మానవ జీవితం పరిణామాలకు లోనవటం సహజం.
సరళ రేఖగా సాగాలనుకున్నవారి జీవితం కూడా కొన్ని సంఘటనల వల్ల [అవి సామాజికం కావచ్చు; వ్యక్తిగతం కావచ్చు] గతి మారి ప్రవహించవచ్చు. జీవితంలో హఠాత్తుగా జరిగే సంఘటనలు కొన్ని ప్రారంభాలకు పునాది కూడా కావచ్చు
అలాంటి ఒక్క హఠాత్తు సంఘటనయే నన్ను తెలుగు కథారచయితను చేసింది.
తెలుగు నా మాతృభాష కాదు ;చదువుకున్న భాష అసలే కాదు
ఉన్నత ఉద్యోగం దొరకటంతో ముంబై లోని ఉద్యోగం మానేసి విశాఖ వచ్చి స్థిరపడ్డాక స్వయంగా నేర్చుకున్న భాష తెలుగు. ఊరులో బ్రతకటం కోసం భాష
నేర్చుకున్నాను కానీ తెలుగులో రచనలు చేయాలని అనుకోలేదు. అయితే విశాఖ రాక ముందే నేను రచయితని. మలయాళ భాషలో యువకవి అనే పేరుండేది.
తెలుగులో కథ వ్రాయడానికి ప్రేరణ కలిగించిన సంఘటన చెప్తా.
అది 1987 ఫిబ్రవరి నెల .అప్పుడు నేను విశాఖ ఫెరిలైజర్స్ లోని ఒక విభాగానికి షిఫ్ట్ ఇన్చార్జ్ గా పనిచేస్తున్నా .ఆ రోజు రాత్రి పదకొండు నుంచి పొద్దున ఏడు గంటలవరకు డ్యూటీ. రాత్రి డ్యూటీ అంటే రెప్ప వాల్చడానికి వీలుండదు .నా వద్ద అయిదారుగురు టెక్నీషియన్స్ పని చేస్తుండేవార . ఒక మనిషికి ఇద్దరి పని ఉంటుంది . ఐనా అప్పుడప్పుడు కొంత ఖాళీ దొరికినప్పుడు కానీ, చా తాగుతున్నప్పుడు కానీ సాహిత్యం అంటే ముఖ్యంగా చదివిన కథల గురించి మాట్లాడుకునేవారు. ఆ నాటి సంస్కృతి అది. ఆ రోజు ఆ వారం ఆంధ్రప్రభలో వెలువడిన ఒక కథ గురించి మాట్లాడుతూ అది గొప్ప కథ అన్నారు కొందరు. ఆ కథ నేను కూడా చదివా .నా విమర్శక దృష్టికి అందులో చిన్న లోపం కనబడింది. కథ వాస్తవికతకి దూరంగా ఉందనీ, వాస్తవికతకి అద్దం పట్టే కథలే గొప్ప కథలవుతాయని చెప్పా. ఒక్కరిద్దరు వాదనకి దిగారు. అంతే కాదు మీకు తెలుగు కథల గురించి ఏం తెలుసు? మీరు కథ వ్రాయగలరా ? వ్రాసి చూపించండని సవాల్ విసిరాడు ఒక వ్యక్తి. నేను తెలుగు పత్రికలు చదువుతానని వాళ్ళకు తెలియదు. ఆ రోజు ఫిబ్రవరి 23. రాత్రి డ్యూటి నుంచి ఇంటికొచ్చాక ‘జవాబు లేని ప్రశ్న’ అనే కథ వ్రాశా. కథావస్తువు చాలా కాలంగా నా మనసుని వేధిస్తున్నదే. కథ చదివి మెచ్చుకున్నారు వాళ్ళు .అంతే కాదు ఆంధ్రజ్యోతి వారపత్రిక ఉగాది కథల పోటీ నిర్వహిస్తోందని ఫిబ్రవరి 28 చివరి తేదీ కనుక పోటీకి పంపమని కూడా చెప్పారు. పంపా; ఆ కథకు బహుమతి వచ్చింది. అప్పటి నుంచి కథలు వ్రాయటం ప్రారంభించా.
ఫలశ్రుతి– నా కథల గురించి తెలుగు విశ్వవిద్యాలయంలో ఎంఫిల్, ఆంధ్ర యూనివర్సిటీలో పీహెచ్డీ చేశారు.
*
Add comment