ఓ చిన్న కదలిక వస్తే…అదే కథకి ప్రాణం!

నిర్వహణ: శ్రీనివాస్ గౌడ్

   నవంబర్ 10, 2024 వ తేదీన నెల్లూరు టౌన్ హాల్లో నా రెండవ కథల సంపుటి ‘విజయ మహల్ సెంటర్ కథలు’ పుస్తకావిష్కరణ సభ జరిగింది. ఈ కథలు ఈతకోట సుబ్బారావు గారి సంపాదకీయంలో నడుస్తున్న విశాలాక్షి  మాస పత్రికలో ఏప్రిల్ 2021  నుంచి మార్చ్ 2023  వరకు దాదాపు ఏడాది పాటు ఈ కథలు ప్రచురణ అయినాయి. వీటిలో చివరి కథ ‘దొడ్డెత్తే  నరసమ్మ’.  మాములుగా అయితే అది చివరి కథ కాదు. ఇంకో 20  కథలు దాకా రాయాల్సిఉంది. కానీ విశాలాక్షి పత్రికలో  ‘దొడ్డెత్తే  నరసమ్మ’ శీర్షికతో వచ్చిన ఈ కథ తర్వాత అర్ధాంతరంగా నా కథల ప్రచురణ ఆపేసారు. ఇది  ఒక కులాన్ని, ఒక వృత్తిని కించపరుస్తూ రాసిన కథ  అని ఎవరో విమర్శకులు విశాలాక్షి పత్రిక మీద కేసు వేశారని తర్వాత నాకు తెలిసింది. దీనికి నేను ఖచ్చితంగా జవాబు చెప్పాల్సిన భాద్యత ఉంది. అయితే కథ చదివిన వారు ఎవరికైనా నేను కథలో రాసినదేమిటో తేటతెల్లం అవుతుంది.

‘దొడ్డెత్తే  నరసమ్మ’ కథ doddette narasamma చదవండి:

నవంబర్ 10, 2024 నాటి   పుస్తకావిష్కరణ సభలో ముఖ్య అతిధులుగా ప్రసంగించిన లతీఫ్ కుట్టీ గారు  ఈ కథని గురించి మాట్లాడుతూ ‘కథ ముగింపు ఆశావహ దృక్పధంతో ముగించాల్సిన అవసరం ఏముంది? నరసమ్మ లాంటి వారి జీవితాలు అప్పుడూ, ఇప్పుడూ ఏమి మారలేదు. వాళ్ళ జీవితాలను ఉన్నతీకరించినట్లు రాయడమెందుకు అనే ప్రశ్నలు వేసి, అనేకానేక ఆలోచనల తేనెతుట్టెని కదిపారు. కథలోకి వెళితే కథా కాలం 1970 నుంచి 80 దశకంలోనిది. నెల్లూరును రెండు భాగాలుగా విభజిస్తూ తూర్పు, పడమర ప్రాంతాల మధ్యగా వెళ్ళే రైలుకట్టకు తూర్పుదిక్కున ఉన్న విజయ మహల్ సెంటర్ కథ నడిచిన ప్రాంతం. కథ చెప్పేనాటి  బుజ్జమ్మకు అప్పుడూ ఏడెనిమిదేళ్ళ వయసు. ౩వ తరగతి చదివే ఓ చిన్న పాప, ఆనాటి మధ్యతరగతి జీవితాలను, మనుషులను, వారి సాంఘిక, ఆర్ధిక, మత, సామాజిక పరిస్థితులను అతి దగ్గరగా చూసి ఆనందమో, ఆవేదనో పొంది, తాను అనుభూతి చెందిన జీవితాలను, ఈనాటికీ మరువలేక వాటిని అక్షరీకరించాలి అనే నిరంతర తపనతో ఈ కథని రాసాను. కథ నెల్లూరులోని మధ్య తరగతి, దిగువ మధ్యతరగతి, ఏనాదుల సంఘంలోని ప్రజలు మాట్లాడుకునే  మాండలికంలో నెల్లూరికి మాత్రమే ప్రత్యేకమైన యాసలో సాగుతుంది.

ఇక కథలోకి వెళితే 1970,80  దశకాల్లో దక్షిణ కోస్తా  ప్రాంతాల్లోకి ముఖ్యంగా చుట్టుపక్కల పల్లెటూర్లనుంచి టౌన్ కి వలస వచ్చి, చిన్న చిన్న ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకునే మధ్యతరగతి మనుషులు, పల్లెల్లో బోలెడన్ని ఎకరాల పొలాలు ఉండి, టౌన్ జీవితాలకు అలవాటు పడ్డ రెడ్లు, కాపులు, వగైరా  సామాజిక వర్గాలు అందరు కలిసి నివసించే ప్రాంతం నెల్లూరు. అప్పట్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ లాంటివి అభివృద్ధి చెందలేదు. వీధుల్లో ఇళ్ల ముందునుంచి పారే  మురుగు కాలువలు. ఇంటి పెరట్లో ఓ మూల పైకప్పు లేని చిన్న గదిలాంటి ప్రదేశంలో మూడు పక్కల కాస్త ఎత్తుగా కట్టిన అరుగులు. ఇవి అప్పట్లో కాలకృత్యాలు తీర్చుకోవడానికి ప్రతిఇంటిలో ఉండే మరుగు దొడ్లు. వాటి పక్కనే స్నానాల దొడ్డి కూడా ఉండేది. పొద్దుపొద్దున  ఇళ్లల్లోని వాళ్ళందరూ  మరుగుదొడ్లో  కాలకృత్యాన్ని తీర్చుకున్నాక, దాదాపు ఎనిమిది గంటల ప్రాంతంలో పెద్ద ఇనుప బొక్కెన, రెండు పలుచని ఇనుపరేకులు టకటకలాడించుకుంటూ మరుగుదొడ్లలోని అశుద్ధాన్ని ఎత్తడానికి వచ్చే వృత్తిలోని వారు ప్రతి ఊరిలో కనపడతారు.

అలాంటి  పాకీ వృత్తి చేసే నరసమ్మ నేను ఎంచుకున్న  కథలోని పాత్ర. అయితే నరసమ్మ అశుద్ధాన్ని ప్రతి ఇంటిలో ఎత్తడానికి వచ్చినప్పుడు, ఆమె వీధిలో కనపడినప్పుడు ఆమె పట్ల మనుషుల ప్రవర్తన ఎలా ఉండేదో నేను నా ఏడెనిమిదేళ్ళ వయసులో చూసాను. అప్పట్లో నరసమ్మను చూసినప్పుడు ఏదో తెలియని బాధ మెలిపెట్టింది. కానీ దానికి స్పష్టమైన రూపం ఉండేది కాదు. అయితే నరసమ్మకు  తన వృత్తి వల్లో, తన మాదిగ సామాజిక వర్గం వల్లో తనని అందరూ అంటరానిదానిగా చూస్తున్నారు అనే విషయం ఏ మాత్రం తెలియని అమాయకురాలు ఆమె. పైపెచ్చు ఎవరు ఆదరించినా, ఎవరు చీదరించినా చలించక  కర్మయోగిలా తన పని తాను చేసుకువెళ్లడం తప్ప ఆమెకు ఇంకేమి తెలియదు. తన తరువాతి తరలవారు తాను చేసే వృత్తిని మానివేసిన, మతం మారినా ఆమె మాత్రం  తన చివరి శ్వాసవరకు తన కర్తవ్యాన్ని దైవ సేవగా భావించింది.

అటువంటి నరసమ్మను మనిషిగా గుర్తించే అవసరం, ఆవశ్యకత ఎవరికీ పెద్దగా ఉండకపోవచ్చు. కానీ  తమ జీవితాల్లో ఆమె అవసరం ఎంత ఉందో తెలిపే సమయం వచ్చినప్పుడు కానీ ఆమెను మనిషిగా గుర్తించలేదు అందరూ. నెల్లూరు ప్రాంతంలో ప్రతిసంవత్సరం వానాకాలం అంటే నవంబర్ మాసం మధ్యలో వచ్చే తుఫాను మాత్రమే. అప్పుడూ కూడా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. తుఫాను గాలి ఈడ్చి కొడుతోంది. కుండపోత వర్షం వారం రోజులు. చెట్లు పడిపోయాయి.  మట్టి ఇల్లు కూలిపోయాయి.చెట్ల మీది పిట్ట,  పుట్టా చెదిరిపోయాయి.  ఇళ్ళు, వాకిళ్లు నీళ్లతో నిండిపోయాయి. అలాంటి తుఫానునులో  పాకీ పని చేయడానికి నరసమ్మ  రాలేదు. వారం రోజులైంది. పైకప్పు లేని మరుగుదొడ్లు, ఎన్ని పట్టలు కప్పినా ఆగని  వర్షపు నీటితో కలిసిపోయిన మలమూత్రాలు మరుగుదొడ్డి నుంచి, ఇళ్లల్లోకి వచ్చేస్తున్నాయి. ఇల్లంతా అశుద్ధం గబ్బు. అదిగో అప్పుడు వచ్చింది నరసమ్మ మీద కోపం. పాకీ పనికి రాకుండా గుడిసెలో ఏం చేస్తున్నట్లు ఆమె. మగవారు వర్షంలోనే తంటాలు పడి ఏ కాలవ దగ్గరకో, చెరువు కట్ట దగ్గరకో  పోయి కాలకృత్యం తీర్చుకుంటే, ఇంట్లోని ఆడవారు ఏమి చేయాలి. ఇంట్లో ఆడవారి సణుగుళ్లు ఎక్కువ అయినాయి. అదిగో అప్పుడు గుర్తుకువచ్చింది అందరికీ నరసమ్మ. తొలిసారిగా తమ అవసరం కోసం, ఆ తుఫాను రోజుల్లో నరసమ్మను అశుద్ధాన్ని ఎత్తమని తమ ఇళ్లకు రమ్మని పిలిచేందుకు అందరూ కలిసికట్టుగా చల్లా ఏనాదుల సంఘం అవతల ఉన్న మరో సంఘం లోకి, నరసమ్మ గుడిసెలోకి అందరూ తొలిసారి అడుగుపెట్టారు. అక్కడ అందరూ ఏం చూసారు. చూసిన తర్వాత ఏం చేశారు. ఇది కథ చదివి తెలుసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం.

గుడిసెలో నరసమ్మ చనిపోయింది అని కథకి  ముగింపు  రాసేయవచ్చు. అయితే నరసమ్మ చనిపోవడం వరకు బుజ్జమ్మ అనే పాపకి తెలుసు. ఆ తర్వాతి కథలోకి పరిణితి చెందిన రచయిత పరకాయ ప్రవేశం చేసి, కథకి ఎటువంటి ముగింపు ఇచ్చింది అనేది ఈ కథలో ముఖ్యం. ఎందుకంటే వృత్తి మానినా, మతం మారినా, వారి సామాజిక వర్గంలోని వారు చదువుకుని ఉన్నత స్థితిలో ఉన్నా కూడా ఇప్పటికీ మనుషుల మధ్య ఉండే అంటరానితం అనే జాడ్యం ఇంకా పోలేదు. మేము నాగరికులం, ఆధునికులం, మాకు కుల,మతాల పట్టింపు లేదు అనడం  హిపోక్రసీ మాత్రమే. అంతర్లీనంగా మనిషిని మనిషి దూరం చేసుకునే కొత్త కొత్త అంటరానితనాలు నేడు ఇంకా విజృంభణ స్థాయిలో ఉన్నాయి. కనీసం కథలో అయినా మనుషులు మనుషులా ప్రవర్తిస్తే, కనీసం ఈ కథ చదివిన ఒక్కరంటే ఒక్కరిలో అయినా ఓ చిన్న కదలిక వస్తే నా ఈ ప్రయత్నం సార్ధకం అనుకుంటాను.

*

రోహిణి వంజారి

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు