మధ్యాహ్నం నుంచి చినుకు చినుకుగా వర్షం. ఏడింటికే దట్టంగా చీకటి పరచుకుంది. నీటిలో ముంచి తీసినట్లుగా మసక మసకగా దీపాల కాంతి. భార్య పోయిన దగ్గర నుంచి శ్రీధర్ కి ఒంటరితనానికీ, చీకటికీ తేడా పోల్చుకోలేకుండా ఉంది. రాత్రి పన్నెండైనా నిద్ర కోసం ఎదురు చూడాల్సిందే. అదృష్టం ఉంటే కళ్ళు మూతలు పడ్తాయి. నెల్లో సగం రోజులు అదృష్టం కల్సి రాదు. మిగిలిన సగం రోజులూ ‘ముసలి సన్యాసి’ సేద తీరుస్తాడు. శ్రీధర్ కి ఒకప్పుడు చదవడం, చదివినది అందరికీ చెప్పడం, సంగీతం వినడం, గొంతెత్తి పాడడం, వీటన్నిటిలో ఏదో అలౌకిక ఆనందం ఉండేది. ఇప్పుడన్నీ గతం. సన్నగా రేడియోలో పాట వినిపిస్తోంది. శ్రీధర్ ఆలోచనలు ఘనీభవించిన గతం చుట్టూ తిరుగుతుంటే కాలింగ్ బెల్ మోగింది.
తలుపు తీస్తే, ఎదురుగా ఓ నలభైకి దగ్గర్లోని కుర్రాడు.
“శ్రీధర్ గారూ, నేను కమల్ ని గుర్తుపట్టారా?” వర్షానికి తడిసిన మొహాన్నీ, చేతుల్నీ రుమాలుతో తుడుచుకుంటూ అడిగాడు ఆ కుర్రాడు.
వర్ష బిందువుల్ని మోస్తున్న చెట్టు గాలికి నీటిని విదిలించిన్నట్టు కమల్ ఉనికి శ్రీధర్ ని తడి జ్ఞాపకాల తుంపర్లలతో ముంచెత్తింది.
కమల్ ఇంజనీరింగ్ చదివే రోజులు, రాంనగర్ లో తన ఇంటిపైన గదిలో ఉన్న రోజులు, విద్యానగర్ లో తన సొంత ఫ్లాట్ కొనుక్కొని వచ్చేశాక ఖాళీ దొరికినప్పుడల్లా వచ్చి పాటలు, పుస్తకాలు, చర్చలతో గడిపిన రోజులు, శ్రీ తో కల్సి చేసిన అల్లరి, అమ్మ అమ్మ అంటూ వసంత చేత పాడించుకున్న పాటలు, చెప్పించుకున్న కథలు, మధ్యలో అలకలు, బుజ్జగింపులు, ఎమ్. ఎస్. చేయడానికి యు.ఎస్. వెడ్తూ, చిన్న పిల్లాడిలా ఏడ్చిన రోజు . . . . . . ఒక్కసారి శ్రీధర్ జ్ఞాపకాలు జల జలా రాలిపడ్డాయి.
“ఏం సార్ గుర్తుపట్టలేదా?” అన్నాడు కమల్.
“ఓ గాడ్, ఓ గాడ్, సారీ కమల్ రా, లోపలికి రా” అన్నాడు శ్రీధర్.
“ఏ ఫ్లాటో అని తడ బడ్డా , కానీ చూసారా ‘హాయిరే ఓ దిన్ క్యోం న ఆయే’ లతా, రవిశంకర్ మీ ఇంట్లో కాక ఎక్కడుంటారు? అనుకుని తలుపు కొట్టా. చాలా చాలా కాలం అయినా నా అంచనా తప్ప లేదు” పూలు రాలినంత మెత్తగా నవ్వుతూ లోపలికి వచ్చిన కమల్ కి పొడి తువ్వాలు అందించాడు శ్రీధర్.
……
కమల్ ఆ రాత్రికి తనతోనే ఉంటాడని స్థిరపరచుకొని, తను మార్చుకోడానికి నైట్ డ్రెస్ ఇచ్చి, తినడానికి బయటినుంచి ఆర్డర్ చేసి, ఓల్డ్ మాంక్ చెరో పెగ్గు పోసి, కమల్ తో మాట్లాడడానికి కూర్చున్నాడు శ్రీధర్. నెమ్మదిగా కబుర్లు జారుతున్నాయి.
“నే అమెరికా వెళ్ళిన రెండేళ్ళకి కదా శ్రీ ఎమ్.ఎస్. చేయడానికి వచ్చింది. కలవాలని ఉన్నా రోజువారీ ఇబ్బందులతోనే కాలం గడిచిపోయేది. ఆ పైన తను ఉండే చోటు చాలా దూరం. ఆ తర్వాత మీతోనూ టచ్ లో లేను. ప్రేమ, పెళ్లి, అలకలు, నాన్న పోవడం ఓ పదేళ్లు చకచకా గడిచిపోయాయి. ఇక్కడకి వచ్చాక మిమ్మల్ని కులుద్దాం అనుకున్నా ఓ ముఖ్యమైన పని పూర్తయ్యాక మాత్రమే కలవాలని పెట్టుకున్నా. అదో మిషన్ అనుకోండి. అవన్నీ తర్వాత చెప్తా, ముందు మీరెలా ఉన్నారు? మేడమ్ పోవడం చాలా బాధనిపించింది. ఆవిడ లేకుండా మిమ్మల్ని అస్సలు ఊహించుకోలేక పోయా” చెప్పుకుంటూ పోయాడు కమల్.
“చెప్పడానికేం లేదోయ్. తిరుగుతూ తిరుగుతూ ఉన్న మనిషే. తెల్లారి లేవ లేదు. ఒక్కసారి అంతా ఖాళీ . . . ఎప్పటికీ పూరించలేని ఖాళీ. చదువయ్యాక శ్రీ ఇండియా వచ్చేస్తుందని తను, నేను ఎదురుచూసాము. దూరంగా ఉండడానికే ఇష్టపడింది. క్లాస్మేట్ నే పెళ్లి చేసుకుంది. ఆల్విదా టు ఇండియా. వాళ్ళకో పిల్లాడు. పిల్ల దూరంలో ఉందని చాలా ఫీల్ అయ్యేవాళ్లం. తనున్నప్పుడు రోజులెలా గడిచేవో తెల్సేది కాదు. ఏదో ఒకటి చదవడం, సంగీతం, చర్చలు, తిరగడాలు. తను పోయాకా పొద్దుట ఏదో కాలక్షేపం చేసినా, సాయంత్రాలు యెడతెగని దీర్ఘ దిగుళ్లే. వాకింగ్ లో ఒకళ్ళిద్దరు నా వయసు వాళ్ళు తగులుతున్నా, అందరి బాధ ఒంటరితనమే. ఇంట్లో మనుషులున్నా మాట్లాడే వాళ్ళు ఉండరు. ఎప్పుడైనా ఒకళ్ళిద్దరింటికి వెళ్దామని ప్రయత్నించినా, అది వాళ్ళకీ, నాకు కూడా యిబ్బందికర పరిస్థితులు తీసికొచ్చేది. ఇంక శ్రీ వాళ్ళ అమ్మ పోయినప్పుడు వచ్చింది. ఐదేళ్లు అయ్యింది. ఏడాదికి నాలుగైదు నెలలు నే వెళ్ళి రావడమే. తను మళ్ళీ రాలేదు. ఇక్కడికొస్తే మీరందరినీ చూడొచ్చు అనేదో వంక. మొదట్లో కొత్త దేశం కావడం, చాలా ప్రదేశాలు చూడడం లాంటి వాటి వల్ల బానే అనిపించింది. కానీ రాను, రాను అదో మొక్కుబడై పోయింది. వాళ్ళ జీవితాలు, వాళ్ళ బిజీ, అక్కడి చలి, ఒంటరితనం, దానికి తోడు ఈ సహకరించని వయస్సు. ఎంత చెప్పినా యింతే కమల్. ఇవాళ నువ్వోచ్చావ్. ఈ రాత్రికి ప్రాణం పోసావు. ఇప్పుడు చెప్పు నీ మిషనేంటో” ముగించాడు శ్రీధర్.
“నాన్న పోయాక, తమ్ముడున్నా అమ్మనొదిలి వెళ్ళడం ఇష్టం లేక నేను, తను వెనక్కి వచ్చేశాం. కావల్సిన దాని కన్నా ఎక్కువే ఉంది. అందుకే మదనపల్లికి దగ్గర మా ఊరిలోనే ఓ పది ఎకరాల తోట, అందులో ఓ పది గదులుండే మండువా యింటిని తల్లీతండ్రీ లేని పిల్లల కోసం ‘సందడి’ అనే పేరుతో ఓ ఆశ్రయంగా మార్చాం. దాన్ని ఎన్.జి.ఓ. గా రిజిస్టర్ చేశాం. మీరో సారి అన్నారు, ‘వృద్ధాశ్రమాలు క్రుంగిపోతున్న జ్ఞాపకాల శిధిలాలు, అనాధాశ్రమాలు విచ్చుకుంటున్న కలల వాకిళ్ళు’ అని. ఆ కలలకి జీవం పోసి, వృక్షాలుగా తీర్చి దిద్దాలనేదే ఆశయం. ఇప్పుడు నాకొక పెద్ద దిక్కు కావాలి. ఈ మిషన్ వెనుక స్పూర్తి మీ కుటుంబం నుంచి వచ్చిందే. అందుకే మీరు వచ్చి నాతో ఉండాలి మీకు అభ్యంతరం లేకపోతే” ముగించి శ్రీధర్ ముఖంల్లోకి చూశాడు కమల్.
శ్రీధర్ కి ముందు కొంచం అయోమయంలా అనిపించింది. “ఆలోచిస్తా, ఈ వయసులో ఇవన్నీ కుదురుతాయంటావా? తను పోయాకా అన్నిటి మీద ఆసక్తి పోయింది” అంటూ ఓ నిట్టూర్పు విడిచాడు.
తెల్లారి వెడుతూ కమల్ మరీ మరీ చెప్పి, ఓ వారం రోజులు వచ్చి చూసి, ఆ తర్వాత నిర్ణయం తీసుకునేలా శ్రీధర్ ని ఒప్పించాడు.
……
ముందుగా అనుకున్నట్టే శ్రీధర్ ‘పిల్లల సందడి’ ని చూడడానికి వెళ్ళాడు. కమల్ తన ఉద్యోగంలో నేర్చుకున్న మెళకువలను ఉపయోగించి చక్కటి ఆశ్రయాన్ని కట్టినట్లు శ్రీధర్ గుర్తించాడు. పిల్లలందరూ కమల్ ని ‘నాన్నా, నాన్నా’ అంటూ ఉంటే ఓ వింత అనుభూతి కలిగింది. పిల్లలకి శ్రీధర్ ని ‘తాత’ అని పరిచయం చేశాడు కమల్. వారంలో వెనక్కి వచ్చేయొచ్చు అనుకున్న శ్రీధర్ మూడు నెలలు ఉండిపోయాడు. ఒకప్పటి దీర్ఘ రాత్రులు కథల ఉయ్యాలలగా మారి పోయాయి. చీకటి చల్లని స్నేహ హస్తంగా చుట్టుకు పోయింది. పిల్లలు జల జలా రాల్చే నవ్వుల మధ్య ‘ముసలి సన్యాసి’ అవసరమే లేకుండా పోయింది. పిల్లలందరిలో రోహిత్ అనే పిల్లవాడు మరింత దగ్గరగా వచ్చేవాడు. చాలా సార్లు కథలు చెప్పించుకుంటూ తన దగ్గరనే పడుకునేవాడు.
వచ్చే ముందు ఓ రోజు కమల్ అన్నాడు, “మీకు మొదలు నుండి పిల్లలు చాలా ఇష్టం కదా; పిల్లలు మిమ్మల్ని సొంత తాత లాగా భావిస్తున్నారు. మీరు ఉంటే నాకూ చాలా బావుంది, ఉండి పోరాదూ.”
అయితే శ్రీధర్ కి అప్పటికే శ్రీ చాలా సార్లు ఫోన్ చేసింది, పిల్లాడి వెకేషన్ టైమ్ కి యు.ఎస్. రావాలని. ఈ సారి యు.ఎస్. ప్రయాణానికి శ్రీధర్ కి పెద్దగా ఆసక్తి లేదు. అయినా తప్పేట్లు లేదు. అందుకే అన్నాడు “ లేదు కమల్. ప్రస్తుతానికి నేనేం చెప్పలేను. యు.ఎస్. వెళ్ళి ఐదారు నెలలుండాలి. వెళ్లొచ్చాకా ఏదో ఒక నిర్ణయం తీసుకుంటా. రేపు హైదరబాద్ వెళ్తా. ఏమీ చక్కబెట్టుకోకుండా వచ్చా. యు.ఎస్. వెళ్లడానికి ఎన్నో రోజులు లేవు. అందుకే అన్నీ ముగించుకుని, కొన్ని రోజులు ఇక్కడ ఉండి మరీ వెళ్తా.” బయలుదేరే ముందు పిల్లలు, ‘తాతయ్యా జల్దీ రావాలి’ అంటూ చెప్తుంటే శ్రీధర్ కి కళ్ళు చెమ్మ గిల్లాయి. రోహిత్ దగ్గరకి రాలేదు, మాట్లాడలేదు. దూరంగానే ఉండిపోయాడు.
……..
“సారీ పిల్లలూ, జ్వరం వచ్చి నెల రోజుల పాటు లేవలేక పోయా,” ‘సందడి’ లో ఎక్కడికి పోయారు తాతయ్యా అంటూ తనను చుట్టుముట్టిన పిల్లల్నిదగ్గరకి తీసుకుంటూ అన్నాడు శ్రీధర్. అప్పుడే అటు వచ్చిన కమల్ నవ్వుతూ శ్రీధర్ ని
“ఎలా ఉన్నారూ? మీరున్నన్నిరోజులు పిల్లలు మీకు ఎలా దగ్గరయ్యారో తెలుసా?” అంటూ లోపల గదిలో కూర్చోబెట్టాడు. శ్రీధర్ సన్నగా నవ్వుతూ “ ఏంటీ వెంటనే రమ్మని ఫోన్ చేశావు? శ్రీ రమ్మని ఫోన్ల మీద ఫోన్ చేస్తోంది. ఇంకో రెండు వారాలలో ప్రయాణం. ఇది వరకు వెళ్ళేదాకానైనా ఎక్సైట్మెంట్ ఉండేది. ఇప్పుడదీ లేదు. హైదారాబాద్ వెళ్ళానన్న మాటే గాని, మనస్సంతా ఇక్కడే ఉంది. కానీ, ఉన్న ఒక్క బంధం, వెళ్ళక తప్పదు. ఎలాగూ రెండు రోజుల్లో నేనే వద్దామను కుంటుంటే నువ్వే ఫోన్ చేశావు. ఏమిటి విషయం?”
“ఏంలేదు, మీకు రోహిత్, నాలుగేళ్ల కుర్రాడు గుర్తున్నాడుగా; మీ కూడా కూడా తిరుగుతూ ఉండేవాడు. మీరెళ్ళిన దగ్గర నుంచి తాత ఎప్పుడు వస్తాడు? అని అడుగుతూ ఉండేవాడు. ఆ కుర్రాడికి ఓ పది రోజుల నుంచి జ్వరం. తిండి తినడం లేదు. మిమ్మల్నే కలవరిస్తున్నాడు. డాక్టర్ మామూలు జ్వరమే అంటాడు. నాకైతే మీమీద బెంగ పెట్టుకున్నాడేమోనని అనుమానం. రండి చూద్దురుగాని” అంటూ కమల్ శ్రీధర్ ని సిక్ రూమ్ లోకి తీసుకెళ్ళాడు.
శ్రీధర్ కి ఆనందంల్లాంటి విషాదానుభూతి కలిగింది. ‘తన మీద ఓ చిన్న పిల్లాడు బెంగ పెట్టుకోవడం ? నిజంగా! తను చెప్పిన గుప్పెడు కథలకి, చూపించిన కాసింత ఆప్యాయతకే వాడు తన్ని ప్రేమించడం మొదలు పెట్టాడా? ఏమో, కమల్ కొంచెం ఎక్కువగా ఊహించుకొని ఉంటాడు’ అనుకుంటూ లోపలికి నడిచాడు.
కమల్ రోహిత్ ని తట్టి, “చూడు నాన్నా తాత వచ్చాడు” అంటూ లేపాడు. అప్పుడే మంచం దగ్గరకు వచ్చిన శ్రీధర్ ని కళ్ళు విప్పి చూసిన రోహిత్ లేచి మెడకి చుట్టేసుకున్నాడు. “ఎక్కడికి పోయావు తాతా?” అంటూ ఒక్కటే ఏడవడం మొదలు పెట్టాడు. హఠాత్తు గా జరిగిన ఈ పరిణామానికి శ్రీధర్ కి కన్నీళ్లు వచ్చాయి. ఆపుకుందామని ప్రయత్నించి వృధా అని వదిలేశాడు. తన కోసం ఇంతలా కన్నీళ్లు పెట్టుకునే ఓ ప్రాణి ఉండడం శ్రీధర్ ని ఉక్కిరిబిక్కిరి చేసింది.
ఐదు నిమిషాలు నిశ్శబ్దం. కాసేపటికి ఉద్వేగాలు కుదుట పడ్డాయి.
“పాపం రోహిత్ చిన్నప్పుడే తల్లీతండ్రీ పోతే, తాత దగ్గరే పెరిగాడు. రోహిత్ ని ప్రాణానికి ప్రాణం గా చూసుకున్న ఆయన ఆర్నెల్ల క్రితం పోయాడు. ఎప్పుడూ దిగులుగా ఉండే కుర్రాడు, మీరొచ్చాక కాస్త హుషారుగా ఉండటం కనిపించింది” అన్నాడు కమల్.
అప్పుడే శ్రీ నుంచి ఫోన్. నాన్నా సాయంత్రం చేస్తాను రా అని శ్రీధర్ కట్ చేశాడు.
శ్రీధర్ చాలా సేపు ఆలోచించాడు. ఈ కుర్రాడి పరిస్థితి చూస్తే కోలుకోడానికి సమయం పట్టేలా ఉంది. తన మనవడికి తన అవసరం నామమాత్రమే. కానీ, ఇక్కడున్న పిల్లలకి అది అత్యవసరం. అయినా ఇంతమంది ప్రేమను తను వదులుకొని ఎక్కడికైనా ఎందుకు వెళ్ళాలి? చెప్పినట్టుగానే సాయంత్రం శ్రీ కి ఫోన్ చేశాడు. కమల్ కల్సింది, ‘సందడి’ వివరాలు, పిల్లల తో తన అనుభవం, ముఖ్యంగా రోహిత్ గురించి చాలా విషయాలు చెప్పాడు.
“అందుకే నే నిక్కడే ఉండిపోదాం అనుకుంటున్నాను. ఏమంటావు రా ?” అన్నాడు శ్రీధర్.
“నాన్నా చాలా కాలమైంది మీరింత సంతోషం గా మాట్లాడి. నిజానికి నీకేం చేయలేక పోతున్నాననే గిల్ట్ వల్లే నిన్ను రమ్మని సతాయించేది. ఇప్పుడా అవసరం లేదు. కాకపోతే నిన్ను మళ్ళీ ఎప్పుడు కలుస్తానో అనే బెంగైతే ఉంటుంది. అక్కడే పిల్లలతో ఉండిపోదామని నువ్వు తీసుకున్న నిర్ణయం చాలా బావుంది. ఇప్పుడు నీకు బోలెడు మంది మనవలు. కమల్ మీద నాకు చాలా అసూయగా ఉంది. ఆల్ ద బెస్ట్ నాన్న. సెలవలు చూసుకుని అక్కడికి వచ్చి పోవడానికి ప్లాన్ చేస్తాము.” శ్రీ మాటలు విన్న శ్రీధర్ కి చాలా సంతోషం కలిగింది.
తన పెంపకంలో లోపం లేదు. తన పర్యవేక్షణ లో కూడా లోపం రాదు అనుకున్న శ్రీధర్ తడి కళ్ళు ఒక్కసారి మెరిసాయి.
*
బాగుంది సర్ వాస్తవానికి దగ్గరగా కధ.!💐.అభివందనలు.మీకు!
బావుంది
చాలా బాగా రాశారు మిత్రమా అభినందనలు
అక్షరాల వెంట కళ్ళు వెళ్తున్న కొద్ది.. మనసు నిండిపోయింది అనుకున్నా.. మరికాస్త చదివేసరికి.. కళ్ళు తడిచాయి.
మొత్తం గా చదివేసరికి గుండెల్లో గోదావరి కళ్ళలో ప్రవహిస్తూ నన్ను నేను మర్చిపోయాను.
అమ్మ అడిగిందప్పుడు.. ఏమైందంటూ..
గుండె తడిచిందన్నా.. మా ఇద్దరి మధ్య పేరుకున్న నిశ్శబ్దం చెప్పింది అమ్మకు అర్థం అయ్యిందని…
బాగుంది కథ. ఇప్పుడు వయసు మల్లినవారి సంఖ్య బాగా పెరిగింది. ఒంటరితనం లాంటి సమస్యలు. మరో పక్క ఆదరణ, ఆధారం అవసరం ఉన్న అనాథలు. రెండు సమస్యలూ ఒక్క చర్యతో తీరడం బాగుంది. ఠాగూర్ కథ లాంటి కథ.
మీ ఇతర కథలు కూడా అందించండి, చదవాలి. నేను మీ కత చదవడం ఇదే మొదటిసారి.
“‘వృద్ధాశ్రమాలు క్రుంగిపోతున్న జ్ఞాపకాల శిధిలాలు, అనాధాశ్రమాలు విచ్చుకుంటున్న కలల వాకిళ్ళు’”
Quotable quote.
Wow….nice..poetic story 👌
baagumdi vaastavaaniki koMchaM daggaragaa koMchaM dooraMgaa , EmO magavaariki saadhyamEmO ammalaku kaadu