రాయలసీమ కథా నవలా రచయిత బండి నారాయణ స్వామి తన తాజా రచనను పర్ స్పెక్టివ్ వారి ద్వారా పుస్తకంగా తెచ్చాడు. ఈ పుస్తకం రెండు భాగాలుగా వుంది. మొదటి భాగంలో రాయలసీమ సమాజం గురించి వర్తమాన రాజకీయ సామాజిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రాయలసీమ వుద్యమ కారుడిగా రాసిన వ్యాసాలు వున్నాయి. రెండో భాగంలో రాయలసీమ సాహిత్యం మీద, మొత్తం తెలుగు సాహిత్యంలో భాగంగా స్వామి చేసిన పరిశీలనలూ ప్రతిపాదనలు.
ప్రజలతో నేరుగా సంబంధాలు కలిగి వున్న రచయిత తన సృజన లో యెంతటి ప్రజాపక్షపాతం వహిస్తాడో, ఆచరణలో కూడా అంతే నేరుగా పాల్గొంటాడు. ఈ ప్రజాస్పర్శ రచయిత ను కార్యకర్తను చేస్తుంది. ఇది అందరు వుద్యమకారులైన రచయితలకూ వర్తిస్తుంది. ఆంధ్రప్రదేశ్ విభజనానంతరం రాయలసీమ ప్రయోజనాల పరిరక్షణ కోసం కృషి చేస్తున్న అనేక మంది వుద్యమకారుల్లో బండి నారాయణ స్వామి కూడా ఒకరు. స్వయానా రచయిత అయినందున స్వామి రాయలసీమ మీద తన ఆకాంక్షలను అభిప్రాయాలనూ వ్యాసాలుగా ప్రకటించాడు. వర్తమానంలో రాయలసీమ యెదుర్కుంటున్న అభద్రతల నేపథ్యంలో రాయలసీమ కు యేంగావాలి, యేం నష్టపోయింది, చారిత్రికంగా యీ సమస్యల నిలువేమిటి అనేవాటి గురించి లోతైన విషయ వివరణ తో పాటు పరిశీలన విశ్లేషణ కూడా యీ వ్యాసాలలో వుంది.ఈ మొదటి భాగంలోని వ్యాసాల అన్నింటి సారం రాయలసీమ ప్రాధాన్యత నీళ్లు, నీళ్లు, నీళ్లేనని స్వామి బల్లగుద్ది చెబుతాడు.
స్వామి, సృజనకారుడైన రచయిత అయినందున రెండవ భాగంలోని సాహిత్య వ్యాసాలు చదువరికి ఆసక్తి కలిగిస్తాయి. అన్ని రకాల సాహిత్య ప్రక్రయల మీద స్వామి యీ పుస్తకం లో వ్యాసాలు రాశారు. రాయలసీమ ను నేపథ్యంలో వుంచుకొని సాధారణ తెలుగు సాహిత్యంపై తన అభిప్రాయాలను నిష్కర్షగా వ్యక్తీకరించాడు.
స్వామి యీ పుస్తకం లో ప్రాంతీయత అనే గీటురాయి మీద రాయలసీమ సాహిత్యాన్ని మరీ ముఖ్యంగా తెలుగు సాహిత్యాన్ని చర్చిస్తాడు. ఈ ప్రాంతీయత అంతస్సారంగా తాత్వకధారగా పెట్టుకొని కథా నవలా కవిత్వ రూపాలను విశ్లేషిస్తాడు. మొత్తంగా చూసినప్పుడు యీ పుస్తకంలో స్వామి అస్తిత్వవాదాల వైపు నుంచి మార్క్సిస్టు ఆలోచనా విధానాన్ని విమర్శ చేస్తూ వుంటాడు. కొన్ని చోట్ల రెండింటి సమన్వయంతో చేసిన విమర్శా వుంది. అస్తిత్వవాద ధోరణులు వైపునుంచీ మాట్లాడుతూనే వాటిలోని లోపాలను యెత్తిచూపడమూ కన్పిస్తుంది.
రచయితకుండాల్సిన ఆధునిక లక్షణం ఏమిటి? అన్నదగ్గర మొదలుపెట్టి, శిలాసదృశంగా మారిపోయిన రచయితల్లోని అవగాహనలను ఎండగడతాడు. రచయిత తప్పనిసరిగా తన ప్రాంతీయతలో, కులంలో, లింగభేదంలో వేళ్లుతన్నుకొని ఆ సారంలో నుంచి సాహిత్య సృజన చేస్తేనే అది కళారూపంగా నిలబడుతుందని చెప్తాడు. స్వంత ప్రాంత స్పృహ లేని కథా, నవలా సాహిత్యం ఆత్మ లేనిదని చెప్తాడు.’ తెలుగు కథ-ప్రాంతీయత, నిర్ధిష్టత’ అనే వ్యాసంలో నాలుగు తెలుగు వుపప్రాంతాల సాహిత్యంలోని తారతమ్యాలనూ వైరుధ్యాలనూ వివరిస్తూ, ఉత్తరాంధ్ర వుద్యమ సాహిత్యానికి, మధ్యాంధ్ర వివిధ ధోరణులకు చెందిన సాహిత్యానికి, రాయలసీమ ప్రాంతీయతకు ప్రముఖ స్థానమిచ్చాయనీ, మధ్యాంధ్ర సర్వసాధారిణీకరించబడ్డ కథనాలకు నెలవై స్థానిక విశిష్టతను కోల్పోయిందంటాడు. నాలుగు ఉప ప్రాంతాల్లో నాలుగు రకాల జీవిత సంస్కృతికి యీ కథలు ప్రాతినిధ్యం వహించాయని చెబుతూ, నాలుగు ప్రాంతాలూ కథల రూపేణా చూసినా భిన్నంగా కన్పించినప్పుడు నాలుగు ప్రాంతాలూ నాలుగు రాష్ట్రాలుగా మారివుంటే తప్పేంవుండేదని, అలా జరగక పోవడం వల్ల నష్టం వాటిల్లిందని చెప్తాడు. ఈ పుస్తకంలో భాషాప్రయుక్త రాష్ట్రాల యేర్పాటు చరిత్రలో జరిగిన తప్పుగా స్వామి పేర్కొంటాడు. ఈ భాషా ప్రయుక్తత వల్ల తెలుగు భాషా వ్యవహర్తలే నష్టపోయారని వివరాలతో నిరూపిస్తాడు. హైదరాబాద్ సరిహద్దుగా వున్న తెలుగు మహరాష్ట్ర ప్రాంతాలూ, ఒరిస్సా సరిహద్దుగా వున్న బరంపురం తెలుగు ప్రాంతాలూ, రాయలసీమ కోల్పోయిన బళ్లారి, ధర్మపురి హోసూరు ప్రాంతాలు స్వామి ఆలోచనలలో విశాల తెలుగు భాషా ప్రాంతాలు. కోస్తా రాజకీయ నాయకుల సంకుచితత్వం వల్ల జరిగిన నష్టాలను యీ పుస్తకం లో స్వామి పదే పదే చర్చకు పెడతాడు. ఇదంతా ప్రాంతీయ కోణం నుంచి ప్రాంతాల వెనుకబాటుకు, గత రాజకీయాలకూ గల సంబంధబాంధవ్యాల మీద వెలుగు పరుస్తుంది.
ఈ పుస్తకం లో అస్తిత్వవాద విశ్లేషకుడిగా స్వామి చేసిన సూత్రీకరణలు ఆసక్తికరంగా వున్నాయి. బహుజన కథలు, సంచార జాతుల కథలు, రాయలసీమ దళిత కథలు వంటి వ్యాసాలలో దీనిని గమనించవచ్చు. కుమ్మరిని బీదవానిగా చిత్రించే కథకుడిది ఉపరితల దృష్టి. ఆ కుమ్మరి బీదతనానికి కారణం, తక్కువ ఆదాయం యిచ్చే వృత్తిని అతనికి అనువంశికంగా విధించడం అన్న స్ఫురణతో రాయడం తాత్విక దృష్టి. మార్క్సిస్టు విమర్శకుల ప్రభావం వల్ల కథా పాత్ర రూపకల్పన లో కులాన్ని విస్మరించడం జరిగిందని చెబుతూనే, సమాజంలో ఏ మేరకు చైతన్య పెరిగి వుంటుందో కనీసం ఆ చైతన్య స్థాయికి తగ్గకుండా రచయితలు వున్నప్పుడే సాహిత్యానికి ఆరోగ్యమూ హుందాతనమూ అబ్బుతాయనీ, యీ క్రమంలో కులం నుంచి బీసీ చైతన్యం వరకూ కథ యెందుకు ప్రయాణించలేదో బహుజన రచయితలు తమను తాము ప్రశ్నించుకోవాలంటాడు. దీనిని, స్వామి కులం లో క్లాస్ ను చూడ్డంగానే అనుకోవచ్చు.
దళితకథా ప్రస్తావనలో స్వామి తరచుగా మార్క్సిస్టు ఆలోచనల మీద విమర్శ పెడుతుంటాడు. రాయలసీమ రచయితలలో దళితేతరులు దళిత కథలు రాసారు. దేవపుత్ర, నాగప్పగారి సుందర్రాజ్ లాంటి దళిత రచయితలూ రాశారు. దళిత రచయిత కు జీవితానుభవం తెలిసినంతగా భౌతికంగా దళితేతర రచయితల వీరకాల్పనిక భావుకత్వానికి తెలియకపోవచ్చుని,అంటాడు స్వామి. రాయలసీమ లో మొదటి తరం రచయితలకూ, రెండవ తరం రచయితలకూ దళిత జీవితాన్ని చూసే దృష్టికోణంలో వ్యత్యాసాన్ని కూడా స్వామి గమనించాడు. మొదటి తరం వాళ్ళు వామపక్ష సాహిత్య సంస్థల నుంచి తయారై వచ్చినట్లుగా రెండవ తరం తయారు కానందున వీరి కథనం, పాత్రలభాషా, వస్తాశ్రయం, ఆత్మాశ్రయంగా వుంటాయనీ, దళిత ఈస్తటిక్స్ ను దీప్తివంతం చేయగలిగారనీ అంటాడు.
ఇంకో మంచి గమనిక స్వామి చూసింది, ఆధునిక సాహిత్య ప్రక్రయల్లోకి కోస్తా బ్రాహ్మణులు ప్రవేశించినంత అధికంగా రాయలసీమ బ్రాహ్మలు ప్రవేశించలేదనీ దానివల్ల రాయలసీమ కు రెండు ప్రత్యేకతలు చేకూరాయనీ, అవి ‘కరువు’ చిత్రీకరణ, ‘కులం ‘అనే భౌతిక వాస్తవికత అంటాడు. ఈ సందర్భంగా దళిత రచయితలకు స్వామి కొన్ని ప్రశ్నలు వేస్తాడు…
1.ఒక ప్రాంతంలో దళిత MLA/MP వున్నా, లేదా ఒక ప్రాంతంలో విప్లవోద్యమం ప్రభావవంతంగా వుండినా ఆ ప్రాంతంలో దళితులు హోటళ్లు నడపడం గానీ పాలవ్యాపారం చేయడం గానీ జరిగిందా?
2.రాజకీయ పదవుల్లో వున్న దళితులకు రాజకీయ స్వేచ్ఛ వుందా?
3. తమకూ ఇతర గిరిజన బహుజన మైనారిటీ కులాల మధ్యా ఉమ్మడి ఓటు బ్యాంకు యేర్పడకుండా దళిత రాజ్యాధికారం వునికిలోకి వస్తుందా?
4. దళితులకు రాజకీయ రిజర్వేషన్లు వచ్చి యిన్ని దశాబ్దాలు దాటినా వాటి ప్రభావం యెందుకు వేయలేకపోతున్నాయి?
ఈ ప్రశ్నలకు సాహిత్యం లో సమాధానాలు వెతకమని స్వామి సూచిస్తూ వుండవచ్చు.
గిరిజన సంచార కులాల కథల గురించి రాస్తూ ‘అనుభవ సామీప్యతతో రాసిన కథల్లో జీవితచిత్రణ, వినికిడి జ్ఞానంతో వూహించి రాసిన కథల్లో కథేతివృత్తమూ ప్రాధాన్యత వహిస్తా’ యని అంటాడు. స్వామి పనిగట్టుకొని యానాదుల మీద, నక్కలోల్ల మీదా, బుడబుక్కలవాళ్ల మీద, ఎరుకల, దొమ్మర, చెంచుల మీద వచ్చిన కథలన్నీ వెతికి సంపాదించి మంచి వ్యాసం యీ పుస్తకం కోసమే రాసినట్లుంది. ఈ పరిశీలనలోకి కొన్ని కథలు తప్పిపోయినా (రాయలసీమ దొమ్మర కులం నుంచి వచ్చిన రచయిత్రి నాగమ్మ ఫూలె రాసిన ‘గడీ ఎల్లమ్మ’ కథ స్వామి చూసినట్లు లేదు) యీ ప్రయత్నం అభినందనీయం. ఈ సందర్భంగా, తెలుగు సాధారణ విమర్శ శ్రీ శ్రీ గురజాడ ల దగ్గరే ఆగిపోయిందని స్వామి కామెంట్ చేస్తాడు.
‘రాయలసీమ ముస్లిం కథ’ స్వామి యీ పుస్తకం కోసమే రాసాడు. ఇందులో కూడా’ సర్వే’వీక్షణం కన్పిస్తుంది. షరీఫ్ ‘తలుగ’ కథను స్వామి చూసినట్లు లేదు. ముస్లిం కథలూ తెలుగు సమాజ జీవితం, గురించి రాస్తూ స్వామి ఒక మాట అంటాడు. ‘సామాన్యతల్ని గుర్తించుకుంటే తప్ప వివిధ అస్తిత్వాలు సమాజంలో సహజీవనం చేయలేవు. వివిధ అస్తిత్వాలలో ఉన్నవల్లా ప్రత్యేకతలే సామాన్యతలే లేవు అన్న ధోరణి సామాజిక జీవితానికి పెనుప్రమాదం అవుతుంది’ ఇప్పుడున్న పరిస్థితుల్లో యీ మాట బాగా అన్వయం అవుతుంది. ముస్లింల్లో కూడా వున్న భారతీయ సామాన్యతలను గుర్తిస్తూ సహనభావంతో ముందుకెళ్లాల్సిన అగత్యాన్ని స్వామి గమనింపు గుర్తు చేస్తుంది.
స్వామి లో కన్పించే మరో అంశం గ్రామీణ వాదం. ఆ పేరుతో ఒక వ్యాసమే వుందీ పుస్తకంలో. వివక్ష కు గురవుతున్న గ్రామీణ ప్రాంతానికి నగరమే శత్రువుగా స్వామి పేర్కొంటాడు. ఇది కాస్త విచిత్రంగా అసంబద్ధంగా అనిపిస్తుంది. నగర స్వభావం గ్రామస్వభావానికి విరుధ్ధమనీ గ్రామం వల్లే నగరం బతుకుతుందనీ అయినా గ్రామం మీద నగరం పెత్తనం చేస్తున్నదనీ స్వామి చెప్తాడు. తను స్వయంగా గ్రామ వివక్ష కథలు రాశాడు. సడ్లపల్లె చిదంబరరెడ్డి రాసిన ‘కొల్లబోయిన పల్లె’ కథలను కూడా యీ సందర్భంగా వివరిస్తాడు. ఈ గ్రామీణ వాద నేపథ్యంలోనే స్వామి ‘రాయలసీమ వ్యవసాయ కథలను’ పరిశీలించాడు. ఈ పుస్తకం రచనలో కూడా స్వామి గ్రామీణ విమర్శకుడిగా కన్పిస్తాడు. ఈ పుస్తకం లో వాడిన పలుకుబడి గ్రామాలదే. స్వామి ఒక పల్లెటూరు పాత మనిషి లాగా మనతో మాట్లాడినట్లు రాశాడీ పుస్తకవచనం.
రాయలసీమ సరిహద్దు కథ – ప్రత్యామ్నాయ భావజాలం, అనే వ్యాసంలో తెలుగు – తమిళ ప్రాంతాలైన మొరుసునాడు, తొండనాడు, ఉడుములపేట ల్లోని తెలుగు కథా సాహిత్య రాజకీయాల గురించి చర్చించాడు. ఈ స్థితి కి కారణమైన మధ్యాంధ్ర రాజకీయ సాంస్కృతిక ఆధిపత్యం చేసిన చేటును యెండగడతాడు.
రాయలసీమ దళిత బహుజన నవల గురించి కూడా యీ పుస్తకం లో సవివరమైన వ్యాసం వున్నా స్వామి రాసిన రాయలసీమ కవిత్వ వ్యాసం, రాయలసీమ ప్రాంతీయ అస్తిత్వంను చర్చిస్తూ యిప్పటివరకూ వచ్చిన గొప్ప వ్యాసం. రాయలసీమ కవిత్వంను స్వయంస్పృహ కవిత్వం, భావచైతన్య కవిత్వం, ధిక్కార కవిత్వం అనే మూడు విభాగాలుగా వివరించిన ప్రామాణికమైన పరిశీలనలున్న రచన యిది.
ఇట్లా ఒక రచయిత లో సృజనకారుడిగా తప్పకుండా కలిగివుండాల్సిన లింగ కుల ప్రాంతీయ స్పృహలతో మొదలుపెట్టి, నిర్ధిష్ట ప్రాంతీయత మీదుగా ప్రజాస్వామికత మీదుగా సామరస్య ఆవశ్యకతను వివరించే వైఖరిని స్వామి యీ పుస్తకం లో చూపించాడు. ఒక విలక్షణమైన ఆలోచనాపరుడిగా ప్రాంతీయత అనే గీటురాయి మీద ఒక జాతి ఐదు తెలుగు ప్రాంతాలుగా చేసిన చారిత్రకవిషాధ గమనాన్ని వివరించాడు. అణగారిన వర్గాల, సమూహాల వైపు నిలబడడమే మార్క్సిస్టు అవగాహన అయితే, దోపిడీని యే రూపంలో వున్నా ప్రశ్నించడమే మార్క్సిస్టు ఆచరణ అయితే అస్తిత్వవాది అయిన స్వామి, ఆ నిజమైన అర్థంలో మార్క్సిస్టు సత్యాన్ని ఆచరిస్తూన్న కార్యకర్తేననీ, మార్క్సిస్టుల కంటే ఒకడుగు మేలిమివైపే వున్నాడనీ యీ పుస్తకం లోని ఆయన రాత ద్వారా నిరూపించవచ్చు.
*
Add comment