ఇది ఆదూరి సత్యవతీదేవి గారి కవిత:
ఎప్పుడూ ఏదో ఒక మూల నాలో
జరుగుతూనే వుంటుంది
ఒక దీపతోరణ చలనోత్సవం
ఆ జ్వలనం లేకపోతే
జవం జీవం లేనట్లే అనిపిస్తుంది
పదాల పట్టుదారాల కంబళి కప్పుకుని విహరిస్తుంటా
ఉండీ వుండీ ఒక పరిమళపు శ్వాస
వాయులీనంలా వ్యాపిస్తుంది
మెల్ల మెల్లగా మంచు విభావరి జారిపోతుంది
రేకుల విప్పుకుంటున్న దరహాసాలు
చంద్రవంకల్లా ప్రేమలాహిరులూగుతుంటాయి
అప్పుడొక రసావిష్కరణోత్సవం
అదొక రసజ్వలనా యానం
దృశ్యం వెంట దృశ్యం సిద్దమై వుంటుంది
యవనిక జారిపోతుంది
రంగం రూపుమారిపోతుంది
ఉప్పగా, చేదుగా ధారలు ధారలుగా కాంక్షలు కరిగి
అలలుగా జలపాతాలుగా సముద్రాలుగా
ఒక భీకర వేషంతో నన్ను ముంచెత్తుతాయి
పట్టుతప్పి శిథిలాల్లో కూరుకొని
జీవనలత శిశిరమయ్యే వేళ
దీపతోరణ చలనోత్సవం
గాఢంగా, స్నేహంగా దరహాసమౌనంతో పరిమళిస్తూ
నన్ను హత్తుకుంటుంది
తన వెలుగు కొసలపై కెక్కించుకొని
అడవుల లోయల్లో, అనంతాంబర వీధుల్లో
జనజీవన బాధల్లో
గాలిలా పరుచుకుంటూ నన్ను
తన వెంట తిప్పుతుంది
అప్పుడొక నూతన భావోద్వేగం
ఉక్కిరి బిక్కిరిగా నాలో లయమౌతుంది
నేనెప్పుడూ వినని, చూడని
ఒక పక్షిపాట, ఒక పాద ముద్ర
నాకొక సూర్యనేత్రాన్ని బహూకరిస్తాయి
జవజవలాడే ఒక కవితా సింధువులో
నన్ను ముంచి లేవనెత్తుతాయి
అది ఒక విశ్వభావనల క్షేత్రం
అది ఒక ఉజ్వలాకాశ హాసం!
ఇప్పుడు
ఉప్పుగా, చేదుగా, ధారలు ధారలుగా
కాలం నన్ను వంచించలేదు
కొత్తగా సిద్ధించిన యీ విద్యుత్ రూపాన్ని తాకనైనా లేదు
దృఢంగా, స్థిరంగా ముందుకు సాగే నా అడుగుల క్రింద
దీనంగా నిస్తేజంగా ముడుచుకు పోతుందొక మాయాజాలం
ఆంధ్రజ్యోతి వారపత్రిక
1 జూలై 1990
( ఆదూరి సత్యవతీదేవి గారి ” రెక్క ముడవని
రాగం ” కవితా సంపుటి నుంచి )
—————————— ———————-
ఈ కవితను ఒక్కో పాఠకుడు ఒక్కోరకంగా అర్థం చేసుకునే, ఆస్వాదించే వీలుందని అనుకుంటాను. ఈ కవిత్వ పాఠకుడు ఈ కవితను అర్థం చేసుకున్న తీరును, ఇట్లా ఈ రీతిన మీతో పంచుకుంటున్నాడు.
ఈ కవితలోని సొగసు చాలావరకు ” దీపతోరణ చలనోత్సవ” మనే ఈ కీలక పదబంధంలో, ఈ కవితా శీర్షికలో ఉందనిపిస్తుంది. దీపతోరణ చలనోత్సవం – ఒక చక్కని అనుభూతి సాంద్రమైన అభివ్యక్తి. దీపాలతో తోరణం – దీపతోరణం! చలించే దీపతోరణం! పైగా ఈ తోరణాలతో ఒక ఉత్సవం! ఇక ఈ భావనలోని సౌందర్యాన్ని ఎవరికి వారు ఊహించవలసినదే అనుభూతి చెందవలసినదే. ఈ పదబంధం కవయిత్రి అంతరంగ కాంతులకు సంకేతం.
“ఎప్పుడు ఏదో ఒక మూల నాలో
జరుగుతూనే ఉంటుంది
ఒక దీపతోరణ చలనోత్సవం
ఆ జ్వలనం లేకపోతే
జవం జీవం లేనట్లే అనిపిస్తుంది”
దీపతోరణచలనోత్సవమనే జ్వలనం (జ్వాల ), ఈ జ్వాలా తీవ్రత తనలో తగ్గినవేళ జీవితం నిస్సారమైనదిగా అనిపిస్తుంది అంటున్నారు కవయిత్రి.
“పదాల పట్టుదారాల కంబళి కప్పుకొని విహరిస్తుంటా
ఉండీ వుండీ ఒక పరిమళపు శ్వాస
వాయులీనంలా వ్యాపిస్తుంది
మెల్ల మెల్లగా మంచు విభావరి జారిపోతుంది”
విభావరి అంటే రాత్రి కదా. రాత్రి అనెడి మంచు జారిపోవడం, కరిగిపోవడం జరుగుతుందన్నమాట.
“రేకులు విప్పుకుంటున్న దరహాసాలు
చంద్రవంకల్లా ప్రేమలాహిరులూగుతుంటాయి”
రేకులు విప్పుకునేవి కుసుమాలని మనకు తెలుసు. ఈ కుసుమాలకు దరహాసాలతో పోలిక ( దరహాసాలు, కుసుమాలకు ప్రాతినిధ్యాలు – metonymy). దరహాసాలకు రూప సాదృశ్యాలు : చంద్రవంకలు. లాహిరులంటే మైకం కలుగజేసే ద్రవాలు, పరిమళపు తేనియలు!
ఇక, ” అప్పుడొక రసావిష్కరణోత్సవం
అదొక రసజ్వలనా యానం “
ఇంతవరకు ఈ కవితలో కూడా ఒక రసజ్వాలనా యానమే!
” దృశ్యం వెంట దృశ్యం సిద్ధమై వుంటుంది
యవనిక జారిపోతుంది ( యవనిక : తెర )
రంగం రూపుమారిపోతుంది
ఉప్పగా, చేదుగా ధారలు ధారలుగా కాంక్షలు కరిగి
అలలుగా జలపాతాలుగా సముద్రాలుగా
ఒక భీకర వేషంలో నన్ను ముంచెత్తుతాయి”
ఏవో “కాంక్షలు” ఉప్పగా, చేదుగా ధారలు ధారలుగా మారతాయి. అవి భీకర వేషంలో తనను ముంచెత్తుతాయి అంటున్నారు కవయిత్రి.
“పట్టుతప్పి శిథిలాల్లో కూరుకొని
జీవనలత శిశిరమయ్యే వేళ
దీపతోరణ చలనోత్సవం
గాఢంగా, స్నేహంగా దరహాసమౌనంతో పరిమళిస్తూ
నన్ను హత్తుకుంటుంది”
ఈ “కాంక్షల” వల్ల జీవితం పట్టు తప్పే వేళ, జీవనలత శిశిరమయ్యే వేళ; గాఢంగా స్నేహంగా దరహాసమౌనంతో పరిమళిస్తూ కవయిత్రిని హత్తుకుంటున్నదీ, ఆదుకుంటున్నదీ ఈ దీపతోరణ చలనోత్సవమే! ఈ జ్వలనమే! ఆమె మదిలోపల నివాసముంటున్న కాంతులే!
ఏం చేస్తుంది ఈ జ్వలనం?
” తన వెలుగు కొసలపై కెక్కించుకొని
అడవుల లోయల్లో, అనంతాంబర వీధుల్లో
జనజీవన బాధల్లో
గాలిలా పరచుకుంటూ ” – తనను వెంట తిప్పుతుంది.
” అప్పుడొక నూతన భావోద్వేగం
ఉక్కిరి బిక్కిరిగా నాలో లయమౌతుంది.
నేనెప్పుడూ వినని, చూడని
ఒక పక్షి పాట, ఒక పాదముద్ర
నాకు ఒక సూర్యనేత్రాన్ని బహూకరిస్తాయి
జవజవలాడే ఒక కవితా సింధువులో
నన్ను ముంచి లేవనెత్తుతాయి”
ఇదీ ఫలితం!
అందువలన తన హృదయంలోని జ్వలనం ఈ కవయిత్రికి,
” ఒక విశ్వభావనల క్షేత్రం
ఒక ఉజ్వలాకాశ హాసం! “
ఈ జ్వలనానిది విద్యుత్ రూపం. ఇది తనలో జాజ్వల్యమానంగా జరిగేవేళ, తన అడుగులు దృఢంగా స్థిరంగా ముందుకు కదిలేవేళ, ఈ “కాంక్షల” మాయాజాలం తనలో దీనంగా నిస్తేజంగా ముడుచుకుపోతుందని చెబుతున్నారు కవయిత్రి, ఈ కవిత ముగింపులో. కవయిత్రి ఉద్దేశించిన ఈ ” కాంక్షలు ” నకారాత్మకమైనవని మనకు సులువుగానే తెలుస్తున్నది.
ఈ కవితలో ప్రకృతి పట్ల మనుషుల పట్ల ప్రేమ ఉంది. మనుషులను శిథిలాల్లోకి కూలదోసే కాంక్షల పట్ల నిరసన ఉంది. పాఠకులు ఒకింత నిదానంగా చదువుకొని ఆస్వాదించే ఉత్తమ కవిత ఇది.
*
Add comment