అది పోఖ్రాలో నేనున్న ఆఖరి రోజు.
ఫీవా సరస్సు ఒడ్డున ఉన్న Lake Shore రెస్టారెంట్ ఎప్పుడూ కిక్కిరిసి ఉంటుంది. ఆ రాత్రి కూడా ఆ రెస్టారెంట్ అలాగే ఉంది. ఒకే ఒక్క టేబుల్ ఖాళీగా ఉంది, కాని ఆ టేబుల్ కి ఒకవైపున 25 ఏళ్ల యువతి కూర్చుని ఉంది. ఆమె అనుమతితో ఆమె ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాను. ఆమె నేపాలీ జాతీయురాలు. హిమాలయాలకు చెందిన లోతట్టు ప్రాంతం నుండి వచ్చింది. ఉన్నత కుటుంబానికి చెందిన అమ్మాయి. ఉన్నత విద్యావంతురాలని ఆమె ఇంగ్లీష్ ఉచ్ఛారణను బట్టి అర్థమయింది. ఖాట్మండులో ఉద్యోగం చేస్తోంది. ఆమె ఎంతో అందంగా ఉంది. ఎలా అంటే స్వచ్ఛమైన హిందూ వదనం. స్వచ్ఛం అని ఎందుకంటున్నానంటే భారతదేశంలో అటువంటి హిందూ ముఖాల్ని మనం చూడలేము. ఇక్కడ హిందూ అనే పదాన్ని మతపరంగా నేను చెప్పడం లేదు. ఎటువంటి ముఖ ఆకృతి కలిగివుంటే ఒకరిని హిందూ అని ఎవరైనా చెప్పకుండానే గుర్తిస్తారో ఆ ముఖ లక్షణాలను గురించి నేను చెబుతున్నాను. భారతదేశంలో వస్త్రధారణ పద్ధతులను పక్కన పెడితే–ఎవరు హిందువో, ఎవరు ముస్లిమో చెప్పడం కష్టం. ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ నుండి శ్రీలంక వరకూ దాదాపు ముఖాలన్నీ ఒకేలా ఉంటాయి. కాని నేపాల్ లో మాత్రం ఇటువంటి స్వచ్ఛమైన హిందూ ముఖాలు మనకు చాలానే కనిపిస్తాయి. అవి మంచితనంతో, దయతో నిండి ఉంటాయి. అలాగే వారు ఇతరులతో ప్రవర్తించే విధానం కూడా మృదువుగా, ప్రేమాస్పదంగా, మన పట్ల candid curiosity తో కూడి ఉంటుంది.
ఆమె నన్ను “భారతదేశం నుంచి వచ్చారా?” అని ఇంగ్లీష్ లో పలకరించింది. అలా మొదలైన సంభాషణ ఎంతో ఆత్మీయంగా కొనసాగింది. అన్నపూర్ణ సర్క్యూట్ ట్రెక్ నుండి తిరిగి వస్తూ పోఖ్రా చేరుకున్నానని ఆమె చెప్పింది. నేను మరుసటి రోజు ఉదయం అదే ట్రెక్ కి వెళుతున్నానని తెలుసుకొని చాలా సంతోషపడింది. ఎన్నో వివరాలు, జాగ్రత్తలు చెప్పింది. ఆమె సొంత ఊరు ఎవరెస్ట్ పర్వతానికి దగ్గరలో ఉన్న ఉన్న జిరి అనే పట్టణమని, దానిని సెకండ్ second Switzerland అని పిలుస్తారని, ఆ పట్టణాన్ని చూడడానికి నన్ను రమ్మని కోరింది. ఒకటి రెండు ఏళ్ళలో అక్కడికి తప్పకుండా వస్తానని, ఆమె సలహాలు తీసుకొని జిరి నుండి ఎవరెస్ట్ ట్రెక్ కి వెళతానని చెప్పాను. జిరి పట్టణాన్ని second Switzerland అని పిలుస్తారని ఆమె అన్నప్పుడు, Switzerland నే second Jiri అనాలని చెప్పాను. హిమాలయాలకు మించినది సృష్టిలోనే లేదని ఆమెకు ఎలా తెలుస్తుంది!
హిమాలయాల నుండి వచ్చిన ఆమెను గిరిజ అని పిలవాలనిపించింది. పర్వత రాజు కుమార్తె పార్వతి నడయాడిన చోటు నుండి వచ్చిన అమ్మాయి కనుక. ఆమె పూర్వికురాలు సాక్షాత్తు పరమశివుని ప్రేమను పొందిన పార్వతి కనుక.
మనుషుల పట్ల ఇటువంటి స్వచ్చందమైన కుతూహలం, స్నేహ భావం భారతీయులలో చాలా తక్కువ చూస్తాము.
2
పర్వతారోహకుల స్వర్గ ధామంగా పిలువబడే ఈ పోఖ్రా ‘సరస్సుల నగరం’గా కూడా పిలవబడుతోంది. ఈ నగరం నేపాల్ రాజధాని ఖాట్మండు నుండి సుమారు 200 కిలోమీటర్ల దూరంలో, ఫీవా సరస్సు తీరంలో ఉంది. అద్భుతమైన అన్నపూర్ణ పర్వత శ్రేణి నగరం చుట్టూ వ్యాపించి ఉంటుంది, ఇందులో ప్రపంచంలోని పది అత్యంత ఎత్తైన పర్వతాలలో మూడు ఉన్నాయి: ధౌలగిరి, అన్నపూర్ణ, మనస్లు. పోఖ్రా నేపాల్ యొక్క పర్యాటక రాజధానిగా అధికారికంగా ప్రకటించబడింది. ధవళగిరి, అన్నపూర్ణ పర్వతశ్రేణుల్ని దర్శించాలనుకునే వారికి base గా ఉంది. ప్రపంచంలోకల్లా లోతైన bungee jump కూడా ఇక్కడే అందుబాటులో ఉంది.
సాహస ప్రియులకు పోఖ్రా ఒక స్వర్గం. ఈ నగరం పారా గ్లైడింగ్, ట్రెక్కింగ్, మౌంటైన్ బైకింగ్, వైట్ వాటర్ రాఫ్టింగ్ వంటి అనేక కార్యకలాపాలను అందిస్తుంది. ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ ట్రెక్కింగ్ మార్గాలలో ఒకటైన అన్నపూర్ణ సర్క్యూట్, పోఖరా నుండి ప్రారంభమవుతుంది.
పోఖరా అనేక జాతుల సమ్మేళనం, ఇందులో గురుంగులు, మగర్లు, నేవార్లు ఎక్కువగా నివశిస్తారు. ఈ నగరం అనేక గోర్కా సైనికులకు కూడా నివాసంగా ఉంది. దసరా, తిహర్, హోలీ వంటి పండుగలు వారు గొప్ప ఉత్సాహంతో జరుపుకుంటారు.
పోఖ్రా చూడటానికి యూరోపియన్ సిటీలా ఉంటుంది. ఎప్పుడూ విదేశీయులతో కళకళలాడుతూ ఉంటుంది. నగర నిర్మాణం, రెస్టారెంట్స్, షాపులు యూరప్ నే తలపుకు తెస్తాయి. అంతర్జాతీయ షాపింగ్ అనుభవాన్ని కూడా ఇక్కడ పొందవచ్చు. నగరంలో సాయంత్రాలు గడపడం చాలా exotic గా ఉంటుంది.
Fewa Lake ఒడ్డున ఉన్న ఏ రెస్టారెంట్ లో కూర్చున్నా ఎంతో మంది విదేశీయులు, పర్వతారోహకులు మనకు స్నేహితులు అవుతారు. నగర వాతావరణం ఎంతో స్నేహపూర్వకంగా ఉంటుంది.
ఎత్తైన హిమాలయాలపైన ఒక లోయలో ఉన్ప పోఖ్రా పట్టణంలో కొన్ని నెలల పాటు ఉండిపోవాలనిపిస్తుంది. ఎక్కడైనా ప్రశాంతంగా కొంత కాలం గడపాలనుకునేవారికి మంచి చోటు. ఆధునికత, ప్రకృతి ఒకే చోట చక్కగా అమరిన చోటు ఇది.
పోఖ్రా ఒక నగరం మాత్రమే కాదు; అది ఒక అనుభవం. దాని అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు, సుసంపన్న సంస్కృతి, సాహసాలకు ఉన్న అవకాశాలతో నేపాల్‌కు ప్రయాణించే ఎవరైనా తప్పనిసరిగా సందర్శించాల్సిన ప్రదేశం.
నేపాల్‌లోని అత్యంత పురాతన ఆలయాలలో ఒకటైన బింద్యబాసిని ఆలయం నుండి ఫోఖ్రా నగరాన్ని, దానిని చుట్టూ వ్యాపించివున్న హిమాలయాల్ని చూడడం ఎంతో అద్భుతంగా ఉంటుంది.
*
Sriram M గారు
చాలా చక్కని అనుభూతిని, అనుభవాలను మాతో పంచుకున్నందుకు చాలా సంతోషం సర్..
అభినందనలు మీకు 🌿🍀