ఓ కాంక్ష కి మరుజన్మ

ప్రతీ ఉదయం

ఆరంభ శూరత్వం.

ముగింపు మాటెత్తని

ఒక కొత్త ప్రారంభం.

 

విఫలమైనా పర్లేని

ఒక చిన్న ప్రయత్నం.

కనుమరుగైనా కలవరపడని,

కలలను నెరవేర్చే ,

తపనల కోలాహలం.

తలమునకల తలపులతో,

మెదడుకు మేకుల పదును.

అవకతవకల ఆలోచనలతో,

అవిశ్రాంత అలజడి.

 

ఒత్తిడి ముంత పొగ,

ఒడిదుడుకుల భగభగ,

అలసటల ఆర్భాటం,

దిగులు చింతల చిద్విలాసం,

మిట్ట మధ్యాహ్నం.

 

శాంతి విశ్రాంతి,

చల్లని సాయంత్రం.

హృదయ కలవరాల సంయమనం,

స్వీయ అనుమానాల అస్తమయం.

ఆవేదనల ప్రసవ వేదనకి,

పుట్టుకొచ్చిన ఉపాయాల వలయం.

 

చిగురాశల తెగింపు,

ఆశాభంగాల ముగింపు.

ఒక నిరాశకి మరణం,

ఓ కాంక్ష కి మరుజన్మ.

ఇన్ని ప్రభంజనాల పరిణామం,

సంశయాలు తీరిన శయనం.

 

నవస్వప్నపు కౌగిట్లో,

కితకితల కలవరం,

మరో వేకువ వెలుగుకి శ్రీకారం.

 

ఇలాంటి…ఇంకోలాంటి…

ఎలాగో తెలియనిలాంటి,

మంచో చెడో,

వివరించడం వీలులేనిలాంటి,

శుభాశుభాల ఆకృతి…

అనిర్వచనీయం అయినలాంటి,

మరో మూడు నూర్ల

ఉదయసంధ్యల స్రవంతి,

సరస సోపానాల సమూహం,

కష్టసుఖాల సంగమం,

మరో యుగాది…

మనోధైర్యంతో, మనోహరంగా,

ఆత్మవిశ్వాసం ఆద్యంతంగా,

ఆస్వాంతం ఆసాంతం స్వాగతం!!

*

కుందుర్తి కవిత

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు