విశాఖపట్నం లో చూడదగ్గ ప్రదేశాలు అంటే ఆర్కే బీచ్,కైలాసగిరి ,యారాడ కొండ , సింహాచలం లాంటివి గుర్తుకొస్తాయి కానీ ‘కొండకర్ల ఆవ’ అని మాత్రం ఎవరూ అనరు . విశాఖ కి యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆవ మూడు నాలుగేళ్ల క్రితమే టూరిజం వారి జాబితా లోకి వచ్చింది. కొండకర్ల దగ్గర ఉండటం వల్ల ‘కొండకర్ల ఆవ’ అయ్యింది.
ఇంచుమించు పద్దెనిమిది వందల ఎకరాల మంచినీటి సరస్సు అది. ఆవ అంటే పల్లపు ప్రదేశం . కొండలమీద కురిసిన వర్షం, ఆవ లోకి చేరి సరస్సుగా మారిందన్న మాట. శీతాకాలం వచ్చిందంటే వలస పక్షుల ఆశ్రమంగా మారుతుంది. ఒక పక్క కొండలు ఇంకోపక్క కొబ్బరి తోటలు మధ్యలో నీలి సముద్రంలా కొండకర్ల ఆవ.
మొదటిసారి పద్నాలుగు ఏళ్ల క్రితం వెళ్లాను. ఎవరో ‘అక్కడ బోట్ రైడ్ బాగుంటుంది తెలుసా’ అంటే వెళ్ళాం. మిత్రుడి కుటుంబం , మేము కలిసి ఆరుగురం. అప్పటికింకా గూగుల్ తల్లి ఇంత ఫేమస్ కాలేదు . దారి అడుక్కుంటూ మట్టి రోడ్లలో వెళ్ళాల్సి వచ్చింది. తీరా అక్కడికి వెళ్తే ఏమి చేయాలో అర్థం కాలేదు. ఒడ్డున చెట్టుకింద నులకమంచం పైనుంచి దూకుతూ ఆడుకుంటున్న పిల్లలు , బట్టలు రాతిమీద బాదుతూ ఉతుక్కుంటున్న తల్లులు , చిన్న పిల్లలకి స్నానాలు చేయిస్తున్న తండ్రులు తప్ప, మమ్మల్ని నీటిలోకి తీసుకెళ్ళగలిగే పడవల్లాంటి సాధనాలేవీ కనబడలేదు.
“లోపలి కి వెళ్ళాలంటే ఎలా ?” అన్న ప్రశ్నకి “ తాటి దోనె మీద తీసుకెళతాం వస్తారా ?” అనే సమాధానం వచ్చింది. ఆరుగురం తాటిదోనె మీద ఎలా వెళ్ళాలో అర్థం కాలేదు. అంత ధైర్యం కూడా లేదు. అప్పుడు వాళ్ళెంత అడిగారో గుర్తులేదు . అప్పటికప్పుడే రెండు తాటి దోనెలు తెచ్చి వాటి మీద పిల్లలు ఆడుకుంటున్న నులక మంచాన్ని తిరగేసి, తాళ్ళతో కట్టి పడవలా తయారు చేసారు. భయపడుతూనే నులకమంచం ఎక్కి కూర్చున్నాం. ఇద్దరు మాతో బాటే దోనెలపై ఎక్కి తెడ్లు వేస్తూ ముందుకు తీసుకెళ్ళారు.
ఆవంతా విరగబూసిన కలువలు, తామరపూలు ..మనిషి ఎత్తు పెరిగిన గడ్డి దుబ్బులు.. నీటిపై చేపలవేటలో వలస పక్షులు … వాటి మధ్య నుంచి నీటిని చీల్చుకుంటూ మా వింత పడవ. మా బరువుకి తాటి దోనెలు నీటిలో సగం వరకూ మునగడం వల్ల ఇంచుమించు నీటిమీద ఉన్నాం. చేతులు నీటిలోకి జారుస్తూ అందిన కలువపూలు కోసుకుంటూ వాటితో ప్రేమగుచ్చాలు చేసి ఒడ్డుకి చేరాక ఒకరికి ఒకరు ఇచ్చుకున్నాం.
శీతాకాలపు ఎండలో, నులక మంచం మీద , ఆ కలువ కొలనులో తేలుతూ , మధ్య మధ్యలో పూలు తెంచుకుంటూ, పక్షులని పలకరిస్తూ, పాటలు పాడుకుంటూ .. ఇన్నేళ్ళ తర్వాత కూడా వాడని పచ్చని జ్ఞాపకం అది.
ఆ తర్వాత నేను చాలా సరస్సులు , నదులలో పడవ ప్రయాణం చేసాను. ఊటీ , కోడై కెనాల్ , డాల్ లేక్, స్విట్జర్లాండ్ లో లేక్ లూసేర్న్ , గోదావరి పై పాపికొండలు , పారిస్ లో సీన్ నది, బియాస్ నదిపై రాఫ్టింగ్ .. అవన్నీ సుందరమైన పరిసరాల మధ్య ఉండటం వల్ల అందాన్ని సంతరించుకున్నాయేమో కాని, మా కొండకర్ల ఆవది మాత్రం పరిసరాలని వెలిగించే అందం .
సంవత్సరం క్రితం స్నేహితులతో వెళ్లాను . అదే అందం . కొత్తగా టూరిజం బోట్లు వచ్చాయి. అయితే ఎక్కడో గోదావరి లో జరిగిన ప్రమాదం కారణంగా ప్రభుత్వం బోటింగ్ పర్మిషన్ తీసేసిందట. అందరినీ ఊరిస్తూ తీసుకొచ్చిన నాకు ఏమి చేయాలో అర్థం కాలేదు. పడవ నడిపే ఆయన ఒక్కడే ఉన్నాడు. కొద్దిసేపు పక్కకి తీసుకెళ్ళి , తెలిసిన వాళ్ళ పేర్లు చెప్పి, బ్రతిమాలుకొన్న తర్వాత, ఎవరికీ చెప్పనని ఒట్టేయించుకుని పడవ తీసాడు . రెండు పడవలని కలిపి తయారుచేసిన జంట పడవ అది. నీలం రంగు కి పసుపు పచ్చని బోర్డర్ తో మెరిసిపోతోంది.
ఆవంతా వలస పక్షులతో కోలాహలంగా ఉంది. పైన ఆకాశానికి సరస్సు అద్దం అయ్యింది . ఆవంతా పరుచుకున్న నీలాకాశం పై తెల్లని కలువలు , ఎఱ్ఱని తామరలు, మనిషెత్తు గడ్డి దుబ్బుల్ని చీల్చుకుంటూ మా పడవ ఆ ఫెయిరీ ల్యాండ్ లోకి ( నీళ్ళ లోకి అనాలేమో !) ప్రవేశించింది. ఒడ్డునుంచి సాధారణమైన చెరువులా కనిపించే సరస్సు లోపలకి వెళ్ళగానే దివ్యనగరిలా మారుతుంది . ఆవ మొత్తం మీద మాదొక్కటే పడవ . పడవ నీళ్ళలోకి చేరినది మొదలు కల్యాణి గారు , శుభశ్రీ పాడుతూనే ఉన్నారు. అమరేంద్ర , నేనూ కోరస్ ఇచ్చాం … డాక్టర్ గారు కలువ పూవుని మెడలో వేసుకుని నాగభూషణుడిలా తోచారు .. పడవ నడిపే అతను మా పాటలకి గొంతు కలిపాడు. పడవని నీటి మధ్యలో ఉన్న చిన్న లంక లాంటి ప్రదేశానికి తీసుకెళ్ళి ఫోటోలు తీసుకోమన్నాడు. ఫోటోలు ఎలా తీసుకోవాలో కూడా అతనే చెప్పాడు. పడవ ప్రయాణం అంటే ఒకరిపై ఒకరు నీళ్ళు చల్లుకోవాలని కూడా చెప్పాడు. మాటల,పాటల సందడిలో ప్రయాణం ఎప్పుడు ముగిసిందో కూడా తెలియలేదు.
కొండకర్ల ఆవది ఎప్పుడూ ఆహ్లాదకరమైన అనుభవమే .. అయితే ఇంతకుముందు నులకమంచం మీద తిరిగిన రొమాన్స్ మిస్ అయ్యాననిపించింది .. అవును …నిజమే.. ఇప్పుడెక్కిన పడవ , నులకమంచం కంటే సురక్షితం , సుఖవంతం .. మరేమంత దొబ్బుడాయి అనకండి . కొన్ని ప్రదేశాలకి , కొన్ని అనుభవాలు జోడింపబడి ఉంటాయి .. నులకమంచం పై ఆవంతా తిరిగి , అదే మంచంపై, ఒడ్డున చెట్టుకింద పడుకున్న రోజుల్ని ఎలా మరచిపోగలను ? బహుశా అది మళ్ళీ రాని అనుభవం. ఇప్పుడొక జ్ఞాపకం. అంతే..
*
Very nice intro
ఆవ కొండ అవతల మా మామ గారి ఊరు
కానీ ఎప్పుడో వెళ్లాం
పక్కనే వుందని కొంత నిర్లక్ష్యం చేసాం
మీ వ్యాసం చదివాక తెలిసింది ఎంత కోల్పొతున్నామని
Not mentioning about Rambabu, Rajesh, and Raju who joined us in Dec 19 amounts to injustice dear sridhar
Lovely article..ee saari nulakamancham thaati doney – yentha kharchayinaa sare
sir,
పాటలు పాడిన వారు . విచిత్ర వేషధారణ చేసిన వారిపేర్లు మాత్రమే..
well portrayed
మీ మంచి అనుభవం మాకు కూడా పంచినందుకు
చాలా సంతోషం శ్రీధర్ గారూ..