబట్టి బోధనాభ్యసన ప్రక్రియ లోని సోపానాలు అన్వయం చెందించబడతాయి.
 “యాపపుల్ల” అనే పాఠ్యాంశ ప్రకటన చేస్తున్నట్లుగా ఆసక్తికరమైన జీవిత కథనం కవిత్వంలో భాగమవుతుంది. నిజానికి పాఠ్యాంశ ప్రకటనతో ఒక సోపానం పూర్తవుతుంది. కానీ కవిత పాఠ్యాంశ ప్రకటనతో అన్వయం పూర్తి కాదు. అనగా అదే ముగింపు కాదు. దాని తర్వాత కూడా కవి మాట్లాడతాడు. ముగింపు అనుకున్న వాక్యం తర్వాత చెప్పే విషయం వస్తువును అందనంత ఎత్తుకు తీసుకువెళ్లి నిలబెడుతుంది. ఇది కవి నిర్మాణ వ్యూహంగా కూడా చెప్పుకోవచ్చు.
ప్రతి కథకు ‘మలుపు’ను కీలకంగా చెబుతారు. ఇక్కడ మలుపు దగ్గర ఆగితే అది కవితా శీర్షిక అవుతుంది. ఇది ఒక ‘కీ పాయింట్’. కవిత నడకను పరిశీలిస్తే వాస్తవానికి అది ‘కీ పాయింట్’ కి ఇరువైపులా కొనసాగినట్లు అనిపిస్తుంది. ఒక స్థిర బిందువు నుంచి రెండు దిశల్లో ప్రయాణిస్తున్న సరళరేఖ –  కవిత్వ నిర్మాణ సూత్రం అవుతుంది. కవి ముందుగానే అనుకొని ఈ నిర్మాణ సూత్రాన్ని పాటించాడనుకుంటే ఇది ఒక నిగమన పద్ధతి అవుతుంది. ఉదాహరణల ద్వారా సూత్రాన్ని రాబట్టడం ఆగమన పద్ధతి అయితే సూత్రీకరణల నుంచి ఉదాహరణల వైపు సాగేదే ఈ నిగమన పద్ధతి.
*
వస్తువులో కవి ఏం దర్శించాడు? అనేది మనం ప్రముఖంగా మాట్లాడుకోవాల్సిన అంశం. ‘యాపపుల్ల’ కవిత చదువుతున్న పాఠకుడికి మరోకవి ‘వడ్లకొండ దయాకర్” రాసిన ‘యాప చెట్టు’ (బతకడమే దాని కులం/ బతికించడమే దాని మతం) కవిత యాదికి వచ్చిందనుకుందాం. ఒక అంశాన్ని లేదా వస్తువును చూసి దాన్ని గుర్తించుకోవడానికి మరో అంశంతో జోడించుకోవడం లేదా సంధానపరచుకోవడం సాధారణంగా చేసే పనే. థీమ్ బేస్డ్ పోయెట్రీ స్ఫురణలోకి వస్తుంది. వస్తువు పరుచుకున్న అంశాలు లేదా వస్త ఆవరణ లోపలి విషయాలు అంటే యాపపుల్లకు – యాప చెట్టు, యాప ఆకులు, యాప మండలు, యాప పండ్లు, దాని నీడ, నీడలో ఆడుకున్న ఆటలు, సోపతి గాళ్లు, ఒడ్వని ముచ్చట్లు, యాప చెట్టుతో ఉన్న అనుబంధం మొ.న విషయాలు జ్ఞప్తికి వస్తాయి. ఒకే వస్తువును వివిధ కవులు కవిత్వం చేస్తున్నప్పుడు కొంత భావ సంసర్గం (అసోసియేషన్ ఆఫ్ థాట్స్) కు అవకాశం లేకుండా పోదు  ఇక్కడ లేదాళ్ళ తీసుకున్న వస్తువుకు సంధానపరచబడ్డ అంశంగా శీర్షిక కనిపిస్తుంది. పాఠకుడు కొన్ని సందర్భాల్లో శీర్షికే వస్తువుగా, వస్తు ఆవరణంలోని అంశంగానే భావించినప్పుడు, కవి అందుకు భిన్నంగా కవిత్వం చేస్తున్నప్పుడు ఉద్వేగ భరితమైన అనుభూతికి లోనవుతారు.
వస్తువు “ఎవుసాన్ని, కుటుంబ ఆర్థిక పరిస్థితిని, పటిష్టమైన అనుబంధాల్లోని నమ్మకాన్ని, బతుకు పట్ల ఆశను – యాపపుల్లతో సంసర్గం చేసి చెప్పడంతో పాటుగా రెండు రకాల సన్నివేశాల్ని దృశ్యమానం చేసే ప్రయత్నం చేస్తాడు కవి. ఒకటి గతం, రెండోది భవిష్యత్తు. వర్తమానంలో ఉండి మాట్లాడుతూనే భారతదేశ రైతు ముఖచిత్రాన్ని చిత్రిక పడుతడు.  గ్రామీణ భారతంలోని వ్యవసాయ కుటుంబాల సామాజిక స్థితిని చూపెట్టిన క్రమం ఇందులో ప్రస్ఫుటమవుతుంది.
” పెద్దబాయి మోటారుకు రిపేరు వచ్చినప్పుడల్లా/ నాన్న అమ్మ ముఖం కేసి చూసేవాడు”
అమ్మ ముఖం కేసి చూడటం లోని లోతుని, ఆంతర్యాన్ని కవి నేరుగా పాఠకుడి గుండెల్లోకి ఒంపగలిగిన ద్రవీభూత వాక్యాలు అనొచ్చు‌. ఏకకాలంలో అమ్మానాన్నల మనఃస్థితిని సైతం అర్థం చేయించగలదు‌. వస్తువును కవిత్వం చేయడానికి కవి ప్రదర్శించిన ఒడుపు ఇక్కడ ప్రశంసనీయమైనది.
‘కథనాత్శకత’ను  కవిత్వబలంగా మలుచుకుని , అద్భుతమైన కవిత్వాన్ని వాగ్ధానం చేస్తున్న కవికి శనార్తులు.
*

బండారి రాజ్ కుమార్

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు