ఒక నల్ల కథ!

జనాలు సినిమాకి, తన స్టైల్ తో మెస్మరైజ్ చేసే రజనీకాంత్ ని చూడాలనుకుని వస్తున్నారేమో. కానీ ఒక విషయం మనం గమనిస్తే ఈ కాలా సినిమాలో ఆ తరహా స్టైల్ లేదా మ్యానరిజమ్స్  కనిపించవు.

లుపు తెలుపుల రంగులు మనుషులకు ఎప్పుడు ఆపాదించబడ్డాయి? ఇదెప్పుడూ నన్ను వెంటాడే ప్రశ్న. రంగులు ఆపాదించబడ్డం ఎంత వరకు సబబో తెలియదు కానీ. మనుషులను వర్గీకరించిన పాపం ఈ రెండు రంగులకు తగులుతుంది.  పా. రంజిత్ సినిమా “కాలా” చూసాక చాలా ఎమోషన్స్ తో థియేటర్ నుంచి బయటికొచ్చా.

“కాలా” విడుదలయ్యాక చాలా ఏకపక్ష స్పందనలు, గందరగోళ సమీక్షలు  బయటికొచ్చాయి. ఒకరు బాగుంది అంటే మరొకరు చూడటం దండగ అన్న స్పందనను తెలియజేసారు. ఇక ఉండబట్టలేక సినిమా చూడాల్సి వచ్చింది.

ఈ సినిమా రజనీకాంత్ దా? ఈ సినిమా పా. రంజిత్ దా? అని ఆలోచించే వాళ్లు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది వాళ్లదవునో కాదో — కానీ స్లమ్ లలో పుట్టిన నాలాంటి వాళ్లందరిదీ.

స్లంలలో ఉండే వాళ్లు మాత్రమే చూసే B సెంటర్లలో మాత్రమే ఆడే సినిమానా అంటే థియేటర్ లలో నుంచి బయటికొచ్చే వాళ్ళందరి మాట ఇదే. ఇది మాస్ సినిమా అని. సినిమా మాస్  కోసమే తీయబడుతుంది. వాళ్ళు ఎలాంటి మాస్ కి చెందినవారో దాన్ని బేస్ చేసుకుని ఆ సినిమా జీవితం, లేదా సినిమా రీచబిలిటీ ఆధారపడి ఉంటుంది.

ఇప్పటి వరకూ మనం చూస్తూనే వస్తున్నాం. ఒక వర్గం తీసే సినిమాల్లో ఆ వర్గానికి సంబంధించిన భాషా, సంస్కృతీ, సాంప్రదాయం, ఆ ప్రాంతపు కట్టు బొట్లు మాత్రమే చూపించడం జరుగుతూ వచ్చింది. ఇప్పుడు విభిన్న వర్గాల నుంచి వస్తున్న నైపుణ్యం కలిగిన యువ చిత్రదర్శకులు తమ విశాలమైన దృక్పథాన్ని  తమ తమ వర్గాల ప్రాతినిధ్యాల్ని  చాలా క్రియేటివ్ గా  చూపిస్తున్నారు.

“కాలా” సినిమాలో చూపించబడ్డ జీవితం ఎంచుకున్న కథా వస్తువు, ఆ సినిమాకి సంబంధించిన  రీచబిలిటీని జడ్జ్ చేస్తుంది ఇక్కడ. రీచబిలిటీనే కాదు ఆ కథా వస్తువుగా ఎంచుకోబడ్డ జీవన వైరుధ్యాలు చూపబడ్డాయ్. అలాంటి జీవితాలతో సంబంధం  కలిగివున్న వాళ్లకు కథ చేరువైనట్టు, ఇతరులకు ఇది కనెక్ట్ అవదు.

జనాలు సినిమాకి, తన స్టైల్ తో మెస్మరైజ్ చేసే రజనీకాంత్ ని చూడాలనుకుని వస్తున్నారేమో. కానీ ఒక విషయం మనం గమనిస్తే ఈ కాలా సినిమాలో ఆ తరహా స్టైల్ లేదా మ్యానరిజమ్స్  కనిపించవు. చాలా సహజంగా ఒక వర్గాన్ని రెప్రెసెంట్ చేసే నాయకుడిగా రజనీకాంత్ కనబడటం గమనించాల్సిన విషయం.

కాలా సినిమా ఈ నేల మా హక్కు అన్న అంతఃసూత్రంగా తీయబడింది. మా నేల, మా హక్కు, మా ఓటు ఇవ్వేకదా ఒక సగటు పౌరుడు కోరుకునేది.

నేలమీద ఆధిపత్యం. హక్కుల మీద ఆదిపత్యం. ఓటును లాక్కోడానికి పొంచిఉండే రాజకీయం. ఈ మధ్యే మనం వేదాంతకీ ఎదురొడ్డి ప్రాణాలు కోల్పోయి తాత్కాలికంగానైనా ఆ ప్రాజెక్టుని  ఆపించేయటం మనం చూసాం.

కాలా సినిమా అంబేద్కర్ భావజాలంతో పాటు, లెనిన్ పేరును కొడుకుకు పెట్టుకున్న కాలాకి మార్క్సిజంపై ఉన్న ప్రేమ కనిపిస్తుంది. ఒకవైపు విప్లవం మరో వైపు అన్యాయాన్ని అంతే బలంతో ఎదుర్కోడానికి రౌడీ ముద్రతో కాలా కనిపిస్తాడు. హక్కులకు భంగం వాటిల్లిన చోట ఉద్యమం ఆక్రోశం కలిసే ఉంటాయ్. తండ్రి కాలా రౌడీఇజం అనిపించే అన్యాయాయాన్ని వ్యతిరేకించే పని చేస్తుంటే కొడుకు లెనిన్ ఉద్యమం విప్లవం గురించి మాట్లాడటం అంతర్లీనంగా కనిపిస్తుంది.

ఈ మధ్య దేశంలో జరిగిన చాలా విషయాలు ఆర్ధిక, సామాజిక, రాజకీయ విషయాలు తన సినిమాలో చర్చకు పెట్టారు పా. రంజిత్. ఈ సినిమాలో కూడా  చాలా చర్చించాల్సిన విషయాలే వున్నాయి.

ముఖ్యంగా:

1. స్వచ్చ భారత్ పేరుతో స్లంలపై జరుగుతున్న ఆక్రమణ.

2. నలుపు తెలుపు రంగుల గురించిన రేసిజం

౩. ఫాసిజం

4. దేశభక్తున్ని నేను శుభ్రత నా ధ్యేయం అని మాట్లాడే నాయకుడు

5. ఎప్పుడూ డబ్బులకు అమ్ముడుబోయే ఓటర్లు

6. ఉంటున్న ప్రాంతాలని బట్టి స్టేటస్ decide చేయడం లాంటివి

7. స్లంలలో పెరిగే వాళ్లలోపలి భయాలు

8. న్యాయంకోసం నిలబడేవ్యక్తుల నైతికవిలువలు

9. సమాజంలో స్లంలలో ఉండేవాళ్లందరిని క్రిమినల్స్ అనుకునే మనస్తత్వం

10. అంబేద్కర్ విలువల పట్ల ఆదర్శాలపట్ల అవగాహన

ఇలా రాసుకుంటూ పోతే చాలా విషయాలు చర్చకు వస్తాయ్.

దేశభక్తి ఏంటి? సమానత్వం ఏంటి? అనే చర్చలు జరిగినప్పుడు దేశభక్తి కూడా సమానత్వాన్ని డామినేట్ చేసేదిగానే కనబడుతుంది. కాలా సినిమాలో కూడా దేశభక్తి పేరుతో శుద్ద్ ముంబయ్ పేరుతో స్లంలలో నివసించే వలసవచ్చిన దక్షిణ భారతీయులు నివసించే ధారవి ప్రాతాన్ని ఖాళీచేయించాలన్న దురాలోచనతో ఉంటాడు హరిసింగ్ అనే రాజకీయనాయకుడు. కాలా తండ్రి వీరయ్య బ్రతికి ఉన్నప్పటినుండి ఆ ప్రాంతాన్ని అక్కడి ప్రజలను కంటికి రెప్పలా కాచుకుంటూ ఉంటాడు కాలా తండ్రి వీరయ్య. హరిసింగ్ చేతుల్లో దుర్మరణం చెందుతాడు.

కాలా ఆ ప్రాంత ప్రజలకు పెద్దదిక్కుగా ఎదుగుతాడు. వాళ్ల స్థలాలని ఎవరూ ఆక్రమించుకోకుండా కాపు కాస్తుంటాడు. ఆ క్రమంలో హరి సింగ్ తో తన గొడవలు తారాస్థాయికి చేరటం. కాలా భార్య కొడకు హత్యగావింపబటం జరుగుతుంది. ఆ సంఘటనతో కాలా కృంగిపోతాడనకుంటాడు. కానీ కాలా ఒక్క ఇంచు స్థలాన్ని పిడికెడు మట్టిని కూడా దారావి నుంచి తీసుకెళ్లనివ్వనని ప్రతిఙ్ఞ చేస్తాడు. హరిసింగ్ దారావిని ఆక్రమించుకున్నాడా ? కాలా పిడికెడు మట్టినైనా పట్టుకుపోగలిగే సాహసం చేశాడా? సినిమాలో చూడాల్సిందే.

సినిమాలో నాకు నచ్చిన అంశం అసురుడు పుస్తకాన్ని కాలా బల్లపైన చూడటం. సినిమా అంత ఆనంద్ నీలకంఠన్ రాసిన అసురుడులోని చర్చనే ప్రధానంగా వివిధ రూపాల్లో కనబడటం. రాముని వర్గం (హరిసింగ్) రావణున్ని చంపుతున్నాం అనుకుంటుంది. రావణుడు(కాలా) తన ప్రజల జీవించే హక్కును , నేల హక్కును కాపాడేందుకు తన ప్రాణాలర్పించడానికి పోరాడుతుంటాడు. ఎవరిది న్యాయం ఎవరిది అన్యాయం.

నల్లగా ఉన్నా మీతో కలిసి ఉండటం లేదా అని ఆ మధ్య ఒక ఉత్తర భారతదేశపు  మంత్రి అన్నాడు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానంద్ ని కలవాలంటే స్నానాలు చేసి ఉతికినబట్టులు వేసుకుని రండి అంటూ ప్రభుత్వ యంత్రాంగన హడావుడి. ఒక ఆంధ్ర మంత్రి దళితులకు చదువు అవసరమా అంటాడు. భారతదేశంలో అంబేద్కర్ ఫోటోలు కాదు ఆదర్శాలు దర్శనమిస్తే చాలనుకుంటున్న సందర్భంలో ఉన్నత విశ్వవిద్యాలయాల్లో ఒక రోహిత్ కనిపిస్తాడు. నేలను నీళ్లను లాక్కుపోయే MNC భూతంతో ఎప్పటికప్పుడు యుద్దం జరుగుతూనే ఉంటది.

కాలా సినిమా, కబాలి సినిమా, పా.రంజిత్ రెండు సినిమాలు వలస జీవిత చిత్రాలని చాలా క్షుణ్ణంగా ప్రతిబింభిస్తాయ్. రెండు సినిమాల్లో అప్రెస్డ్ లైఫ్స్ ని వాళ్ల దృష్టికోణంలోనేకాదు రాజకీయ, సామాజిక, ఆర్ధిక దృష్టి కోణాలనుంచి విశ్లేషిస్తూ సమగ్ర జీవన విధానాన్ని  మన ముందుంచుతున్నాడు.

ఈ సినిమాకి కొంత అనుబంధంగా చూసిన వాళ్లు చూడాలనుకున్న వాళ్లు:

1. ఆనంద్  నీలకంఠన్ రాసిన “అసురుడు”

2. రాణా అయ్యూబ్ రాసిన “గుజరాత్ అల్లర్లు” అనే పుస్తకాలను చదివితే బాగుంటుంది.

మొత్తంగా కాలా సినిమా అన్ని వర్గాల వారికి నచ్చకపోవచ్చు. అయితే గ్రౌండ్ రియాలిటీస్ కి చాల దగ్గర ఉందీ. వాటిని ఒప్పుకునే గుండె కావాలి.

ఇప్పటికీ కొన్ని వృత్తులు 4th Grade jobs గా వీళ్లకి మాత్రమే ఉండటం. వాళ్లని పనిని బట్టి తక్కువగా చూడటం చూడా అనాగరిక ఆలోచనే. సత్యాన్ని  జీర్ణించుకుంటూ ఆ సినిమా చూడటం అవసరం.

తప్పొప్పులు ఎంచటం కన్నా ఇన్నాళ్ల తర్వాత భారతదేశ సినిమూ పరిశ్రమ మళ్లీ ప్రజలను దృష్టిలో ఉంచుకుని అసమానతల గురించి క్షుణ్ణంగా మాట్లాడుతూ సమాజాన్ని చైతన్య పరిచే దిశగా వెళ్తున్నందుకు ఆనందించాల్సిన విషయం.

*

మెర్సీ మార్గరెట్

6 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • చాలా చక్కగా విశ్లేషించారు..కాలా సినిమాను
    అయితే ఇది స్లం లో పుట్టిన వాళ్ళకే బాగా అర్ధమౌతుందనుకోవడం పొరపాటు!
    రజనీకాంత్ సినిమాలంటే కేవలం అతని మానరిజమ్స్ మాత్రమే కాదు,కథలోని బలాన్ని కూడా చూస్తాడు ప్రేక్షకుడు!
    స్వచ్ఛభారత్ పేరు ను అడ్డుపెట్టుకునో,మరొకటి అడ్డుపెట్టుకునో…తరతరాలుగా బలమున్నోడు బలహీనుడిని దోచుకోవడమే లక్ష్యం!అది భూమిపై హక్కు కావొచ్చు..మరోటి కావొచ్చు…
    ఇక్కడ ధారావి అనే స్లం ఏరియా గురించి..
    మా భూమి మాకే కావాలి అని ఒక వర్గం పోరాటం,
    ఆశచూపి.. లాక్కుని తమ జెండా ఎగురవేయా లనేది మరో వర్గ ఆరాటం!
    ఇక్కడ ఉద్యమంపై ప్రేక్షకుడికి ఒక అవగాహన రావాలంటే..
    చిన్న చిన్న ఇరుకు ఇళ్ళల్లో..అదీ పదేసి మంది ఒకే ఇంట్లో సంసారాలు చేయడం,చూడకూడని దృశ్యాలు పిల్లలు చూడాల్సి రావడం,తద్వారా వారి మానసిక ఒత్తిడి, సమాజం పై వాటి ప్రభావం..ఇవన్నీ హృద్యంగా చిత్రీకరించాల్సిన అవసరం ఉంది!
    అవేమీ లేకుండా ఒక బాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ..వాస్తవానికి దూరంగా ఉండే ఫైటింగులతో సినిమాను లాక్కోచెయ్యాలనే తపన…కేవలం రజనీకాంత్ పేరు చెప్పి ప్రేక్షకులను సినిమాకు రప్పించెయ్యొచ్చనే ఆలోచన తప్ప మరోటికాదు!
    సగటు ప్రేక్షకులకు నవలలు చదివి సినిమాను అవగాహన చేసుకునే ఓపిక ఉండదు! హక్కులకోసం పోరాడాలి, సాధించాలి.. కానీ దానిని వక్రీకరించకూడదు!
    ఏదైనా ఒక మంచి సినిమాను మీ కోణంలో పరిచయం చేసినందుకు అభినందనలు!!????????
    “యత్భావే తద్భవతి”!

  • చాలా బాగా రాశారు మెర్సీ గారు. వందల కోట్లు పెట్టి రోబో- 2 లాంటి పూర్తి కమర్షియల్ సినిమా తీస్తూ ఒక సామజిక బాధ్యత తో సమాజంలో అణచివేతకు గురవుతున్న ఒక వర్గాన్ని సప్పోర్ట్ చేస్తూ, “కబాలి”, “కాలా” లాంటి సినిమాలు తీస్తున్న రజనీ కాంత్ గారిని ముందుగా అభినందించాల్సిందే! ఎందుకంటే రజనీ కాంత్ కాకుండా, ఇంకా ఎవరు చేసినా ఈ రోజు ఈ సినిమా పై ఇంత చర్చ జరుగుండేది కాదు, పా.రంజిత్ కి ఇంత గుర్తుండేది కాదు.
    జయాప జయాలను , ఫ్యాన్స్ ఇష్టా ఇష్టాలను పట్టించుకోకుండా సమాజంలో అణచివేయ బడ్డ ఒక నిజాన్ని, అంబేడ్కరిజాన్ని ధైర్యంగా చెప్పే ప్రయత్నం చేసిన పా. రంజిత్ ని, రజినీ కాంత్ గారిని, ఇద్దరినీ అభినందించాల్సిందే.
    ఆ మధ్య మీలో ఎవరు కోటీశ్వరుడు పోటీలో ఎన్నో ప్రశ్నలకు అవలీలగా జవాబులు చెప్పి, ఎన్నో స్టెప్స్ దాటిన వ్యక్తి “దాదాసాహెబ్” అంటే ఎవరో తెలియనటు వంటి .
    ఇప్పటి ఈ సమాజంలో ‘ కాలా ‘ లాంటి సినిమాలు చాలా అవసరం. తెలుగులో కూడా మన హీరోలు, వారి ఫాన్స్ ని దృష్టిలో పెట్టుకొని కాకుండా, సామజిక బాధ్యతో సినిమాలు తీయాల్సిన అవసరం ఎంతో వుంది.

  • నేను సినిమా చూడలేదు కానీ సాధారణంగా అన్ని వర్గాలలోనూ మంచివారు చెడ్డవారు ఉంటారు .సహజంగా అగ్ర వర్గం వారిని విలన్లుగా చూపి ఆనంద పడే వారిని చూసి ఎలా అర్ధం చేసుకోవాలో తెలియదు .అగ్ర వర్గం బాధలు (స్థలం కనీసం గజం పది వేలకు కొనుకుంటే ,మరొకరికి ఉచితంగా రావడం )ఎవరికి పట్టవు .అన్యాయాలు చేసేవారు పది శాతం ఉన్నారనుకుంటే వారిని చూపి మిగిలిని అందరి మీద కోపం ,అక్కసు వెళ్లగక్కడం .టీవీ లలో ఇంకా పాతకాలపు అన్యాయానికి గురి అవుతున్నాం అంటూ అబద్ధపు ప్రచారాలు .సమాజం లో అందరికి ఒకే న్యాయం ఉండాలి

  • అంబేడ్కర్ విలువల పట్ల అవగాహన కావాలని చెప్పిన వ్యక్తులు ఆర్యులు, ద్రావిడుల గురించి అంబేడ్కర్ చెప్పింది ఎందుకు నమ్మరు? భారతదేశాన్ని ఆర్యులు, ద్రావిడులు అన్న బూటకపు విభజనతో ముక్కలు చేయాలనుకున్న వేర్పాటువాద శక్తుల కుట్రే ఈ ఆర్యుల దురాక్రమణ అనే బూటకపు ప్రచారం. పురాతత్త్వ, జన్యు, భాషాశాస్త్ర పరంగా ఆర్యులు ఆక్రమణ, వలస అనేది పచ్చి అబద్ధమని శాస్త్రీయ పరిశోధనలు ఇప్పటికే చెబుతున్నాయి. ఇది కచ్చితంగా అంబేడ్కర్ భావజాలానికి విరుద్ధం, వెన్నుపోటు. ఇదే పత్రికలో ఇదే సినిమాపై వచ్చిన మరొక వ్యాసంలో ఆ వివరాలు యిచ్చాను. చదువుకోవచ్చు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు