కథకు పరిమితులు ఎక్కువ

* హాయ్ కిరణ్! మీ గురించి చెప్పండి.

నాది తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం. పుట్టింది, పెరిగింది అక్కడే. రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో డిగ్రీ  చదివాను. ఆ తర్వాత విశాఖపట్నంలో బయో కెమిస్ట్రీ‌లో పీజీ చేశాను. టీవీ ఛానెల్స్‌లో ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశాను. ప్రస్తుతం పాకెట్ ఎఫ్‌ఎంలో అసోసియేట్ ఎడిటర్‌గా పని చేస్తున్నాను.

* సాహిత్యంతో పరిచయం ఎలా ఏర్పడింది?

డిగ్రీ దాకా పెద్దగా సాహిత్యం చదివింది లేదు. రచయితలెవరూ తెలియదు. డిగ్రీలో సతీష్ అనే మిత్రుడి ద్వారా పుస్తకాలు చదవడం అలవాటైంది. అతను కవితలు రాసేవాడు. నాకు కథల గురించి వివరించిందీ అతనే! ఆదివారం అనుబంధాల్లో వచ్చే కథలు చదివి మేమిద్దరం చర్చించుకునేవాళ్లం. అలా సాహిత్యంతో పరిచయం ఏర్పడింది.

* రచనలు చేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది?

పీజీ తర్వాత చెన్నైలో ఉద్యోగం వచ్చింది. అక్కడ ఉన్నప్పుడు రాయడం మొదలుపెట్టాను. మొదట ‘మనసు పలికింది ఈ మాట’ అనే నవల రాశాను. 2014లో స్వాతి వారపత్రికలో ప్రచురితమైంది. ఆ తర్వాత 2016లో ‘వైకుంఠపాళి’ అనే నవల స్వాతి వారపత్రికలోనే ప్రచురితమై లక్ష రూపాయల అవార్డు పొందింది. ఆ తర్వాత సుకథ వెబ్‌సైట్‌లో ‘పిపాసి’ అనే నవల రాశాను.

* కథలు రాయడం ఎప్పుడు మొదలు పెట్టారు?

కథ కన్నా నవల రాయడం నాకు సులభంగా అనిపిస్తుంది. 2016లో స్వాతి వారపత్రికలో సరస కథల పోటీకి ‘అందిన స్వర్గంలో అమృతం చవక’ అనే కథ రాసి పంపాను. అది సాధారణ ప్రచురణకు ఎంపికైంది. ప్రచురితమైన నా తొలి కథ అదే! ఇప్పటికి 12 కథలు, ఆరు నవలలు రాశాను. ‘వైకుంఠపాళి’, ‘పిపాసి’ నవలలు కలిపి 2017లో పుస్తకంగా తీసుకొచ్చాను.

* మీకు ఇష్టమైన కథలు? కథకులు?

నేను యండమూరి వీరేంద్రనాథ్ గారి నవలలకు బాగా కనెక్ట్ అయ్యాను. అంపశయ్య నవీన్ గారి రచనలన్నా ఇష్టం. చలం గారి కథలు చాలా నచ్చాయి. సలీం గారి నవలలు, బెజ్జారపు వినోద్ కుమార్ గారి కథలు ఇష్టం.

* మీ రచనలకు మీరందుకున్న ప్రశంసలు?

యండమూరి వీరేంద్రనాథ్ గారు నా నవలలు చదివి మెచ్చుకోవడం చాలా ఆనందంగా అనిపించింది. కోలపల్లి ఈశ్వర్ గారు నేను రాసిన ‘మనసు పలికింది ఈ మాట’ నవల చదివి బాగుందంటూ ఉత్తరం రాశారు. రచయిత చంద్రశేఖర్ ఆజాద్ గారు నా రచనలు చదివి మెచ్చుకున్నారు.

* ఇంకా ఎలాంటి రచనలు చేయాలని ఉంది?

ముందే చెప్పినట్టు నాకు నవలలు రాయడం సులువుగా అనిపిస్తుంది. మనం చెప్పాలనుకున్నది విస్తృతంగా, వివరంగా చెప్పే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం రెండు నవలలు రాస్తున్నాను.

అంతిమం

“మనిషి అంతిమంగా ఏమి కోరుకుంటాడు?” నాలో ఎప్పుడు రగిలే ప్రశ్న. సరైన జవాబు దొరకని  ప్రశ్న. ప్రతి మనిషి ఏదో ఒకనాడు ఇటువంటి సంఘర్షణకు గురవుతాడు. రోజూ సాయంత్రం బాల్కనీలో కాఫీ తాగుతూ ఆలోచిస్తూ ఉంటాను. ఏంటసలు ఈ లైఫ్? దేనికోసం? ఎవరికోసం? ఎందుకోసం? అని. దేనికి సమాధానం దొరకదు.

అసలు ఇలాంటి ఆలోచన ఎవరైనా చేస్తారా? లేక నాకొక్కడికే ఇలాంటి ఆలోచనలు వస్తాయా? నేను అందరిలో ఒకడినే! కానీ ఎప్పుడూ ఏదో ఒక దాని గురించి చాలా తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటాను. దాని వల్ల అప్పుడప్పుడు అలసిపోయిన ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. అయినా సరే, ఆలోచనలు అలానే వస్తూ ఉంటాయి. ఇది ఇలానే ఎందుకుండాలి? అలా ఉంటే ఏమవుతుంది అని.

డిగ్రీ చేస్తున్నప్పటి నుండే ఈ పైత్యం నాకు వచ్చింది. అప్పట్లో మా ఇంటికి ఒక పెద్దాయన వస్తే ఆయన్ని ఒకసారి అడిగాను.

“ప్రతి మనిషికి జీవితంలో అత్యంత అవసరమైంది ఏంటి?”

“డబ్బు” అన్నారు తడుముకోకుండా.

“ఓహో, డబ్బు ఉంటే అన్నీ ఉన్నట్టేనా?” అనడిగాను.

“డబ్బుతో మనకి కావలసినవన్నీ అమరుతాయి, కాదంటావా?” నవ్వాడు.

ఆయన చేతిలో ఫోన్ గమనించి, “ఒప్పుకుంటాను. మీ ఫోన్ ప్రీ పెయిడా, పోస్ట్ పెయిడా?” ప్రశ్నించాను.

“పోస్ట్ పెయిడ్ ” అన్నాడు అదే నవ్వుతో.

“సో ఫోన్ లో డబ్బు ఉంది”.

“కావాల్సినంత ఉంది”.

పెద్దాయన దగ్గర ఫోన్ తీసుకుని బ్యాటరీ తీసేసాను.

“ఇప్పుడు కాల్ చేయండి. చూద్దాం” అన్నాను.

“బ్యాటరీ తీసేస్తే ఎలా?” అనడిగారు.

“డబ్బు ఉంటే అన్నీ అవుతాయి అన్నారు కదా” అన్నాను.

“ఓహో. అర్ధమైంది.” అంటూ బ్యాటరీ తీసుకుని, “ఏమి చేయాలన్నా మనిషికి ఆయుష్షు అవసరం.” అన్నాడాయన.

“అలా కూడా కుదరదు. బ్యాటరీ ఉండి సిమ్ లేకపోతే? సిమ్ ఉండి బ్యాలెన్స్ లేకపోతే? అన్నీ ఉండి సిగ్నల్ లేకపోతే? చేతిలో ఉన్న ఒక్క ఫోన్ పర్ఫెక్ట్‌గా నడవడానికే ఇన్ని అవసరమైతే, మనిషి కరెక్ట్‌గా బతకడానికి అంతిమంగా ఏమి కోరుకుంటాడు? ఏవి ఉన్నా, లేకపోయినా మనిషికి కావాల్సింది ఏమిటి?” అని అడిగాను. నన్నో పిచ్చోడిని చూసినట్టు చూశాడాయన.

ఇలాంటి ప్రశ్నలు చాలా మందిని అడిగాను, చాలా సమాధానాలు ఇచ్చారు. కానీ అవేమీ నాకు సంతృప్తిని ఇవ్వలేదు. మనిషికి కావాల్సింది ఏమిటి?‌ ఇది ఉంది అది లేదు అని లేకుండా, దేన్ని అంతిమంగా కోరుకుంటే మనిషి జీవితం బాగుంటుంది అని ఆలోచిస్తూనే ఉన్నాను. నా డిగ్రీ పూర్తి అయింది. ఉద్యోగం వచ్చింది. చెన్నైలో పోస్టింగ్.

*          *         *

ఉద్యోగరీత్యా చెన్నై వచ్చాను. మొదట్లో భోజనం ఇబ్బంది, తరువాత భాష ఇబ్బంది. ఎలాగోలా భోజనానికి అలవాటు పడ్డాను. చిన్న చిన్న పదాలు నేర్చుకుని తప్పో ఒప్పో తమిళం మాట్లాడేసాను. ఆఫీస్‌కి వెళ్ళేదారిలో రోజూ నాకు కనిపించే ముగ్గురు వ్యక్తులు నాకు తెలియకుండా నా మనసులో ముద్ర వేసారు. వాళ్ళెవరో, ఏమిటో తెలియదు. కాని రోజూ ఆఫీస్‌కి వెళ్తూ వాళ్ళని గమనించేవాడిని.

ఒకరు చెప్పులు కుట్టే అవ్వ. చీర ఆసాంతం చిరిగిపోయి, మాసిపోయి, చింపిరి జుట్టుతో. నా ఆఫీస్‌కి కొంచెం దగ్గరగా బూట్ పాలిష్ చేస్తూ, చెప్పులు కుట్టుకుంటూ జీవనం సాగించేది.

మరొకరు పానీపూరీ అన్న. ఉదయమంతా పోస్ట్ ఆఫీస్‌లో స్టాంపింగ్ కొట్టే పని చేస్తూ, సాయంత్రం పానీపూరీ బండి పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. “పోస్ట్ ఆఫీస్‌లో ఉద్యోగం అంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబు కదా” అని అడిగితే “టెంపరరీ పోస్ట్. జీతం ఆలస్యం అవుతూ ఉంటుంది” అని చెప్పాడు.

మూడో మనిషి పేరు తెలియదు. అంకుల్ అని పిలుస్తాను. ఏం పని చేస్తాడో కూడా తెలియదు. ఎప్పుడు కనిపించినా నవ్వుతాడు. ఆయన వయసు సుమారు యాభైకి పైనే ఉంటుంది. అందరితో నవ్వుతూ, నవ్విస్తూ తిరుగుతూ ఉంటాడు.

ఓ రోజు సాయంత్రం ఆఫీస్ నుండి రూమ్‌కి వెళ్తుంటే దారి పొడుగునా పూలు ఉన్నాయి. టపాకాయలు కాల్చిన చెత్తతో రోడ్డంతా చిందరవందరగా ఉంది. పానీపూరీ అన్న దగ్గర ఆగి పానీ పూరీ ఆర్డర్ చేసి “ఏంటి ఈ చెత్త?” అని అడిగాను.

“ఎవరో పోయారు, తీసుకెళ్ళారు..” అని చెప్పాడు.

“ఇటువైపు నుండా?”

“అవును! మీ ఇంటి వెనకాలే శ్మశానం ఉంది కదా! చూడలేదా?”

“నాకు తెలియదు”.

“ఈపాటికి అయిపోయుంటుందిలే..” అన్నాడు నవ్వుతూ.

“ఏంటి?”

“దహనం” అని చెప్పాడు.

*          *         *

అవన్నీ తొక్కకుండా జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్ళాను. అంకుల్ ఎక్కడికో వెళ్తూ నాకేసి చూసి నవ్వాడు. నేను ప్రతిగా చిరునవ్వు నవ్వాను. ఇంటికెళ్ళగానే గబగబా మేడపైకి వెళ్ళాను. అన్న చెప్పినట్లు మా మేడ పైనుండి చూస్తే శ్మశానం కనపడుతూ ఉంటుంది.

పెద్ద ప్రహారీ. ఒక వైపంతా తుప్పలు, పొదలు. మరోవైపు గంగావతరణమప్పుడు శివుడే నిలబడ్డట్టు ఒక పెద్ద మర్రి చెట్టు. దాన్ని అల్లుకున్న ఊడలు. వాటిలో కొన్ని భూమిలోపలికి చొచ్చుకుపోయుంటే, కొన్ని నేలని తాకుతున్నాయి. చెట్టు చుట్టూ సిమెంట్‌తో చేసిన అరుగు. ఆ అరుగు మీద శివలింగం. దాని ముందు చిన్న నంది విగ్రహం. ఆ అరుగుకి పది అడుగుల దూరంలో చితి పేర్చే ప్రదేశం. అలా కాసేపు చూస్తూ ఉంటే మళ్లీ మదిలో అదే ప్రశ్న. మనిషి అంతిమంగా కోరుకునేది ఏంటి?

నా ఆలోచనలని భగ్నం చేస్తూ మొబైల్ రింగైంది. మా మేనేజర్ కాల్ చేసాడు. నేను చేసిన పనిలో ఏదో తప్పు జరిగి, ఎస్కలేషన్ అయిందని లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసాడు. అంతలా మా ఇంట్లో కూడా ఎప్పుడూ తిట్టలేదు. తప్పు నాదే గనక ఏమీ అనలేకపోయాను. బయటకు వచ్చి టీ తీసుకుని సిగరెట్ వెలిగించాను.

అంకుల్ అటుగా వెళ్తూ నన్ను చూసి నా దగ్గరకు వచ్చి “ఇంకో సిగరెట్ ఉందా?” అని అడిగారు. నేను సిగరెట్ అందించాను.

“ఏంటి అదోలా ఉన్నావ్?” మొదటి దమ్ము లాగి అడిగారాయన. ఈ ఊరు వచ్చాక నాకంటూ సరైన స్నేహితులు ఏర్పడలేదు. స్నేహానికి వయసుతో సంబంధం లేదనిపించింది.

“మా మేనేజర్  తిట్టాడు” అని చెప్పాను.

పక పకా నవ్వి “ఇంకా నయం కొట్టాడని చెప్పలేదు” అన్నాడాయన.

“మీకు కామెడీగా ఉందా? నా సిగరెట్ నాకిచ్చెయ్” అన్నాను.

“నీ సిగరెట్.. హ హ హ” అంటూ మళ్ళీ నవ్వాడు.

అసలే చిరాగ్గా ఉంటే అనవసరంగా ఈయన్ని కదిపాను అని అనిపించింది.

“నేను వెళ్తానంకుల్” అంటూ లేవబోయాను.

“ఆగాగు” అంటూ నా చెయ్యి పట్టుకుని లాగి కూర్చోబెట్టాడు.

“సరే, మీ మేనేజర్ నిన్ను తిట్టాడు. అంతేనా?” అనడిగారు. కోపంతో చూసాను.

మళ్ళీ ఒకసారి నవ్వి “నిన్ను తిట్టాడు అంటున్నావ్ కదా, నీలో దేన్ని తిట్టాడు ? అనడిగారు.

“నాలో దేన్ని తిట్టడం ఏంటి?” విసుగ్గా అడిగాను.

“విసుక్కోకుండా, నిదానంగా ఆలోచించు. నిన్ను తిట్టాడు అంటే నీ ముఖాన్ని తిట్టాడా? నీ చేతుల్నా, కాళ్ళనా, కళ్లనా, ముక్కా, నోరా, నాలుకా, లేకపోతే కనపడని గుండెనా, లివర్నా? దేన్ని తిట్టాడు?”

“నన్ను తిట్టాడు.అంతే!” అన్నాను.

“అలా కాదు. నువ్వు బండి మీద నుండి వెళ్తున్నావ్. పొరపాటున పడిపోయావ్. ఇంటికెళ్ళి బండి మీంచి పడ్డాను అని చెప్పావ్. అప్పుడేం అడుగుతారు? ఎక్కడ దెబ్బలు తగిలాయ్ అని. అవునా? నువ్వు అప్పుడు ఇదిగో చేతులు గీసుకుపోయాయి, కాళ్ళు కొట్టుకుపోయాయ్ అని ఏదో చెప్తావ్. అవునా?”

“అవును”

“అలాగే దేన్ని తిట్టాడు అని అడుగుతున్నాను”

నా దగ్గర సమాధానం లేదు. “ఏమో నన్ను తిట్టాడు, పనిలో తప్పు చేసాను, అందుకని ఫోన్ చేసి బాగా తిట్టాడు” అని చెప్పాను.

మనసేం బాలేదు. చాలాసేపు మౌనంగా కూర్చుని ఉండిపోయాను. నిజమే, నాలో దేన్ని తిట్టాడు ?  సమాధానం లేని మరో ప్రశ్న. నేనే కాసేపాగి “సరే ఇది చెప్పండి. మనిషి అంతిమంగా కోరుకునేది ఏమిటి?”

“నీ దగ్గర ఇప్పుడు ఏది లేదో అదే”

“అర్థం కాలేదు.”

“జీవితంలో కొన్ని తెలుసుకోవాలి. కొన్ని నేర్చుకోవాలి. నీ అంతట నువ్వే తెలుసుకో” అని చెప్పి వెళ్ళిపోయాడు.

*          *         *

ఆఫీస్‌లో జరిగిన తప్పుకు ఫలితంగా జీతం అనుకున్నంత పెరగలేదు. అర్జెంట్‌గా వేరే ఉద్యోగం మారిపోవాలనిపించినా రెండేళ్ళు పని చేస్తానని బాండ్ రాసిచ్చాను కనుక కిమ్మనకుండా పని చేయాలి. ఏంటో జీవితం, జీతం.. రెండూ తక్కువ స్థాయిలోనే ఉన్నాయి. ఆటో దిగి ఇంటికి వెళ్తూ అవ్వ దగ్గర ఆగి చూసాను. తలమీంచి చెంగు వేసుకుని ఎవరివో చెప్పులు కుడుతోంది. చెప్పులో దిగాల్సిన సూది అనుకోకుండా ఆమె చేతి వేలులో దిగింది. చప్పున లాగి నోట్లో పెట్టుకుని చప్పరించింది. నాకు చివుక్కుమనిపించింది. చెప్పు కుట్టేసి డబ్బులు పుచ్చుకుంది. నేను వెళ్ళి నా షూస్ పాలిష్ చేయమని ఇచ్చాను.

“బాగానే ఉన్నాయి కదా బాబు” అంది.

“పరవాలేదు చేయి” అన్నాను.

“అవ్వా!”

“ఏంటి బాబు?”

“ఎంతకాలం నుండి ఈ పని చేస్తున్నావ్?”

“నా కొడుకు పోయినప్పటి నుంచి బాబు”

“నీ కొడుకు పోయాడా? ఎలా?”

“ఇదిగో ఇక్కడే బాబు. వాడు చెప్పులు కుట్టేవాడు. నాకు కడుపుకింత అన్నం పెట్టేవాడు. ఓరోజు రోడ్ దాటుతుంటే లారీ గుద్దేసింది. చచ్చిపోయాడు.

అది గుద్దినప్పుడు వాడు అమ్మా అని అరిచిన అరుపు ఇంకా వినపడుతూనే ఉంది బాబు” అంటూ చిరిగిన చీరతో కళ్లొత్తుకుంది.

నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అవ్వ అడిగిన దానికన్నా ఎక్కువ డబ్బులు ఇవ్వబోయాను.

“వద్దు బాబు అంత డబ్బు” అంది.

“ఎందుకు వద్దు?”

“రోజుకు డెబ్బై, ఎనభై రుపాయలు సంపాదిస్తాను. అది చాలు. ఈరోజు గడిచిపోతుంది. రేపు తెల్లారి చూస్తానో, లేదో కూడా తెలియదు కదా! ఎక్కువ తీసుకుని ఏం చేసుకోను? పట్టుకెళ్లిపోను కదా” అంది.

నాకు నోట మాట లేదు.

అంకుల్ మాటలు “నీ దగ్గర ఇప్పుడు ఏది లేదో అదే” గుర్తుకు వచ్చాయి. ఏదో జవాబుకి దారి దొరుకుతున్నట్టు అనిపించింది.

*          *         *

అక్కడి నుంచి  పానీపూరీ అన్న దగ్గరకు వెళ్ళాను.

“ఏంటన్నా?జాబ్ పర్మనెంట్ అయిందా?”

“లేదు తమ్ముడు, పోస్ట్ ఫిల్ అయిపోయింది.”

“అంటే ఇప్పుడు?” నాలో జాలి!

“ఖాళీనే..” మాములుగా నవ్వుతూ చెప్పాడు.

“నీకు బాధగా లేదా? జాబ్ పోయినందుకు?”

“ప్చ్! ఏదన్నా ఒకేలా తీసుకో అని మా అమ్మ చెప్పింది” అన్నాడు.

“మోరల్ సపోర్ట్” అన్నాను నవ్వుతూ.

కాసేపు మౌనం తర్వాత “అమ్మకి క్యాన్సర్. జాబ్ వస్తే బాగు చేయించచ్చు అని అనుకున్నాను. కుదరలేదు. అయినా ఫర్లేదు, అమ్మే చెప్పింది. కంగారు పడకు ఇంకొంత కాలం ఉంటాను. టెన్షన్ పడకుండా డబ్బు సంపాదించు అని” అన్నాడు.

ఏమనాలో అర్థం కాలేదు. మాట్లాడున్నంతసేపు చిన్న కన్నీటి పొర కూడా కానరాలేదు. అలా ఉండటం చాలా గ్రేట్. నాలో రేగిన ప్రశ్నకి ఇంకొంచెం సమాధానం దొరికింది. ఒకసారి అన్న నాతో అన్నాడు, ‘ఆ అంకుల్ బాగా డబ్బున్నాయనే! వ్యాపారాల్లో స్నేహితులు మోసం చేస్తే మొత్తం ఆస్తులు అన్నీ అమ్మేసుకున్నాడని, అయినా అస్సలు దాని గురించి బాధ పడలేదని, ఆయన ప్రపంచంలో ఆయన హాయిగా బతికేస్తూ ఉంటాడని, ఇప్పుడిప్పుడే ఏదో చిన్న బిజినెస్ స్టార్ట్ చేసాడని, అది బాగానే నడుస్తోందని’ చెప్పాడు.

*          *         *

చాలా రోజుల తరువాత నేను ప్రేమించిన అమ్మాయి ఫోన్ చేసింది. కొత్త జాబ్‌లో జాయినైన విషయం చెప్పడానికి చేసింది. ఈ అమ్మాయిలు ఎలా అన్నీ మర్చిపోయి మాములుగా మాట్లాడేస్తారో అర్థం కాదు. ఆ అమ్మాయిని ప్రేమించాననడం కన్నా, ఆరాధించాననడం సబబేమో! ఎన్ని కలలు కన్నానో, ఎంత భవిష్యత్తు ఊహించుకున్నానో! ఆమె నాతో అన్న మాటలు నాకు ఇంకా గుర్తు. “అభిరుచులు కలిసినంత మాత్రాన, జీవితం పంచుకోవాలనేం లేదు. నా దృష్టిలో నువ్వు ఒక స్నేహితుడివే. నీ ఆలోచనల కంచె దాటొచ్చి తప్పు చేసావు. ఎప్పుడూ ‘నువ్వు.. నేను’ అనుకునే చనువుంది. అంతే కానీ ‘మనం’ అయ్యేంత బంధం లేదు” అని చెప్పి వెళ్ళిపోయింది. ఆ మాటతో నా మనసు విరిగిపోయింది.

ఆమె ఫోన్ పెట్టేసాక ఫోన్ దూరంగా విసిరేసి బయటకు వెళ్లాను. సిగరెట్ వెలిగించాను.

అంకుల్ వచ్చి “మళ్ళీ ఎవరైనా తిట్టారా? కొట్టారా?” అనడిగారు వెటకారంగా.

“మీకు నేనంటే కామెడీ అయిపోయింది.”

“కామెడీ కాకపోతే ఏంటి? ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ నీకే ఉన్నట్టు ఫోజ్ కొడతావ్. ఆ కుక్కని చూడు. ఒక్కత్తే ఉన్నా ఎంత హాయిగా ఆడుకుంటోందో” అని అక్కడున్న వీధి కుక్కని చూపిస్తూ అన్నారు.

“నా లైఫ్‌ని కుక్కతో పోలుస్తున్న మీకు నా శతకోటి వందనాలు” అన్నాను చేతులు పైకెత్తి దండం పెడుతూ.

పకపకా నవ్వుతూ “సరే! ఏం జరిగిందో చెప్పు.”

“ప్రేమించాను అంకుల్, ప్రాణాలు ఇచ్చేంతగా. నేను సగం రోజులు కాలేజ్‌కి వెళ్లింది ఆమె కోసమే! అంతలా ప్రేమించానని తెలిసి కూడా నన్ను కాదని వేరే వాడిని పెళ్లి చేసుకుంది. ఇప్పటికీ నాకు ఆమెపై కోపం రావడం లేదు. నిజమైన ప్రేమని అమ్మాయిలు యాక్సెప్ట్ చేయరు” అన్నాను.

“ఇప్పుడు అమ్మాయి హ్యాపీగా ఉందా?”

“ఉంది. నేనే లేను”

“ఆమె హ్యాపీగా ఉందన్నా నువ్వు హ్యాపీగా లేవా?”

వెంటనే సమాధానం చెప్పలేకపోయాను. “బీ హ్యాపీ బ్రో” అని చెప్పి అంకుల్ నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు.

*          *         *

కొంతకాలం మాములుగా గడిచిపోయింది. ఒకరోజు రూమ్‌కి వెళ్తుంటే రోడ్ అంతా బ్లాక్ చేసేసారు. జనాలు. గుంపులు గుంపులుగా. ఏదో పెద్ద శాల్తీనే అని అనుకుని నా రూమ్‌కి చేరుకున్నాను. మొదటిసారి చూసిన చెత్తకన్నా మూడింతలు ఎక్కువ పోసారు. ‘రోడ్ మీద పోసే చెత్తను బట్టి పోయినవాడి రేంజ్ అంచనా వేసేయొచ్చు’ అనిపించింది. చీకటి చిక్కబడేసరికి జనం పల్చబడ్డారు. శ్మశానంలో జరిగే తంతు అంతా మేడపైనుండి చూస్తున్నాను. శవం ఇంకా కాలుతూనే ఉంది. ఎంతకీ కపాల మోక్షం అవడం లేదనుకుంట! కాపరి కర్ర పెట్టి కొడుతున్నాడు. నిప్పు రవ్వలు ఎగసిపడుతున్నాయి. ఫాట్‌మని శబ్దం మరో అరగంటకు శ్మశానంలో బూడిదైన ఓ పెద్ద మనిషి.

*          *         *

లీవ్ పెట్టి మా ఊరు వెళ్ళొచ్చాను. మధ్యాహ్నం ఆఫీస్‌కి వెళ్తూ ఉంటే అవ్వ కనపడలేదు. సాయంత్రం అన్నని అడిగితే ‘అవ్వ పోయింది’ అని చెప్పాడు.

“అయ్యో! మరి ఎవరు చేసారు దహనం?” అని అడిగాను.

“మున్సిపాలిటి వాళ్ళు చేసారు. డబ్బు అవసరం అయితే మీ ఇంటి దగ్గర ఊరికనే అటు ఇటు తిరుగుతూ ఉంటాడు కదా ఓ పెద్దాయన, ఆయన సాయం చేసాడు” అని చెప్పాడు అన్న.

ఇంటికెళ్ళే దారిలో అంకుల్ కనిపించాడు. “ఏమైపోయావ్ బ్రదరూ?” అని అడిగారు.

“మనిషి అంతిమంగా ఏం కోరుకుంటారో తెలిసింది అంకుల్.”

“ఏంటి?”

“అవ్వలాగ సంతృప్తిగా జీవించడం. అన్నలాగ ఎన్ని కష్టాలున్నా మనశ్శాంతిగా ఉండగలగటం. మీలా ఎప్పుడూ ఆనందంగా బతకడం. ఇవి ఉంటే చాలు అంకుల్” అన్నాను.

ఏదో బరువు దించుకున్న భావన. “ఎవడెంతటి వాడైనా చివరికి కాటికాపరి చేత దెబ్బలు తినాల్సిందే!”

*

కిరణ్ కుమార్ సత్యవోలు

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు