సురేష్ బ్రేక్‌ఫాస్ట్‌కు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోగానే ప్రజ్వల చెట్నితో పాటు దోసెలు పెట్టిన ప్లేటు , మంచినీళ్లు అతని ముందు పెట్టింది.
అతడు తింటుంటే ఒక నిమిషం ఆగి ‘సాయంత్రం ఏడు గంటలకు మనూకి డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది సురేష్. మీరు ఆఫీస్ నుంచి రాగానే వెళ్దాం’ అంది.
తింటున్న దోసె కటిక చేదుగా అనిపించింది సురేష్‌కి.
‘సరే’ అన్నాడు కాని తలొంచుకొని తింటున్న అతని మనసులో ఆలోచనలు పరిపరి విధాలుగా ఉన్నాయి .
ప్రజ్వల కాఫీ తీసుకురావడానికి కిచెన్ లోకి వెళ్ళింది .
మూడు సంవత్సరాల వయసున్న కొడుకు ఎన్నాళ్ళయినా సొంతంగా తన కాళ్ళ మీద నిలబడలేడని, పుట్టుకతో వచ్చిన జన్యుపరమైన సమస్య అంత తేలిగ్గా పరిష్కారమయ్యేది కాదని ఇప్పటికే ఇద్దరు ముగ్గురు స్పెషలిస్టులు తేల్చి చెప్పేశారు. వాడి మీద ఎంత సమయం, శ్రమ వెచ్చించినా అదంతా వృధాయే అని సురేష్ అభిప్రాయం .
‘బయటికి చెప్తే బాగోదుగానీ వాడి చావు కోసం ఎదురు చూస్తున్నాను’ అనుకున్నాడు మనసులో.
ప్రజ్వల కాఫీ తెస్తే తాగి బ్యాంకుకు బయల్దేరి వెళ్లిపోయాడు.
ప్రజ్వల మెల్లగా బాబు ఉన్న గదిలోకి వెళ్లింది. తల్లిని చూసి బోసిగా నవ్వాడు. నోటి నుంచి చొంగ కారుతోంది. కదల్లేకుండా చూస్తున్నాడు. వెళ్లి వాడి పక్కన కూచుని మెడలో వేలాడకట్టి ఉన్న నాప్కిన్తో చొంగ తుడిచింది.
వాడు ఏదో అర్థం కాని చప్పుడు చేశాడు.
వాడు పుట్టినప్పటి నుంచి ప్రజ్వలకు జీవితం ఇక మీదట ఏమిటాని అర్థం కాకుండా ఉంది.
ప్రజ్వల భౌతికశాస్త్రంలో పీజీ చేసి ప్రయివేట్ డిగ్రీ కాలేజీలో లెక్చరర్‌గా ఉద్యోగం చేస్తుండేది . మొదటి రెండుసార్లు అబార్షన్ కావడంతో, తనకో బిడ్డ కావాలని ఎంతగానో వలపలాడింది. మూడోసారి కన్సీవ్ అవ్వగానే బెడ్‌రెస్ట్ చెప్పడంతో ఉద్యోగం మానేసింది. పుట్టబోయే బిడ్డ కోసం ఎన్నో ఆలోచనలు చేసింది. అమ్మాయైనా , అబ్బాయైనా ఎవరైనా సరే ఆరోగ్యంగా పుడితే చాలనుకొంటూ, ఎప్పుడెప్పుడు పుడతారా అని ఎదురుచూసింది. నెలలు నిండాయి. కాని కాన్పుకు సి సెక్షన్ చేయాల్సి వచ్చింది. బాబు పుట్టినప్పుడే చాలా బలహీనంగా ఉన్నాడని, రెండు వారాల తర్వాత మళ్లీ హాస్పిటల్ తీసుకు రమ్మని చెప్పారు.
‘బాబు పుట్టాడన్న సంతోషం లేకుండా ఇదేం సమస్యరా బాబూ ‘ దిగులుగా అనుకుంది ప్రజ్వల.
తనని పరిశీలనగా చూస్తే వాడికి ఐ కాంటాక్ట్ లేదనిపిస్తుంది . ఆందోళనగా ఈ విషయాన్ని అమ్మతో, భర్తతో పంచుకుంటే– నీకన్నీ అనుమానాలు ఎక్కువైపోతున్నాయి, కొంతమంది పిల్లల్లో ఎదుగుదల లేటుగా మొదలవొచ్చు, ఖంగారు పడకు అంటూ సర్ది చెప్పేవాళ్ళు.
డాక్టర్ రమ్మన్న రోజు బాబును తీసుకుని వెళ్లి కలిశారు. అక్కడి నుంచి ఒక్కో విషయం తెలియటం మొదలయ్యింది. నెమ్మదిగా కొన్ని పరీక్షల ఫలితాలు మరికొన్ని విషయాలను విశద పరిచాయి. బాబు ఆరోగ్యంగా లేడు అన్న అనుమానం నిజమయ్యింది.
‘రెండు సంవత్సరాలు నిండే వరకు కొంతమంది పిల్లలు మెరుగయ్యే అవకాశాలు ఉన్నాయి చూద్దాం’ అని డాక్టర్ చిన్న ఆశ కల్పించాడుగాని అప్పటికే ఇంటర్నెట్లో అంతా చదివిన సురేష్ పిల్లాణ్ణి తాకడం, ఎత్తుకోవడం మానేశాడు. నామకరణం సందర్భంగా కాసేపు ఒళ్లో పడుకోబెట్టుకోవడమే ఆఖరు.
మనోజ్ అనే అందమైన పేరు పెట్టింది ప్రజ్వల. కాని ఆ పేరును బాబు పలకగలడా జీవితంలో? అని మనసులో అప్పుడప్పుడూ అనుకుంటూ ఉండేది .
కొంచెం పొడవు పెరగటం, నవ్వటం మినహా ఆ వయసు పిల్లల్లో వచ్చే ఏ చిన్న ఎదుగుదల బాబులో లేవు. కాని వాడు తల్లిని గుర్తుపడతాడు. దగ్గర్లో కూచుని ప్రజ్వల నిశ్శబ్దంగా పని చేసుకుంటున్నా వాడెలా పసిగడతాడో మరి, ముఖ కవళికలన్నీ పూర్తిగా మారిపోయి , వికసిత వదనంతో కనిపిస్తాడు .
వాడినలా చూసినప్పుడల్లా ప్రజ్వలకు విపరీతమైన ఆశ్చర్యం.
‘పిచ్చితండ్రీ ఈ లోకంలో ఏం చూశావనీ? లేదా ఏ లోకం నుండైనా ఏమైనా మోసుకొచ్చావా? ఇంత సంతోషంగా ఎలా వుంటున్నావు ?‘ అంటూ ఎంతో మృదువుగా, ప్రేమగా పలకరిస్తుంటే మరింతగా నవ్వుతూ ఉంటాడు.
ఇప్పుడు కూడా నవ్వుతూ అలాగే చూస్తున్నాడు.
సాయంత్రం సురేష్ వచ్చాక బాబును డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లింది. అంతకు ముందే చేయించిన పరీక్షల ఫలితాలన్నీ డాక్టర్ ముందు ఉన్నాయి. అతను ఏం చెప్తాడా అని ప్రజ్వల చాలా ఆత్రుతగా ఎదురు చూస్తోంది. సురేష్‌కు అక్కడ ఉండటం ఏమాత్రం ఇష్టం లేదు. డాక్టర్ చెప్పబోయే విషయాలు వినాలని కూడా లేదు. కేవలం భార్య కోసమే ఉన్నాడు.
డాక్టర్ నీరజ్ చెప్తున్న మాటలేవి కొత్త విషయాలుగా అనిపించలేదు ప్రజ్వలకి. అయినా ఎంతో శ్రద్ధగా వింటోంది. ఈ దిగులు చీకటిని తరిమి కొట్టే వెలుగు రేఖేదైనా దొరుకుతుందేమోనని తనకి గంపెడంత ఆశ .
డాక్టర్ మాటల అలికిడికి ప్రజ్వల ఒళ్లో ఉన్న మనోజ్ నవ్వుతూ ఉన్నాడు.
‘మీ బాబులో ఆటిజం స్పెక్ట్రమ్‌లోని కొన్ని మిశ్రమ లక్షణాలు ఉన్నప్పటికీ రెట్ సిండ్రోమ్ లక్షణాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. శారీరకంగా మానసికంగా ఏమాత్రం ఎదుగుదల లేదు. ముఖ్యంగా వెన్నెముకలో బలం లేకపోవడం వల్ల కండరాలు చాలా బలహీనంగా ఉండటం వల్ల లేచి నడవగలడనే నమ్మకం కలగటం లేదు. కానీ మన ప్రయత్నం మనం చేద్దాం’ అంటూ మరికొన్ని జాగ్రత్తలు చెప్పాడు డాక్టర్ నీరజ్.
బాబులో ఇంప్రూవ్మెంట్ లేదనడం ప్రజ్వల మనసుని కలవరంతో మెలిపెట్టింది .
‘ఇప్పటికే బాబు మీ ఓపికని రెట్టింపు చేసి ఉంటాడు. మరింత ఓపిక అవసరం అవుతుందమ్మా మీకు’ ఎంతో దయార్ద్రతగా అన్నాడాయన.
తల వంచుకుని కూర్చున్న ప్రజ్వల– బాబు చేతి మీద పడ్డ కన్నీళ్ళని చకచకా తుడిచింది.
‘బి బ్రేవ్ తల్లీ, వియ్ ఆర్ ఆల్ విత్ యూ’ కన్సర్న్‌గా అన్న డాక్టర్ని కృతజ్ఞతతో చూస్తూ లేచి నిలబడింది. సురేష్ కూడ డాక్టర్ దగ్గర సెలవు తీసుకోవటంతో ఇద్దరూ బయటికి వచ్చారు . మందులు, మరికొన్ని కావలసినవి తీసుకుని కార్లో ఇంటికి బయలుదేరారు.
వెళ్తూ వుండగా ఎవరి ఆలోచనల్లో వాళ్ళుండిపోయారు .
ఎంతో ఎదురుచూపుల తర్వాత పుట్టిన బిడ్డ అని సంతోషపడనీయని పరిస్థితులు, ఇలాంటి బిడ్డ భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాడా అని ఎప్పుడు ఊహించుకున్నా అంధకారమే ప్రత్యక్షమవుతుంది వారిద్దరి కళ్లకి. సురేష్‌కి కొడుకు వంకే చూడాలనిపించదు. కనీసం వాడి గురించిన ఆలోచన కూడా నచ్చదు. ప్రజ్వలను ఈ కష్టం నుండి ఎలా బయటకు తీసుకురావాలనే ఆలోచనలో పడతాడు.
ప్రజ్వల అతనిలో వస్తున్న మార్పులను అర్థం చేసుకుంటోంది. కాని అతని సహకారం ఉంటే బాగుండునని ఎదురు చూస్తోంది. అయినా మాటలతో మార్చలేమనుకున్న వాళ్ళ జోలికి వెళ్లి ప్రయోజనం లేదని ఊరుకుంటోంది.
ఇంటి పనులకు పనమ్మాయి వచ్చి చేసి వెళ్ళి పోతుంది. మనూకి సంబంధించిన సమస్త పనులూ తనే స్వయంగా చేసుకోవటం అలవాటు చేసుకుంది ప్రజ్వల. వాడితోనే తన లోకం అన్నట్లుంటుంది. వాడు నవ్వటం మొదలెట్టగానే నెలవంకలా మారే పెదవులు, వెన్నెల్లాంటి స్వచ్ఛమైన నవ్వు ఆమెను విరగపూసిన పారిజాతవృక్షంలా మారుస్తుంది.
‘అన్ని మొక్కలకు అవసరమైన మట్టి , నీళ్ళు అందుబాటులో వున్నా , కొన్ని మొక్కలు పెరిగేందుకు పరిస్థితులు అనుకూలించక పోవచ్చు. ఈ బిడ్డ గర్భంలో ఉండగానే సవ్యంగా ఎదిగేందుకు ఏ పరిస్థితులు అనుకూలించలేదో! గతాన్ని మార్చగలిగే శక్తి ఎవ్వరికీ ఉండదు. ప్రస్తుతం నా చేతుల్లో ఉన్నది వర్తమానం ఒక్కటే. ఈ వర్తమానంలోనే నేను ఉండాలి. నేను వీడి కోసం జీవిస్తాను. వీడికోసమే జీవిస్తాను’ అంటూ గట్టిగా తనను తాను సమాధాన పరుచుకుంటుంది.
అదే సురేష్‌కి అస్సలే మాత్రం నచ్చని విషయం. అతనికది కంటగింపుగా ఉంటుంది. ప్రజ్వలంటే పడి చచ్చేంత ఇష్టం. బాబు పుట్టిన తర్వాత తనను ఖాతరు చేయట్లేదని కోపం. ఏక కాలంలో ద్వైదీభావనలతో, స్పష్టతా రాహిత్యంలో వుంటాడు.
‘ఏం ఆలోచిస్తున్నావు ప్రజ్వలా’ కారు డ్రైవ్ చేస్తూనే తల తిప్పి అడిగాడు.
‘వీడి గురించే ఆలోచిస్తున్నాను’ అంది ఒళ్లో ఉన్న కొడుకును చూపిస్తూ.
‘మరి మన గురించి ఏం ఆలోచించడం లేదా’ తన ముఖం వంకే చూస్తూ అడిగాడు.
‘సురేష్…. ఒక తల్లిగా నేనొక బాధాకరమైన పరిస్థితుల్లో ఉన్నాను. ఆ విషయం నీకు కూడా తెలుసు. కాని నీకు తెలియని విషయం ఏంటంటే ఆ పరిస్థితిని ఎదుర్కోవడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను అని. ఇప్పుడు మనం ఉన్న పరిస్థితి నీకు నచ్చలేదు. సర్దుబాటు చేసుకోలేక దాని నుండి నువ్వు ఎప్పుడో బయటకి వెళ్ళిపోయావు’
‘నేను వెళ్ళిపోయానని అంత స్ధిరంగా ఎలా చెప్పగలుగుతున్నావ్ నువ్వు’ కొంచెం కోపంగా అడిగాడు సురేష్.
‘రాత్రిళ్ళు నిద్ర డిస్టర్బ్ అవుతుందని నువ్వు బెడ్రూమ్ మార్చుకున్నప్పుడే అర్థం అయింది. నీకు నువ్వే దూరం అవుతున్నావని, బాబు విషయంలో అంటిముట్టనట్లుగా ఉంటున్నావని కూడ అర్థమయింది’
సురేష్ ఏమీ మాట్లాడలేదు. మనుషుల్ని, పరిస్థితుల్ని అవగాహన చేసుకోవడంలో ప్రజ్వల ఎప్పుడూ తనకంటే ఓ అడుగు ముందే ఉంటుందని తెలుసు. అంతమాత్రం చేత బాబు బాధ్యతను ముందు నిలిపి తనను కూడా అందులో మునిగితేలమంటేనే కష్టంగా ఉంది. రసానందం కోల్పోయిన ఈ జీవితం చప్పగా ఇలా ఎన్నాళ్ళు? తన స్నేహితులు, సహ ఉద్యోగులు, కజిన్స్లో చాలామంది తాము అనుకున్నవి సాధిస్తూ, కొత్త ప్రదేశాలు సందర్శిస్తూంటే, తను మాత్రం ఐస్‌బాక్స్‌లో పడుకున్నట్టుగా ఉండలేనని అనుకున్నాడు .
ప్రజ్వలకి దగ్గరయ్యేందుకు అనేక విధాలుగా ఆలోచిస్తూండగానే ఇల్లు వచ్చేసింది.
ఆ రోజు రాత్రి ప్రజ్వల కోసం చాలాసేపు ఎదురుచూశాడు సురేష్. ఆ సంగతి అర్థమైనా బాబు ఎందుకనో చిరాకుతో ఏడుస్తూ ఉంటే కదల్లేకపోయింది ప్రజ్వల.
ఇది జరిగిన రెండు రోజుల తర్వాత సురేష్ వాళ్ళ అమ్మ సీతాలక్ష్మి, నాన్న రామారావు వచ్చారు. తను ఉన్న పరిస్థితికి తోడుగా ఇంట్లో మనుషులు ఉంటే బాగుండని చాలారోజుల నుంచి ప్రజ్వలే వాళ్లకు ఫోన్ చేసి రమ్మని అడుగుతూ ఉంది. తల్లిదండ్రులు వచ్చిన దగ్గర నుండి సురేష్ చాలా ఉత్సాహంగా ఉండటం చూసి, వాళ్ళు ఎప్పటికీ ఇక్కడే ఉంటే బాగుండు అని ప్రజ్వల మనసులో అనుకుంది.
అప్పుడప్పుడు తన కొడుక్కి సుఖం లేకుండా పోయిందంటూ అత్తయ్య అంటున్నప్పటికీ ప్రజ్వల వినీ విన్నట్టుగా ఊరుకుంది.
అది విన్న రామారావు ‘కొడుకు సుఖం గురించే కాదే కోడలు కష్టం గురించి కూడా అర్థం చేసుకుని మాట్లాడు’ అన్నాడు.
వాళ్ళు ఉండగానే మనోజ్‌కి నాలుగో పుట్టినరోజు కూడా వచ్చింది. ఆ తర్వాత వాళ్లు, ఇంటి దగ్గర కొన్ని పనులు ఉన్నాయి ముగించుకుని వస్తామని చెప్పి వెళ్లారు .
···
ఒక రోజు సాయంత్రం ఆఫీస్ నుండి సురేష్, ఓ కొత్త వ్యక్తితో వచ్చాడు. అతని పేరు తిరుమల్ అని ఈ మధ్యనే బదిలీపై వాళ్ళ బాంక్‌కి వచ్చాడని పరిచయం చేశాడు ప్రజ్వలకి.
ఇద్దరికీ స్నాక్స్ , టీ ఇచ్చి ప్రజ్వల వాళ్ళ సంభాషణలో దొర్లుతూ ఉన్న అనేక విషయాల్ని వింటూ , పాత స్నేహితుడిలా చొరవగా మాట్లాడుతున్నాడు అనుకుంది మనసులో .
మధ్యలో ఏడెనిమిది నిముషాలకు ఒకసారి లేచి వెళ్లి బాబుని చూసుకుని వస్తూంది .
అలా ఆమెను గమనించిన తిరుమల్ ‘ఏంటి మేడం ఏదో పనిలో ఉన్నట్టున్నారుగా’ అడిగాడు.
‘ఎప్పుడూ ఉండేదేనండి మా బాబుది స్పెషల్ డ్యూటీ’ నవ్వు ముఖంతో అన్నది ప్రజ్వల .
‘బాబు పేరేంటండి ‘ ?
‘ మనోజ్ ‘ . చెప్పింది .
తిరుమల్ ఆలోచనగా ఇద్దరి వంక చూస్తూ ‘ఒకసారి చూడొచ్చా బాబుని’ ? అనడిగాడు.
సురేష్ ముఖంలో ఏదో మార్పును గమనించాడు తిరుమల్ .
‘అలాగే, రండి’ అంటూ ప్రజ్వల లేచి బెడ్రూమ్ వైపు నడవడంతో తిరుమల్ లేచి నిలబడ్డాడు. తప్పదన్నట్టుగా సురేష్ అనుసరించాడు .
విశాలంగా ఉన్న బెడ్ రూమ్‌లో డబుల్ బెడ్‌కి ప్రక్కనే బాబు చిన్న ప్రత్యేకమైన మంచంలో పడుకుని ఉన్నాడు. ఆ మంచానికి నాలుగు వైపులా ఒక అడుగు ఎత్తులో డిజైన్‌గా కట్ చేసిన చెక్కలు అమర్చి ఉన్నాయి.
దగ్గరగా వెళ్లి, పరిశీలనగా చూడగానే, మన వంక చూసేందుకు కళ్ళు స్థిరంగా నిలపలేకపోతున్నాడని, బాబుకి తన అవయవాలేవీ తన స్వాధీనంలో లేవని, ఇంకా చాలా విషయాలే అర్థమయినాయి తిరుమల్కి .
చిటిక వేసి ‘మనోజ్’ అంటూ పలకరించడానికి ప్రయత్నించాడు తిరుమల్.
బాబు నవ్వే సమాధానం .
ముగ్గురూ బయటికి నడుస్తూనే ‘ఒక్కో సమయం ఒక్కో బాధ్యతతో గడుస్తుంది జీవితం . ఇప్పుడు ఇలా సమయం గడుస్తూంది’ నవ్వుతూ చెప్పింది ప్రజ్వల.
హాల్లో కి వచ్చి కూర్చున్నారు .
‘నేను మిమ్మల్ని కలిసిన మొదటిసారే ఇలా చొరవగా మాట్లాడుతున్నానని మీరేమనుకోవద్దు మేడం’ అన్నాడు తిరుమల్.
‘ఆల్రెడీ అలాగే మాట్లాడుతున్నారని అనుకున్నాను. అయినా పర్వాలేదు చెప్పండి’ నవ్వుతూ మనస్ఫూర్తిగా అన్నది ప్రజ్వల.
తిరుమల్ కూడా నవ్వి ‘మా బాబుకి పద్నాలుగు సంవత్సరాలు ఇప్పుడు. మా పెంపకం సరిలేదో లేక అతని స్వభావమో తెలియదు కానీ మొదటి నుంచి సరిగ్గా చెప్పిన మాట వినడు. అలా వాడు మాట వినడం లేదని, విసిగిస్తున్నాడని ఎన్నో సందర్భాల్లో భార్యాభర్తలం వాడిని బెదిరించడం, ఎన్నో రకాలుగా తిట్టటం, ఒక్కోసారి కొట్టడం కూడ చేస్తూ ఉంటాం. ఒక్కగానొక్క కొడుకు ఏమైపోతాడో భవిష్యత్తులో అనే ఒక అభద్రతా భావం మమ్మల్ని నిత్యం పీడిస్తూ ఉంటుంది . అన్ని అవయవాలు సరిగా ఉండి వాడి పనులు వాడు చేసుకుంటూ ఉండే వాడితో మేము ప్రవర్తించే తీరు ఎక్కడా! ఇలా మంచంలో ఉన్న బాబుకి నిత్యం అన్ని రకాలుగా సేవలు చేసే మీరు…. నాకు ఇంక మాటలు రావడం లేదు మేడం ‘ అంటూ తిరుమల్ చెయ్యెత్తి నమస్కారం చేశాడు.
తర్వాత లేచి నిలబడుతూ ‘సురేష్… నువ్వు మేడంకి సహకరించేలాగా ఉండాలి. ఇప్పుడు నువ్వు అలా కనపడటం లేదు నాకు. చెప్పేశాను నువ్వు ఏమనుకున్నా సరే’ అని, వెళ్ళొస్తానని ఇద్దరికీ చెప్పి వెళ్ళాడు.
···
ఆ రోజు బ్యాంక్ నుంచి ఉత్సాహంగా వచ్చాడు సురేష్. స్వీట్స్ తెచ్చాడు. ప్రజ్వలకు, బాబుకు కూడా కొత్త బట్టలు తెచ్చాడు.
ప్రజ్వల ఆశ్చర్యపోయింది.
‘ఏమిటి ఇవన్నీ’ అంది.
‘కూచో చెప్తాను’ అంటూ ‘ నేను కూడ ఎప్పటికీ ఇలాగే వుంటే , నా బుద్ధికి ఆటిజం సోకిందని డాక్టర్లు కన్ఫామ్ చేస్తారు . అది నాకు ఇష్టం లేదు . అందుకే కూర్చో చెప్తాను’ అని సోఫాలో కూర్చోబెట్టాడు.
‘చూడు ప్రజ్వల. మన వయసు చాలా చిన్నది. మనం ఇంకా చాలా జీవితాన్ని చూడాలి. ఈసారి హెల్దీ బేబీని కనాలినువ్వు . మంచి అమ్మా నాన్నలుగా ఉండాలి మనం . కెరీర్లో ముందుకెళ్లాలి మనిద్దరం . ఇవన్నీ చేయాలంటే ఒకటే మార్గం. షామీర్ పేట్ దగ్గర స్పెషల్నీడ్స్ పిల్లలను పర్మినెంట్‌గా చూసుకునే హోమ్ ఉంది. ఇవాళ వెళ్లొచ్చాను. చాలామంది డబ్బున్నవాళ్లు కూడా తమ పిల్లల్ని అక్కడ పెట్టారు. ట్రయిన్డ్ స్టాఫ్ ఉన్నారు. పిల్లల్ని కన్నబిడ్డల్లా చూసుకుంటున్నారు. ఇంప్రూవ్మెంట్ను బట్టి లోపలే స్కూల్ పెట్టి చదువూ చెప్తున్నారు. చార్జ్ ఎక్కువైనా మనం పొందే రిలీఫ్ ముందు అదేం పెద్ద కష్టం కాదు. బాబును అక్కడ పెడదాం. నువ్వు రెగ్యులర్‌గా ఏ వారానికో రెండు వారాలకో వెళ్లి చూడొచ్చు. నేనే తీసుకువెళతాను. ఏమంటావ్’….
నచ్చచెప్తున్నట్టు అన్నాడు.
ప్రజ్వలకు అతను చెప్పింది అర్థమవ్వడానికి కొంచెం టైమ్ పట్టింది.
‘సురేష్’… పెద్దగా అరిచింది.
సురేష్ చురుగ్గా చూశాడు.
‘అరవకు ప్రజ్వలా . ఇలా నువ్వు అరుస్తావని తెలుసు. నువ్వెత్తుకున్న బాధ్యత ఎంత పెద్దదో , దాని బరువెంతో , వయసెంతో , ఎప్పుడు నీ నెత్తి మీద నుంచి దిగుతుందో తెలుసా? నీకు నీ జీవితాన్ని నాశనం చేసుకునే హక్కుంది గాని నా జీవితాన్ని నాశనం చేసే అధికారం లేదు’…
‘సురేశ్… ఈ బాధ్యత మన ఇద్దరి ప్రేమకు గుర్తు’
‘ఆ ప్రేమ నాలో చచ్చిపోయింది. నువ్విలాగే ఉండమంటే నేను కూడా చచ్చిపోతాను. కాని అలాంటి చావు చావడం నాకు ఇష్టం లేదు. నేనేం వాణ్ణి బుట్టలో పెట్టి నదిలో వదలమని చెప్పడం లేదు. హోమ్‌లో ఉంచుదామని చెప్తున్నానంతే’…
ప్రజ్వల ఏడుస్తూ బాబు గదిలోకి వెళ్లిపోయి తలుపు వేసుకుంది.
*** ఆరు నెలలు గడిచాయి. సురేష్ తన ప్రమోషన్‌ను వదులుకుని సబర్బ్‌లో ఉన్న బ్రాంచీకి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. ఉదయాన్నే సురేశ్, ప్రజ్వల తయారయ్యి కారులో బయలుదేరుతారు. ప్రజ్వల ఇప్పుడు టీచర్‌గా పని చేస్తోంది. మనూను ఏ హోమ్‌లో అయితే చేర్చారో ఆ హోమ్‌లోనే . ఉదయం ఆమెను దించి సాయంత్రం తిరిగి పికప్ చేసుకుంటాడు సురేష్.
ఇప్పుడు సురేష్ కూడా కొద్దిగా మారాడనే అనిపిస్తుంది.
తన భార్య తన కోసం కూడా ఉంది అన్న భావన అతనికి శాంతినిస్తోంది.
ఎవరూ ఓడిపోని ఎవరూ గెలవని దారి కూడా జీవితానికి అవసరం అని ప్రజ్వల మెల్లగా గ్రహించింది.
అందులోనే అందరి ఎదుగుదల ఉందని ఆమె అనుకుంటే దానిని జడ్జ్ చేయడానికి మనం ఎవరం?
—– శారద కావూరి
|
Add comment