1
“For many a year, I have travelled
many a mile to lands far away
I’ve gone to see the mountains,
the oceans I’ve been to view.
But I failed to see that lay
Not two steps from my home.
On a sheaf of paddy grain –
a glistening drop of dew.”
టాగోర్ ఆరేళ్ల బాల సత్యజిత్ రే కోసం రాసిన కవిత ఇది. బహుశా మీరిప్పుడు ఈ కవితకి, నేను రాయబోయే విషయానికి నడుమనున్న సంబంధాన్ని గ్రహిస్తారనుకుంటాను.
టాగోర్ కవితకు పూర్తి వ్యతిరేఖంగా నేను జీవించాను. తూర్పు కనుమల సౌందర్యాన్ని చూస్తూ ఎన్నో దశాబ్దాలు గడిపేసాను. ఇప్పుడిప్పుడే సుదూర దేశాలను చూడడం మొదలు పెట్టాను.
నేను హిమాలయాలను చూడక మునుపు రాసుకున్న నోట్స్ ఇది.
హిమాలయాలను చూసాక నేను నూతిలోని కప్ప మాదిరిగా జీవించానని అర్థమయింది. అయినప్పటికీ నేనున్న నూతిని సైతం సంపూర్ణంగా అన్వేషించలేకపోయానని నాకు తెలుసు. నూతిలో జీవించడం గొప్పా, నూతికి వెలుపల లోకమంతా తిరుగుతూ జీవించడం గొప్పా, మీరే తేల్చుకోండి.
రెండేళ్ళ క్రితం ఒక వేసవిలో నేను రాసుకున్న ఈ నోట్స్ చదివితే టాగోర్ మాటల అంతరార్థం బోధపడుతుంది.
2
నా బాల్యమంతా ఈ పర్వతాల్లోనే గడిపాను. అప్పటి నుండీ నేను ఈ పర్వతాలని శోధిస్తూనే ఉన్నాను. అయినా ఈ పర్వతాలు తమ గర్భంలో నిగూఢమైన రహస్యాల్ని దాచుకునే ఉన్నాయి. విస్తారమైన ఈ తూర్పు కనుమలని పూర్తిగా ఎవరు మాత్రం జల్లెడ పట్టగలరు? ఈ అంతులేని అన్వేషణ నా బాల్యం నుండీ కొనసాగుతూనే ఉంది. ఇక్కడ ఈ పర్వతాల్లో అన్నీ ఉన్నాయి. నేను ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరమే లేదు.
ఇది నా గృహం. తరచి చూసే కొలదీ ఈ నిగూఢమైన గృహంలో మరిన్ని కొత్త తలుపులు తెరుచుకుంటూనే ఉంటాయి. ప్రతి తలుపూ మరిన్ని కొత్త తలుపును తెరుస్తూనే ఉంటుంది.
3
ఈ పర్వతాల్లో వేట కోసం, వజ్రాల కోసం, మట్టిని బంగారంగా మార్చే పరుసవేది మూలికల కోసం తిరిగేవారున్నారు. తుపాకీతో స్వాతంత్య్రం, రాజ్యాధికారం వస్తుందనే నమ్మకంతో తిరిగేవారున్నారు? గిరిజలు రహస్యంగా పండించిన గంజాయిని కొనుగోలు చేయడం కోసం తిరిగేవారు ఉన్నారు.
మరి నేను ఎందుకు తిరుగుతున్నాను! నాకు నిజంగా తెలియదు.
పర్వతాలలో తిరుగుతున్నప్పుడు అనుభూతి గర్భస్థ శిశువు ఉమ్మి నీటిలో భారరహితంగా, నిశ్చింతగా కదలాడుతున్నట్టుగా ఉంటుంది. డేగ రెక్కలు చాచి అప్రయత్నంగా, ఊరికే కారణరహితంగా, దిశరహితంగా యోజనాలకు యోజనాలు గాలిలో తెలియాడుతూ తిరుగుతున్నట్టుగా ఉంటుంది.
జీవితంలో సారవంతమైన అనుభూతిని మీరు ఎప్పుడైనా అనుభవించారా? అనుభవిస్తే నేను చెప్పేది మీకు అర్థం కావచ్చు.
4
పర్వతాలు మనుషులకు ఎప్పటికీ లొంగవు. అవును. పర్వతాలు మనుషులకు ఎప్పటికీ లొంగవు.
మన్యంలోని పర్వతాలలో దుర్గమమైన అరణ్య అంతర్భాగాలలోకి వెళ్ళాలని నేను బాల్యం నుండీ కలలు కన్నాను. ఆ కలలో కొన్నింటిని నెరవేర్చుకోగలిగాను. ఇంకా కొన్ని కలలు మిగిలిపోయాయి. పాత కలలు తీర్చుకునే లోగా కొత్త కలల సృష్టి జరుగుతోంది. ఈ కలలకు అసలు అంతం అనేది ఉందా? అంతం అవసరమా? కొన్ని కలలు నెరవేరకుండా మిగిలిపోతే దుఃఖించకుండా ఉండగలమా? కలలు మనకు దుఃఖాన్ని ఇస్తాయా, సంతోషాన్ని ఇస్తాయా? ప్రశ్నలకు అసలు జవాబులు అవసరమా?
ఏదైతేనేం నాకున్న అసంఖ్యాకమైన కలల్లో కొన్ని ఒక్కటొకటిగా ఇప్పుడు నెరవేరుతున్నాయి. ఈ అరణ్యాల్లోని లోతయిన ప్రాంతాలకు ఇప్పుడు దారులు పడుతున్నాయి.
నిట్రమైన కనుమల్లోకి ప్రవేశం లభిస్తోంది. ఒకప్పుడు కేవలం కలలుగా ఉన్న ఈ అరణ్యాంతర గర్భంలోకి ప్రవేశించగలగడం ఎంతో ఆనందం కలిగిస్తోంది.
1000 ఏళ్ళ వయసున్న మహావృక్షాల క్రింద నిద్రపోవడం, ఈ వృక్షాల కింద ఎన్ని తరాల వారు సేదతీరి ఉంటారో కదా అని తలవడం, ఈ క్షణికమైన నా ఉనికికిగానూ ప్రకృతికి కృతజ్ఞత తెలుపడం ఎంతో గొప్పగా అనిపించాయి.
5
సూర్యుడు నడినెత్తిన తీక్ష్ణతతో మండుతున్నాడు. గాలి దిశ మారింది. సముద్ర మట్టానికి 5000 అడుగుల ఎత్తులో, ఆ పర్వతాలలో అప్పటి వరకూ వీచిన చల్లని గాలులు హఠాత్తుగా వేసంగి గాడ్పులుగా రూపాంతరం చెందాయి. అరణ్యాల దిశ నుండి వచ్చే గాలులు ముగిశాయి. ఇప్పుడు పట్టణాల దిశ నుండి వచ్చిన మైదాన ప్రాంతాల గాలులు ఆ పర్వతాల్ని ముంచెత్తాయి. ఆ ప్రాంతం ఒక్కసారిగా ఉగ్రమైన ఉష్ణంతో నిండిపోయింది. హఠాత్తుగా వాతావరణం మారిపోయిందో లేదా నేను గమనించలేకపోయానో చెప్పలేను!! అటువంటి చోట దేహస్పృహ ఉండదు. కాలం స్తంభిస్తుంది. కాలాతీతమైన దాని స్పర్శ ఒక అనుగ్రహంగా ప్రాప్తిస్తుంది.
అప్పటికే నేను మూడు గంటలకుపైగా ఒంటరిగా కాలినడకన నిట్రమైన ఇరుకు లోయల్లో తిరుగుతున్నాను. తిరుగుముఖంపట్టి, వచ్చే దారిలో ఒక కొండ పైకి అతి కష్టం మీద ఎక్కాక, ఇక సత్తువ చాలక, చాలీచాలని ఒక ఎండిన చెట్టు నీడలో కూలబడ్డాను. నిజానికి ఆ నీడే ఎండ కంటే వేడిగా అనిపించింది. దాహానికి పెదవులు ఎండిపోయాయి. కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. డస్సిపోయిన ప్రాణం అపస్మారకాన్ని కోరుతోంది.
కళ్ళు మూసుకుని నిశ్శబ్దంగా ఉండిపోయాను. దుఃఖం కాదుగానీ దేహం, మనసు నొప్పిగా ఉన్నాయి. అప్పుడే వినిపించింది, ఒక కాకి అరిచే శబ్దం. దాని కూతలో నొప్పి ఉంది. అది నా ఊహ కాదు.
మీరు పక్షుల, ఉడతల, కోతుల అరుపుల్లో నొప్పిని ఎప్పుడైనా గుర్తు పట్టారా? అప్పుడే glimpse లా ఒక అనుభవం కలిగింది. అది ఒక emotional experience కాదు. Reflection కూడా కాదు.
Scorching sun
Dead tree
Mad crow
మనకి జీవితంలో సంభవించే దర్శనాలు అన్నీ సకారాత్మకం కానక్కరలేదు. నకారాత్మకం కూడా కావచ్చు. నిజానికి ఆ దర్శనాలు ఈ విభజనకు అతీతం. అయినప్పటికీ నశ్వరమైన, బుద్భుదమైన మానవజీవితం వాటిని విభజించి చూడక మానదు.
ఆ సమయంలో అక్కడ నేను ఈ హైకూని రాయలేదు. ప్రాచీన ఋషులు కూడా అలా రాసి ఉండరు. అనుభవంలో పదాలు ఉండవు. అనుభవం ముగిశాకనే పదాలు వ్యుత్పత్తి జరుగుతుంది. ముగిసిన అనుభవాన్ని గుర్తుకు తెచ్చుకుని రాయాలని ప్రయత్నిస్తాడు కవి. కాని అతడు రాసినది ఆ అనుభవం కాదు. Words destroy everything beautiful and intense.
ఇస్మాయిల్ గారు నాకు ఒక గొప్ప రహస్యం చెప్పారు. అది అప్పుడే నా మనసులో శాశ్వతంగా నాటుకుపోయింది. అది మీతో ఈ రోజు పంచుకుంటాను. “వంద వాక్యాలతో కూడా చెప్పడం సాధ్యం కాని దానిని ఒకే వాక్యంతో చెప్పు. వంద పదాలలో కూడా చెప్పడం సాధ్యం కాని దానిని ఒకే పదంలో చెప్పు.” These are golden words not only for the haiku, for the poetry and life too.
నీవు ఎక్కువ మాటలను ఉపయోగించే కొలదీ నీ లోతును కోల్పోతావు. నీవు చెప్పాలనుకున్న దానికి దూరమవుతావు. దారి తప్పిపోతావు.
6
కడవ మీద కడవ, కడవ మీద కడవ – నాలుగు కడవల నీళ్ళు ఏటిలో ఎత్తుకుని తలపై పెట్టుకుని నడిచి వస్తున్న ఒక గిరిజన యువతి దూరంగా కనిపించింది.
“కడవ భుజానపెట్టి
నీటికెల్లెను పడతి
ప్రియుడచట కనరాక
కుమిలిపోయెను సుదతి…”
ఆ అమ్మాయిని చూస్తే రాఫయేల్ ఆరమ్యాన్ మాటలు గుర్తుకు వచ్చాయి.
“అన్నా! నీళ్ళు తాగుతావా? ఎండ ఎక్కువగా ఉంది.” అంటూ, దూరంగా వెనుకనే వస్తున్న ఇంకొక యువతిని త్వరగా రమ్మని పిలిచి నాలుగు కడవలనూ కిందకి దించి, అప్పుడే ఊట చలమ నుండి తెచ్చిన తియ్యని, చల్లని నీటిని ఒక గిన్నెలో ఇచ్చింది. అవి తాగుతున్నప్పుడు ఆ హాయికి ఒక్కసారిగా కాలం ఆగిపోయింది. ప్రాణం లేచి వచ్చింది.
నా వివరాలు అడిగారు, ఆ యువతులు.
మొదటి యువతి “అన్నా! మా ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్ళు” అంది.
“భోజనం చేసి వెళ్ళిపొమ్మంటావేంటి? ఇదేం మర్యాద! 2 రోజులు మా ఊరిలో ఉండి, అన్నీ చూసి వెళ్ళన్నయ్యా!’ అంది రెండవ యువతి. అవి మర్యాద కోసం లాంఛనంగా అన్న మాటలు కావు. అవి నిజమైన, హృదయంలోంచి వచ్చిన మాటలు.
తప్పకుండా మరొకసారి అక్కడికి, వారి ఇంటికి వస్తానని వారికి మాట ఇచ్చాను. వారి పేర్లు అడిగి తెలుసుకున్నాను. మొదటి యువతి పేరు చిలక. క్షమించాలి, రెండవ యువతి పేరు మర్చిపోయాను.
రాబోయే వర్ష ఋతువులో కిందికి దిగే మేఘాలను చూడడానికి అక్కడికి రమ్మని వారు నన్ను కోరారు. నేను ప్రతి వర్ష ఋతువులో ఒక్కసారైనా అక్కడికి వస్తానని చెప్పాను. నాగరికత అనే వ్యాధికి దూరంగా జీవిస్తున్న వారి ప్రేమకు చలించిపోయాను.
రెండేళ్ళు గడిచిపోయాయి, నేను మరలా ఆ ప్రాంతానికీ వెళ్ళలేదు. వారి ఇంటికీ వెళ్ళలేదు.
మనం, నాగరికులం ఇలాగే జీవిస్తాం. కేవలం లాంఛనమైన మాటలతో, అబద్దాలతో.
ఇప్పుడు వాళ్ళ ఊరికి కొత్తగా రోడ్డు వేశారు. లక్షల సంవత్సరాలుగా జీవించిన స్వచ్ఛమైన, ప్రశాంతమైన వారి జీవితం నాశనం కాబోతోంది.
చదువులు, విజ్ఞానం, కరెంట్, మొబైల్, ఇంటర్నెట్, ఉద్యోగాలు- అన్ని రకాల వినాశనాలూ వచ్చి వారి హృదయంలోని ప్రేమని, వారి జీవితాల్లోని ప్రశాంతతని చంపివేయనున్నాయి.
నాగరికత మనిషిలోని మనిషిని చంపివేస్తుంది. స్వతంత్ర్యంగా బ్రతికే వారిని బానిసలుగా మారుస్తుంది.
రెండవ యువతి ఊరిలోకి వెళ్ళి ఒక యువకుడిని తీసుకొని వచ్చింది. నిజానికి నేనేమీ నడవలేని స్థితిలో లేను. కాస్త విశ్రాంతి, నీరు, నీడ అప్పటికి నా అవసరాలు, అంతే! నేను నడుచుకుని వెళతాను అని చెబుతున్నా వినకుండా ఆ యువకుడు తన బైక్ మీద ఎక్కించుకుని నేర్పుగా 7 కిలోమీటర్లు నేను బయలు దేరిన చోటు వరకూ తీసుకొని వచ్చి నన్ను దించి “అన్నా! మా ఊరు వస్తూ ఉండండి.
వానాకాలంలో చాలా బాగుంటుంది.” అన్నాడు.
“నన్ను గుర్తుంచుకో. అన్నయ్యా!” అని చెప్పి సెలవు తీసుకున్నాడు.
*
నిజంగా ఆ యువతుల ప్రేమ నన్ను కదిలించింది. స్వచ్ఛమైన మనుషులు అక్కడక్కడా మిగిలి ఉన్నారని సంతోషంగా ఉంది. మీ అనుభవాలు చాలా బాగున్నాయి శ్రీరామ్ గారు.
శ్రీరాం గారు ,
నన్ను కూడా తీసుకెళ్లండి . ఇద్దరం వెళ్దాం .
చదివితే హాయిగా అనిపించింది . అవును మనవన్నీ పైపై ప్రామిస్ లు ..