ఒక సెలయేరులా …ఆ జీవితం!

డాక్టర్ చాగంటి సూర్యనారాయణ గారి  ఆత్మకథ ‘డాక్టర్ కథ ‘. ఆయన తన పుస్తకం ముందు పేజీలలో ఈ పుస్తకం లోని పాత్రలన్నీ కల్పితాలు అని రాశారు కానీ అవి చదువుతుంటే వారు అది ఏ జాగ్రత్తలు పాటించడం కోసం వ్రాసారో కానీ అది ఆయన స్వీయ  చరిత్ర అని తెలుస్తుంది . ఈ పుస్తకం మొదట 1966 లో ప్రచురితమైంది. ఆ చిన్న పుస్తకం, దాదాపు 155 పేజీలు మించి లేదు , ఎంత మంది చదివారో తెలియదు. మనం తరువాత కాలంలో ప్రస్తావించే అనేక ఆత్మ కథలలో దీని ప్రస్తావన లేదు . అయితే అది యాదృఛ్చికమో , ఏమో ,  డాక్టర్  భార్గవి చదివింది. తాను మెడిసిన్ చదవడానికి ముందు ఒక సంవత్సరం ఖాళీగా ఉన్నప్పుడు చదివిన అనేక పుస్తకాలలో ఇది ఒకటి. బహుశా తాను వైద్య వృత్తి ఎంచుకోడానికి కూడా ఈ పుస్తకమే ఒక ప్రేరణ. భార్గవి కుటుంబ సభ్యులలో డాక్టర్లు వున్నారు. అయితే  వారు ఆయుర్వేద వైద్యులు. ఆ బాట పట్టకుండా తాను అల్లోపతి వైపు వెళ్ళడానికి ఈ పుస్తకం దోహద పడింది.

ఇది ఇప్పటి మాట కాదు . తాను వైద్య చదువు పూర్తి చేసుకుని , ప్రాక్టీసు పెట్టింది. పేరు ,డబ్బు సంపాదించుకున్నది. జీవితంలో ఎన్నో ఒడుదుడుకులు చూసింది. కానీ చిత్రంగా ఈ పుస్తకాన్ని మర్చిపోలేదు. మళ్ళీ  చదువుదామని ఆ పుస్తకం గురించి వాకబు చెయ్యడం మొదలు పెట్టింది. మొదట ఈ పుస్తకం గురించి ‘తెలుసు , నా దగ్గర వుంది ‘ అన్నది ముంజులూరి కృష్ణకుమారి. అయితే  తన దగ్గర వున్న అనేక వేల పుస్తకాలలో ఈ చిన్ని పుస్తకం పట్టుకోలేక పోయారు. అయినా పట్టు వదలలేదు ఈ విక్రమార్కురాలు. చదువరులను అడుగుతూనే వుంది. చివరకు గుంటూరు లంకా సూర్యనారాయణ గారి అన్నమయ్య లైబ్రరీ లో ఈ పుస్తకం దొరికింది. వారు దాని సాఫ్ట్ కాపీ కూడా పంపారు . ఒక పెద్ద నిధి కనుక్కున్నట్లు సంతోష పడింది భార్గవి . మళ్ళీ  చదివాక ఈ కథ ఇప్పటికి అంతే  ఆసక్తిగా వున్నదని గ్రహించింది. మరి అవి నిజజీవిత విశేషాలు కనుక పాతబడలేదు . ఇక అప్పుడు వచ్చిన ఆలోచన ఈ పుస్తకం మళ్ళీ  వెలుగులోకి తీసుకు రావాలని . దీనికంతా  నేను, అన్వర్ సాక్షులం .

చాగంటి సూర్యనారాయణ గారు విజయవాడ లో ప్రాక్టీసు మొదలు పెట్టిన మొదటి ఎం.బి.బి.ఎస్ డాక్టర్ . ఆ రోజుల్లో L .I .M ,G .C .I .M ., M.B.B.S -మూడు వైద్య రంగం లో తర్ఫీదు  పొందిన డాక్టర్లు పొందగలిగే డిగ్రీ లు, ముందు రెండింటిలోనూ ‘ఇంటిగ్రేటెడ్ మెడిసిన్’ అని ఆయుర్వేదం ,అల్లోపతి  కలిపి చదివేవారు. కానీ M.B.B.S  అల్లా కాదు . అందులో చదవాలంటే ఇప్పటి లాగ ఇంటర్ లో సైన్స్ గ్రూప్ అక్కర్లేదు. హిస్టరీ తీసుకున్న ,ఒక సబ్జెక్టు లో ఫెయిల్ అయినా వీరు సీటు సంపాదించుకోవచ్చు . అలా చేర్చు కో కూడదని రూల్ వున్నా డబ్బు ,పరపతి ఉంటే ఆ రూలు  మాయమయ్యేది . ఆ రెండు  లేక సూర్యనారాయణ గారు అప్లికేషన్ వారి బంధువుల కుర్రాడు రాజమండ్రి పంపడం వల్ల ఒక సంవత్సరం ఆగి చదవాల్సి వచ్చింది . ఆయన విజయవాడలో పేరు పరపతి రెండూ  సంపాదించుకున్నారు . విజయవాడ IMA (ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ) లో చాలా క్రియా శీలకంగా పని చేసి ఆ బిల్డింగ్ శిలా ఫలకం వేశారు . ఇప్పటికి ఆ ఫలకం మనం చూడవచ్చు.  అయినా ఆయన గురించి ప్రస్తుతం ఎవరికీ ఏమీ తెలియదు . చివరకి డాక్టర్  శర్మ గారు ఆయన గురించి కొన్ని వివరాలు అందించగలిగారు. ఆయన ఇచ్చిన సూచనల తోనే ఆయన రాసిన లలితా సహస్రం పై వ్యాఖ్యానం పుస్తకం పై ఆయన ఫోటో కూడా దొరికింది . అందరిని సలహా అడిగి చివరకి ఆ పుస్తకం తాను మళ్ళీ పబ్లిష్ చేసింది . ఆలా మనకు ఈ నాడు ఈ పుస్తకం దొరికింది.

ఈ పుస్తకంలో కథా నాయకుడు 1919-20 ప్రాంతంలో మద్రాసు (ఇప్పటి చెన్నై) లో దక్షిణ దేశం లో ఉన్న ఏకైక మెడికల్ కాలేజీ లో వైద్య పట్టా తెచ్చుకునేందుకు మద్రాసు మహా పట్టణం చేరాడు . నాలుగైదు వాక్యాలలోనే అప్పటి కాలేజీ ఎలా ఉండేవో హాస్యం తో కూడిన వ్యంగ్యం తో వర్ణించారు . ఈ శతాబ్ది మొదట్లో మద్రాసు మెడికల్ కాలేజీ , జనరల్ హాస్పిటల్  అంటే “ఇండియన్ మెడికల్ సర్వీసు ఆఫీసర్ల యొక్క వరహాల పంట పండే స్వంత సేరీ భూములు . వీటిలో పెద్ద ఉద్యోగస్థులు ,సర్జన్లు , వైద్యులు , ప్రొఫెసర్లు — అందరూ ఈ యురోపియన్ ఐ.ఎం.స్ ఉద్యోగస్తులే . యూరోపియన్ల  వైద్య సహాయం కోసం వచ్చామనే  మిష మీద మిలిటరీ సిబ్బంది లోంచి వచ్చి ఈ పెద్ద ఆసుపత్రులు , కాలేజీలు ఆక్రమించుకుని వీటిని తమ ఏలుబడి లో వుంచుకునేవారు . వీరికి మన దేశీయుడు ఎంత గొప్ప వైద్యుడైనా తమకు తాబేదారుగా ఉంటె తప్ప ,వాడి అడా పొడా కిట్టేది కాదు “. ఈ ఒక్క వాక్యం లో ఆ నాటి సామాజిక పరిస్థితి ఎలా ఉండేదో మనకి కళ్ళకు కట్టినట్లు చూపారు . ఆయన రాసిన భాష అచ్చ తెలుగు . ఇందులోని కొన్ని మాటలు ఇప్పుడు వాడుకలో లేవు .

ఆ రోజుల్లో ఊరి మొత్తంలో అన్ని కాలేజీలకు కలిపి ఒకటే హాస్టల్ ఉండేది . అందులో రూము దొరకడం కష్టం . పైగా మద్రాసులో చదవడానికి దేశం నలుమూలల నుంచే కాక సింహళం నుంచి కూడా వచ్చే వారని రాశారు . మన పల్లెటూళ్లు నుండి వెళ్లి అక్కడ పట్టణ  నాగరీకతకు ఇమడడం ఒక ప్రయత్నం.  ఇమడలేక ఆత్మహత్య చేసుకునే వారి గురించి కూడా ప్రస్తావించారు .  ఆ హాస్టల్ లో రూము  దొరకని వారు, ఇద్దరు ముగ్గురు  కలసి “మద్రాసుకంతకు మురికి పేటలుగా పరిగణింప బడే  పెరియమెట్టు ,వాల్టాక్సు రోడ్డు , చింతాద్రి పేటలో” ఒక గది తీసుకుని ఒంటి పూట  భోజనం తో గడిపేవారుట . ఈయన అలాంటి రూమ్ లో ఉండగా ఈయనకి చలి జ్వరం రావడంతో అది అప్పటికి ప్రబలి వున్న కాలా అజార్ అని భయపడ్డారు . అయితే తన విద్యార్థికి అలా ఉందని తెలిసిన ప్రొఫెసర్ వీరి ఇంటికి వచ్చి పరీక్షించి అది కాలా అజార్ కాదని మందులిచ్చి వారికి ఆ హాస్టల్ లో రూము దొరికేందుకు సహాయ పడ్డారు . ఈ సంఘటన వల్ల  ఆ రోజుల్లో కొంత మంది ప్రొఫెసర్లు తమ విద్యార్థులను ఎలా చూసుకునే వారో తెలుస్తుంది

ఈ పుస్తకం ఆ రోజుల్లో వున్నా వైద్య సౌకర్యాలు గురించి చెపుతుంది . నిజానికి ఈ అరవై సంవత్సరాలలో ఏంతో  పురోభివృద్ధి చెందాము . ఇన్ని రకాల మందులు లేవు . సౌకర్యాలు వున్నా ఆసుపత్రులు లేవు . కాలా అజార్ లాంటి అంటు వ్యాధులు ప్రబలి ఉండేవి . ముఖ్యం గా ప్రసూతి రంగం లో ఆపరేషన్ లాంటివి కనపడలేదు . ప్రసూతి రంగం లో కూడా స్త్రీలు తక్కువ మంది వుండే వారు . పురుషులే పురుడు పొసే వారు . దీనికి కారణం ఆ రోజుల్లో కాన్పు కష్టమైనా , బిడ్డ అడ్డం  తిరిగినా , పటకార తో బిడ్డను బయటకు లాగేవారుట . దీనికి ఎంతో కొంత బలం కావాల్సి వచ్చేది . అందుకని మగవారు ఈ రంగం లోకి ఎక్కువ మంది వచ్చేవారు . అయితే ఘోషా ఉండేది . ఒక స్త్రీని బురఖా పై నుంచి పరిక్ష చేసి తప్పు డయాగ్నోసిస్ చేసిన సంఘటన ప్రస్తావించారు.  వైద్యులకు ఇది కత్తి  మీద సాము. ఏంతో  సంయమముతో  , నేర్పుగా వ్యవహరించాలి.

ఆ రోజుల్లో ఇన్ని స్పెషలైజెషన్స్ లేవు . కాలు విరిగినా ,పన్ను నొప్పికి ఒకటే డాక్టర్. అయితే, చదువు అయిపోగానే ఎదో ఒక చోటు వెతుక్కుని ప్రాక్టీస్ పెట్టాలి . సూర్యనారాయణ గారు ఒక 20వేల  మంది జనాభా వున్నా ఒక పెద్ద పల్లెటూరు బెజవాడని తన కార్య స్థలంగా ఎన్నుకున్నారు . అప్పటికి ఇక్కడ ఎం.బి.బి.స్. డాక్టర్లు లేకపోవడం ఒక కారణం .

సూర్యనారాయణ గారి శైలి తేలికైన అచ్చ తెలుగు మాటలతో ఒక సెలయేరులా ప్రవహిస్తూ పోతుంది . అందులో హాస్యం ,వ్యంగ్యం కలగలిపి ఉంటాయి. ఏ విషయ వివరణకు అతిశయోక్తులు ,తమ సొంత ఊహలు చేర్చలేదు . జరిగినది మనకు చెప్పడంతో అప్పటి కాల పరిస్థితులు పాఠకులు అర్థం చేసుకుంటారు . ఎవరి మీద కోపం , నిరాశ , అభియోగం లేవు . చిన్న చిన్న సంఘటనలు వివరిస్తూ ఆయన అనుభవాలు మనకు అంద జేశారు. ఇంట మంచి పుస్తకం మరుగున పడిపోకుండా వెలుగు చూసేందుకు దోహద పడిన భార్గవి అభినందనీయురాలు.

*

ప్రసూన బాలాంత్రపు

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు