2013లో అంటే దాదాపు దశాబ్దం క్రితం కట్టెపల్క సంపుటి ద్వారా గట్టి పలకరింత కవిత్వాన్ని పరిచయంచేసిన కందుకూరి అంజయ్య 2023లో మరింత స్పష్టతతో, తనదైన డిక్షన్లో, సునిశితమైన దృష్టికోణంతో, తీవ్రమైన స్వరంతో మన ముందు మోగిస్తున్న కవిత్వ గొంతుక జమిడిక. నేటికీ మన గ్రామాల్లో వినిపించే ఒకానొక వాయిద్యం జమిడిక . అందులో ఒక ప్రత్యేక నాదం ఉంటుంది. ఆ నాదం అంజయ్య కవిత్వంలో నినాదం అయ్యింది.
Poetry is when an emotion has found its thought and the thought has found words__ Robert Frost
మనల్నిభావోద్వేగానికి గురిచేసిన ఒకఆలోచన లేదా సంఘటన సరైన పదజాలాన్ని కనుగొన్నప్పుడు, కలగన్నప్పుడు అది కవిత్వం అవుతుంది. కవి ఒక్కడే అయినా సమూహానికి ప్రతినిధిగా తనను తాను ఆవిష్కరించుకుంటాడు. సమాజానికి, సమూహానికి సంబంధించిన అన్ని భావోద్వేగాలను తనవిగా చేసుకొని పలవరిస్తాడు. అందుకే అనేక సందర్భాలలో కవిత్వమై పారుతాడు. కందుకూరి అంజన్న ఇందుకు అతీతుడేమీ కాదు.
సమాజంలో నెలకొన్న అణచివేత, వివక్ష ఎదుర్కొంటున్న నిమ్నజాతి వర్గానికి ప్రతినిధిగా నిలబడతాడు కవి. అందరం హిందువులం, అందరికీ అందరం బంధువులం అని చెప్పే మాటలు పుస్తకాలకు, స్టేజిమీద పూనకాలకు పరిమితమైన నేపథ్యంలో “ఎంతెంత దూరం” అన్న తన మొదటి కవితలోనే అగ్రవర్ణాలకు అనేక ప్రశ్నలను సంధిస్తాడు.”ఉగాదీ ఉగాదీ మావెలి వాడకొస్తవా/ మట్టి పువ్వుల మకరందాన్ని మనసుకద్దుకుంటవా? /చెమట చుక్కల సెంటును పేయంతా పూసుకుంటవా?/ నా కారంతొక్కును ఉగాదిపచ్చడిలో ఊరేసి ఊరేగే రోజులుతెస్తావా?” అంటూ సూటిగా నిలదీస్తాడు. నిజమే కదా! ఎంతగా కాలం మారిందని మనం భుజాలు ఎగిరేసినప్పటికీ, 21వ శతాబ్దపు ఆధునిక కాలంలో కూడా ఇంకా కులమత ప్రాతిపదికన మనుషుల్ని వర్ణాలుగా, వర్గాలుగా విభజించి చూడడం మనదేశంలో మాత్రమే చూస్తాం. కవి రాసేదంతా స్వానుభవం కానక్కరలేదు. అలారాస్తే సృజనకు పరిమితులు ఏర్పడతాయి. అయినప్పటికీ చూసిన వాటిగురించి, విన్నవాటిగురించి రాసిన దానికంటే స్వయంగా అనుభవించిన వేదన నుండి ఘర్షణ నుండి పుట్టుకొచ్చే కవిత్వం మరింత మొనదేలి ఉంటుంది. స్వయంగా కవి తన బాల్యంలో ఎదురైన అవమానాల నుండి ఒక ధిక్కారాన్ని ప్రదర్శించి చదువు వైపు మళ్ళిన కారణంగానే ఈరోజు తాను సంఘంలో ఒక స్థాయిలో గౌరవాన్ని పొందగలిగానని చెబుతాడు.
ఇలాంటి వివక్ష నుంచి పుట్టిన మరోకవిత “సూపుడువేలు సూర్యులు”లో “వర్ణధర్మమే నీకు వజ్రాయుధం/ మీకు అమృతభాష సూరునీళ్లయింది /మాకది శూలమై కుచ్చుకున్నది/ పంజరంలో చిలుకను బంధించి పలుకుమనడం నీకేచెల్లు” అంటూ మనువాదం పరదా మాటున అగ్రవర్ణాలు నిమ్నవర్గాలను ఎలా అణిచివేస్తున్నది ఏకరువుపెడతాడు. అదే సమయంలో “వంచితే వాలం ముడుసుకొని వంగే ఎనుకటి వానరులం కాము/ గురువును గుండ్రాతిగా భావించి బొటనవేలు కోసిచ్చే ఏకలవ్యులం కాదు/ వర్ణ వంకర ధర్మాన్ని ధిక్కరించి తాపసిగా మారి తామసాన్ని ఎదిరించిన శంభూకులం/” అని గట్టిగానే హెచ్చరిస్తాడు.
ఈకవి ఉన్నదిఉన్నట్టు సమాజ స్థితిగతులను, సమస్యలను ఏకరువుపెట్టి పరిష్కారాన్ని పాఠకులకు వదిలేయడు. అందుకు ఆయన్ని అభినందించాలి. ప్రజాస్వామ్యం ముసుగులో నేటి రాజకీయం ఆడుతున్న నాటకాల పరదాలను తొలగించి పాలునీళ్లను వేరు చేస్తాడు. “పుచ్చిపోయిన ఆలోచనలకు పురుడు పోసేవాడు పురుషోత్తముడైతడు/ తోటకు అగ్గిపెట్టి వసంతాన్ని వల్లకాడు చేసినవాడు తోటమాలి అయితడు/” (ఆలోచన ఆచరణ) అంజన్న కవిత్వంనిండా తేటతేట తెలంగాణం రెక్కలు విప్పుకుంది. శిష్ట వ్యవహారిక భాషలో అప్పుడప్పుడు మొదలుపెట్టిన కవితలో కూడా తనతల్లిభాష తనకు తెలియకుండానే మధ్యలో ఇరుకుతది.. ఇక అప్పటినుండి మరింత జోరుగా ఉరుకుతది. సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఏ(తెలుగు), ఎం.ఫిల్(తెలుగు సాహిత్యం) చదవడంవల్ల తెలుగుభాష పై ముఖ్యంగా తెలంగాణ భాషపై పట్టు(ప్రేమ అనడం సబబు కావచ్చు), సాహిత్యంలో లోతైన అధ్యయనం, సామాజిక స్పృహ వల్ల అభివ్యక్తిలో చురుక్కుమనిపించే చురుకుదనం తొణికిసలాడుతుంది.
తెలంగాణ సామెతలకు ఒక ప్రత్యేకత ఉంది. శబ్దాలంకారము,లయ, ప్రాసతో ఉండి తక్కువపదాలలో ఎక్కువ అర్ధాన్ని వివరిస్తాయి. ఈయన కవిత్వం కూడా అలాగే ఉంటుంది. కవిత్వంలో విరివిగా సామెతల్ని పొదిగాడు. అవి అత్యంత సహజంగా కవిత్వంలో ఇమిడిపోయాయి. ఎక్కడా మనకు కృతకంగా, అతికించినట్టుగా అనిపించదు. ఈయన కవిత్వంలో పదబంధాలన్నీ ఒక లయ, ప్రాస కలిగిఉండి పాడుకోవడానికి కూడా అనుకూలంగా అనిపిస్తాయి. చదివేటప్పుడు కూడా మనల్ని ఊయల ఊగిస్తుంది. స్వయంగా గాయకుడు కావడం వల్ల కవిత్వం ఇలా రూపుదిద్దుకుందేమో!
తాను పుట్టినగడ్డ అంటే తనకు వల్లమాలిన ప్రేమ.ఈమట్టిలోని పౌరుషాన్ని, ధిక్కారాన్ని స్పృశిస్తూ “మట్టి మనాది, మానేరుముచ్చట్లు, మందస్మిత, ఎందుకో” లాంటి కవితలు రూపుదిద్దుకున్నాయి. తనకు జీవితంలో తారసపడిన అనేకమంది మిత్రులంటే ఆయనకు అంతులేని అభిమానం. ఈ మనుషుల్లోని తడిని, వాళ్ల మీది ప్రేమని, వాళ్లులేని శూన్యాన్ని కొన్ని కవితలుగా ఆవిష్కరించాడు. “నారుమండే, కృష్ణమూర్తి-నిత్యస్ఫూర్తి, పలకరించే ప్రభాతం, త్రివేణి, గుడిసెకుప్పమీద జెండా” లాంటివి ఈకొవలోకి వస్తాయి. ప్రతికవి తన అమ్మకోసం ఒక్కకవిత అయినా రాయకుండా ఉండలేడు. అంజయ్య రాసిన స్మృతి కవిత్వంలో వాళ్ల అమ్మ గురించి రాసిన “ఇరాములేని రెక్కలు” గొప్ప కవిత. “పోసపోసను ఏరి పొతంచేసి పోయిమీద ఎసులవేస్తే/ ఇంటినిండా ఘుమఘుమలు గుబాళించేవి/ టమాటకూర చేస్తే సై చూసినవాళ్లు తునకలేవిరా అంటే/ ముసిముసినవ్వులు నవ్వేదానివి/.” అమ్మ గురించి ఒక కమ్మనైన పరిమళం ఈ కవిత. మిత్రుడు రాధాకృష్ణ కోసం పరితపించిన “మెత్తని మనసు” కవితలో రక్త సంబంధాన్ని మించిన ఆత్మీయ స్నేహాన్ని పొలమారుతాడు. “మిగిలిన ఒక్క సిగరెట్టును బుక్కబుక్కలుగా పంచుకొని ఒక్కతల్లిరొమ్ము తాగినట్టు తాగినం” ఎంత సొంతమనుకుంటే మిత్రుడికి అంత చను(వు)నిస్తాడో అర్థంచేసుకోవచ్చు. “మమ్మల్ని అందరినీవిడిచి మౌనంగా మట్టిదుప్పటి కప్పుకొని మగతనిద్రలోకి జారుకున్నవు” అంటూ మిత్రుడి సమాధి వద్ద పగిలిపొగిలి ఏడుస్తాడు. స్పందించే సున్నితత్వం, మనుషులతో అల్లుకుపోయే మానవత్వం, అందరూ నావారని తలచే సౌహార్ద్రత , గుండెలో ఆర్ద్రత ఈ స్మృతికవితల్లో అతన్ని పట్టిస్తాయి.
“కష్టజీవికి ఇరువైపులా ఉండేవాడే కవి” అని మహాకవి ఏనాడో చెప్పాడు, కానీ స్వార్థం, పేరుకోసం వెంపర్లాట, పదవులకోసం పాకులాట చాలామందిని ధిక్కారం వదిలేసి అధికారం పంచన చేరేలా చేసింది. అందుకే గొప్పకవిత్వం రాసేవాళ్ళందరూ గొప్పవ్యక్తులు కాలేరు. వ్యక్తిత్వం, కవిత్వం ఒకటే అయినవాళ్లు ఈరోజుల్లో అరుదు. తన సామాజిక బాధ్యతను వదిలేసి శాలువాల కింద, సన్మానాల మీద బ్రతికేవాళ్లను బరిబాత నిలబెడతాడు. “శభాష్ అంటే బండికమ్మి మీదేసుకున్నట్లు/ చప్పట్ల దుప్పట్లు కప్పుకొని కప్పలతక్కెడ అయిన కవనం/ గిచ్చన్న గిరిమల్లెలు బాతదాటి గీతదాటి/ పెద్ద గడిలో పీఠం ఏసుకుని పెడచూపులు చూస్తుంది”(గిట్లయితే ఎట్ల?) “ఈతాకిచ్చి తాటాకు గుంజేటోడ్ని తారీఫు చేసుకుంట తాళాలుకొడుతున్నరు” (ఇదీ సంగతి). స్మార్ట్ సిటీ నిర్మాణంలో ధ్వంసమైన గుడిసెలబాధను వర్ణిస్తూ “అక్కడ ఒక పంచర్ జోడాయించి గాలిపెట్టే మిషన్ ఉండేది /వచ్చిపోయే చక్రాలకు తనఊపిరి నింపి గమ్యాన్నిచేర్చేది/ జెసిబి ఇనుప కాళ్ళు ఒక్క తన్నుతన్నితే/ సుడిగాలిలో ఎగిరే తాటికమ్మలైన గుడిసెలు/ నోటికాడి బుక్కతీసి నందనవనాన్ని కలగంటున్న నగరం/”(కూలిన బతుకులు) అని వలపోతాడు. ఆధునికతవైపు అడుగులేస్తున్న దేశంలో పేద మూలవాసులను తొక్కుకుంటూ వెళ్తున్నామన్న సంగతిని చెప్పకనే చెబుతాడు.
ఏ కవిత్వానికైనా ఆత్మవంటిది భాష. అంజన్న తనఅమ్మనేర్పిన ఇంటిభాషను, దోస్తులు పంచుకున్న ఊరిభాషను మాత్రమే నమ్ముకున్నాడు. తెలంగాణ భాషలోని సౌందర్యం ఈపుస్తకం నిండా పరచుకుంది. “కప్పిచెప్పేది కవిత్వం” అన్నది ప్రతిసారి అన్వయించుకోవాల్సిన అవసరంలేదు. కవి తన భావోద్వేగాన్ని పాఠకునికి ఎంత ప్రభావవంతంగా చేరవేయగలిగాడు అన్నదే ఇక్కడప్రధానం. అంజన్న అర్థం అయ్యి కానటువంటి మోడర్న్ పోయెట్రీ, ఇంకా పాఠకుడిని అయోమయానికి గురిచేసే పోస్ట్ మోడర్న్ పోయెట్రీ జోలికి వెళ్లకుండా అచ్చమైన స్వచ్ఛమైన తన మట్టిభాషలో మాట్లాడుతూ చదువరిని తనతో చేయిపట్టి నడిపించుకు వెళతాడు. తన మస్తిష్కంలోని భావాలన్నీ పాఠకుని చూపుతో వెలిగించి అలైబలై తీసుకుంటడు. ప్రతి కవితలోను ఎత్తుగడ, ముగింపు మనల్ని ముగ్ధులను చేస్తాయి. ఆరెండిటిని సమన్వయంచేస్తూ కవిత్వదేహాన్ని శుద్ధవచనమై తేలిపోకుండా చాకచక్యంగా లయవిన్యాసంగా శబ్దాలంకారసోయగంగా నడపడం అతనినేర్పు.
పుస్తకాన్ని వదిలేసి ముఖపుస్తకాన్ని(FB) పట్టుకొని వేలాడుతున్న ఆధునిక పోకడలను, ముఖస్తుతికోసం కొట్టే లైకులు, పెట్టే కామెంట్లను చూస్తూ మురిసిపోయేవాళ్లకు సుతిమెత్తగా చురకలు పెడతాడు(పుట్టగొడుగులు). సంస్కరణల పేరుతో ప్రజాసంక్షేమాన్ని గాలికివదిలేసి, ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ అప్పనంగా కార్పొరేట్లకు కట్టబెడుతున్న దుర్మార్గాన్ని ఎండగడతాడు (చీకటి శిఖరాలు). వైయక్తిక జీవనశైలినికూడా ప్రభావితం చేస్తూ ఏమితినాలో ఏమితినకూడదో వారే నిర్ణయిస్తున్న తీరును కడిగిపారేస్తాడు. “ఎలుక ఎవరికో వాహనమని/ ఉడుత బుడుతా సాయమని/ పంది ఆది వరాహమనీ/ నా అన్నం గిన్నెను చిల్లం కల్లం చేస్తే/ నా బతుకు చుట్టూ బాకుల కంచెలు మొలిచినై”(కంచంచుట్టూ కంచెలు)
తెలంగాణ ఆవిర్భావంకోసం మనమంతా కలలు కన్నవాళ్లమే. కలాలు కదిలించినవాళ్ళమే. మలిదశ ఉద్యమ ప్రస్థానం, అమరవీరుల త్యాగం, రాష్ట్రఅవతరణ అంశాలుగా ఇందులో కొన్నికవితలు చోటుచేసుకున్నాయి (పంజరంలో నినదించిన పాట, మానేరు ముచ్చట్లు, ఆమె వస్తున్నది, కొత్త స్వరం). చరిత్రను రికార్డుచేసే పనిలో భాగంగా ఇవి చాలా అవసరమైన కవితలు. అలాగే సమకాలీన అంశాలన్నిటిపై తక్షణ స్పందనగా అనేక కవితలు ఉన్నాయి. వనరుల విధ్వంసం, రైతుల లాంగ్ మార్చ్, ఆదివాసీల సంస్కృతి, ఆర్టీసీ సమ్మె, శ్రీలంకలో తమిళ ఈలం పోరాటం కొన్ని ఉదాహరణలు మాత్రమే.
కొన్ని కవితల నిడివి మరీ ఎక్కువగా ఉండడం కాస్త శ్రద్ధపెట్టాల్సిన విషయం. అలాగే ప్రతీ సందర్భానికి ప్రతీకవి స్పందించాలని నియమం ఏమీలేకపోయినా దాదాపు రెండుసంవత్సరాలు ప్రపంచాన్ని అతలాకుతలంచేసి కోట్లాదిప్రాణాలను మింగేసిన కరోనా విలయతాండవం మీద ఒక్క కవిత అయినా ఇందులో లేకపోవడం చిన్నలోపంగా కాకపోయినా ఉండాల్సిన అంశంగా అనిపించింది.
తన మొదటి పుస్తకం విడుదలై 10 సంవత్సరాలు దాటినా ఇంత సుదీర్ఘ విరామంలో తనలోని కవిత్వ చెమ్మ ఇంకిపోకుండా తనను సాహిత్య ఉమ్మనీరులో ఆడించి కవిగా తన ఉనికిని అలాగే ఉండనిచ్చిన “ఎన్నిల ముచ్చట్లు” కార్యక్రమానికి ఎనలేని నెనర్లు ప్రకటిస్తాడు. ప్రముఖ కవి, విమర్శకులు పుప్పాల శ్రీరామ్ అన్నట్లు అంజయ్య మంచి చదువరి. చారిత్రక అవగాహన కలిగినవాడు. కవి వయసు అతని దృక్పథాన్ని పలుచన చేయలేదని ఆయన నిరూపించారు. శీర్షికల ఎంపిక, వైవిధ్య భరితమైన వస్తువుల ఎన్నిక, తనదైన ప్రత్యేక ప్రతీకాత్మక అభివ్యక్తి , ప్రాస లయతో కూడిన పదబంధాల నిర్మాణం , సామూహిక సామాజిక స్పృహ , ముక్కుసూటి తత్వం వెరసి కందుకూరి అంజయ్య జమిడిక కవిత్వం.
*
కవి స్వేచ్చని కట్టడి చేయడం కాని ముచ్చట
ఉత్తర తెలంగాణ కరీం నగర్ కు చెందిన కందుకూరి అంజయ్య 2013 లో కట్టెపల్క అనే కవితా సంపుటి వెలువరించాడు. మళ్ళీ ఇప్పుడు ‘జమిడిక’ అని మన ముందుకొస్తున్నాడు. సాహిత్యం సామాజిక ప్రయోజనాన్ని కలిగి ఉండాలన్న దృక్పధంతో రచనలు చేస్తున్న అంజయ్య తెలంగాణ రచయితల వేదిక జిల్లా అధ్యక్షునిగా ఉన్నారు. ఏప్రిల్ 14 న అంబేద్కర్ జయంతి నాడు ప్రముఖ కవి, కళారత్న డా. శిఖామణి చేతుల మీదుగా ఆవిష్కరణ జరుపుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీరామ్ పుప్పాల జరిపిన సంభాషణ….
1. కవిత్వమూ, వ్యాసమూ రెండు ప్రక్రియల్లో కృషి చేస్తున్న మీకు ఏదంటే ఎక్కువ ఇష్టం ?
— నాకు రెండు ప్రక్రియలపట్లా చాలా ఇష్టం ఉంది. రెండింటిని సమానంగా భావిస్తాను.
2. పదేళ్ళ విరామం తరువాత 63 ఏళ్ళ వయసులో రెండవ కవితా సంపుటి తేవాలని ఎందుకనిపించింది ?
— సృజనకూ వయసుకూ సంబంధంలేదు. శ్వాస ఉన్నంత కాలం, సృజనకారుడిగానే బత్కతా. ఈ విషయంలో శివారెడ్డి, ఎన్ గోపీ, సినారె, జూకంటి, నలిమెల లాంటివాళ్ళు నాకు ప్రేరణ. సృజనలో సామాజిక బాధ్యత తెలిసినవాళ్ళకు వయసు బట్టి విశ్రాంతి లేదు. కవి స్వేఛ్ఛకు వయసు లేదు. దాన్ని కట్టడి చేయడం సాధ్యం కాని ముచ్చట.
3. మీలోని సాహితీవేత్తను అత్యంత ప్రభావితం చేసినవారెవరు ?
— విరసం, జన నాట్యమండలి నన్ను అత్యంత ప్రభావితం చేసిన సంస్థలు. శ్రీశ్రీ, వివి, శివసాగర్, చెర కవిత్వాల్ని పరవశంతో చదువుకుంటాను.తెలంగాణ పలుకుబడి విషయంలో గద్దర్, గోరేటి వెంకన్న నాకు ఆదర్శంగా భావిస్తాను. గుడా అంజన్న, జయరాజ్ అంటే నాకు చాలా ఇష్టం.
4. తెలంగాణా ఉద్యమానంతరం వస్తున్న కవిత్వం పై తెరవే అధ్యక్షుడిగా మీ అభిప్రాయం ?
— ఉద్యమానంతరం ఒక స్తబ్దత ఏర్పడింది. వస్తువు కోసం కవులు వెతుకులాటకు గురయ్యారు. కానీ మళ్ళీ ఇప్పుడిప్పుడే తెలగాణ సమాజం తన ధిక్కార స్వరం వినిపిస్తోంది. ఆ తిరుగుబాటు లక్షణం ఈ నేల రక్తంలోనే ఉంది.
5. రెండు కవిత్వ పుస్తకాల మధ్య మీ కవిత్వం ఏ మార్పులకు గురైంది ?
— నేను HCU లో తెలుగు MA, MPhil చేసినవాణ్ణి. పిల్లలమర్రి రాములు, గాలి నాసర రెడ్డి లాంటి వారు మాకు కాలేజీలో సమకాలికులు. ప్రాచీన సాహిత్యం మొదలు అర్వాచీనం వరకూ నాకు తెలుగు కవిత్వమంటే ఎనలేని ప్రేమ ఉంది. అన్ని రకాల భావజాలాల్ని మనం అధ్యయనం చేయాలి. రూపసారాల దృష్ట్యా, సారమే రూపాన్ని నిర్ణయిస్తుంది నమ్ముతాను. ఆ మేరకు నా రచనల్లో సారం ఎప్పటికప్పుడు పరిణామం చెందిందని భావిస్తున్నాను.
6. మీది వస్తు ప్రాధాన్యత గల కవిత్వమా ? లేక అభివ్యక్తి కేంద్రకమా ?
— నా కవిత్వంలో నేను శిల్పసారాల సమ తూకం ఉందని భావిస్తాను.
*
సమీక్ష బాగుంది అంటే ప్రధానంగా అది ఆ పుస్తకం గొప్పతనం. అలాంటి కవిత్వాన్ని సృజించిన కందుకూరి అంజన్నకు, ప్రచురించి ప్రోత్సహించిన సారంగ బాధ్యులకు అనేక ధన్యవాదాలు
కందుకూరి అంజయ్య సార్ కవిత్వపు ఆత్మను అలవోకగా ఆవిష్కరించారు బసవేశ్వర్ సార్.. అవును.. జమిడిక నిండా అచ్చ తెలంగాణ భాషా పరిమళం గుప్పుమంటుంది.. మీ విశ్ళేషణలో పుస్తకంలో ని అనేక ఆంశాల మీద మీదైన కోణంలో కవి ఉద్దేశాన్ని చేరవేసారు. కవి కందుకూరి సార్ కు శుభాకాంక్షలు.. బసవేశ్వర్ గారికి, శ్రీరామ్ గారికి అభినందనలు!
చాలా చాలా కృతజ్ఞతలు మేడం. మీలాంటి వాళ్ళ ప్రోత్సాహం చాలా విలువైనది.
సమీక్ష బాగుంది బసవేశ్వర్ గారు. జమిడిక వాయిద్యాన్ని కవి తన కవిత్వానికి ప్రతీకగా ఎందుకు ఎంచుకున్నారో పాఠకులకు సమీక్షకులు అవగాహన కలిగించినట్లైతే మరింత బాగుండేది.
Tq విలాసాగరం గారూ. జమిడిక వాయిద్యం లోని నాదం అంజన్న కవిత్వం లో నినాదం అయిందని రాశాను. అదొక దళిత వర్గాల తరపున మోగే ధిక్కారం అనే అర్థం లో కూడా చెబితే బాగుండేది. మీ సూచనకు ధన్యవాదాలు
సమీక్ష బాగుంది. ముఖ్యంా కవిత్వం లో కవి ఎన్నుకున్న అంశాలు చాలా బలమైనవి. వివక్ష, శ్రమ, అమ్మతనపు కమ్మదనం, ప్రకృతి మొదలగు చక్కటి వస్తువులను కవి తనదైన శైలిలో చక్కగా చెప్పారు.
అన్నా నిజం చెప్పారు. కవిత్వం గొప్పగా ఉంటే సమీక్ష ఆటోమేటిక్ గా బాగుంటుంది. చాలా కృతజ్ఞతలు
మంచి.. సాహిత్య సమీక్షా పరిచయం సర్… కవిత్వం అంతా మనసు తడి లో నిండిపోతుంది.. జమిడిక కచ్చితంగా చదవాలనిపించింది..
ఇంటర్వ్యూ కూడా బావుంది
థాంక్యూ రా. నీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు
బసవేశ్వర్ గారు మీరు కవిగా, గాయకునిగా పదునుదేరి, ఇప్పుడు సమీక్షకులుగా కూడా బలమైన అడుగులు వేయడం బాగుంది. తెలంగాణ మట్టి పరిమళం అంజయ్య గారి కవిత్వాన్ని చక్కగా పరిచయం చేశారు… అభినందనలు
మీలాంటి అనుభవజ్ఞుల ప్రోత్సాహం చాలా కీలకం. ధన్యవాదాలు వెంకన్నా