ఒక అస్లీ హైదరాబాదీ సంఘర్షణ

నేటి తరానికి హైదరాబాదంటే సైబరాబాదే; అది సహజం. ఆధునిక మెట్రోగా, ఐటీ కేంద్రంగా అవతరించిన ఈ మహానగరం – దేశం నలుమూలలనుండీ వచ్కిన కొత్త తరం ఉద్యోగులకూ, పెట్టుబడికీ అపూర్వమైన అవకాశాలనూ అలాగే శ్రామికులకూ, చిరు వ్యాపారులకూ పెద్ద ఎత్తున జీవనాధారాన్నీ కల్పించింది. గత రెండు దశాబ్దాలలో నగరం ఎంతగా విస్తరించిందంటే దాని రూపురేఖలు సమూలంగా మారిపోయాయి. అయితే ఈ మార్పులు విస్తరణకి మాత్రమే పరిమితం కాలేదు. నగరపు స్వభావం, నగరవాసుల మనస్తత్వాలు, నడవడి కూడా గుర్తు పట్టలేనంతగా మారిపోయాయి. తొలినాటి అలవాట్లు, సంప్రదాయాలు, భాష, సంస్కృతి మరుగున పడిపోయాయి. పనిగట్టుకొని వెతికితే తప్ప వాటి ఆనవాళ్లు కూడా నేడు కనిపించవు.

ఆనాటి హైదరాబాదు నగరపు మూలాలు ఎక్కడున్నాయి? ముఖ్యంగా స్వాతంత్ర్యాంతరకాలంలో అది దాటి వచ్చిన మైలురాళ్లు ఏమిటి? ఇక్కడికి ఎలా, ఏయే దారుల వెంట నడిచి వచ్చాం? అసలీ ప్రాంతపు మూల స్వరూపం ఏమిటి? అది ఎక్కడైనా మిగిలి ఉన్నదా?

పరవస్తు లోకేశ్వర్ నవలారూపంలో వెలువరించిన ఆత్మకథ – ‘కల్లోల కలల కాలం’లో పై ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయి. ఆయనే గతంలో (2005) రచించిన ‘సలాం హైదరాబాద్’కి ఇది కొనసాగింపు, రెండవ భాగం. మొదటి భాగం – ‘సలాం హైదరాబాద్’ మాదిరిగానే ఈ రచన కూడా ఒక తరం పడ్డ ఆవేదనను, చేసిన సంఘర్షణను నమోదు చేస్తుంది. ఒకవైపున హైదరాబాదు నగర మూలాలను వెలికితీస్తూనే – మరోవైపున జీవన పోరాట క్రమంలో అంతర్, బాహ్య స్థితి గతులు విధించిన పరిమితులతో ఒక వ్యక్తి, ఒక తరం తలపడ్డ వృత్తాంతాన్ని వెలుగులోకి తెస్తుంది. ఈ రచన ఆ తరం దాటి వచ్చిన కల్లోల సందర్భాల ఉదంతం. అది స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో జన్మించిన తరం. అప్పటి సామాజిక విలువల్ని, నిష్కపట ఆదర్శవాదాన్ని, అమాయకపు ఆశావాదాన్ని అందిపుచ్చుకున్న తరం. వ్యక్తికన్నా సమాజమే ప్రధానం అని నమ్మిన సమిష్టి దృక్పథం కలిగిన తరం.

ఇతర నగరాల మాదిరిగానే హైదరాబాదు పైన కూడా ఎన్నో రచనలు వచ్చాయి – ముఖ్యంగా ఇంగ్లీషులో. అయితే లోకేశ్వర్ రచనలు తెలుగులో రావడమూ, రచయిత హైదరాబాదు పాతనగరపు భూమిపుత్రుడు కావడం, అతని మనోనేత్రాన్ని తెరిచిన సామాజిక స్పృహ, సాహిత్యాభిలాష – ఇవన్నీ వీటి ప్రత్యేకతలు. ఆయన మాటల్లో – ఈ రెండు నవలలూ హైదరాబాదు నగరపు ‘జీవనాడి’ని పట్టుకొనేందుకు చేసిన ప్రయత్నాలు. ఈ కారణాల వల్ల ‘సలాం హైదరాబాద్’ మాదిరిగానే ఇటీవల (2020) వెలువడ్డ ‘కల్లోల కలల కాలం’ రచనకు కూడా ఒక విశిష్టత ఉన్నది; ఈ నవలలో ఒక వ్యక్తి చేసిన అన్వేషణ, పడ్డ తపన, అనుభవించిన క్షోభ మనకు హృద్యంగా, నిజాయితీగా, యదార్థంగా మన కళ్లముందు మెదులుతాయి. అంతేకాదు, రచయితలో ఉన్న చారిత్రక అవగాహన, రాజకీయ చైతన్యం – వీటి మూలంగా తన జీవితానుభవాలను సామాజిక పరిణామాలతో రంగరించి మనకు అందించగలిగాడు. అందుచేత ఈ నవల ఏక కాలంలో వైయుక్తిక అనుభవం, సామాజిక భాష్యం కూడా. ఈ విశిష్టత దీన్ని పఠనీయంగా, సమగ్రంగా, ప్రామాణికంగా తీర్చిదిద్దింది. ‘ఇవి ఆత్మకథలు కదా! వీటిని నవలలు అనవచ్చా?’ – అనే సందేహం కొందరు పాఠకులకు కలగవచ్చు. నిజమే, నవలల్లో ఉండే పాత్రల కలయక, ఎడబాటు, కథాగమనానికి తోడ్పడే విధంగా ప్రధాన పాత్రల మధ్య కడవరకూ కొనసాగే నాటకీయ సాహచర్యం, కథనాన్ని సంధించే సన్నివేశాలు ఈ రచనల్లో కనిపించవు. ఇందులోని ప్రధాన పాత్ర రచయితదే. మిగతా పాత్రలన్నీ రచయితకు ఎదురుపడి, కొంతదూరం ప్రయాణించి కనుమరుగవుతాయి. అయితే ఈ ఆత్మకథలు నిజాయితీ నిండిన ఒక వ్యక్తి మనతో పంచుకున్న జీవితానుభవాలు. అరుదైన స్థానిక, చారిత్రక సమాచారం, ఆసక్తికరమైన కథనం, ఆద్యంతం చదివింపజేసే పఠనీయత – ఇవన్నీ మెండుగా ఉన్న రచనలు ఇవి.

ఈ నవల మొదటి భాగం, ‘సలాం హైదరాబాద్’ 1969నాటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమంతో మొదలవుతుంది. అప్పటికి కథానాయకుడు స్వామి వయసు సుమారుగా పద్ధెనిమిదేళ్లు. ఆ ఉద్యమం మూలంగా అతని చదువుకి ఏర్పడ్డ రెండేళ్ల ఆటంకం లేదా విరామం, అతని జీవితంలో ఒక పెద్ద మలుపు. అప్పుడు ఏర్పడ్డ పరిచయాలు, స్నేహాలు, చదివిన పుస్తకాలు, చేసిన చర్చలు అతడి జీవితాన్ని సమూలంగా మార్చివేసి కొత్త దిశవైపుగా అతడిని మళ్లించాయి. అతడిని వామపక్ష రాజకీయల పైపుగా నడిపించాయి. వాటి ప్రభావం అతనిపై శాశ్వతమైన ముద్రనువేసింది. అది నక్సల్బరి, శ్రీకాకుళ పోరాటాల స్ఫూర్తితో తెలుగు సాహితీరంగాన్ని విరసం అనే ప్రభంజనం కుదిపివేసిన కాలం.

ఈ నవలా పరంపరలో రెండవభాగమైన ‘కల్లోల కాలల కాలం’ – తెలంగాణా ఉద్యమం 1971లో ముగిసాక స్వామి తన వామపక్ష రాజకీయ ప్రయాణాన్ని కొనసాగించడంతో మొదలవుతుంది. ఉద్యమకాలంలో ఖాళీగా ఉండడం ఎందుకని నేర్చుకున్న టైపింగు చిరు ఉద్యోగానికి అవకాశం కల్పిస్తుంది. మేనకోడలుతో ప్రేమలో పడతాడు. ఆ ప్రేమ వృత్తాంతం, వారిద్దరి మధ్యా నడిచిన ఉత్తరప్రత్యుత్తరాలు నవల అంతటా సమాంతరంగా నడుస్తూ స్వామి కథనాన్నీ, అతడి రాజకీయ, సాంఘిక అనుభవాలను మానవీయం చేస్తాయి. సీ.పీ.ఎం. అనుబంధ సంస్థల్లో పనిచేస్తూ హైదరాబాదులోని వివిధ బస్తీలలో విద్యార్థులనీ, యువకుల్నీ కూడగట్టే పనిలో మునిగితేలుతూ ఉండగా జరిగిన మరో సంఘటన – జార్జి రెడ్డి హత్య (1972). పార్టీ కోసం హోల్ టైమర్ గా పని చెయ్యాలనే స్వామి కోరిక ఆ పార్టీలో ఉండగా తీరనేలేదు. నాయకత్వాన్ని నిలదీసే మనస్తత్వం, నక్సలైట్లతోసహా అన్ని వామపక్ష ఉద్యమాల పట్లా స్వామికి ఉండిన సానుభూతి – వీటి మూలంగా కోస్తాంధ్ర నాయకులు అతన్ని పక్కనపెట్టారు.

సీ.ఐ.టీ.యూ. అఖిల భారత సమావేశాలకు 1973లో విశాఖపట్నం వెళ్లడం స్వామి జీవితంలోని మరో మలుపు. విశాఖ, అరకులోయ పర్యటన అనుభవాలను ఎంతో ప్రేమతో నమోదు చేస్తాడు. రావిశాస్త్రి వర్ణించిన విశాఖని కళ్లారా చూడాలనీ, ఆయా పాత్రల మాటలు చెవులారా వినాలనీ స్వామి తపించిపోతాడు. సాహిత్యంలోంచి వామపక్ష రాజకీయాల్లోకి వచ్చే వారందరిలాగానే ఒక ఉన్నతమైన సమాజాన్నీ, సార్వజనీన మానవీయతనూ, ఆదర్శప్రాయమైన ప్రపంచాన్ని ఊహించుకుంటాడు. విశాఖ అనుభవంతో శ్రామికవర్గాన్ని కూడగట్టేందుకే తన జీవితాన్ని అంకితం చెయ్యాలని నిశ్చయించుకుంటాడు. ఆ దారిలోనే నడుస్తాడు. ఇతలో ఇందిరాగాంధీ ప్రభుత్వం ఎమర్జెన్సీ విధిస్తుంది, కృష్ణాజిల్లా కమ్యూనిస్టు నాయకుల ద్వంద్వ వైఖరి, రాజకీయాలకు అతీతంగా కొనసాగే భూదాహం వారి అసలు రూపాన్ని బయటపెడతాయి. స్వామి వాళ్లని అసహ్యించుకుంటాడు. సీ.పీ.ఐ. వైపుగా జరుగుతాడు. పటాన్ చెరు ప్రాంతాలలో కార్మిక సంఘాలలో తన పనిని కొనసాగిస్తాడు. ఎందరో అసాధారణమైన కామ్రేడ్లతో పరిచయాలు, స్నేహాలు ఏర్పడతాయి; మంచీ, చెడూ అన్నీ చవిచూస్తాడు. తద్వారా తక్కువ కాలంలోనే విస్తారమైన జీవితానుభవాన్ని గడిస్తాడు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం, ఇందిరా గాంధీ హత్య, సిక్కుల ఊచకోత – వీటన్నింటికీ రచయిత లోతుగా స్పందిస్తాడు. తన ఆలోచనలను మనతో పంచుకుంటాడు. కథానాయకుడు స్వామి గ్రూప్-2 పరీక్షలలో ఉత్తీర్ణుడై, ప్రభుత్వ అధికారిగా నియమించబడడంతో ఈ నవల ముగుస్తుంది.

ఈ నవలలో మనల్ని ఆకట్టుకొనేవి రెండు అంశాలు – మొదటిది విభిన్నమైన వ్యక్తుల పరిచయాలు, రెండవది అనేకానేక ఉపకథలు. చదువు లేకపోయినా హైదరాబాదు చారిత్రక విశేషాలను అలవోకగా వివరించే మహబూబ్ బాషా, ఉర్దూ భాషకీ, సాహిత్యానికీ విశిష్టమైన సేవలను అందించిన ప్రొఫెసర్ హబీబుర్ రహమాన్, దక్కన్ చరిత్రపై ప్రామాణిక గ్రంథాలను రచించిన బహుభాషా కోవిదుడు ప్రొఫెసర్ షేర్వానీ, హైదరాబాదు వామపక్ష రాజకీయాల ఎన్సైక్లోపీడియా సలాంసాబ్, సమీక్షావేదికని సమర్థవంతంగా, సృజనాత్మకంగా నిర్వహించిన సురా – ఇలా ఎంతో మంది విశిష్టమైన వ్యక్తుల గురించి తెలుసుకోవాలంటే ఈ పుస్తకం చదవాల్సిందే.

బొంబాయిలో కార్మికులను సమీకరించిన జార్జి ఫెర్నాండెజ్ జీవితం స్వామిని ప్రభావితం చేసిది. శంకరంబాడి సుందరాచార్య (‘మా తెలుగు తల్లికీ మల్లె పూదండ’ రచయిత)కి తానెవరో చెప్పుకోవలసిన దుస్థితి, అలాగే సంజీవ్ దేవ్ ని కలుసుకోవడం కూడా ఒక ముఖ్య సంఘటన. మిస్టరీగా మిగిలిపోయిన అద్వితీయమైన ఆర్గనైజర్ ‘పొరకల దొర’ దాసరి లక్ష్మీకాంతం కథ మనల్ని కదిలిస్తుంది. వందేళ్ల ఘన చరిత్ర కలిగిన భారతదేశపు వామపక్షాల సమిష్టి వైఫల్యాలు మనల్ని ఆలోచింపజేస్తాయి.

మఖ్దూం, రాజ్ బహద్దూర్ గౌడ్ ల ప్రభావంతో చైతన్యవంతులైన పాతబస్తీ ముస్లింలను సంఘటిత పరచాల్సిందిపోయి వామపక్షాలు వాళ్లను ఎలా దూరం చేసుకున్నాయి? మన రాష్ట్రాలలో మార్క్సిస్టుల పరిభాష ఎవరికీ కొరుకుడు పడకుండా ఎందుకంత గజిబిజిగా తయారైంది? ఓరుగల్లు పోరుగల్లు ఎందుకైంది? ఒక ఉద్యమం, మరో ఉద్యమానికి నాయకత్వాన్ని ఏవిధంగా అందిస్తుంది? ‘దున్నేవాడిదే భూమి’ నినాదం కృష్ణాజిల్లాలో ఒక కులం వారిని ఏవిధంగా ఆకర్షించింది? ఖచ్చితంగా నెగ్గుతారని అంతా అనుకున్న1956నాటి అసెంబ్లీ ఎన్నికల్లో కమ్యూనిస్టులు ఎందుకని తుడిచిపెట్టుకు పోయారు? నిజాం హైదరాబాదు, తెలంగాణా ప్రాంతం – వీటి ప్రత్యేకతలు, నిర్దిష్టతలు ఏ విధంగా కోస్తాంధ్ర, రాయలసీమలకు భిన్నమైన దిశలో ప్రయాణించాయి? తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఆ స్థాయిలో ప్రజల సంపూర్ణమైన మద్దతు అంత నిలకడగా ఎలా లభించింది?… ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు ఈ నవలలో జవాబులు దొరుకుతాయి.

అంతేకాదు. హైదరాబాదీ వంటకం హలీంను ఎలా తయారుచేస్తారు? నగరంలోని వివిధ ప్రాంతాలకు, బస్తీలకు ఆయా పేర్లు ఎలా వచ్చాయి? హుసేన్ సాగర్ నిర్మాణం వెనుక ఉన్న కథ ఏమిటి?…ఈ విషయాల్ని కూడా ఎంతో ఆసక్తికరంగా పాఠకుల ముందుంచుతుంది – ఈ నవల. రచయిత ఈ రచన అంతటా ప్రస్తావించిన సాహితీ అంశాలు, సీన్మా పాటలు, షాయరీలు, దక్కనీ ఉర్దూ మాటలు, సామెతలూ – ఈ నవలకు జీవం పోశాయి.

రచయిత లోకేశ్వర్ కి సమకాలీనులైతే, ముఖ్యంగా ఎంతో కొంత మేరకు వామపక్ష రాజకీయాలతోనూ, తెలుగు సాహిత్యంతోనూ పరిచయం ఉన్నవారైతే ఈ నవలలో అతడు ప్రస్తావించిన ఘటనలతో, చర్చించిన అంశాలతో పూర్తిగా కనెక్ట్ అవుతారు. అవేవీ లేకపోయినప్పటికీ, పాఠకులందరికీ కూడా, ముఖ్యంగా యువతరానికి, ఇదొక చారిత్రక అంశాల సమాహారంగా అనిపిస్తుంది. అయితే అందులోని అంతస్సూత్రాన్ని వారు సులభంగానే ఆకళింపు చేసుకోగలుగుతారు. పాఠకులెవరైనప్పటికీ – ఈ నవల హైదరాబాదు మూలాలని వారి ఎదుట ఆవిష్కరిస్తుంది; వారి హృదయాలను తాకుతుంది. ఆత్మకథకు అక్షర రూపం ఇవ్వడం అంటే రచయిత నిస్సంకోచంగా తన అనుభవాన్నీ, అంతరంగాన్నీ, అంతర్మధనాన్నీ అందరికీ వెల్లడి చేసే సాహసం చెయ్యడం. ఆ సాహసం ఈ రచయిత చేస్తాడు. అతడు ఎదుర్కొన్న సంక్షోభాలనూ, అతనిలో వచ్చిన మానసిక ఎదుగుదలనూ మనకు వివరిస్తాడు.

మనుష్యులకు ఉన్నట్లే – ప్రతీ నగరానికీ అది ఉనికిలోకి వచ్చిన నేపథ్యం, అది ఎదిగిన క్రమం ఉంటాయి. అవే వాటి స్వభావాలను, సంస్కృతినీ నిర్దేశిస్తాయి; తత్ఫలితంగా ఏ రెండు నగరాలూ ఒకే మాదిరిగా ఉండజాలవు – మనుష్యుల మాదిరిగానే. ఇందుకు మన మెట్రో నగరాలపై చెలామణీలో ఉన్న అభిప్రాయాలను ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. ఢిల్లీలో వినిపించే ఖాళీకుండల బడాయి, ముంబై పౌరుల నియమపాలన, కలకత్తా వాసుల సాంస్కృతిక ఆధిపత్య భావన, చెన్నైలో కనిపించే అంతర్ముఖ ప్రాంతీయత – ఇలా వివిధ నగరాలకు మంచీచెడూ కలగలిసిపోయిన అనేక పార్శ్వాలు ఉంటాయి. కానీ నేటి హైదరాబాదు నగర విషాదం ఏమిటంటే దాన్ని సైబరాబాదు పూర్తిగా మింగేసింది. పాతనగరపు మూలాలను నామరూపాలు లేకుండా ధ్వంసం చేసింది. అందువలన కూడా ఈ నవలలకు ఒక పాఠ్య పుస్తకానికి, ఒక చారిత్రక డాక్యుమెంటుకి ఉండే స్థాయి, ప్రాముఖ్యత ఉన్నవి. ‘పోగొట్టుకున్న వాటిని, పోగొట్టుకున్న చోటనే వెతుక్కోవాలి’ అని పెద్దలు ఊరికే అనలేదు.

[‘కల్లోల కలల కాలం’, రచయిత పరవస్తు లోకేశ్వర్. 524 పేజీలు. వెల రూ. 350/-. సాహితీ ప్రచురణలు, విజయవాడ]

Unudurti Sudhakar

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • **నగరం కన్నీళ్లు పెడుతుందో కనిపించని కుట్రల**…

    స్టార్ టివి దగ్గర నుండి ఎఫ్ టివి వరకు, అంతర్జాతీయ కార్పొరేట్ ప్రకటనల దగ్గర నుండి జబర్దస్త్ దృశ్యాల వరకు, పాశ్చాత్య సంస్కృతి నేరుగా మీ ఇంటిలోకి, మీ మెదళ్లలోకి కేబుల్, నెట్, డిష్ ద్వారా చొరబడడం ప్రారంభమై ఓ పాతికేళ్లయిన తరువాత, మెదళ్లు నిండుగా ఆ బాణీకి అనువుగా మలచబడిన తరువాత, ఆహార్య, ఆహార, వినోద, విహారాలలో మొత్తం అదే సంస్కృతి బీభత్సంగా ఆక్రమించిన తరువాత సైబరాబాద్ మాత్రమే పాత సంస్కృతిని చంపేసింది అనడం నాకెందుకో ఫక్తు రొమాంటిసిజం మాత్రమే అనిపిస్తోంది. (భాష కూడా తెంగ్లీష్ అయిపోయి అసహజమరణం పొందిందనేది అదనం.

  • చాలా మంచి పరిచయం . చదవలనిపించేలా సమీక్ష రాశారు . ఒక చోట “సురా” మన సి‌వి సుబ్బరావు అనుకొంటాను. ఇలా విశాఖపట్నం కూడా మారలేదు. వీలయితే ఆ మార్పు గురించి రాయగలరేమో చూడండి.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు