అది 1881వ సంవత్సరం. డిసెంబర్ నెల 11వ తేదీ. ఆ రోజు రాజమహేంద్ర వరంలో గొప్ప సంఘటన జరగబోతున్నట్లుంది. పట్టణమంతా ఏదో హడావుడిలో మునిగిపోయుంది.
ప్రధానవీధిలోనూ, గోదావరిగట్టుమీదా, స్నాన ఘట్టాలలోనూ, వెండి బంగారం కొట్ల దగ్గర, నల్లమందు సందులోనూ, ఇన్నీసుపేటలో, ధవళేశ్వరం వెళ్ళేదారిలో, కందకం రోడ్డులో… ఇంకా… ఇంకా… రాజమహేంద్రవరంలోని ప్రతి కూడలిలో ఒక్కటేచర్చ…ఎడతెగని చర్చ.
దేవాలయాల్లో అర్చన చేసే పూజారుల నోట అదే చర్చ. నదీతీరంలో కర్మకాండ చేయించే పురోహితుల నోటా అదే మాట. గోదావరీస్నానం చేసి తడిబట్టలతో మడినీళ్ళు తెచ్చుకొంటున్న ఆడవాళ్ళ నోటా అదే మాట.
కార్యాలయాల్లో ఆరోజు ప్రభుత్వ కార్యక్రమాలు ఏమీ జరగాలేదు. న్యాయస్థానాలలో కేసుల విషయంలో, న్యాయవాదులు ఎవరూ శ్రద్ధ చూపించాలేదు. అందరూ ఏదో అత్యవసర విషయాన్ని, అతిముఖ్యమైన సమస్యని చర్చిస్తున్నట్టే ఉన్నారు.
క్రమంగా చీకటి పడుతోంది. పెనుతుఫాను వల్ల కల్లోలితమైన మహాసాగరంలో చిక్కిన నౌకలా, రాజమహేంద్రవరం సంక్షోభంలో చిక్కిపోయింది. అందరూ ఆ విషయం గురించే చర్చిస్తున్నారు కానీ నలుగురి ముందూ ధైర్యంగా నిలబడి మాట్లాడే సాహసం ఎవరూ చేయలేకపోతున్నారు.
అంతవరకూ ఊరుపేరూ లేకుండ పడిఉన్న ఎందరికో ఎక్కడలేని ప్రసిద్ధి కలిగించింది ఆ సంఘటన. ఎక్కడెక్కడి వాళ్ళో ముందుకొచ్చి, ప్రజల్ని రెచ్చగొట్టి.. ఆ శుభకార్యం చెడ గొట్టాలనుకొన్నారు. కానీ వాళ్ళ కలలు కల్లలయ్యాయి, వాళ్ళ ఆశలు అడియాసలయ్యాయి.
గోదవరిగట్టు అంతా చీకటిలో మునిగిపోయింది, కానీ గట్టు దిగువున ఉన్న ఆ పెద్ద ఇల్లు మాత్రం పెట్రోమాక్స్ లైట్లతో వెలిగిపోతోంది. ఇంటికి కట్టిన పచ్చని మామిడి తోరణాలపై ఆ దీపాల తెల్లని వెలుగు పడి..ఆ ఇల్లు మరింత ప్రకాశిస్తోంది.
పట్టణంలోని వాతావరణమంతా ఒక విధంగా ఉంటే, అక్కడ మాత్రం మరొక విధంగా ఉంది. అక్కడంతా గంభీరత రాజ్యమేలుతోంది.
అందరూ అటూఇటూ తిరుగుతూ పనులు చేస్తున్నారు, ఒకరితో మరొకరు మాట్లాడుతున్నారు. చూడ్డానికి అదంతా మామూలుగానే కన్పించినా, అదంతా క్రమపద్ధతిలో, గొప్ప విశ్వాసంతో, పరిపూర్ణమైన నమ్మకంతో సాగుతోంది.
ఇంతలో పరుగులాంటి నడకతో వచ్చింది వంటమనిషి. వస్తూ వస్తూనే నేను ఈ అనాచారపు ఇంట్లో పనిచేయను. చేయలేను తల్లీ! అంటూ, ఎలా వచ్చిందో అలాగే వెళ్ళిపోయింది. పనివాళ్ళు ఒక్కరొక్కరే మెల్లిగా తప్పుకొంటున్నారు.
చివరికి శుభకార్యం చేయించే బ్రాహ్మడూ ముఖం చాటేశాడు.
కొద్దిసేపటిలో ఆ ఇంట శుభకార్యం జరగవలసి ఉండగా, అందరూ ఇలా నమ్మించి మోసం చేశారు.
అదంతా ఆ వ్యక్తి చూస్తున్నాడు.
అందరూ తన ప్రయత్నానికి తోడుగా నిలబడకపోయినా అందరూ తనని వ్యతిరేకించినా, అందరూ తనకి సహాయం చేయడానికి నిరాకరించినా, ఆ వ్యక్తి ఎంతమాత్రం నిరుత్సాహపడలేదు. అధైర్యపడలేదు. నిజానికి భయమంటే ఏమిటో తెలియని ధీరుడు ఆతడు. నిర్భయం ఆయన సొత్తు. ధైర్యం ఆయన చిరునామా.
క్షణక్షణానికీ మారుతున్న ఆ పరిస్థితిని చూసి కంగారు పడుతున్న భార్యకు ఎంతో ధైర్యం చెప్పాడు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎన్ని అవాంతరాలొచ్చినా ఎట్టి పరిస్థితులలోనూ తలపెట్టిన శుభకార్యం ఆగిపోదు అని నిర్ద్వందంగా ప్రకిటించాడు.
తొలినుండి అటువంటి శుభకార్యం చేసి తీరాలని తొందరపెట్టిన చల్లపల్లి బాపయ్యగారు ఆ ఛాయలకే రాలేదు. సంఘసంస్కరణ అంటే ఎంతో ఇష్టమున్న గొప్ప వ్యక్తుల్లో న్యాపతి సుబ్బారావుగారొకరు. అయితే ఏం ప్రయోజనం? సరిగ్గా రావలసిన సమయానికి ఆయనా రాలేదు. వాళ్ళకి ఏవేవో కారణాలు ఉండి ఉంటాయనుకోండి. అయినా అసలు వాళ్ళు రాకపోతే ఎలాగ? అలా ఆ గొప్ప కార్యక్రమానికి వస్తానని వాగ్దానం చేసిన అనేకమంది, సరిగ్గా ఆ సమయానికి కన్పించలేదు.
వారందరి సంగతి అలా ఉంచి, బసవరాజు గవర్రాజు గారి సంగతి చెప్పుకోవాలి సుమా! ఈ శుభకార్యానికి వెళ్ళడానికి సిద్ధమైనప్పుడు వారింట్లో పెద్దగొడవే జరిగింది. గవర్రాజు గారి భార్య అనారోగ్యంతో బాధపడుతోంది. పైగా బంధువులందరూ ఏడుస్తూ, శాపనార్థాలు పెట్టారు. చిన్నతనంనుండి ఆయనను పెంచి పెద్దచేసి వారి యోగక్షేమాలు చూసిన ముసలితల్లి .. వదలి వెళ్ళిపోతానని బెదిరించింది. అయినా భయపడలేదు. సంఘ సంస్కరణోద్యమంలో వెనకడుగు వేయలేదు. ఎవరెన్ని విధాలుగా కాదన్నా, తన దారికి ఎందరు అడ్డమొచ్చినా, ఎంతమంది వ్యతిరేకించినా బసవరాజు గవర్రాజు మాత్రం ధైర్యంగా వచ్చాడు. పందిట్లో కొండంత అండగా నిలబడ్డాడు.
సంఘసంస్కరణోద్యమం గిట్టని అనేకులు, ఆ రోజు రాత్రి జరగబోయే శుభకార్యాన్ని చెడగొట్టడానికి తమ శాయశక్తులా ప్రయత్నించారు కానీ, దేశాన్నేలే దొరతనం వారు, తమ రక్షకభటుల్ని కాపుంచి, విధ్వంసం నుండి కార్యక్రమాన్ని రక్షించి, విజయవంతం చేయడంలో ఎంతగానో తోడ్పడ్డారు.
ప్రభుత్వ శాసనానికి భయపడిన ఎందరో, ప్రత్యక్షంగా ఆ కార్యక్రమం చెడగొట్టే ధైర్యం చేయలేక,పరోక్షంగా ఎన్నో రకాలుగా కుట్రచేశారు. ఆరోజు జరగబోయే శుభకార్యానికి సహకరించే అందర్నీ బెదిరించి, అక్కడికి వెళ్ళనివ్వకుండా చేశారు.
రాత్రిపూట కాగడాలు పట్టేవాళ్ళని, వాయిద్యాలు వాయించేవాళ్ళని చివరకు వినోదమేళం కట్టే ఆడవాళ్ళని కూడ బెదిరించి, భయపెట్టి కదలనివ్వకుండ చేశారు. ఛాందసుల ఆగడాలు మితిమీరిపోయాయి. చీకటి బాగా పడుతున్నకొద్దీ ..పరిస్థితి మరింత చెయ్యిదాటిపోయేలా కన్పించింది. ఎందుకైనా మంచిదని జిల్లా పోలీసు అధికారి స్వయంగా పర్యవేక్షణ చేయడం మొదలుపెట్టాడు.
పరిస్థితి ఎంతో తీవ్రంగా ఉన్నా, తలపెట్టిన శుభకార్యం నిర్ణయించిన ముహూర్తానికి వైభవోపేతంగా జరపడానికే నిర్ణయించాడు ఆయన. పోలీసు బందోబస్తుతో, పెళ్ళికొడుకు పల్లకీలో వచ్చాడు. గోదావరిజిల్లా పోలీసు పెద్ద అధికారి..ఆ పల్లకీతో నడిచి రావడం చూస్తే అదేదో గవర్నర్ గారింట జరిగే శుభకార్యంలా అన్పించింది.
ముహూర్తం సమీపించింది. పట్టణమంతా ఒక్కటే ఉత్కంఠ. ఏం జరుగుతుందో, ఏమిటోనని ఒకటే ఆతృత… అన్ని ప్రశ్నలకూ సమాధానంలా, అందరి ఉత్కంఠలకు తెరతీసేలా, అందరి ఆతృతలకూ ఒక్కటే జవాబుగా, వితంతుస్త్రీ పునర్వివాహ మహోత్సవం జరిగింది.
శతాబ్దాలకాలంనుండి.. సాంఫిుక జీవనంలో… స్త్రీకి జరుగుతున్న అన్యాయానికి భరతవాక్యం పలికే దిశలో తొలిప్రయత్నం నిర్విఘ్నంగా జరిగింది.
విజయసూచకంగా బాణసంచా కాలుస్తున్నారు విద్యార్థులు. ఆ వెలుగుల్లో, ఆ జిలుగుల్లో పెళ్ళిమండపం తళుక్కు తళుక్కుమంటోంది. ఆ మహాయజ్ఞానికి సూత్రధారులైన ఆ దంపతుల పాదాలకు వరుడు, వధువు భక్తితో నమస్కరించారు.
నిండు నూరేళ్లూ సంతోషంగా జీవించండి అంటూ నూతన వధూవరుల్ని మనసారా దీవిస్తున్న కందుకూరి వీరేశలింగం, రాజ్యలక్ష్మమ్మ దంపతులు ఆ బాణసంచా వెలుగుల్లో మరింత వెలుగుతూ కన్పించారు.
చిత్రం: తొలి వితంతు స్త్రీ పునర్వివాహం జరిగిన స్థలం.కందుకూరి వీరేశలింగం గారి గృహం. రాజమహేంద్రవరం.తూర్పుగోదావరి జిల్లా
*
ఒక మంచి పనిచేయాలంటే ఎంత ధైర్యంఉండాలి,,దృడనిశ్చయం ఉండాలి, ఏం వచ్చినా చెక్కుచెదరక నిలబడటం! చాలా మంచి post !! ధన్యవాదాలు! మీ
very good narration of a historical fact