నిజంగా నిజమే
నిత్యము నిక్కమే
నదిలాంటి నీలో మునిగి
ఈదులాడి నీలో లోన
దాగిన అతి రహస్య ప్రదేశాల
పద్మవ్యూహాన్ని ప్రవేశించాలని
నీ ఒడి బడిలో చేరాలని
నెమలి పించం లా నిన్ను సమీపించి
తెడ్డు ఆసరాతో బొడ్డు ఒడ్డుకు
తుఫాను ముందటి
మొదటి ప్రమాద హెచ్చరికలా
కొట్టుకు పోవాలిఅనుకుంటాను
అంతలోనే పొంతన కుదరక
స్వాంతన పొందక
దాహం తీరని ఇరు ఇరులు ఆరబోసిన
అసంతృప్తి దర్భలా ఒక సందర్భం
స్పర్శ సన్నని సెగ తగలక
గుండె పగిలిన దర్పణంలా
అన్నీ అవయవాల
వాలు తెలిసినదే
అయినా దేహం ముందు
ఈడేరని మోహం ముందు
లక్ష్యం నెరవేరని బిక్షా పాత్రతో
కడు దీనాతి దీనంగా
శృతితప్పిన వాయిద్యంలా
గొంతులో నుండి
కదిలీ కదలని కుదిరీ కుదిరని
యుగయుగాల యుగళ గాత్రం
సూత్ర ప్రాయం అవుతుంది
ఇఛ్ఛ యొక్క స్వేచ్ఛ
కత్తిరించబడిన రెక్కలతో
ఎగరలేక ఎదగలేక ఒదగలేక వదలలేక చెట్టునుంచి చెల్లాచెదురైన ఆహా కారాల పక్షుల్లా
శరణు శరణు కనికరించు కనికరించు
కచటతపలు గజడదపలు
దోని సప్పుడు అవుతుంది
దొయ్య పారదు
బాయి గంగాళంకు వచ్చింది
చిల్లులు పడ్డ మోట బొక్కెన
చిలకరించని తడి లేక పొడిబారిన బిందువులు
మయసభ ఒగరుకొడుతున్న
నగుబాటు లక్కఇల్లు సడలుతున్న
జిగిబిగి కౌగిలి
పొద్దులు నిండిన ముద్దులు
ఎత్తి పోయిన కాలంలో
విత్తిన పంటలా మంటలు అంటుకుంటాయి అయినా ఇసుమంత కాలదు
చేపలు లేని నీటిలో కొంగ వాలదు
మెరుపుతీగసొంటి ముఖము
కాంతి కోల్పోయిన అమాస ఔవ్ ఈమె
ఉసూరు మంటూ వడలిన తోటకూర కాడలా
చల్లారు తున్న పెనం మీద
చిట్లిన వర్షపు చినుకులా అవ్ ఇతను.
*
What a write up
A sympathetic poem on the inevitable ‘pauses’!