కథకు రూపం, సారం వేరు వేరు

  సాహిత్యంలో కథకు ఓ సామాజిక ప్రయోజనముంది. ఒక మనిషిని మంచి వాడని ఎట్ల చెప్పలేమో కథను కూడా మంచి కథ అని అట్లనే చెప్పలేము. విడిచిన బాణం లక్ష్యాన్ని కొట్టినట్టు ప్రయోజనాన్ని నెరవేర్చిన ప్రతి కథ ఒక మంచి కథనే. స్థల కాలాలను అద్దుకుని స్థానికతను దిద్దుకుని గతం అనుభవంగా వర్తమానం మీద నిలబడి భవిష్యత్ ను జీవితం లోంచి చూసే ప్రతి కథ మంచి కథనే. గ్లాసియర్ తెలుసు కదా… హిమనీ నది. పైన పొరలు పొరలుగా గడ్డకట్టుకుని మంచు రూపములో ఉన్నా లోపల వేగంగా ప్రవహించే ఒక నది ఉంటది.  మంచి కథ కూడా అంతే. రూపము సారమూ వేరువేరుగా ఉండాలె.  పై పొరలు పాపి చూస్తే లోపల అనంత చలనశీలత ఉండాలె. మంచి కథ అంటే ఏమిటో చెప్పడానికి మీకు ఓ కథను చెప్పుత.

అదొక పెద్ద బడి. టీచర్లందరు స్టాఫ్ రూమ్ లో కూర్చున్నారు. బెల్ మోగింది. అయినా పనిని మరిచి తరగతి గదుల్లోకి వెళ్లకుండా ముచ్చట్లు పెడుతున్నారు. చూసి చూసి పెద్ద సారుకు కోపం వచ్చింది. వాళ్ళను పల్లెత్తు మాటనకుండా బయటకు వచ్చి ఒక పిల్లవాడిని పట్టుకొని గట్టిగా ‘ఏంరా… గంట కొట్టింది వినలేదా… క్లాస్ రూమ్ లకు పోవాలని తెలువదా’ అన్నాడు. అంతే… అక్కడ తలగాల్సిన మాట ఎక్కడో తలిగింది. ఒక్క సరుపు సరిచినట్టు సురుక్కుమంది. అందరికి బాద్యత యాదికొచ్చింది. బుద్ధిగా టీచర్లంతా చాక్ పీస్ డస్టర్లతో తరగతి గదిలోకి వెళ్లారు. జరగాల్సిన పని ఒక్క మాటతో జరిగి పోయింది.

అదిగో మంచి కథ కూడా అంతే. బడి ఒక సమాజం మార్పును కోరే కథకుడే పెద్దసారు. అతని నోటి వెంట వచ్చిన ఆ రెండు మాటలే కథ. అతడు చెప్పాల్సిన మాట సార్లతో చెప్పకుండా బయటకు వచ్చి చెప్పడం ఒక ఎత్తుగడ. పిల్లవాడిని మందలింపు ఒక రూపం. సార్లు కార్యోన్ముఖులు కావడం సారం. ఎక్కుపెట్టిన తూటాలా మెత్తగా ఎక్కడ దిగాలో అక్కడ దిగి కర్తవ్యాన్ని గుర్తుకు తెచ్చింది. అట్లని ప్రబోదించడం ప్రవచనాలు చెప్పడం కాదు. పిల్లలు గోటీలు ఆడుతున్నప్పుడు ఒక్కకాయతో సంటర్ కాయను కొడితే గోటీలన్ని చెల్లాచెదురయినట్టు, క్యారం బోర్డులో ఏ  మూలకో తగిలిన ఒక్క స్టైగర్ నాలుగు నల్ల కాయిన్ లను హోల్లలో పడేసినట్టు సూటిగా చేయాల్సిన పనిచెయ్యాలె.

అసలు మంచి అంటేనే ఓ స్థిరమైన అర్థం లేని పదం. ఒక చోట మంచి ఒకానొక చోట మంచి కాకపోవచ్చు. కాలం మారినా, చోటు మారినా మంచికి నిర్వచనం మారవచ్చు. మంచి అనుకుని మనం పెట్టుకున్న నియమాలకు అవతల కూడా మంచి కథ ఉండవచ్చు. చెప్పీ చెప్పొద్దని, విప్పీ విప్పొద్దని, ఓపెన్ ఎండ్ అని, కొనా మొదలు ఉండొద్దని, కథనే కథ చెప్పాలని, కావాలనే ఖాళీలు వదులాలని ఇలా మంచి కథ గురించి ఏదేదో చెప్పినా ఇల్లు కాలుతుంటే నిశ్శబ్దంగా నీళ్ళు మోసేకంటే అంచున కూసుండి అరిచి బొబ్బపెట్టి పది మందిని జమకొట్టి కాలుతున్న ఇల్లును ఊరంతా చూపించేదే మంచి కథ. ఇంతకంటే ఇంకేం ఎక్కువ చెప్పినా ముక్కు ఎక్కడా? అంటే ముఖం చుట్టూ వేలు తిప్పినట్టే అవుతుంది.

*

పెద్దింటి అశోక్ కుమార్

16 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు