అతను…
వెలుగుతున్న కళ్లతో ఉదయిస్తాడు. ఆనక సూర్యుణ్ణి నిద్రలేపుతాడు. ఆకలేసే లేగని అమ్మ దగ్గరకంపి తన బాల్యంలోకి జారుకుంటాడు
ఏ పంచదారా కలవని ఆ పాలు ఎంత తీపో గుర్తుచేసుకుంటాడు
కడుపునిండిన తువ్వాయి మూతినంటుకున్న పచ్చిపాల నురుగును చూసి మురిసిపోతాడు
పరకలమోపుతో తల్లిని మేపుతూ పసరు వాసనల మధ్య పాలు పితుకుతాడు
చీకట్లోనూ అలవాటైన వీధుల్లో అవలీలగా పరుగులెడుతూ ‘అత్తా మామా పిన్నీ చిన్నీ’ అంటూ ఆప్యాయతల తలుపులు తడతాడు
వాడుకగా పోసేవే అయినా వేడుకలా పదిళ్లకీ పాలు పంచుతుంటాడు
అలిసిన ఒంటిని ఆరుబయటే అరగంటసేపు స్నానమాడిస్తాడు
గిన్నెడు చల్దన్నంలో కుండెడు గంజీ, ఉప్పూమిరగాయీ కలిపి కొడతాడు
పాతగుడ్డతో తుడిచిన కొత్తబండెక్కి నల్లకళ్లద్దం తగిలిస్తాడు
‘ఏట్రా ఈడి పోజూ?’ అనే ముసిలీముతకల్ని నవ్వుతూ పలకరిస్తూ వేగాన్ని నూరుకి పెంచుతాడు
పడమటిదిక్కునుంచి చలువ చంద్రుళ్లా బయలుదేరి తూరుపు వేలుపుకి ఎదురేగుతూ ఆసుపత్రిని చేరతాడు
మేడమీద మూలనున్న గదిలో ఆకుపచ్చగా మారి ముక్కూమూతీ మూసుకున్న గుడ్డలతో బయటపడతాడు
ఆ సరికే సిద్ధమైవున్న వైద్యుడికి సరిజోడుగా నిలిచి కడుపు చించుతాడు
ఆ చేతివేళ్లలో మహిమలూ మహత్తులూ చూపుతూ కత్తులూ కత్తెరలన్నిటా ఉదయరాగాన్ని వినిపిస్తాడు
తొలిఉషస్సును చూసే పసిబాలల మొదటి ఏడుపుకి సాక్షీభూతమవుతాడు
అరుణారుణవర్ణంతో ఎరుపెక్కే ఆకసానికి మరో సూర్యుణ్ణి పరిచయం చేస్తాడు
ఇంటిదగ్గర వాడు ఒకడు
ఇక్కడింకొకడుగా మారిపోవడానికి అలవాటు పడినవాడు
పశువులకీ, పసివాళ్లకీ పదికాలాలుగా పరమావధిగా నిలిచినవాడు
*
ఓటీ కుర్రాడి కథ బాగా చెప్పారు.
ధన్యవాదాలు మోహన్ గారు
కళ్ళ ముందు నిలిచాడు ot కుర్రాడు.
కాదు మీరు అలా నిలిపారు.
బావుంది జగదీష్ గారు
ధన్యవాదాలు మణిగారు
చాలా బాగుంది డాక్టర్ గారు. ఇలా సంతోషంగా, మనస్ఫూర్తిగా చేసే పనితో ఎందరి మనసుల్లో దూరిపోతాడో కదా ఆ కుర్రాడు🙂 నైస్👏🏻👏🏻👏🏻
ధన్యవాదాలు రత్నశ్రీగారు
ప్రారంభంలో ఏమిటా కథ అనుకున్నా. దినచర్యను మనసుకు హత్తుకొనే విధంగా ఆవిష్కరించారు. మాండలికంలో బహు చక్కగా అల్లారు. ఇంకా చల్దన్నం వగైరా సాగుతున్నాయంటే పాత క్రొత్తల మేలు కలయికల జీవితం అన్నమాట! ముగింపులో పసికందుల జీవనయానం మీ చేతుల మీదుగా ఏడుపుతో ప్రారంభం. శుభం. మనలో మన మాట.సాధ్యమైనంతగా పొట్ట కోయటం తగ్గించండి🙏
ధన్యవాదాలు సదానందరావుగారు. మీరన్నట్లు ఇది దినచర్యే. ఒకరోజు ఆ కుర్రాణ్ణి చాలా కాజువల్‌గా అడిగాను. ఇదంతా చెప్పేటప్పటికి నాకు నోటమాట లేదు. అప్పటివరకూ నేనేదో అవిశ్రాంతంగా పనిచేసేస్తున్నానన్న భావన నుండి బయటపడేశాడు.
పాడి ఆవు కి కోడ్ దూడ, చూలింత కి చిన్ని కృష్ణుడు. మన ఓటీ కుర్రాడికి ఇద్దరూ ఓ(హ) టే .
🙏
“పడమటిదిక్కునుంచి చలువ చంద్రుళ్లా బయలుదేరి తూరుపు వేలుపుకి ఎదురేగుతూ ఆసుపత్రిని చేరతాడు
మేడమీద మూలనున్న గదిలో ఆకుపచ్చగా మారి ముక్కూమూతీ మూసుకున్న గుడ్డలతో బయటపడతాడు”
ఒటి బాయ్ రూపాంతరం చెందే క్రమం 👌
అవునండీ. అతగాణ్ణి గడిచిన పదిహేనేళ్ళుగా గమనిస్తున్నా ఎప్పుడూ అతని ఇంటి వ్యవహారం తెలుసుకోలేదు. ఇదంతా ఈమధ్యనే తెలిసింది. ధన్యవాదాలు 🙏