ఒక ముఖం

కొన్ని ముఖాలని గుర్తుపడతాం. పెట్టుకుంటాం. కానీ ఎన్నేళ్లైనా ఆ ముఖాలతో పరిచయం చేసుకోం.

కొందర్ని మనం ఎప్పటికీ కలవం. ఏ మూడో తరగతిలోనో, ఏ తెలుగు టీచరో ఓ కథ చెప్తుంది. అందరం వింటాం ఆ కథ. ఆ కథలో మనకు ఒకడు బాగా నచ్చుతాడు. ఆ నచ్చినవాడు ఎలా ఉంటాడో కొన్ని పోలికలు తెచ్చుకుంటాం. వాడ్ని ఊహిస్తాం. వాడినెప్పటికీ కలవం. కలిసినా వాడే అని చెప్పడంలో నీ పోలికలు ఎందుకో ఒప్పుకోవు.

ఇలాంటి మనుషులను మనం మళ్లీ కలవం అనుకున్నప్పుడు, వాళ్లను కలవాలన్న ఆశ ఒకటి పుట్టుకొస్తుంది.

మధ్యాహ్నం పూట. కాలేజీ ఉండదు. లేదా వెళ్లి ఉండను. ఎండాకాలం. నీళ్లు అడగడానికొచ్చిన ఒక పెద్దమ్మ, అరుగు మీద కూర్చొని, “ఏం ఎండలు.. ఏం ఎండలే..” అంటుంది. ఆమె ముంజకాయలు అమ్ముకుంటుంది. కాసేపు ఇంటిముందే కూర్చుంటుంది. కొడుకు – కోడలు గొడవ పడ్డట్టు చెప్తుంది. “లంబిడి ముండ..” అంటుంది ఆ కోడల్ని. ఆ కోడల్ని చూడాలని ఉంటుంది నాకు. ఆమె ఏం మాట్లాడుతుందో వినాలని ఉంటుంది. ఆ పెద్దమ్మను నేను మళ్లీ ఏనాడూ చూడలేదు.

మనకు కనిపించే మనుషుల్నే మనం చాలామందిని మళ్లీ కలవం. మొన్న నువ్వు ఫోన్ చేసి, “ఇంటికి చేరావా?” అనడిగినప్పుడు నేను బస్‌లో సగం దూరంలోనే ఉన్నా. అప్పుడే అనుకుంటా, చూస్కోకుండా నా పక్కన కూర్చున్నామె చెయ్యికి నా చెయ్యి తాకింది. ఆమె తన చెయ్యిని లాక్కుంది. ఆమెను ఆరోజే మళ్లీ చూడలేదు నేను.

“ఆయనకివ్వు..” అని కౌంటర్ దగ్గర నా ముందున్న అమ్మాయికి అల్-సబా వాడు చేంజ్ ఇచ్చాడు. “హా! వచ్చేస్తున్నా..” అని ఫోన్లో మాట్లాడుతూనే ఆ చిల్లర నాకు ఇచ్చేసింది ఆ అమ్మాయి. ఆ ఫోన్లో వ్యక్తిని చూడాలనుకుంటాను.

రాత్రి పన్నెండుకి మైత్రివనం కరాచీ బేకరీ ముందు చాలామంది ఉన్నారు. నేను రోడ్ క్రాస్ చేసేటప్పుడు నాకోసం ఒక కారతను బ్రేకేసి పొమ్మన్నాడు. ఆ మొహాన్ని నేను చూడలేదు. ఎప్పటికీ చూడలేను కూడా.

రోజుకి మనమిలా కలిసే వందలమందిలో చాలామంది ముఖాలతో మనకి అవసరం లేదు. రిజిష్టర్ కూడా చేసుకోం. వాళ్లను కలవాలని పుట్టిన ఆశ అప్పటికే పోతుంది. అదెందుకు పుడుతుంది?

కొన్ని ముఖాలని గుర్తుపడతాం. పెట్టుకుంటాం. కానీ ఎన్నేళ్లైనా ఆ ముఖాలతో పరిచయం చేసుకోం. పరిచయమైన ముఖాల్లో చాలా ముఖాలకు దగ్గరెప్పటికీ అవ్వం. దగ్గరైన ముఖాలను అన్నిసార్లూ మనలోకి తెచ్చుకోం. తెచ్చేసుకున్న ముఖాలను ఎప్పుడూ పక్కనే ఉంచి చూస్కోవాలని ఉంటుంది. ఏదైనా చెప్తూ ఉంటే వినాలని, వాళ్లకి ఏదైనా చెప్పాలని ఉంటుంది.

నాకు ఇప్పటికిప్పుడు నీ ముఖం చూడాలని ఉంది. నీకిందాక కొన్న చాక్‌లెట్ తినాలని గంట నుంచి టెంప్టింగ్‍గా ఉంది కానీ తినట్లేను. ఆ బ్యాగ్‍లో దాచిపెట్టుకున్నా నిన్నిప్పుడు.

పొద్దునంతా నిన్ను జేబులో పెట్టుకుని తిరిగా. చాయ్ తాగేప్పుడు నువ్వెక్కడో పడిపోయావనిపించి జేబులో చెయ్యి పెట్టి చూశా. ఉన్నావు. నిన్ను జారిపోకుండా పట్టుకొనే ఉండి, ఆ మెయిన్ రోడ్డంతా చుట్టూ చూశా. కుడివైపు చివర మూలనున్న బ్లాక్ టీషర్ట్ నువ్వే అనుకున్నా. కాదు. ఎడమవైపు అడ్డంగా నిలబడ్డ ఒకామెకు ముందు నిలబడింది నువ్వు అనుకున్నా. కాదు. అప్పుడు చూశా నిన్ను. అంత రోడ్‍లో నిన్ను కౌగిలించుకోవాలనిపించింది. అక్కడ, సరిగ్గా అక్కడే, మనతో సంబంధం లేనతను ఎల్లుండెప్పుడో నువ్వు తినే కూరలో కూరగాయను నీ దాకా తెచ్చింది అతనని తెలిస్తే? ఏదైనా ముఖం గుర్తుందా ఆ ముఖాల్లో? మనకొద్దు కదూ!

మనకి ముఖాలతో, శరీరాలతో, మనుషులతో పనులు, అవసరాలు, ఇష్టాలు. ఏవి పడితే అవి. ఎలా పడితే అలా ఉంటాయి.

కొన్నిసార్లు ఏవి ముఖాలన్నది మనకే తెలీదు. ఏ శరీరానికి అవసరం అయ్యామని మనకి తెలీదు. ఏ ఇష్టంతో ఒక మనిషిని కోరుకుంటామో తెలీదు.

నాకు ఇప్పటికిప్పుడు నువ్వు కేవలం ఒక ముఖం మాత్రమే అయితే.. (నాకు..) ఈ దారెంట నువ్వు వెళ్లిపోతుంటే నిన్నెలా చూస్తానా అని ఆలోచించినప్పుడూ నాకు ఆ చాక్‌లెట్ తినేయొచ్చు అనిపిస్తుంది. ఈ బుక్ ఇప్పుడు మూసేసి, ఇంకేం చేస్తూ ఉండొచ్చనిపిస్తుంది. ఇందాక చదివిన పుస్తకంలోని ఏదో వాక్యం నిన్ను గుర్తు చెయ్యదు కదా అనిపిస్తుంది.

సడెన్‍గా ఇవన్నీ నీకు చెప్పుకోవడానికి నాకు ఇప్పటికిప్పుడు, నిన్ను చేరే మార్గం ఏదని అనిపిస్తోంది, నువ్వు నాకు ముఖంతో మాత్రమే పరిచయమైన వ్యక్తివి కాదన్నప్పుడు.

ఈ పుస్తకం మూసేసి, కారిడార్ దగ్గరికొచ్చి కిందకు చూసి నువ్వు రాలేదని కన్‍ఫర్మ్ చేసుకోవాలి. ఫ్లోర్ దిగి రోడ్డు మీదికొచ్చి “వస్తావా?” అని అడగాలి.

ఇప్పుడే ఆ కారిడార్ దాకా వెళ్తే ఎప్పుడూ (అంటే రోజూ..) చూసే ఓ ముఖం కనిపించింది. ఆ ముఖానికి ఉన్న పేరేంటో!

కొందర్ని మనం ఎప్పటికీ కలవం.

మూడేళ్ల క్రితం నేను ఆ లిఫ్ట్‌లో నిన్ను చూసి ఈ మాట అనుకొని ఉండొచ్చు. దానికి అవకాశం ఉంది.

ఒక మనిషికి (ముఖానికి) సంబంధించి మనమిచ్చుకునే ఒకే స్టేట్‌మెంట్ కొన్నాళ్లకు మారిపోవచ్చు. మారిపోతుంది చాలాసార్లు.

నాకిప్పుడు నిన్ను చాయ్‌కి పిలవాలనుంది.

నీతో ఏదైనా చెప్పాలనుంది.

నీ చెంపను తాకాలని ఉంది.

నాకు ఈ మాటలు నా నోటి నుంచి ఎప్పుడూ వస్తూ ఉండటం కావాలి. పరిచయం లేని ముఖాల మధ్య నిలబడి, దూరం నుంచి నువ్వొస్తుంటే గుర్తుపట్టి, నీకు పరిచయం లేని ముఖాల మధ్య నువ్వు నన్ను చూసి, నవ్వి దగ్గరికి రావాలి.

కొందర్ని మళ్లీ కలవాలి. “వస్తా.” అని చెప్పి బయల్దేరిన అదే సెకండ్‌నించి.

*

 

 

 

 

 

వి. మల్లికార్జున్

కొత్త కథకి సరికొత్త వాగ్దానం మల్లికార్జున్. రాసిన ప్రతి వాక్యం భిన్నంగా రాయాలన్న తపన. తను చెప్పాలనుకున్న కథకి ప్రయోగమనే గీటురాయి మీద నిరంతరం పరీక్షించుకునే నూత్న పథికుడు.

7 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • నిజంగానే వాక్యాలతో భావాలతో ప్రయోగాలు చేస్తున్నారు

  • నిజమే! కొందర్ని మళ్ళీ కలవాలి. To know them better. కానీ కలిసిన మరు నిమిషం వాళ్ళూ మనమూ ఒక్కటే. కొత్తగా ఏమీ మిగలదు. మళ్ళీ కలవాలన్న భావం కూడా మిగలదు. మనసులో మిగిలిపోయే Mystical feeling మాత్రం ఎప్పుడూ బాగుంటుంది. My pov. భలే రాశారు ..జ్ఞాపకాలను సున్నితంగా తాకుతూ!!

  • చూడాలనుకున్న ఎన్నో ముఖాలని చూడలేమేమో
    వద్దులే అనుకున్న వాటిని చూడక తప్పదేమో
    చూసినా చూడకపోయినా నాదైనా, తనదైనా, ఇంకెవరిదైనా
    Hipocricy ముసుగేయని ముఖమైతే చాలునేమో

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు