ఒక అందమైన కల ఆ కథ!

అమ్మాయిలు ఎందుకింత మార్పులకు లోనవుతారు?!

క కల ఏళ్ళ తరబడి నన్ను వెంటాడుతోంది.. కలకంటున్నంత సేపు చాలా చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా వుంటుంది. మనుషుల మధ్య పరస్పర గౌరవం, నమ్మకం, అవగాహన వుంటే, స్నేహం, ప్రేమ అల్లుకుంటాయి కదా. మన జీవితాలు మరింత ఆనందమయం అవుతాయి కదా! ఇది చాలా సులభంగా సాధ్యమయ్యేదే అనిపిస్తుంది.

“రెక్కలున్న పిల్ల” నా అందమైన కల. కథ పేరుకు తగ్గట్టుగానే అది అచ్చయిన ఏడాది ఎన్నెన్నో కథా సంకలనాల్లోనో వాలిపోయింది.  ఈ కథకు ఆధారం లేదా అంటే తప్పకుండా వుంది. ఈ కథ రాయడానికి నాలుగేళ్ల ముందు “మా అమ్మాయి” అని ఇంటర్ చదువుతున్న మా అమ్మాయి గురించిన కథ రాశాను.

నా చదువుకునే రోజుల్నుంచి నేను గమనించింది-  అమ్మాయిలు చదువుకుంటున్నప్పుడు చాలా ఉత్సాహంగా, పరుగులు తీస్తూ, కేరింతలు కొడుతూ ఉంటారు. నలుగురు అమ్మాయిలు చేరిన చోట చాలా ఆహ్లాదపూరిత వాతావరణం ఏర్పడుతుంది. అంత ఉల్లాసంగా ఉండే అమ్మాయి పెళ్లి కాగానే “గృహిణి” అనే బరువు కింద ముడుచుకుపోతుంది. అమ్మాయిలు ఎందుకింత మార్పులకు లోనవుతారు. అది ఎంత హింసాత్మకంగా వుంటుందో అనిపించేది.

ఇంటర్ చదివే “మా అమ్మాయి”లోని కరుణ మాస్టర్ డిగ్రీ పూర్తి చేసుకొని ఒక ఉద్యోగినిగా, రెక్కలొచ్చి ఎగిరిపోయి మరొకరితో కలిసి జీవించేప్పుడు ఎలా వుంటుందో ఊహించి  “రెక్కలున్న పిల్ల” కథను రాశాను. ‘రెక్కలొచ్చి ఎగిరిపోయే’ ఈ  ఊహను కథలో ఉపయోగించుకుంటే అనే ఆలోచన  నాలో ఒక మెరుపులా మెరిసి నన్ను  అద్భుత పరిచింది   ఈ ఊహే కథకు శీర్షిక అయింది. ఇదే ఈ కథను  మాజికల్ రియలిజంగా మలిచింది.  కొందరు ఈ కథ “ఫెమినిస్ట్ మానిఫెస్టో” అని కూడా అన్నారు.  పిల్లల్ని కూడా ఆకట్టుకుంది. కామ్రేడ్ కృష్ణమూర్తిగారమ్మాయి మణి, ఇప్పుడు ఖమ్మంలో టీచర్ గా పని చేస్తొంది. మణి “రెక్కలున్నపిల్ల” కథ బాగుందని చెబుతూ, తన అనుభవాన్ని నాతో ఇలా పంచుకుంది. “నేను, మా ఫ్రెండ్ మీ కథ ‘రెక్కలున్న పిల్ల’ గురించి చర్చించుకుంటుంటే, మా ఫ్రెండ్ కూతురు ఐదేళ్ళది, మా మాటలు వింటూ, నాక్కూడా రెక్కలొచ్చి ఎగిరిపోతున్నట్టుంది అంది “. మణి చెప్పింది విని భలే సంతోషపడ్డాను.

ప్రశంసల జడివాన నన్ను తడిపేసింది. అన్నీ ప్రశంసలే. ఏమో, విమర్శలుంటే నా వరకు రాలేదా? అయితే ఈ మధ్యనే ఒక ప్రశ్న నాకు ఎదురైంది. మాకు అత్యంత ఆప్తుడు, స్నేహశీలి రాయుడుగారు (అనంతపురం)” రెక్కలున్న పిల్ల” కథ చదివి, “మగవారి అహంకారం మీద భలే దెబ్బకొట్టారు, వారు దీన్ని జీర్ణించుకోగలరా ?” అన్నారు. నేనెక్కడా ఎవరినీ కించపరచ లేదే అన్నాను. “నాకు రెక్కలున్నాయి. నా పనులు నేను చేసుకోగలను’ అని కథకు ముగింపు ఇచ్చారు. దీన్ని ఏ పురుషుడు అంగీకరిస్తారనుకుంటున్నారు” అన్నారు. దీన్ని నేను ప్రశంసగానే తీసుకున్నాను. రాయుడులాంటి వారు…మరి కొందరు అంగీకరిస్తారు. అంగీకరించలేని మగవారి అహంకారాన్ని ఈ కథ దెబ్బకొట్టగలిగితే దీని లక్ష్యం నెరవేరినట్టే. కొత్త కొత్త కలలతో ముందుకే పోదాం. పాత ప్రపంచం మన వెనకాల పడిపోతుంది.

                                                                   ***

రెక్కలున్న పిల్ల

“నీకేమ్మన్నా పిచ్చా? ఉండుండి ఆశనా పెళ్లి చేసుకునేది?’ ప్రేమా పిచ్చీ ఒకటే’  అన్నారు కానీ పెళ్లీ పిచ్చీ  ఒకటనలేదు” రవిశంకర్ మురళిని ఎగతాళి  చేశాడు.

“…………”

“ఆశ గురించి ఒక విషయం చెప్పనా? నొచ్చుకోకు మరి. ప్రేమ కోసమై వలలో చిక్కుకున్నావేమోనని చెబుతున్నాను”. మురళి కళ్లలోకి చూశాడు రవి  శంకర్. ఆ కళ్లల్లో ఏ ఉత్సుకత కనిపించలేదు. మాటలు కొనసాగించడానికి కాసేపు తటపటాయించాడు. దాన్ని కప్పిపుచ్చుకోడానికి ఈలోగా సిగరెట్ వెలిగించాడు.

రవిశంకర్, మురళి మంచి స్నేహితులు. ఇద్దరూ ఒకే కాలేజీలో లెక్చరర్లు. ఒకరు ఎకనామిక్స్, మరొకరు పొలిటికల్ సైన్స్. ఒకే యూనివర్శిటీలో చదువుకున్నారు.ఒకే స్టూడెంట్ యూనియన్ లోను పనిచేశారు. వారి మధ్య దాపరికాలు లేవు.

“ఆశకు రెక్కలున్నాయి. ఎప్పుడైనా నీ చేతుల్లోంచి ఎగిరిపోవచ్చు!” రహస్యం చెబుతున్నట్లు చెప్పాడు రవి శంకర్.

మురళి మందహాసం చేస్తూ “ ఆశ రెక్కల్ని చూశావా’’? అడిగాడు.

“చూళ్లేదు కానీ రెక్కల చప్పుడు చాలాసార్లు విన్నాను. ఆమె దగ్గరగా వచ్చిందంటే చాలు, రెక్కల చప్పుడు వినిపిస్తుంది. భయంతో వణికిపోతాను. ఆశ వైపు చూడాలన్నా నాకు భయమే. నువ్వు చూశావా?’’ ఎదురు ప్రశ్న వేశాడు.

మురళి వైపు జాలిగా చూస్తూ రవిశంకర్ మళ్లీ అన్నాడు. “నువ్వు చూసి వుండవు. విని ఉండవు. ప్రేమ మైకంలో ఉన్నావు కదా?”

“అట్లా జాలిగా చూడకు. నేనేమీ చిక్కుల్లో పడలేదు. ఆశకు రెక్కలున్నాయని తెలుసు. ఆమె వ్యక్తిత్వం చూసి స్నేహం చేశాను. ఆమె రెక్కల్ని చూసి ప్రేమించాను. కలిసి వుందామనుకుంటున్నాం.”

“ఇది ఆశ నిర్ణయమే కదా?”

“ మా ఇద్దరి నిర్ణయం. ఆశకు రెక్కలున్నాయని కదా అట్లా అడుగుతున్నావ్?”

“మీరు పెళ్లెందుకు చేసుకోరు?”

“పెళ్లంటే ఏమిటి? ఒక ఇంట్లో ఇద్దరిని బంధించి కాపురం చేయండి అని అందరూ ఆమోదించడమా? మా మధ్య ప్రేమ ఉన్నన్ని రోజులు కలిసి వుంటాం. లేనప్పుడు ఇంత సింపుల్ గానూ విడిపోతాం. కలిసివుండడానికి పెళ్లిపీటలు, మంగళవాయిద్యాలు అక్కర్లేదు. విడిపోతున్నప్పుడు లాయర్లు,కోర్టులు, తీర్పులు అక్కర్లేదు.”

“ఇంట్లో చెప్పావా? మీ అమ్మా నాన్న ఒప్పుకున్నారా?”

“ఆశను మా అమ్మకు నాన్నకు పరిచయం చేశాను. చాలా మంది తల్లితండ్రుల్లాగే మా వాళ్లూ అభ్యంతరం చెప్పారు.” విషయాన్ని చాలా క్లుప్తంగా స్నేహితునికి చెప్పాడు మురళి.

మురళికి తన అమ్మానాన్నల సంగతి తెలుసు. అంగీకరించరని కూడా తెలుసు. కానీ తనేం తప్పు చేయడం లేదు.అనుకున్నాడు.

ఒకరోజు ఆశను ఇంటికి తీసికెళ్లాడు, ఆశను చూడగానే  మురళి తల్లి ‘అందమైన పిల్ల. బాగా చదువుకున్న అమ్మాయి’ అని సంబరపడింది. కానీ ఆశను చూస్తూన్నకొద్దీ ఆమెలో ఆందోళన పెరగసాగింది. ముందు ఆశ కళ్లల్లో మెరుపును చూసి తోట్రుపడింది. మరికాసేపటికి మాటల్లో సూటిదనం, స్పష్టత చూసి జంకింది.

ఆశ ఒక గంటలోనే ఆ ఇంటితో, ఆ మనుషులతో ఎన్నో ఏళ్ల పరిచయం వున్నట్లు కలివిడిగా మాట్లాడుతూ, ఉల్లాసంగా ఒకసారి తన రెక్కల్ని విప్పి ఆనందంగా ఆడించి, ముడిచింది. అంతే మురళి తల్లి భయంతో వణికిపోయింది.

ఆశ వెళ్లిపోయాక, “ ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. ఎక్కడో పెళ్లిచేసుకొని ఆమెను ఇంటికి తెచ్చావా నా శవాన్ని చూస్తావు” అని బెదిరించింది మురళిని తల్లి.

“మేము ముందే నిర్ణయించుకున్నాం. వేరే ఇల్లు తీసుకుంటున్నాం”.

“నువ్వు కాక మాకు ఇంకెవరున్నారు.రెక్కలున్నపిల్ల పెళ్లయిన వెంటనే వేరే కాపురం పెట్టిస్తుందేమోనని భయపడి ఈ పెళ్లి వద్దంటున్నాం కానీ, పెళ్లి కాకుండానే వేరే పోతావా?” మురళి తండ్రి అడిగాడు.

“పుట్టింటి నుంచి మెట్టినింటికి వలసపోవడానికి ఆమె మామూలు ఆడపిల్ల కాదు. అందుకే మా ఇల్లు మేం ఏర్పాటు చేసుకున్నాం.”

“ ఈ ఇల్లు అవి, ఇవి ఏవీ వద్దంటున్నావు. కనీసం మేము నీ తల్లిదండ్రులమనైనా ఒప్పుకుంటావా?” అడిగింది తల్లి.

“ఆశకు ఆమె తల్లిదండ్రులు ఎంతో, నాకూ మీరు అంతే. అమ్మాయిలకు పుట్టిల్లు తాత్కాలికమనే కదా చెబుతుంది మీ సంప్రదాయం. ఒక తల్లి కడుపున పుట్టిన అమ్మాయికి ఒక సంప్రదాయం, అబ్బాయికి మరో సంప్రదాయం. ఈ తేడా ఒద్దంటున్నాం. అందుకనే వేరే ఇల్లు తీసుకున్నాం. మీకిష్టమైనప్పుడు మీరు మా ఇంటికి రావొచ్చు . మాకిష్టమైనప్పుడు మేము మీ ఇంటికి వస్తాం.”

మురళి వెల్లడించిన భావాలు అతని తల్లికి, తండ్రికి పూర్తిగా కొత్త. వారికి ఎంత అర్థమయ్యాయో వారికే తెలియదు. ఆస్తిలో చిల్లి గవ్వ ఇవ్వమనో, చచ్చి పోతామనో బెదిరించి ప్రేమ పెళ్లిళ్లు ఆపగలిగిన సంప్రదాయం తెలుసుకాని, వాటికి ఏ మాత్రం విలువివ్వని వారితో ఎట్లా గొడవపడాలో, బెదిరించాలో తెలియదు. సరికదా మురళి మాటలు వారి మనసుల్ని కలవరపెట్టాయి.ఈ కొత్తదనం ఎట్లాఉంటుందో చూడాలన్న కుతూహలం కూడా వారిలో కలగకపోలేదు.

*        *          *

“నీకు రెక్కలు వచ్చేట్లుగా పెంచిన మీ అమ్మను చూస్తే నాకు చాలా గౌరవం. మా అమ్మ మా అక్కను ఎప్పుడూ ప్రతి చిన్న పనికి కోప్పడుతూ, సరిదిద్దుతూ వుండేది.పెళ్లికాక ముందే మా అక్కను ఓ మంచి గృహిణిగా తయారు చేసింది మా అమ్మ” అన్నాడు ఒక రోజు మురళి వంట చేస్తున్న సమయంలో.

మురళి, ఆశ వారంలో రెండుసార్లు మాత్రమే వంట చేసుకుంటారు. ఎవరికిష్టమైనవి వారు నాలుగు రకాల కూరలు వండుకొని ఫ్రిజ్ లో పెట్టుకుంటారు. ఇద్దరు కలిసి ఓ గంటలో వంట పూర్తి చేసేలోగా, తరచుగా వాళ్లు చిన్నప్పటి ఆటపాటల గురించి, చిన్ననాటి స్నేహితుల గురించి, తల్లిదండ్రుల గురించి, ఒక్కోసారి ఫక్తు వంటల గురించి మాట్లాడుకుంటారు.

మురళి మాటలకు పగలబడి నవ్వింది ఆశ.

“నాకు రెక్కలు రావడానికి మా అమ్మ కారణమని అంత ఖచ్చితంగా ఓ నిర్ణయానికి ఎట్లా వచ్చావు?” అంది.

“మరి?”

“ మా శ్యామల టీచర్ స్నేహం వల్లనే నాకీ రెక్కలు వచ్చాయి” అని తన రెక్కల్ని చాపి, వాటి వైపు మురిపెంగా  చూసుకుంది. మురళి లాలనగా ఆశ రెక్కలను సుతారంగా నిమిరాడు.ఆశ కళ్లు గర్వంతో వెలిగిపోయాయి.

“నేను ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుడు, శ్యామలా టీచర్ మాకు ఇంగ్లీష్ టీచ్ చేసేది. ఆమె మాకు ఎన్నెన్నో కొత్త కథలు చెప్పేది. అవి ఏ పుస్తకాల్లో వుంటాయో, ఆ పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయో అడిగాను. ఒకసారి ఇంటికి రమ్మంటే వెళ్లాను. ఆమె దగ్గర చాలా పుస్తకాలున్నాయి. నాకప్పుడే తెలిసింది నాక్కూడా పుస్తకాలంటే ప్రాణమని. నేను ఇంటర్ లో చేరాక కూడా శ్యామలా టీచర్ ఇంటికి వెళ్లి బుక్స్ తెచ్చుకుని చదివేదాన్ని. రంగనాయకమ్మ రాసిన “జానకి విముక్తి” నవలను బట్టీయం వేశానంటే నమ్ము. ఆ బుక్స్ నాలో కొత్త కొత్త ఆలోచనలు రేకెత్తించేవి.

ఎవరు ఏం మాట్లాడినా ఏదో లోపం ఉన్నట్లు అనిపించేది. నేను అమ్మ చెప్పినట్టు నడుచుకోవడం లేదని, దీనికంతా కారణం శ్యామల టీచరేనని మా అమ్మ అనుకొంది” అని చెప్పింది ఆశ.

“కాలేజీలో చేరావు. శ్యామల టీచర్ ఇంటికి ఎందుకు వెళతావు? ఆ పుస్తకాలు చదవడం మానేసేయ్” ఒక రోజు  ఆశ తల్లి అనూరాధ అంది.

“ ఆ బుక్స్ చదవడం నా కిష్టం. చదువుతాను.”

“ఇట్లా ఎదురు మాట్లాడుతున్నావనే ఆ టీచర్ ఇంటికి వెళ్లొద్దు అంటున్నాను”.

“ నా తప్పేమీ లేకపోయినా నన్ను కోప్పడితే, గంగిరెద్దులా తలాడిస్తూ వుండలేను”.

“ఈ తలబిరుసుతనమే వద్దనేది. ఏ తప్పు లేదంటునే ఎట్లా మాట్లాడుతున్నావో చూడు. పక్కింటి సీతను చూసి నేర్చుకో. ఎంత అణుకువగల పిల్ల. ఈ వీధికే వన్నె తెచ్చే పిల్ల”. అంది అనూరాధ.

“నిజమే, ద్వాపరయుగం సీతకు, ఈ సీతమ్మకు పిసరంత తేడా లేదు. చెప్పినట్లు వినే మంచిపిల్ల. తనకిష్టమైన పని ఏదీ చేయదు. అందరి చేత మంచి అనిపించుకోడానికి, ఎన్ని బాధలొచ్చినా భరిస్తూ బతకడానికి తయారవుతోంది. జీవితమంతా దుఃఖిస్తుంది.”

సతీమ తల్లి సీతను కూడా తిరస్కరిస్తున్న ఆశ, తన చేతులు దాటిపోయిందని గుర్తించింది అనూరాధ. ఈ విషయాన్ని అంగీకరించే స్థితిలో ఆమె లేదు. ఆశను లొంగదీసుకోడానికి తనలో ఎక్కడలేని కాఠిన్యాన్ని బయటపెట్టింది. మొరటుగా తిడుతూ, కొట్టడానికి ఆశ మీదికి చేయి ఎత్తింది.

చెంప మీద దెబ్బ పడకుండా తప్పించుకోగలిగింది ఆశ. కానీ, తల్లి తనను అవమానించడం భరించలేకపోయింది.తన తల్లి ప్రవర్తనను అసహ్యించుకుంది. తల్లి వైపు నిర్లక్ష్యంగా చూసింది. ఆ చూపుతో ఆ తల్లి కూడా సిగ్గుతో కుంచించుకుపోయింది.

మరు నిముషంలో ఆశ రెండు మూడు పుస్తకాలు తీసుకొని “శ్యామల టీచర్ ఇంటికి వెళుతున్నాను. ఉదయం వస్తాను” అంటూ వెళ్లబోయింది.

అనూరాధ ఆశ వైపు వింతగా చూసింది. “ఏమిటి ఈ పిల్ల ఇంత జరిగాక కూడా టీచర్ ఇంటికి వెళతానంటోంది?” అనుకుంది.

“ఒకటి గుర్తుంచుకో అమ్మా! నేనేం చిన్నపిల్లను కాను. మంచి చెడు నిర్ణయించుకోగలను. ఇంకెప్పుడు నా మీదికి చేయి  ఎత్తొద్దు” ఆశ చాల మామూలు విషయంలా చెప్పి వెళ్లిపోయింది. ఆశ ప్రవర్తనకు ఆ తల్లి ఆశ్చర్యపోయింది.

శ్యామల టీచర్ ఇంటికి వెళ్లిన ఆశ, రోజుకన్నా ఎక్కువగా చాల శ్రద్ధగా పాఠాలు చదువుకుంది. అర్ధరాత్రి దాటినా నిద్ర రావడం లేదని, చదువుకోడానికి “రెక్క విప్పిన రెవల్యూషన్” బుక్ తీసుకుంది. ఫ్రాన్స్ లో 1968లో జరిగిన విద్యార్థుల ఉద్యమం గురించి, విద్యార్థులపై ప్రభుత్వ దమనకాండ గురించి ఏంజిలా కాట్రొచ్చి రాయగా శ్రీశ్రీ తెలుగులోకి అనువదించిన పుస్తకం అది. ఆ పుస్తకం చదువుతూ. ఆ సంఘటనలు ఇప్పుడే జరుగుతున్నట్టు, ఆ విద్యార్థుల్లో తను ఉన్నట్టు అనిపించింది ఆశకు. ఊపిరి తీసుకోవడం కూడా మరచి పోయి, ఏకబిగిన ఆ పుస్తకం పూర్తిచేసింది. ఒక కొత్త ఉత్సాహం, ధైర్యం వచ్చినట్టు ఆశకు అనిపించింది. నిద్రలోకి ఒరిగిపోయింది.

అందమైన కల. అద్భుతమైన ఆనందమేదో తనలోకి పొగమబ్బులా దూసుకుపోయింది. తనకు రెక్కలు మొలుచుకొచ్చాయి. ఆకాశంలోకి ఎగిరిపోయింది. తెల్లమబ్బుల మధ్య గిరీకలు కొడుతోంది తను. ఆశ సంతోషంతో  కళ్లు తెరిచింది. భుజాలను తడుముకొని ఉలిక్కిపడింది. ఇప్పుడు తనకు రెక్కలున్నాయి. రెక్కల్ని చూసుకొని మురిసిపోతుంటే శ్యామల టీచర్ కాఫీ కప్పుతో వచ్చి” మంచి కలతో మేల్కొన్నట్టున్నావ్” అంది.

“ అవును టీచర్, రెక్కలొచ్చినట్టు కలకన్నాను. మెలకువ వచ్చి చూసుకుంటే నిజంగానే నాకు రెక్కలొచ్చాయి” అని చూపించింది.

శ్యామల టీచర్ వాటిని చూసి అనందంతో పొంగిపోయింది.”ఎంత అందంగా ఉన్నాయి ఈ రెక్కలు?” అంది రెక్కలను సుతారంగా నిమురుతూ.

ఆశ తన రెక్కలను చూసుకోవడంలో మునిగిపోయింది కాఫీ తాగడం మరిచి.

“ఎందుకైనా మంచిది, రెక్కల్ని ఎవరికంటా పడకుండా జాగ్రత్త చేసుకో. నీ కాళ్ల మీద నీవు నిలబడగలిగే పరిస్థితి వచ్చేవరకు జాగ్రత్త తీసుకో”. శ్యామల టీచర్ మాటలతో ఆశకు  తన తల్లి, తండ్రి గుర్తొచ్చారు. ముందు వారి కంట పడకుండా చూసుకోవాలి అనుకుంది.

ఆశ భయపడినట్టే జరిగింది. ఒక రోజు చదువుకుంటూ మైమరచి రెక్కలు చాపింది ఆశ. అనూరాధ ఎందుకనో అప్పుడే ఆ గదిలోకి వచ్చి కూతురిని చూసి భయపడింది. మరుక్షణంలో ఆశ తన తప్పు తెలుసుకొని, రెక్కల్ని ముడిచి, ఎవరికి కనిపించకుండా జాగ్రత్త చేసుకుంది. మళ్లీ ఏమీ ఎరగనట్టు ఏకాగ్రతతో చదువుకుంటూ కూర్చుంది. అనూరాధ అందోళనగా వెళ్లి భర్తకు విషయం చెప్పి, వెంట తీసుకొని ఆశ వున్న గదిలోకి వెళ్లింది.  వారు వచ్చిన అలికిడికి ఏ మాత్రం చలించకుండా చదువుకుంటూ వుంది ఆశ. చదువులో నిమగ్నమైపోయిన కూతురిని చూసి, ఆ తండ్రి,భార్య చెప్పింది నమ్మలేదు. గది బయటకు వెళ్లి,”నువ్వేదో భ్రమపడ్డావు. మనుషులకు ఎక్కడైనా రెక్కలుంటాయా? ఒక్క రోజులో ఆశకు రెక్కలు ఎట్లా వస్తాయి?” అని వెళ్లిపోయాడు.

ఆ రోజు నుంచి తల్లి తనను గుచ్చి గుచ్చి చూస్తోందని ఆశ గమనించింది.తన రెక్కల్ని దాచడానికి మరిన్ని జాగ్రత్తలు తీసుకొంది. అలా రెండేళ్లు నెట్టుకరాగలిగింది. ఒకసారి బాగా జ్వరం వచ్చి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది ఆశ.

అనూరాధ మందులు ఇస్తూ, సపర్యలు చేస్తూ, ఒక సారి ఆశ భుజాలు తడిమి చూసింది. రెక్కలున్న విషయం నిర్థారించుకుంది. భర్తకు చూపించింది. జ్వరంలో కూతురిని ఏమీ అడగలేకపోయారు. తల్లికి, తండ్రికి తన రెక్కల సంగతి తెలిసిపోయిందని ఆశ కూడా గుర్తించింది.

ఒక రోజు ఆశ ఆదమరిచి నిద్రిస్తుండగా అనూరాధ, ఆమె భర్త కలిసి ఆశ రెక్కల్ని కత్తిరించడానికి ప్రయత్నించారు.రెక్కల మీద కత్తి పెట్టారో లేదో ఆశకు మెలకువ వచ్చింది. తన రెక్కల్ని కత్తిరించవద్దని ఏడుస్తూ ఒక్క ఉదుటున మంచం దిగి పక్క గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంది.

తెల్లారాక, పనిమనిషి తలుపుకొడితే తలుపు తీసింది ఆశ. స్నానం చేసి, కాలేజీకి వెళ్ళడానికి తయారైంది.తన బుక్సన్నీ రెండు సంచుల్లో పెట్టి, నాలుగైదు డ్రస్సులు ఒక సూట్ కేసులో సర్దుకొంది. వాటిని చూసి ‘ఎందుకవన్నీ’ అని అనూరాధ అడిగింది.

“నాకు రక్షణ లేని ఇంట్లో వుండలేను. ఒకర్నొకరం అనుమానంతో చూసుకుంటూ దొంగల్లాగా బతకడం నాకిష్టంలేదు. పరీక్షలు అయ్యేదాకా శ్యామల టీచర్ ఇంట్లో ఉంటాను. తర్వాత ఏదైనా ఉద్యోగం చూసుకుంటాను” అని విసవిసా వీధిలోకి నడిచి ఆటోను పిలిచింది.తల్లి, తండ్రి చూస్తుండగానే ఆటో ఎక్కి వెళ్లిపోయింది. ఇద్దరూ అశతో ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయారు.

రెక్కల్ని చూసి తామెందుకు అంత కిరాతంగా ప్రవర్తించామా అని పశ్చాత్తాపపడ్డారు. ఆశను అదుపులో పెట్టాలని ప్రయత్నించి చివరికి తాము తప్పు చేశామని గుర్తించారు. ఆ సాయంత్రమే శ్యామల టీచర్ ఇంటికి వెళ్లి ఆశను ఇంటికి రమ్మని బతిమాలారు.

“ వద్దు మీరు నన్ను అర్థం చేసుకోలేరు. ఈ ప్రేమ చాలు. అప్పుడప్పుడు కలుసుకుంటూ వుందాం. నేనిక్కడ సంతోషంగా వుంటానని మీకు తెలుసు. నా గురించి బెంగపెట్టుకోవద్దు.” అని తల్లిని ఓదార్చింది . ఆశ  ఓదారుస్తుంటే అనూరాధ అనుకొంది”ఆశ ఏనాడు తొందరపడి తనను ఒక్క మాటా అనలేదు. తనే ప్రతిసారీ, తను తల్లినని, తన మాట నెగ్గితీరాలని అనాలోచితంగా ప్రవర్తించాన”ని అనూరాధ గుండెలవిసేలా ఏడ్చింది .

ఆ కన్నీళ్లు ఆమెలోని కాఠిన్యాన్నంతా కడిగేసినట్టున్నాయి. ఆ రోజు నుంచి ఆమె ఆశను అమితంగా ప్రేమించింది. ఆశ బి.ఏ. పూర్తి చేశాక ఉద్యోగంలో చేరాలనుకుంది. కానీ శ్యామల టీచర్ ఒప్పుకోలేదు.ఆశ తలిదండ్రులు కూడా ఆశ పై చదువులు చదవాలని చెప్పారు. వారిలో ఈ మార్పు చూసి ఆశ సంతోషపడింది.ఎం.ఎ. పూర్తి చేసి కాలేజీలో లెక్చరర్ గా చేరింది. అక్కడే ఆమెకు మురళితో పరిచయమైంది.

“అమ్మ నాకు జన్మనిచ్చింది. మా శ్యామల టీచర్ నాలో చైతన్యం కలిగించారు. చైతిన్యించినప్పుడే కదా నిజంగా జన్మించినట్టు” అంది ఆశ. అ క్షణంలో ఆశలో కొత్త అందాలు చూసి మురళి ఆనందంతో పొంగిపోయాడు.

“శ్యామల టీచర్ ను నాకింత వరకు పరిచయం చేయలేదు ఎందుకు” అన్నాడు మురళి. వంట పూర్తి చేసి ఇద్దరు  చేతులు కడుక్కున్నారు.

“ ఒక్క నిముషం” అంటూ ఆశ చేతులు గబగబా తుడుచుకుంది నాప్ కిన్ తో, దాన్ని మురళి చేతుల్లో  పెట్టి ఫొటో ఆల్బమ్ తీసుకొచ్చింది. మురళి కూడా గబగబా చేతులు తుడుచుకొని, నాప్ కిన్ ను ఫ్రిజ్ కు తగిలించి

ఆల్బంలోకి తొంగి చూశాడు.

“ఇంతకు ముందే ఈ ఫొటో చూపించి, నా కిష్టమైన టీచర్ అని చెప్పావు కానీ, మీ మధ్య ఇంత అనుబంధం వుందని చెప్పలేదు. నాకు ఇప్పుడే శ్యామల టీచర్ ను చూడాలని వుంది వెళదామా?” అన్నాడు మురళి.

“ ఆమె లేరు. నేను ఎం. ఎ. చదువుతుండగా చనిపోయారు?

“సారీ! ఆమెను గుర్తు చేసి బాధపెట్టాను”.

“అదేం కాదు. మన దగ్గర లేని వాళ్లను గుర్తు చేసుకొని కొత్త ఉత్సాహం నింపుకోవాలి. నాకెప్పుడు దిగులు వేసినా శ్యామల టీచర్ ను గుర్తుచేసుకుంటాను.”.

“ అవునా ! అయితే ఆ ఫొటో ఇటివ్వు”.

“దేనికి?” అంటూనే ఆల్బంలోంచి ఫొటో తీసి ఇచ్చింది ఆశ.

“ఫొటో ఎన్లార్జ్ చేయించి, లామినేషన్ చేయిస్తాను. బుక్స్ ఆల్మెరాలో కనిపించేట్టు పెట్టుకుందాం”.

“భలే మంచి ఐడియా”. ఆశ రెక్కల్ని చాపి మురళిని కౌగలించుకొని ముద్దుపెట్టుకుంది.

***

“ఎంత రెక్కలుంటే మాత్రం. రాత్రి పదకొండు గంటలైంది. ఇంకా ఇంటికి రాలేదు. టీచర్! మీరైనా చెప్పండి ఆశకు. ఈ భయాన్ని భరించడం క్షణక్షణానికి కష్టమవుతోంది” ఫొటో లోని శ్యామలకు ఫిర్యాదు చేశాడు మురళి.

అప్పుడే డోర్ బెల్ ట్రింగ్ మని మోగింది.

పరుగున వెళ్లి బోల్ట్ తీసి డోర్ తెరిచాడు మురళి. ఎదురుగా ఆశ.

“ హమ్మయ్యా! ఏమైందోనని భయపడి ఛస్తున్నాను. ఎట్లా వచ్చావ్? ఎక్కడికెళ్లావ్? ఓల్డ్ సిటీలో కమ్యూనల్ టెన్షన్స్ మొదలయ్యాయి. నీ గురించి ఎంత ఆందోళన పడుతున్నానో. నీ కోసం స్వప్నకు, రాధికకు ఫోన్ చేశాను. నువ్వెక్కడికెళ్లింది వాళ్లు చెప్పలేకపోయారు.”

“భార్గవి పూణేకి మకాం మారుస్తోందని చెప్పాను కదా! ఈ రోజు ఫ్రెండ్స్ కందరికి పార్టీ ఇచ్చింది. తొమ్మిదికంతా వస్తాననుకున్నాను. నీక్కూడా ఏదో మీటింగ్ వుందన్నావు కదా?!” భుజానికున్న బ్యాగ్ తీసి ఆల్మెరాలో పెడుతూ అడిగింది.

“ఓల్డ్ సిటీలో టెన్షన్ గా వుందని మీటింగ్ రద్దు చేశారు. ఏడుకంతా ఇంటికి వచ్చాను. అప్పట్నుంచి నీ కోసం ఎదురు చూస్తున్నాను.”

“ఏమన్నా చదువుకోవచ్చు కదా!” అంది కేన్ కుర్చీలో చేరగిలపడుతూ.

“ నీ కోసం ఎదురు చూస్తూ వంట చేశాను. ఫోన్ చేస్తావేమోనని నిన్ను తీసుకరావొచ్చని ఎదురు చూస్తున్నాను. ఫోన్ చేయొచ్చు కదా?”

“నేను రాగలను కదా! నీ టైం పాడు చేయడం ఎందుకని ఫోన్ చేయలేదు. నేను తినే వచ్చాను. నువ్వు తిను.” డైనింగ్ టేబుల్ దగ్గరకు నడిచారు ఇద్దరు. మురళి వడ్డించుకున్నాడు.

“రెండు మూడు నెలలుగా చూస్తున్నాను. బాగా పనులు పెట్టుకుంటున్నావు.ఇంటికి వెళ్లి హాయిగా కబుర్లు చెప్పుకుందామని కలలు కంటూ ఇంటికి వస్తానా? నువ్వు కనిపించకపోయే సరికి దిగులు వేస్తుంది. ఇక వస్తుంది,.. ఇక వస్తుంది…. అనుకుంటూ ఎదురుచూస్తుంటాను. ఉదయమే ఏదన్నా మీటింగ్ వుంటే చెప్పొచ్చు కదా, నేను వచ్చి  పికప్ చేసుకుంటాను. త్వరగా ఇల్లు చేరుకుంటాం”.

“ఎందుకిలా తయారవుతున్నావ్ మురళి. నేను పనులు కల్పించుకుంటున్నట్లు , నువ్వు ఏమైనా పనులు పెట్టుకోవచ్చు కదా?”

“నన్నంటున్నావ్. నువ్వెందుకు మారిపోయావు. నువ్వెక్కడికి వెళ్లేది నాకెందుకు చెప్పడంలేదు.”

“ప్రతిదీ ఎందుకు చెప్పాలి?”

“ చెబితే తప్పేమిటి?”

“ నాకిష్టం లేదు.కొన్ని కొన్ని పనులు నేను చేసుకుంటేనే నాకు హాయిగా వుంటుంది.”

“నేను వెంట వుండడం నీకు ఇబ్బందిగా వుంటుందా?”మురళి అడిగాడు.

“ఎందుకుండదు?  నీకు బోర్ కొట్టకుండా నేనూ, నా ఫ్రెండ్స్ నిన్ను చూసుకుంటూ వుండాలి. అదీగాక, నీకు నీ ఫ్రెండ్స్ లేకపోతే ఎట్లా?”

“ నీ ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్ అంటూ ప్రత్యేకంగా ఎందుకు? నీ ఫ్రెండ్స్ నాకూ ఫ్రెండ్సే. నా ఫ్రెండ్స్ నీకూ ఫ్రెండ్సే”.

“అంత ఇరుకుగా జీవించవద్దు మనం. అన్నిట్లో పూర్తిగా కలగలిసిపోవడంలో ఎప్పుడూ ఎవరో ఒకరికి నష్టం కలుగుతుంది. నీ స్నేహితులు, నీ పనులు వేరే వుండాలి. రవి శంకర్ నీకు మంచి ఫ్రెండే కదా. ఎన్నాళ్లయింది మీరు కలుసుకొని?”

“ఇప్పుడవన్నీ ఎందుకు? నీకు ఏ ఇబ్బంది కలక్కుండా చూడ్డం కోసమే నేను నీకోసం వస్తానంటున్నాను.”

“ అది నాకిష్టం లేదు. నువ్వు నా కోసం డ్రైవరుగానో, పి.ఆర్వోగానో పనిచేయడం నా కిష్టం లేదు. నాకు రెక్కలున్నాయి. నా పనులు నేను చేసుకోగలను.”

ఆశ అభిప్రాయాలు ముందు కఠినంగా కనిపించాయి మురళికి. ఆలోచిస్తున్న కొద్దీ అందులో అర్థం చాలా వుందనిపించింది. నిజమే ఒకరి స్వేచ్ఛ మరొకరికి అడ్డంకి కాకూడదు అనుకున్నాడు మురళి.

*

 

ఎస్. జయ

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • చాలా బాగుంది కథ. చాలా ఆలోచనలు రేకెత్తించింది నాలో నేను తొంగిచూసుకున్నట్టు అనిపించింది ధన్యవాదాలు

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు