మహేంద్ర మధురాంతకం రాజారాం గారి రెండవ కుమారుడు. తన 39 ఏండ్ల జీవితంలోనే గొప్ప రచనలు చేసి, ఎప్పుడో కొన్ని వందల ఏండ్లకు ఒక సారి, అత్యంత కాంతి తో కొద్ది కాలం మాత్రమే తళుక్కుమని మెరిసి మాయమయ్యే తోక చుక్కలా అదృశ్యమయ్యాడు.
మహేంద్ర రచనలు చదివి ఆనందించని వాళ్ళు అరుదే. మరి అలాంటి రచనలు మహేంద్ర ఎలా చేయగలిగాడు అని తెలుసుకోవాలంటే, మహేంద్ర గురించి, అతడు బ్రతికిన ప్రదేశాల గురించి, అతడు చూసిన జనాల గురించి తెలియాలి. ఆ నేపథ్యం తెలిసి మహేంద్ర రచనలు చదివితే, అతని రచనల లోని మాధుర్యం మరింత ఆస్వాదించవచ్చు.
మధురాంతకం రాజారాం గారు పుట్టింది, పెరిగింది రమణయ్యగారి పల్లె లో. అది చిత్తూరు లో ఒక పాతిక ఇళ్ళు ఉన్న కుగ్రామం. ఆయన ఎలిమెంటరీ స్కూల్ టీచర్, హెడ్ మాస్టర్ గా తమ వూరు దగ్గరనే ఉన్న దామల చెరువు లో చాలా రోజులు పని చేసారు. అక్కడే వారు ఇల్లు కూడా కొన్నారు. మహేంద్ర బడి చదువులు ఇక్కడే జరిగాయి.
రాజారాం గారికి తరువాత తిరుపతి దగ్గరున్న కొట్టాల గ్రామానికి బదిలీ కావడంతో, అక్కడ నివాసం ఉన్నారు. అప్పటికి పిల్లలు కాలేజి చదువులకు రావడంతో ఆ మార్పు సరిపోయింది. మహేంద్ర ట్రెయిన్, బస్సు పట్టి కాలేజి చదువులకు తిరుపతి పోయి రావడం జరిగేది.
మహేంద్ర నివసించిన ఆ తిరుపతి సమీప ప్రదేశాలను తొండనాడు అనేవారు. చెన్నై ఉత్తరం నుంచి నెల్లూరు దక్షిణం వరకు వ్యాపించిన తొండనాడు ను ఏలిన రాజులు చాల చెరువులు త్రవ్వారు. క్రీ.శ. నాలుగవ శతాబ్దం సంగముల నాటి సాహిత్య చరిత్రల లోనే, ఈ చెరువుల ప్రస్తావన కనిపిస్తుంది. అక్కడ ఉన్న గుట్టలు, కొండలు, వాటి మీద వర్షా కాలంలో ప్రవహించే వంకలు, వాగుల నీరు ఈ చెరువులలో చేరి ఆ చుట్టు పక్కల పల్లెల భూములన్నీ సస్యశ్యామలం చేసేసాయి. నీటి సాగుకు చెరువు నీటితో బాటు, త్రవ్విన బావులలో కూడా నీరు ఎప్పుడూ సంవృద్ధిగా ఉండేది. వరి, చెరుకు, మిట్ట ప్రాంతంలో వేరుశనగ పంటలు బాగా పండేవి. కొబ్బరి, తాటి చెట్లు, మామిడి తోపులతో భూలోక స్వర్గం లాగా ఉండేది. పచ్చదనం, పాడి పంటలలో నదీ ప్రాంతాలైన కోన సీమకు దీటుగా ఉండేది తొండనాడు.
కానీ, 1960, 70 దశకాలలో, ఈ ప్రాంతాలలో మార్పులు రావడం మొదలెట్టాయి. ఇష్టమొచ్చినట్లు ఇండ్లు కట్టడం, కొండలు తవ్వడం, అక్కడి చెట్లు కొట్టేయడం వల్ల చెరువులు నిండడం మానేశాయి. ఎండిన చెరువులు అక్రమంగా ఇండ్లు కట్టుకోవడానికి అమ్ముడు పోయాయి. వ్యవసాయం, ఇతర పనులు చేసుకుంటున్న గ్రామ ప్రజలు కొత్త జీవనోపాదుల కోసం తిరుపతి, చిత్తూరు, చెన్నై లాంటి పట్టణాలు చేరడం మొదలయ్యింది. అలా వలస పోక గ్రామాలలోనే ఉన్నవారు పలుచ బడుతున్న అడవులలో పడి అక్కడి సంపదను సంగ్రహించి అమ్మడం మొదలయ్యింది.
మహేంద్ర నివసించిన ప్రాంతాలలో రైలు ఒక ముఖ్యమైన ప్రయాణ సౌకర్యం. వ్యవస్థలో ఇలా మరింత దిగజారిపోతున్న జనం బ్రతకడానికి చేసే దిన ప్రయాణాలు అక్కడి అప్పటి మీటర్ గేజ్ ట్రెయిన్ ల మీద జరిగేది. దామల చెరువు, కొట్టాల స్టేషన్ ల నుండి తరచూ ప్రయాణం చేసే మహేంద్రకు ఈ బడుగు వర్గం రైళ్ల లోను, ఈ స్టేషన్ లలో నూ తటస్థ పడే వారు.
రాజారాం గారి ఇల్లు సృజనాత్మక ఉన్న వారికందరికీ ఒక పాఠశాల, సాహితీ గోష్టులకు విడిది. సాహిత్యంలో అప్పటికే లబ్ద ప్రతిష్టలు, వర్థమాన రచయితలు రాజారాం గారింటికి వెళ్లి ఆయనతో గంటల తరబడి సాహిత్య చర్చ చేసి, చాల సార్లు వాళ్లింట్లోనే ఉండి వారి ఆతిధ్యం స్వీకరించడం మామూలు. అలాంటి వాతావరణం లో పెరగడం వారి పెద్దబ్బాయి నరేంద్ర, మహేంద్ర గొప్ప రచయితలు కావడానికి తప్పక స్ఫూర్తి, దోహదం చేసి ఉండాలి. రాజారాం గారికి పిల్లలంటే ఇష్టం. పిల్లలను సాయంత్రం షికారు కని అక్కడి కొండల దగ్గరికి, సెలయేటి దగ్గరికి వెళ్ళడం సరదా. అలానే భోజనం తరువాత తన చుట్టూ చేరిన పిల్లలకు కథలు చెప్పడం కూడా సరదా. అప్పుడప్పుడు ఛందస్సులో పద్యాలు వ్రాయమనే వారు. ఆయన చుట్టూ పెరిగిన పిల్లలలో సాహిత్యాభిలాష కూడా అబ్బడంలో అబ్బురమేమి లేదు. మహేంద్ర కు కూడా పదాల మీద పట్టు అలాగే వచ్చు ఉండాలి.
చిన్నప్పటి నుంచే కాగితం కలం ఉంటే మహి కి కాలం తెలిసేది కాదు. రచనలలో బాటు, తరచూ అందమైన బొమ్మలు వేసేవాడు. పెద్దగా ప్రయత్నం చేయలేదు కానీ చిత్రకళ మీద కృషి చేసి ఉంటే, మహేంద్ర ఒక గొప్ప చిత్ర కళా కారుడు కూడా అయ్యి ఉండే వాడు.
చదువులో ఫిజిక్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అయ్యినా, గ్రామీణ బ్యాంక్ లో ఉద్యోగంలో చేరిన తరువాత ఫిలాసఫీ లో కూడా ప్రైవేటు గా పరీక్షకు డబ్బులు కట్టి పోస్ట్ గ్రాడ్యుయేట్ అయ్యాడు. అలా తన ఆలోచన పరిధిని విస్తరించకోవడానికి మహేంద్ర ప్రయత్నించడం, అతనిని గురించి తెలిసిన వారికి ఆశ్చర్యమేమీ కలిగించదు.
మహేంద్ర తన ఇరవై ఏళ్ల సాహిత్య ప్రయాణంలో 14 కథలు, ఒక నవలిక వ్రాసారు. కథల సంకలనం ‘కనిపించని కోయిల’ అతడు కనిపించడం మానేసిన తరువాతనే ప్రచురణకు నోచుకుంది. వ్రాసింది 14 కథలే అయినా వందేళ్ల తెలుగు కథలు సంకలనంలో మహేంద్ర కథలలో ఒక దానికి చోటు దొరికింది. అలానే గొప్ప కథలు వెదికి కథల పుస్తకాలు ప్రచురించే సంకలన కర్తలు, మహేంద్ర కథలు ఎన్నుకోవడం జరిగింది. మహేంద్ర వ్రాసిన ‘ బేసిన్ బ్రిడ్జి దగ్గర ‘, ‘ హొగినేకల్ ‘ , ‘ జర్తే ‘ కథలు ఇలాంటి సంకనాలలో తరచూ చూస్తుంటాము.
అలానే మహేంద్ర నవల ‘ స్వర్ణ సీమ కు స్వాగతం ,’ మొదట చదివిన పత్రిక సంపాదక వర్గానే కాక పాఠకులను కూడా ఒక ఊపు వూపింది. మహేంద్ర తను బ్రతికి ఉండగానే ప్రచురించి విడుదల చేసుకున్న ఒకే ఒక పుస్తకం ఈ నవల. తరువాత ఈ రచనను, నేషనల్ బుక్ ట్రస్ట్ ఉత్కృష్ట తెలుగు నవలగా ఎన్నుకొని అన్నీ భాషలలోకి అనువదించి విడుదల చేసిన అరుదైన గుర్తింపు కూడా మహేంద్రకు ఈ లోకం వీడిపోయిన తరువాతే దక్కింది.
నలభై కూడా నిండకుండానే, భగవంతుడు తన దగ్గరకు తెప్పించుకున్న మహేంద్ర వదిలేసిన వెళ్లిన అనేక కాగితాల నుంచి సేకరించిన కవితలు, వ్రాతలు, చిత్రాల తో, విడుదలైన చివరి పుస్తకం ‘ పర్వవేలా తరంగాలు’ .
ప్రస్తుత విశ్లేషణ మహేంద్ర కథలకు మాత్రం పరిమితం చేస్తే, ఆయన గొప్ప కథలుగా వ్రాయడానికి ఆయన జీవిత నేపథ్యం ఎలా సహకరించిందో అర్థం అవ్వుతుంది. కథా వస్తువు జీవితంలోనే దొరుకుతుంది. అలా తీసుకున్నప్పుడే చేసిన రచనలు పాఠకుల హృదయాలు కదిలిస్తాయి, హత్తుకు పోతాయి. మహేంద్ర రచనలలో అవి పుష్కలంగా కనిపిస్తాయి.
మహేంద్ర రచనలలో కొన్ని కథా వస్తువులు తరచూ చూస్తూ ఉంటాం. దానిని బట్టి మహేంద్రని కదిలించిన విషయాలపై మనకు ఒక అవగాహన వస్తుంది. మహేంద్ర కథలు వర్గీకరించ ప్రయత్నిస్తే … మానవ అసమానతలు మీద ఐదు కథలు తటస్థపడతాయి.
జర్తే
అతడి పేరు మనిషి
ప్రతిజ్ఞ
కుక్క చావు
ఇంధనం
అప్పు చేయడంలో ఈతిబాధలు, వ్యవస్థ లో లోటుపాట్లు రెండు కథలలో కనిపిస్తాయి.
పాడి ఆవు
వ్రతం
అస్తిత్వం మీద గొప్ప కథ
హోగినేకల్
పర్యావరణం, కాలుష్యం మీద తెలుగులో అతి తక్కువ రచనలు ఉన్నాయి. మహి అందులో మార్గ దర్శకుడు, ట్రెయిల్ బ్లేజర్ అని చెప్పవచ్చు. అలాంటి కథలు రెండు –
బేసిన్ బ్రిడ్జి దగ్గర
ముసలమ్మ మరణం
సార్వజననీయం అయ్యిన జీవితానుభూతుల పుట్టలు మిగిలిన ఈ నాలుగు కథలు. ఇందులో మొదటి రెండు కథలలో నవ యవ్వనం లో తటస్థ పడే ప్రేమావేదనలు అందులోని మాధుర్యం(రొమాంటిజం) కనిపిస్తాయి.
కనిపించని కోయిల
ఒక పగటి వేల ఇరానీ హోటల్లో
ఈత
గౌళి
మహి తన కొద్ది కాలంలో వ్రాసిన కొద్ది కథలలో తరచూ కనిపించే విషయాలు, బడుగు జీవితాలు, వారి సమస్యలు, అప్పుల బాధ, దోపిడి వ్యవస్థ గా మారుతున్న సమాజం, తమ బాధలను ఏ మాత్రం ఘర్షణ లేకుండా అంగీకరించే మనుష్యులు.
రచనలో మట్టి వాసన ఇట్టే పరిమళిస్తుంది. పాత్రోచిత భాష, అక్కడి ప్రకృతి వర్ణనలు దీనికి ముఖ్య కారణం. మహేంద్ర నేపథ్యం తెలుసు కాబట్టి, కథలలో వీటి ప్రత్యక్షం అర్థవంతమౌతుంది. తొందనాడు ప్రాంతాలలో తిరుగుతున్న అనుభూతి ఆయన కథలు చదివినప్పుడు కలుగుతుంది.
‘ జర్తె ‘ , ‘ ఇంధనం ‘ లాంటి కథలలో రైల్లు, ఆ రైలు లో కథా పాత్రలు చేసే ప్రయాణాలు కూడా కనిపిస్తాయి. ఇది కూడా మహేంద్ర జీవన నేపథ్యంతో అన్వయించుకోవచ్చు.
ఇక కథా శిల్పానికి వస్తే, మహేంద్ర కథలను ఏ మాత్రం కన్ఫ్యూజన్ కి తావు ఇవ్వకుండా నేరుగా చెప్పుతాడు. ‘ఇరానీ హోటల్లో … ‘, ‘ హాగినేకల్ ‘ అన్న రెండు కథలలో మాత్రం మహేంద్ర ఫస్ట్ పర్సన్ లో కథ చెప్పుతాడు. మహేంద్ర ఇతర కథలలో తనను ఒక అబ్జర్వర్/ నేరేటర్ గానే పరిగణిస్తూ కథలలో కనపడడు. ‘ కనిపించని కోయిల ‘ , ‘ పాడి ఆవు ‘ కథలలో, అతన్ని వ్యక్తిగతంగా తెలిసినవారు కథా పాత్రలలో ఒకరిగా గుర్తు పట్టొచ్చు. కథలు పాత్రలను అనుసరిస్తూ, వాటి సంభాషణల ద్వారా, పాత్రలను కలుపుతూ, చెప్పవలసిన విషయాన్ని దౌడు తీయిస్తూ, మహేంద్ర కథలు అల్లు తాడు. కథ చివర ఆశ్చర్య పడే మలుపులు లేక పొయినా, రచయిత దృక్పథం వివరించే మాటలతో ముగుస్తాయి.
కథలలో ఆయా ప్రదేశాల పై, అక్కడి మనుష్యులు పై, అక్కడున్న వాతావరణం పై మంచి వర్ణన లు ఉంటాయి. కథలు పెయింటింగ్ లాగా అనిపిస్తాయి. కదిలే చిత్రాలుగా అనిపిస్తాయి. ఒక సినిమా చూసిన అనుభూతి కల్పిస్తాయి. అలాంటి సమయాల్లో మహేంద్ర కథలు స్కెచ్ లు అంటే సరిపోతుందేమో .
రాజారాం గారు కథన చక్రవర్తి. ఒక మర్రి వృక్షం లాంటి వారు. వారి నీడ ఉండి పెరిగి పేరు తెచ్చుకోవడం క్లిష్టమైన పని. కానీ నరేంద్ర, మహేంద్ర – ఇద్దరూ ఆ పనిలో సఫలీకృతులయ్యారు. మహేంద్ర తన పేరుకు మధురాంతకం తగిలించకుండా రచనలు చేయడం అలాంటి ఆలోచనలనుండే వచ్చి ఉండాలి.
రాజారాం గారి కథలలో మానవుల మంచితనమే కనిపిస్తుంది. ఆయన కథలు చదివిన పాఠకులకు మంచి సందేశం, ‘ఫీల్ గుడ్’ అన్న ఆనందం కలుగుతుంది. ఆ విషయంలో మహేంద్ర, నరేంద్ర ఇద్దరూ రాజారాం గారు కథలపై ఆయనకే ఆక్షేపణ చేశారని విన్నాను. రాజారాం గారి ప్రతి స్పందన చిరు నవ్వే. కానీ ఆయన కథకులందరికీ ఇచ్చే మౌలిక సూచన ఒకటే. కథకులు ‘నేల విడిచి సాము చేయకూడదని’. ఆ సందేశ ప్రభావం మహేంద్ర రచనలలో బాగా కనిపిస్తుంది. కథలలోని వాస్తవికత, నిజాయితీ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.
మహేంద్ర కథలు అన్నీ గొప్ప కథలే. అందులో నాకు నచ్చిన కథల నుండి, ఆయన రచనా శైలికి మచ్చు తునకలు, కొన్ని ఇవి.
‘ జర్తె ‘
గురు సామి , అర్జునుడు గొర్రె కాపరులు. అడవిలో మేపడానికి తీసుకెళ్తుంటారు.
వాళ్ళు ఆ తిరుపతి గుట్టలలో తిరుగుతూ ఉంటే, అర్జునుడు గురుసామి కి పెద్ద నక్క గురించి హెచ్చరిస్తాడు. మహేంద్ర వర్ణనలు చిత్రకారునిలా ఒక బొమ్మను పాఠకులకు ఆవిష్కరింపజేస్తాయి. ఉదాహరణకు అర్జునుడి నోటి ద్వారా ఆ నక్క గురించి గురుసామి కి ఎలా చెప్పాడో విందాము.
“మీ నాయన గూడా వుండె! కొనలో కొస్తే రెండు కాళ్ళు ఒక సోట పెట్టేవోడు కాదు. కూత ఏసినాడంటే ఇట్ల మొగదల కొన మొదలుకొని అట్ల నేరేడు మాను సెలమ దాకా – ఇట్ల గుండాల మిట్ట కాన్నించి అక్కడ నక్కలబండ దాకా ఏడున్న జీవాలు అరచనంలో చుట్టూరా చేరిపోయేటివి. తోడేళ్ళు, పెద్ద నక్కలు మీ నాయనకు ఉచ్చ బోసుకునేటివి. మళ్ళా జెప్తా ఉండా పెద్ద నక్కొకటి జేరుండాది. అదో ఆ నల్ల మేక ముందర పోతావుందే ఎర్ర మరక, అంత మాత్రమూ బాగా బలిసుండాది. దాని తోక మాత్రం నా మూరతో ఒకటిన్నర మూర వుంటాది. ముక్కు కాన్నించి వెనిక్కాళ్ళ దాకా నల్లంగా బట్లుబట్లు గా వుంటాది. మొన్న నాగుల గాడి చుక్కల మేకను మింగేసింది. ఆవునట్టా దాన్ని అలగ్గా గొంతు కొరికేస్తాది. బద్దరం! బద్ధరం!”
అప్పుడు గురుసామి కంట్లో ఎర్ర చీర కట్టుకున్న ఎల్లమ్మ కనిపిస్తుంది. ఆవిడని ఆసక్తిగా చూస్తున్న గురుసామి అదిలించి మందను చూసుకో మని చెబుతాడు అర్జునుడు.
అర్జునుడు మరికొంత డబ్బు కోసం కట్టెలు తెస్తానని తన మంద కూడా గురుసామి కి అప్పజెప్పి, తిరుగుతున్న నక్క గురించి మరో సారి హెచ్చరించి అడవిలో మరో దారిలో పోతాడు.
గురుసామి కి ఆ ఎర్ర చేర ఎల్లమ్మ మీద మనసు పోతుంది. ఆ పిల్ల గురు సామి నుండి తప్పించుకోవడానికి నయాన, భయాన చెప్పి చూస్తుంది. పరిగెత్తి పారిపోతుంది. కానీ గురుసామి ఆ అడవిలో మేకలను వాటి మానాన వాటిని వదిలేసి ఆ అమ్మాయికోసం అడ్డ దార్లలో పోయి, పట్టుకొని నక్క లాగా దోచేస్తాడు. ఆవిడ ఆ అడవిలో పోరాడుతుంది కానీ చివరకు నిస్సహారాలై లొంగి పోతుంది. గురు సామి ని తిట్టి పోస్తుంది. గురుసామి ఎల్లమ్మ వెంటబడినప్పుడు అర్జునుడు మందలో పెద్ద మేకను నక్క తీసుకెళ్ళి పోతుంది. అర్జునుడు, కాపరిలేక తిరుగుతున్న, తన గొర్రెల మందను కిందకి తెచ్చి గురుసామి కోసం ఎదురుచూస్తుండగా, కట్టెల మోపుతో కొండని దిగిన ఎల్లమ్మ తో సహా ఫారెస్ట్ చెకింగ్ స్క్వాడ్ పట్టుకుంటుంది. ఎల్లమ్మ, గురుసామి చేసిన నీచమైన పని, ఆర్జునితో చెప్పి రోదిస్తుంది. అర్జునుడు గురుసామి తాట వలుస్తాను అని వూగిపోతుంటాడు. అడివిలో వేటకు పోయిన ఇర్లవాళ్ళు, ఫారెస్ట్ చెకింగ్ స్క్వాడ్ కు దొరకగూడదని జర్తె దాటుతూ, జారి పడిపోయి ప్రాణం పోగొట్టుకున్న గురుసామి శవం తో కిందకు దిగి వస్తారు.
ఆ అడవిలో జరుగుతున్న ఇతర దౌర్జన్యాలను వర్ణిస్తూ కథ ముగింపు మహేంద్ర మాటల్లో…
“నల్లటి కొండ కొమ్ము పై నున్న తెల్లని జర్తె, మేక పిల్లను వెంటాడుతున్న పెద్ద నక్కలా క్రూరంగా, ఎల్లమ్మ వెంటాడుతున్న గురుసామి లా ఉన్మత్తంగా, అడవిలో వెళ్ళితే కానీ భుక్తి గడవని పశువుల కాపర్ల దగ్గర, కట్టెల వాళ్ళ దగ్గర దొరికిన కాడికి డబ్బులు గుంజడం కోసం మాటువేసి వున్న ఫారెస్ట్ ఉద్యోగుల తండా లా, నిర్దయగా, ఒకరినొకరు వేటాడు కొనే పరిస్థితిని కల్పిస్తున్న సమాజపు భయంకర గహ్వారం నుంచి వేరాలాడుతున్న విషపు నాలికలా , కొండ క్రింద జరుగుతున్న తతంగాన్ని చూస్తూనే ఉంది.”
ముగింపులో ఒక అర్థం, సందేశం చెప్పి ముగించడం మహేంద్ర ట్ట్రేడ్ మార్క్. మహేంద్ర కథలలో కొస మెరుపులు ఉండవు, నాయకులు, నాయకి లు నిర్లిప్తంగా, నిస్సహాయ లు గా ఉంటారు. తమకు కలిగిన పరిస్థితులను అంగీకరిస్తారు. కారా గారి ‘ యజ్ఞం ‘ లాగా, నిహలాని ‘ ఆక్రోష్ ‘ లాగా పాఠకుణ్ణి జలదరింపజేసే ముగింపులుండవు. కానీ ఆ ఫాటలిజం, నిర్వీర్యతనే పాఠకులను కదిలించి వేసి, చాల ఆలోచింప చేస్తుంది. పాఠకుల మనస్సును చాల రోజులు తొలచి, వేధించి కథ చిర కాలం గుర్తుండి పోతుంది. మహి కథలలో ఈ ఫేటలిజం మళ్ళీ, మళ్ళీ కనిపిస్తూనే ఉంటుంది. కొంత ఆశాజనకంగా పాత్రలు కనిపించాలంటే ‘ ప్రతిజ్ఞ ‘ కథ లోని చిన్న పిల్ల వాడిలోనే చూడగలం. లేక పోతే ‘ కుక్క చావు ‘ లోని కుక్కలో చూడగలం. మిగిలిన కథల లోని ప్రధాన పాత్రలన్నీ తమ కర్మకు ఎటువంటి ప్రతిఘటన లేకుండా లొంగిపోతాయి, పరిస్థితులకు రాజీ పడతాయి.
‘పాడి ఆవు’ ఆ కధలో బ్యాంక్ ఇచ్చే ఋణాలు ఏవిధంగా డబ్బున్న వారే దోచేసుకుంటున్నారో చక్కగా చూపెదతాడు మహేంద్ర. మహేంద్ర ఉద్యోగానుభవం నుంచి వచ్చిన కథ ఇది.
ఇది సిన్న మునెప్ప కధ.
ఒక జెర్సీ ఆవు, సిన్న మూనెప్ప పేరు మీద లోను తీసుకొని, పిన పెద్ద అన్న ఊరిలోని ఒక మోతుబరి రైతు అనుభవిస్తున్నాడని బ్యాంక్ లోన్ ఆఫీసర్ కి తెలిసి పోతుంది. బ్యాంక్ ఆఫీసర్ మునెప్ప ను కలిసి ఆ ఆవును పిన పెద్ద ఇంట్లోనుంచి , తన ఇంట్లోకి తెచ్చి పాల వ్యాపారం చేసి గ్రామాల్లోని పెద్ద కాపుల ఉచ్చులో నుంచి బయట పడమని తెగ వేడుకొని ఒప్పిస్తాడు. జరిగిన అన్యాయం గురించి పోలీస్ స్టేషన్ లో ఆ బ్యాంక్ లోన్ ఆఫీసర్ ఫిర్యాదు చేస్తాడు. మునెప్ప చేయవలసిందల్లా పోలీసు అధికారి కి తన పేరు మీద అప్పుతో ఇచ్చిన ఆవు పిన పెద్ద తనింట్లో కట్టి పడవేసి దానినుండి వచ్చిన పాలు, ఇతర ఆదాయాలు పిన పెద్దనే అనుభవిస్తున్నాడని నోటితో చెప్పడమే.
ఈ విషయం తెలుసుకున్న చిన పెద్ద, మునెప్ప ను పిలిపించి, మెత్తగా బెదిరించి, ఇన్స్పెక్టర్ తో ఏమి చెప్పాలో అని తర్ఫీదు ఇస్తాడు.
మునెప్ప ఇన్స్పెక్టర్ తో చిన పెద్ద చెప్పినట్లే చెప్తాడు. దానితో బ్యాంక్ ఆఫీసర్ తప్పుడు ఆరోపణ చేసినాడని ఎక్కడో నీళ్ళు దొరకని దూర ప్రాంతంలోకి ట్రాన్స్ఫర్ చేసేస్తారు. ఆ విషయం తెలిసి మునెప్ప చిన పెద్ద పోయించన సారా తాగి తన ఆవేదనను చెప్పి కొంత గుండె బరువు దించుకో ప్రయత్నిస్తాడు.
ఈ కథలో మునెప్ప మాటలు…
“ సామీ! నువ్వు సదుంకున్నోడివి. నేను ఏలిముద్దర్లు వేసెవొన్ని. నీకు తెలవంది గాదు. సర్కారని దాన్ని పట్టుకొని నీవు పీకలాడతా వుండావు. సర్కారంటే ఎవరు సామీ. మావూరుకి పిన పెద్దే సర్కారు…ఆవును ఇచ్చినట్టుగా యిచ్చిరి. తీసుకున్నట్టుగా తీసుకుండ్రి. దీనికి వగచేం లాభం చెప్పు. అయినా పుట్టినదాదిగా తరాల నుండి మేము గొడ్లు మేపుకునే వాళ్ళము. మా తాత, మా నాయన, నా కొడుకు అంతా ఆ బాబత్తే. పేడా, గంజో ఎత్తే రాతే గానీ పాలు, మజ్జిగ తాగే రాత లేదు. నువ్వు తెల్లనిదంతా పాలు అనుకునేటోడివి. నా మూలంగా నీకీ పొద్దు తల దించుకునే పనై పాయ. నన్ను మన్నించు కో దేవరా!”
అస్తిత్వం గురించిన కథ ‘ హోగినేకల్ ‘
ఇందులో విహార యాత్రకు ఆనందంగా వచ్చిన ఇక కుటుంబంలోని చిన్నారి పిల్ల జలపాతంలో కొట్టుకొని పోయి చనిపోతుంది. దాని ముగింపు చూడండి.
“ లీల వైపు చూసాను. వర్షం కురిసిన మేఘాల్లా ఉన్నాయి ఆమె కళ్ళు.
రాత్రి టాప్ ఆఫ్ చేయడం మర్చిపోయినట్లున్నాను. మొజాయిక్ ఫ్లోర్ మీద షవర్ నుండి నీళ్ళు దబ, దబ దూకుతున్నాయి. బాత్ రూం లోకి దూరి షవర్ కింద నిలుచున్నాను.
అనాది మానవుల ఆనంద విషాదాశ్రు జలపాతం హోగినేకల్ ఇంకా దూకుతూనే వుంది”
మహేంద్ర రచనలలో ప్రకృతి కీలకమైన పాత్ర వహిస్తుంది. మానవ సుఖ దుఃఖాలకు అతీతంగా, సమయంతో సంబంధం లేక నిరంతరము మానవ జీవితాలకు సాక్షి గా ఉంటుంది. అలా ప్రకృతిని కథలలో ప్రస్తావించి, ఈ విశాల ప్రపంచంలో మానవుల ఉనికిని, వారి భావాల అస్తిత్వాన్ని ప్రశ్నిస్తాడు మహేంద్ర. ‘ఇన్ ది గ్రాండ్ స్కీమ్ ఆఫ్ థింగ్స్’, ఇవన్నీ అర్ధ రహితం అనే ముగింపు పాఠకులకు కల్పిస్తాడు. ఒక విధంగా ఆ ముగింపులలోనే మనకు మహేంద్ర అకాల మరణం కల్పించిన వేదనకు పరిష్కారం, ఊరడింపు దొరుకుతుంది.
*
తప్పు పట్టడానికి కాదు, నొప్పి పెట్టడానికి కానే కాదు. తెలిసినది చెప్పడం,తెలియనిది తెలుసుకొనడం కోసం మట్టుకే ఈ మాటలు. తొండనాటి ఎల్లలను చెన్నపట్నం నుండి నెల్లూరు వరకు అనడం పొరపాటు. చెన్నపట్నంకు దిగువన మరో 200 కి.మీ వరకూ తొండనాడే. తొండనాటి ఎల్లలు తెక్కణాన మణిముత్తేరు, వక్కణాన మొగిలేరు (సొర్ణముకి), తూరపున వంగకడలి, పడమరన మేల, ఏల, కలవరాయని మలల వరుసలు. దాదాపు 40వేల చ.కి.మీ పరపు కలిగిన పెద్దతావు తొండనాడు. ఇదీ నాకు తెలిసినది. 1600 ఏండ్ల కిందటి తమిళ సంగ నానుడిలో చెరువుల గురించి ఉందన్నారు కదా, అది ఎక్కడుందో తెలుసుకోవాలని ఉంది. ఎట్టుత్తొగై లోనా, పత్తుప్పాట్టు లోనా? దయవుంచి తెలుపగలరు.
రమేశ్ గారు
మహేంద్ర గురించి వ్రాసింది చదివి స్పందించినందుకు ధన్యవాదాలు.
ఇక తొండనాడు ప్రస్తావన తేవడానికి రెండు ముఖ్య కారణాలు. ఒకటి మహేంద్ర పుట్టి, పెరిగిన చిత్తూరు, తిరుపతి, చెన్నై ప్రాంతాలు తొండనాడు కావడం. రెండవది ప్రగతి తొండనాడులోని ప్రకృతి ముఖ్యంగా నీటి వనరుల మీద తెచ్చిన మార్పులు.
ఇక తొండనాడు ఎల్లలు చారిత్రాత్మకంగా అన్నీ దేశాల, ప్రాంతాల ఎల్లల లాగగానే పలు విధాలుగా చెప్పబడుతున్నది. ఈ వ్యాసం కోసం చేసిన పరిశోధన ద్వారా నేను నాకు తెలిసిన విషయాలు పంచుకున్నాను.
మహేంద్ర తన కథ ‘ ముసలమ్మ మరణం ‘ కు నేపథ్యంగా వ్రాసిన వ్యాసం, ఆ వ్యాసంలో ప్రస్తావించిన పరిశోధనా గ్రంథాలు మీకు ఆసక్తి కరంగా ఉంటాయను కుంటాను. ఈ వ్యాసం కూడా మహేంద్ర కథల పుస్తకం ‘ కనిపించని కోయిల ‘ లో అనుబంధం గా ప్రచురించారు.