ఒక “యువక”వి అంటరాని ప్రేమ

కలేకూరి ప్రసాద్ రాక-పోక మారుత సమానం. కొందరి పాలిట స్వల్పం. మరికొందరి పాలిట అనల్పం- అపూర్వం.

లేకూరి ప్రసాద్ అలియాస్ యువక

తెగిపడ్డ నాలుకల కూడిక

ఖండిత బొటిమన వేళ్ళ పచ్చినెత్తుటి చారిక

ఛండాలుని మెడకి వేలాడేసిన ఉమ్మిముంత పోలిక

చిట్టచివరి మనిషి నడుముకి కట్టిన తాటాకుల తిరుగుబాటుకి ప్రతీక

 

కలేకూరి ప్రసాద్ అలియాస్ యువక

పొలికేక సృష్టించిన మంటల పతాక

తూరుపు కొండల కోనల్లో విరిసిన నీలివర్ణ కాలరేక

నిదుర ఎరుగని కనులు నిత్యపాఠంగా స్మరించే యుద్ధగీతిక

మండే గుండెలు దట్టించిన మాటలు అనేకానేక

 

కలేకూరి ప్రసాద్ అలియాస్ యువక

డప్పుల దండుల లయగా మారిన గొంతుక

చిందేస్తున్న దళితదళం అవతారిక

వెలి బతుకుల కంటతడిని తుడిచే బాలీయమైన పూనిక

కంటక పథాన సాగిన నిరవధిక నడక…

***

“కలేకూరి ప్రసాద్ లేదా “యువక” అన్న పేరులో విద్యుత్ ప్రవాహం ఉండేది. తను మన మధ్య వున్నప్పుడు ఆ ప్రకంపన చాలా మందికి అనుభవమే. ఆ పేరు వింటే హైవోల్టేజ్ షాక్ తగిలినట్టు ఉలిక్కిపడేవారు కొందరు. అది నచ్చని వారి వ్యవహారం. నచ్చిన వారికి మాత్రం అంతరంగం అంతటా మిరుమిట్లు గొలిపే గొప్ప కాంతి!

అవును- పెనుమంటల జాతర అలానే వుంటుంది.

గాయపడ్డ పల్లెల ఊరేగింపు ముట్టడిస్తే అలానే వుంటుంది.

పరపరమని పళ్ళు నూరగల కసి వుంటే అలానే వుంటుంది.

వివక్షలపర్వాన్ని నిరసించే కవాతు అలానే వుంటుంది.

ధిక్కారగీతాలతో సమాజ రుగ్మతకు చికిత్స చేసే విధానం అలాగే వుంటుంది.

కలేకూరి ప్రసాద్ ప్రతి మాటలో, ప్రతి చేతలో, ప్రతి అక్షరంలో, ప్రతి పదంలో అదే దీక్ష.. అదే పంధా.. అదే పదును.. అదే ప్రస్థానం..

***

కలేకూరి ప్రసాద్ రాకపోక మారుత సమానం. కొందరి పాలిట స్వల్పం. మరికొందరి పాలిట అనల్పం- అపూర్వం. ఒక్క కరచాలనంతో అపరిచితత్వాన్ని ఇట్టే తుడిచేసేవాడు. “ఒరేయ్” అని మాట కలిపి ఆప్యాయంగా తన మందిలోకి కలిపేసుకునేవాడు. 1990లకి కొంచం వెనుకా-ముందూ తెలుగు సాహిత్యలోకంలో… ముఖ్యంగా విప్లవ శిబిరం నుంచి ఊర్రూతలూపిన పేర్లలో “యువక” ఒక కొత్త సంచలనం. నూత్న కంఠస్వరం. తొలుత విప్లవోద్యమంలోకి అడుగిడి అక్కడ ఇమడలేక సంఘర్షణకు గురై… కులం ప్రశ్నకు శిలువపడి, ఆ ప్రశ్నకు జవాబు వెతికే క్రమంలో తనువునీ, మనసునీ, ఆలోచనల్నీ, ఆచరణనీ అణువణువు దళితీకరించుకుని నీలికాంతుల నక్షత్రమయ్యాడు.

1995 ప్రాంతంలో హైదరాబాద్ లో మాదొక సంత. వార్త దినపత్రికలో మేము పనిచేస్తున్నప్పుడు కవులకు సత్రంలా వుండేది మా విడిది. కవిబైరాగుల రాకపోకల సందడే మాకు అన్నపానీయాలు ఆ రోజుల్లో. ఎప్పుడు ఎలా కలిశాడో గుర్తులేదు కానీ, మా దరికి చేరిపోయాడు ప్రసాద్ ఇష్టంగా! కొన్ని నెలలపాటు మాతోనే బస. ఆటా- మాటా- పాటల సునామీలో కొట్టుకుపోయాం. ఊపిరి నిండా కవిత్వ పరీమళమే! మాపట్ల అపరిమిత అభిమానాన్ని ప్రదర్శించాడు. అనుకోని పరిస్థితుల్లో మా గూటి పక్షులం చెల్లాచెదురయ్యే వరకూ అక్కడే వున్నాడు. వున్నంతకాలం కలేకూరి రచనలను మేం తలకెత్తుకున్నాం. ఆనాటి రోజుల్లో ప్రసాద్ మాటల్లో పదును, పాటల్లో జలపాతం, ఆ జలపాతాలు సృష్టించే ఉద్యమ విద్యుత్ తరంగాలు, వాటిల్లో తన ముద్రలు మాలో ఇప్పటికీ పదిలం- పదిలం- పదిలం!

ఆల్టర్నేటివ్ అన్నమాటకి సంతకంలా వుండేవాడు కలేకూరి. తనకి కొన్ని బలీయమైన ఇష్టాలున్నాయి. పత్రికలైనా, రాజకీయాలైనా ప్రత్యామ్యాయమే తనకిష్టం. దళిత బహుజనుల వూరేగింపుతో కలిసి నడవటమే తనకిష్టం. ప్రతీ క్షణాన్ని పదునెక్కించే ఆలోచనాపరుల సావాసమే తనకిష్టం.

విప్లవ శిబిరానికి దూరం జరిగాక, అట్టడుగు సమూహాల బాధల పాటల పల్లవిగా మారాడు. శివసాగర్ అలియాస్ సత్యమూర్తి అంటే అపార గౌరవం. ఏకలవ్య పత్రికలో రచనలు చేశాడు. ఆ తర్వాత జె.గౌతమ్ ప్రధాన సంపాదకుడిగా శోభాభట్, నేను సహ సంపాదకులుగా వెలువరించిన “మహాబోధి”కి ముఖపత్ర కథనాలు రాశాడు. చిలకలూరిపేట బస్సుదగ్ధం కేసులో ముద్దాయిలైన చలపతి, విజయవర్ధనరావులకు పడిన ఉరిశిక్షలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో గళమెత్తాడు. తర్వాతి రోజుల్లో పల్నాటి శ్రీరాములు వెలువరించిన “బహుజన కెరటాలు” పత్రికకి రచనా సహకారం అందించాడు. ఎక్కడ వున్నా, ఎలా వున్నా తటిల్లతల్లాంటి తన వాక్యాలతో మెరుపులు మెరిపించాడు. అస్తిత్వ ఉద్యమాలు బలపడాలని కోరుకున్నాడు. వర్గీకరణ కోసం జరిగిన పోరుని సమర్ధించాడు. ప్రత్యేక తెలంగాణ గానాన్ని స్వాగతించాడు.

స్వభావరీత్యా కలేకూరి ప్రసాద్ అరాచకంగా కనిపించేవాడు గానీ,

అతని దృష్టిపధం సుస్పష్టం, స్థిరం.

ప్రసాద్ నడతలో అరాచకత్వం పాలు కనిపించేది గానీ,

అతని రాజకీయ దృక్పధం సుస్పష్టం, స్థిరం.

***

కలేకూరి ప్రసాద్ ఒక్కడు కాదు, అనేకుడు. కవిత్వం అతనే. ప్రవహించే పాట అతనే. నడిపించే ఉద్యమం అతనే. అనువాద రచనల సంబురం అతనే. ఎగరేసిన ఆత్మగౌరవ పోరాట కేతనం అతనే. ప్రసాద్ చేసిన అసంఖ్యాక రచనలు సంపుటాలుగా రావాలి. అక్కడక్కడ మిత్రులు కొన్ని ప్రయత్నాలు చేశారు. కానీ ఒక క్రమ పద్ధతిలో ప్రసాద్ రచనల కూర్పు జరిగితే తన ఆశల్లో, తన ఆకాంక్షల్లో ఎంతటి ఉక్కుసంకల్పం దాగివుందో బోధపడుతుంది.

నిరసనని జీవితంగా మార్చుకున్నవాడు ప్రసాద్. అదే నిరసనతో తన నిష్క్రమణ గీతాన్ని కూడా రాసుకున్నాడు. అప్పటికి కొన్నేళ్ళ ముందునించే భౌతికంగా క్షీణించాడు. ఒకానొక సందర్భంలో బస్ స్టాండ్లో అనామకుడిగా పడివున్న కలేకూరిని వేముల ఎల్లయ్య కాపాడుకున్నాడు. తన ఇంటికి తీసుకెళ్లి ప్రసాద్ ఆరోగ్యం కుదుటపడే వరకూ కంటికి రెప్పలా చూసుకున్నాడు. ఒకరకంగా అది కలేకూరికి మరోజన్మ.

కడగొట్టు జనాల కన్నీళ్ల జడివాన కలేకూరి. బలిపీఠాలెక్కిన వెలివాడల వెక్కిళ్లు కలేకూరి. కులోన్మాదంపైకి దండెత్తిన పిడికిళ్ళ దండోరా కలేకూరి. వెలివేత అనే అవమానం, అంతరానితనం అనే దుర్మార్గం ఎంత మానసిక క్షోభకి గురిచేస్తాయో అనుభవించిన వాళ్లకే తెలుస్తాయి. అందుకే ఆ బాధలగాధకి కలేకూరి పర్యాయపదంగా మారాడు. గాయపడ్డ దళితపల్లెలను ఆవాహన చేసుకున్నాడు. తనని తాను కారంచేడుగా, చుండూరుగా, నీరుకొండగా… కడకి లక్షింపేటగా మార్చుకున్నాడు. రగిలిరగిలి రగిలిపోయాడు. తన రాతలతో మనల్ని రగిలించాడు. కలేకూరి మనపక్కన ఉంటే రాక్షసబొగ్గుల కుంపటి పక్కన వున్నట్టే లెక్క!

***

హైదరాబాద్ లో మా కవులసత్రంలో కలేకూరి వున్నప్పుడు, నామాడి శ్రీధర్, నేను, ఎమ్మెస్ నాయుడు, పెద్ది రామారావు, తల్లావజ్జుల శశి సహా అక్కడ నిత్యం కొలువున్న అనంతు, సిద్ధార్థ, శ్రీవత్స, సత్యశ్రీనివాస్ లతోపాటు ఇంకా అనేకమంది గుంపులు గుంపులుగా వాలేవారు. ఆడీపాడేవారు. అక్కడ ఎందరున్నా శ్రీధర్ అంటే కలేకూరికి పిచ్చి అభిమానం. తనపట్ల, తన అక్షరాల పట్ల ప్రసాద్ ఎంతో ఆపేక్ష చూపేవాడు. ప్రతి పనిలో శ్రీధర్ చూపే నిబద్దతని, నిమగ్నతని ప్రేమించేవాడు. శ్రీధర్ ఒక మాట చెబితే ప్రసాద్ కి అది ఒక కట్టు. జవదాటేవాడు కాదు. శ్రీధర్ కూడా ప్రసాద్ అంటే అంతే ప్రాణం పెట్టేవాడు. ప్రసాద్ పరోక్షంలో కూడా తనని ఎవరైనా పల్లెత్తు మాట అన్నా భరించేవాడు కాదు. ఆ రోజుల్లో శ్రీధర్ వార్త దినపత్రికలో “సృష్టి” సాహిత్యపేజీకి బాధ్యుడిగా వున్నాడు. కలేకూరి రచనని అచ్చేసిన సందర్భంగా వివాదం తలెత్తితే శ్రీధర్ రాజీపడలేదు. తన ఉద్యోగానికే రాజీనామా చేశాడు. అదీ ప్రసాద్ పట్ల శ్రీధర్ కి ఉన్న రెస్పెక్ట్ కి గుర్తు. అంతా ప్రాణప్రదం కనుకే ఇదిగో ఇప్పటివరకూ ఒక గుచ్ఛంగా కూడుకోక.. చెల్లాచెదురుగా వున్న కలేకూరి కవితల్ని ఒక పరిశోధకుడి మాదిరిగా ఏరికూర్చి.. రేయింబవళ్లు శ్రమించి సంపుటీకరించాడు శ్రీధర్. గంటల తరబడి కూర్చుని పనిచేయటం వల్ల ఒక దశలో ఆరోగ్యం పాడైనా లెక్కచేయలేదు. కంకణబద్దుడై ఒక దీక్షలా ఈ పనిని పూర్తిచేశాడు. కంచికచెర్లలో మొదలయ్యి చురచురమని మండే కాగడాలా మారిన కలేకూరిని “అంటరాని ప్రేమ” అనే సంపుటిగా మార్చి మనకు అందించాడు.

రండి- హత్తుకుందాం!

ప్రేమారా గుండెలకెత్తుకుందాం!

మనలోకి మరోసారి కలేకూరిని రంగరించుకుందాం!

*

 

ఒమ్మి రమేష్ బాబు

13 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • లాల్ సలామ్ !అనాలని పించింది. అతని, గురించి, అంతగా తెలియదు,, కాని, ఈ రచన ద్వారా, ఎంత గొప్ప పర్సన్ అనిపించింది, నాకు..

  • కలేకూరి ఒక రగులుతున్న స్వప్నం. అద్భుతంగా ఆవిష్కరించారు రమేష్ బాబు గారు

  • థ్యాంక్యూ రమేష్ గారు
    కొంత మా అజ్ఞానాన్ని సవరించినందుకు
    కొత్త వెలుగును చూపినందుకు

  • బావుంది.. నిజాయితీ తో కూడిన మాటల అల్లిక. ప్రేమాస్పద కరచాలనాల జోడుగా..

  • చాలా టచీగా రాశావు ఒమ్మీ .. ఎదుటి మనిషి బలాలతో పాటూ బలహీనతలను సైతం ప్రేమించే నీ లాంటి మిత్రుడు దొరకడం మా అదృష్టం .

    • కలేకూరి గురించి చాల ఆత్మీయంగా ఆవిష్కరించావు రమేష్. గొప్ప జ్ఞాపకాల ఊట.

  • ఇప్పటివరకూ ఒక గుచ్ఛంగా కూడుకోక . . . చెల్లాచెదురుగా పడి వున్న కలేకూరి కవితల్ని రేయింబవళ్లు శ్రమించి ( ఒక దశలో ఆరోగ్యం పాడైనా లెక్కచేయక ) ప్రాణప్రదంగా ఏరికూర్చి.. “అంటరాని ప్రేమ” గా సంపుటీకరించిన నామాడి శ్రీధర్ కి హృదయపూర్వక కృతజ్నతలు అని పొడిమాటల్లో ఎలా చెప్పను.

    కలేకూరి ని ఆవిష్కరిస్తున్న / ఆవాహనం చేస్తున్న ఒమ్మి రమేష్ బాబు గారికీ ( మా సజయక్క గారి ఒమ్మి రమేష్ బాబుకి ) ఏవీ చెప్పను.

    ఆత్మగౌరవ పోరాట కేతనం కలేకూరి అన్నా! అస్తిత్వ ఉద్యమాలకు అండగా, సమాజ రుగ్మతకు చికిత్స కొనసాగించకుండా నీలికాంతుల నక్షత్రం ఎందుకయ్యావ్ ? పోరుబాటలోకి, క్రాంతి పధంలోకి అడుగిడినవాడికి తన జీవితంపై తనకు హక్కు ఉండదు, అది మందికే అంకితం అని తెలిసీ ఎందుకిలా చేసావ్ అడగాలని ఉన్నా అదీ చెయ్యలేను.

    ~ ఇట్లు ఓ తప్పుచెయ్యని, లేదా చేస్తున్న దోషి

  • కలేకూరి ప్రసాద్ కవితల సంకలనం ” అంటరాని ప్రేమ ” పుస్తకం నవోదయ బుక్ హౌస్, కాచీగూడా వారి వద్ద లభ్యం.

    https://www.telugubooks.in/collections/telugubooks-new-releases/products/antarani-prema

    ” అంటరాని ప్రేమ ” పుస్తకం కాపీల కోసం కానీ, కలేకూరి గురించిన మరేవైనా వివరాల కోసం కానీ నామాడి శ్రీధర్ గారిని పలకరించవచ్చు ( Mobile No : 093 96 80 70 70 )

  • ” పిడికెడు ఆత్మ గౌరవం కోసం ” ~ కలేకూరి కవిత

    నాకు జాలి జాలి మాటలొద్దు కన్నీటి మూటలొద్దు
    నేను బాదితున్ని కాను అమరుణ్ణి
    ఎగిరే ధిక్కార పతాకాన్ని
    నాకోసం కన్నీరు కార్చకండి – మీకు చాతనైతే
    నగరం నడిబొడ్డున ఖననం చేయండి
    జీవన రవళిని వినిపించే వెదురు వనాన్నై వికసిస్తాను
    నా శవాన్ని ఈ దేశం ముఖచిత్రంగా ముద్రించండి
    చరిత్ర పుటల్లోకి సుందర భవిష్యత్తునై పరివ్యాప్తిస్తాను

  • “ఒక నిజాయితి గల వ్యక్తి తనను తాను అంతం చేసుకోవడానికి, ఒక్క నమ్మకం వమ్ము అయితే చాలు, కానీ కలేకూరి ప్రసాద్ కు తను నమ్మిన మూడు నమ్మకాలూ వమ్ము అయినాయి. ఒకటి, విప్లవకారులుగా చెలామణి అవుతున్న నిజాయితీ లేని నకిలీలు. రెండు ప్రేమికురాలు. మూడు, నిజాయితిలేని దళిత నాయకత్వం.”

    ~ కలేకూరితో పరిచయం ఉన్న బత్తుల కార్తీక్ నవయన్ రాసిన నివాళి వ్యాసం నుండి.

    కలేకూరి గురించిన మరిన్ని వివరాలు, ఆ వ్యాసం మీద జరిగిన వాగ్వివాదాలు : మెహర్ సంపాదకత్వం లో వచ్చిన కినిగె అంతర్జాల పత్రిక లోని వ్యాసం ” ద పాషన్ ఆఫ్ కలేకూరి ప్రసాద్ ” (దళిత్కెమెరా వీడియోల సమీక్ష)

    http://patrika.kinige.com/?p=5138

  • కలేకూరిగారి గురించి చదివితే ఒళ్ళు గగుర్పొడిచింది. ఆయన కవిత్వాన్ని సంపుటీకరించిన శ్రీధర్ గారికి వారి పరిచయాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన రమేష్ బాబుగారికి అభినందనలు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు