భయ్యా రహ్మతుల్లా!
నిన్న మొన్ననే కదా గుర్తుకు చేసుకున్నం
ఆయనతో నాలుగు దశాబ్దుల కిందటి
అనుబంధాన్నీ అనుభూతుల్నీ
ఒక్కొక్కటిగా నెమరేసుకున్నం
తొందరగానే కలిసివొద్దామనీ అనుకున్నం కదా
నంబరు దొరికితే పలకరిద్దామనుకుంటే
సెల్లుఫోను వాడడం తెలువదు …..
తెలువదు కాదు …..
అటువంటి వేటిపట్లా తన ప్రపంచంతో
నిమిత్తం లేని
తన ప్రపంచం లోనికి అటువంటి వేటికీ
అనుమతి దొరకని
తనకే సొంతమైన మరో ప్రపంచ విహారి!
బషారత్ అలీ!
బషారత్ అలీ పోయినాడని!
సెప్టెంబరు ఏడు నాడు పోయినాడని!
నిన్న సందెపొద్దుకాడ నువ్వు పంపిన వార్తే!
రొండున్నర నెలలు
కేలెండరు పుటల నడుమ ఆవిరైపోయినై
ఈ వార్తని చేరుకోడానికి
బషారత్ సన్నిహిత మిత్రుడు
బా రహ్మతుల్లా
ఇప్పుడే వాట్సాపులో పెట్టినాడని
ఫోనులో చెప్పగానే
అలీ సహోద్యోగి
నా చిరకాల మిత్రుడు రాజేశ్వరశాస్త్రి
అలీకి గొప్ప ఆరాధకుడూ
తక్షణం ఆయన నోట వెలువడిన మాట
బషారత్ బాట ఆయన పోకడ ఆయనదే
మన మధ్యనే సాదాసీదాగా
తచ్చాడిన ఒక మహా యోగి
తన గమనంలో ఈ మజిలీ విడనాడినాడని
వొచ్చిన పని ముగించుకుని వెళ్ళిపోయినాడని
ఈ రాస్తున్న దానికి
ఇంతకన్నా చెల్లించుకోలేని
ఈ నాలుగక్షరాల నివాళికి
ఆత్మీయుడు శాస్త్రి మాటలు స్ఫూర్తి
మిత్రమా శాస్త్రీ! రహ్మతుల్లా మెసేజి పెట్టినడు
సెప్టెంబరు ఏడు నాడే పోయినాడని!
కేలెండరు పుటల నడుమ ఆవిరైపోయినై
మనం ఈ వార్తని చేరుకోడానికి
రహ్మత్ భయ్యా!
నిన్న మొన్ననే అనుకున్నాం కదా
ఇంటి అడ్రసు తెలువదు
హైదరాబాదు దారుల్ షఫాలో చాలా పెద్ద భవంతి
లంకంత ఇల్లు అదొక
రాజభవనం అన్నావు కదా
ఇల్లు మాత్రం గుర్తుపట్టగలనంటివి కదా
ఇంటికి పోయి కలిసి వొద్దామంటివి కదా
రొండున్నర నెలలు
కేలెండరు పుటల నడుమ ఆవిరైపోయినై
మనం ఈ వార్తని చేరుకోడానికి
‘శాస్రీ! ఎట్ లాస్ట్ ఐ హేవ్ మెట్
ఎ ఫ్రొఫెసర్ ఇన్ మై లైఫ్
ఆయనే శ్రీలక్ష్మణమూర్తి గారు’
అనే వాడట మిత్రుడు శాస్త్రితో పదేపదే
అనుకున్నది అనుకున్నట్లుగా
పచ్చిగా నిక్కచ్చిగా ప్రకటించగల నిర్భీతికి
ఎన్నెన్నో ఎనలేని నిలువుల సాక్ష్యం
‘జీవితమంతా ఒకటే ధ్యానం
ఛాయ్ పీతుం కాం కర్తుం‘
అనే వాడని రాసినావు కదా భయ్యా!
నేనూ అక్కడే మొదలు పెడుతున్న
నాలుగు దశాబ్దుల కిందట
సూర్యాపేటలో నల్లాలబావి కాడినుంచి
వేంకటేశ్వర కాలేజీ దాకా
అదే డొక్కు సైకిలు మీద
ముందు చూపే తప్ప
ఆపక్క ఈపక్క లోకాన్ని
వెంట్రుకంతైనా అంటాము కదా అట్లా
పట్టించుకోని ఒకటే పోకడ
కొన్నాళ్ళు ఒక బ్రౌను కలరు
మోపెడ్ బైకు మీద కూడ తిరిగినడు
ఆ సైకిలే నయం! ఇది అంతకన్నాడొక్కుది
కిరాయి కొంప!
అడుగు పెడితే దెయ్యం పట్టినట్లయ్యేది
నూటికి నూరుపాళ్ళు దెయ్యాల కొంపే!
అందులో పాడుబడ్డ కిరసనాయిలు స్టవ్వొకటి
నెత్తీరబోసుకున్న దెయ్యం లెక్కన
తాతలుతండ్రుల నాటి
నిండా మసిబారిన సట్టిగిన్నె
ముదాం ఛాయ్ కాగుతుండాలె
కాగిన ఛాయిపత్తా మార్చిన దాఖలాల
జ్ఞాపకాలైతే లేవు
అందువల్లనేనేమో ఆ ఛాయికి అంత రుచి
శ్మశానానికి పీనిగెను మోసుకుపొడానికా అన్నట్టు
ఆ దెయ్యాల కొంపల నులక మంచమొకటి
చొల్లు కార్చుకుంట నోటిల పానొకటి
అది చాలదన్నట్టు వేళ్ళ మధ్యన
గుప్పుగుప్పుమనుకుంట పొట్టి గణేష్ బీడీ
ముక్కున వేలేసుకున్నట్టు
తేలగిలపడ్డ మొహాలేసుకొని
ఏదో వింతను దేవులాడుకుంటున్నట్టు
గుడ్లప్పగించిన చూపులేసుకొని
చుట్టూర మూగిన దెయ్యాలకు
ఆ కుక్కిమంచంల కూసోని
ఏదో ఉపదేశమిస్తున్న కాటికాపరి వోలె
పూర్వీకులకన్నా పూర్వపు
తాళపత్ర గ్రంథాలను గుర్తుకు తెస్తూ
పట్టుకుంటే పుటపుటమని విరిగిపోయే పుటల
గ్రంథమొకటి ఒళ్ళోన పరుచుకొని పొద్దస్తమానం
డొక్కు సైకిలో డొక్కు మోపెడో
దెయ్యాలకొంపో కొంపలో దెయ్యాల మూకలో
బత్తీల స్టవ్వో తాతలనాటి సొట్లుబొయిన గిన్నో
పీనిగెల పానుపు నులకమంచమో
కాటికాపని మాయ ఉపదేశ ముల్లెలో
అతని ఆత్మఘోషల ప్రతిధ్వనుల ప్రతిబింబాలే
అతని మజిలీ ఊసుల తొక్కులాటల ప్రతిరూపాలే
దారుల్ షఫాలో చాలా పెద్ద భవంతి
అన్నావు కదా!
నాలుగు దశాబ్దుల కిందట
సూర్యాపేట వీధుల్లో డొక్కు సైకిలేసుకొని
జనసముద్రం మధ్యన
ఒంటరివాడై తిరిగాడిన మౌని బషారత్ అలీ
ఇదిగో! ఇప్పుడిట్లా కండ్లల్ల మెదులుతున్నడు
సూడోమోడర్న్ హిపోక్రసీకి
అనార్కిజం ఒక మాస్క్
అనార్కిస్టంటే అరాచకుడని కాదు
చీకటిబతుల లోకం ముసుగేసుకునే
రోత విలువల అక్కరలు లేని వాడని
ఒక కలేకూరి మళ్ళా పుడితేనే
మరో అనార్కిస్ట్ మళ్ళా పుట్టుక
ఒక బషారత్ మళ్ళా పుడితేనే
మరో కలేకూరి మళ్ళా పుట్టుక
నైతికాల గిరిగీతలకవతలి బతుకులటు
నైతికాల బేరల కివతలి బతుకులిటు
నీతివంతమటు నీతిబాహ్యమిటు
నైతికానైతిక అంతర్బాహరాల ఊసెరుగని
స్వేచ్చాంతరంగపు కొలతకు తూనికలుండవ్
నాగరీక లోకపు రీతులెరుగని
ఒక మొరటు మనిషికి దగ్గరైనడు
లోకాన్ని మభ్యపెట్టలేదు
ప్రేమను బాహాటంగ ప్రకటించుకున్నడు
బిడ్డను కన్నడు
ఊరు వాడ కలెతిరిగెటోడు చంకనేసుకొని
ఎత్తుకొని ముద్దాడుకుంటూ
కన్నీళ్ళు జలజల రాల్చెటోడు
అదొక నిర్వచనమెరుగని అలౌకికానందం
శృంగార అనుభవం సృష్టి ప్రసాదించిన
ఒక నిరుపమాన ఆనంద దాయినిగా
ఒక తపయోగ అనుభూతి స్వరూపినిగా
ఫలింప జేసుకోగలిగిన దార్శనికులెందరు!
ఎవరు నమ్ముతారు నువ్వొక జ్ఞానివని
నువ్వొక యోగివని మౌనివని
నడెండల బస్టాండు మూలన
నెత్తిమీద కొప్పెరవంటి చిన్న
గుడారమొకటి వేలాడకట్టుకొని
చింపురు బస్తొకటి నేలమీద పర్చుకొని
ఆరె ఒక పక్కన గూటమింకొక పక్క
నిగ్గు నింపిన ఎద్దుకొమ్మొక పక్క
ఇంకేవేవొ పనిముట్లు ముందేసుకొని
వచ్చేపోయే పాదాలు నీవేపే నడవాలని
కండ్ల నిండిన ఆశ దిగాలుపడి కూలబడితే
నువ్వొక బిక్కచచ్చి దిక్కుమాలిన
చెప్పులు కుట్టుకునే బికారి రూపు
మసకచీకట్లో ఊరవతల మర్రి కింద
బండ మీద చేతులు వెనక్కి వాల్చి
పొడుచుకొస్తున్న కండ్లప్పగించి కూలబడితే
నువ్వొక పసి పిల్లలు పక్కలు తడిపే
భయానకమైన పిచ్చివాని రూపు
ఎవరు నమ్ముతారు
తాత్వికతకు నువ్వొక పర్యాయ రూపమని
*
బైరెడ్డి గారి యోగి ఒక పద చిత్రం. నాకు బషా శరత్ తో పెనవేసు కున్న 5 సంవత్సరాల అనుబంధం, ఆ కర్మయోగి జీవన పథం కళ్ళముందు కనిపించి కదిలించాయి. ఆ సరస్వతి పుత్రుడి యదార్థ జీవన యానాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన కవికి కృతజ్ఞతలు.
అలీ నీవు లేవు కానీ ఈ కవితలో నీవు శాశ్వతంగా ఉంటావు. మిత్రుడు బశార త్ ఇక లేదు అనే వార్త వే దనను పెంచింది.అయన మౌనాన్ని జీవితాన్ని వ్యాఖ్యానించిన ఈ కవి గళం కళ్ళలో జ్ఞపకాల వర్షం కురిపించింది.
కవికి, సారంగకు ధన్యవాదాలు. ఇది అక్షర సుమాంజలి.ఆ యోగికి మా వినమ్ర శ్రద్ధాంజలి.
బాగుంది సార్