ఒక్క పోస్ట్‌ చేయండి… ప్లీజ్‌

ఇప్పుడిలా శిథిల చిత్తరువునై
బిత్తరపోతున్నాను కానీ
పూర్ణవాక్యంలా ఒకప్పుడెన్ని ప్రభలు పోయాను?
ఇప్పుడిలా విరిగిపోయిన వాక్యాన్నై
వీధి పక్కన పడి ఉన్నాను కానీ
అంతఃకరణాల అంతఃపురాలలో
ఒకప్పుడెన్ని రాజసాలొలికాను?
అచ్చులు, హల్లుల మధ్య చుట్టేసిన
భూమ్యాకాశాల్ని ఒంటి చేత్తో మోస్తూ
ఊసుల నిండా నవ్విన కాడమల్లెల తోటల్ని
శ్వాసల నిండా సోకిన స్పోటకపు పుళ్లని
ఏకకాలంలో నిర్విరామంగా తలదాల్చినదాన్ని!
పక్షుల్లా ఎగిరే పవలురాత్రిని మూటగట్టి తెచ్చి
రంగుల సంబరంలో రవ్వంత ముంచి తీసి
రెపరెపలతో కాస్తంత సహజీవనం చేయించి
కొద్దికొద్దిగా ఫ్రేములు కట్టిన జీవితాన్ని
మనిషికింత మనసుకింత గంధంగా పూసినదాన్ని!
అసలు, కాలం మీద కొడిగట్టని గండదీపంలా
నేనెంత దర్పం పోయినదాన్ని?!
ఎప్పుడూ వాకిలి తెరిచుంచుకుని
వచ్చే పోయే చుట్టాలతో
లెక్కలేనన్ని లబ్‌డబ్‌ల్ని మోసిమోసి
కొండెక్కిపోతున్న మీ వర్ణధనస్సుల మీద
నేను దేవకాంచనమైనప్పుడల్లా
సూరీడెంతగా చుప్పనాతివాడయ్యేవాడో
ఎండల రగడలో నిమ్మమజ్జిగ తేటలా –
ఎగదూసుకువచ్చే మీ తంపటుల్ని చేయుచ్చుకుని
పంచెవన్నెల వానల్లోకి నడిపించినప్పుడల్లా
దిక్కులెన్నిమార్లు మూతులొంకర్లు తిప్పుకునేవో
ముంచెత్తీ ముద్దాడి, గిల్లీగిచ్చీ, మైలపడి, రెక్క ముడిచి –
కాలమెలా మీ పక్కలో ఒత్తిగిల్లినా
కాళ్ళు కడిగి మీరెత్తిన ఉత్తరాల పల్లకీలకు కేరాఫ్‌ చిరునామానై
పరికిణీలు కట్టుకున్న పొద్దుల్ని
చిలక్కొట్టిన పండులాంటి సమయాల్ని గుదిగుచ్చి
మీ మనసులకెన్నిసార్లు శ్రీమంతాలు చేశానో
పొగలు కక్కే ఊపిరి చప్పుళ్ళకు
పొట్లం కట్టి దాచుకున్న ఆకాశాలకు
మీరు చేసుకున్న అనువాదాల్ని
కడుపులో మోసిమోసి,
మిమ్ముల్ని ఆకుపచ్చగా నిలబెట్టడానికి
ఎన్ని పునర్జన్మలెత్తానో
****
ప్చ్‌… ఏమిటో…
వెన్నెలచెండుల్లాంటి ఆ నిన్నలే మాయాబిలాల్లో
జీవితకాలం బందీలయ్యాయో ఏమో
తొడిగించుకున్న అన్నన్ని గండపెండేరాల్ని
ఏ దొంగలెత్తుకుపోయారో ఏమో
ఇప్పుడందరూ –
నా అడుగులకద్దిన వేడుకల్ని మరిచి
ఉమ్మనీరు మింగిన బిడ్డగా నన్ను మార్చేసి
ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నారు
ఇప్పుడన్ని గుండెలూ –
తలా కాసిన్ని ఎండలు విసిరి
నన్నో వాడిపోయిన వాగును చేస్తున్నాయి
పువ్వుల సంతకమే ఎరుగని
పోతుచెట్టుగా మిగిలిపొమ్మని శపిస్తున్నాయి
ప్లీజ్‌… ప్లీజ్‌…
చీకటి ఒడ్డున గొంతు పట్టుకుపోయిన
నాలోకిన్ని అక్షరగంగోత్రుల్ని
ఇప్పటికైనా వేకువతీగగా పాకించరూ…!
ప్లీజ్‌… ప్లీజ్‌…
మళ్లీ నన్ను
మీ ఇంటికి వచ్చీపోయే అతిథిగా
ఇంకోసారి పరామర్శించరూ…!
*

యార్లగడ్డ రాఘవేంద్రరావు

9 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • తిలక్ పోస్ట్ మేన్ గురించి రాస్తే ఉత్తరం ఆత్మ వేదన గురించి తన దైన శైలి లో చెప్పారు రాఘవేంద్ర గారు

  • సార్,
    ఒక్క పోస్ట్ చేయండి ప్లీజ్ … అంటూ మమ్మల్ని ఎక్కడికో, మిరుమిట్లు గొలిపే దిగాంతాల వైపు లాకెళ్ళారు. రోదసి శూన్యంలో గిరికీలు కొట్టించారు. ఎంత బాగా రాసారో!
    “అచ్చులు, హల్లుల మధ్య చుట్టేసిన భూమ్యాకాశాల్ని ఒంటిచేత్తో … ”
    అవును , ఆరోజులు మళ్ళీ వస్తాయా !
    మీదెంత రమ్యమైన భావుకత సార్ .. వెన్నెల చెండు, దేవ కాంచనం, మాయా బిలం , నిమ్మ మజ్జిగ తేట , కాడమల్లె తోట .. వహ్వా, మల్లది రామక్రిష్ణ శాస్త్రి గారిని సాక్షాత్కరింపచేసారు .
    అభినందనలు సార్ .

    • గొరుసు గారూ,
      మీ లాంటి సహృదయ పాఠకులే కవికి వరం.
      కృతజ్ఞతలు

  • రాఘవా!

    ” నీ ఎగశ్వాస మీదింత
    కుంకుమ పరాగాన్ని మంత్రించి జల్లుకోని
    తమ నెలవు కానందుకు దేవతలే దిగులు చెందే
    ఆ కశ్మీరాల కనుపాపల మీద రుధిర రేఖ లెందుకున్నాయో ” ప్రశ్నించు

    అసహాయుల కన్నీళ్లు తుడిచి, వాళ్లకు సాంత్వన దొరికే దాకా ఇటు రావొద్దు !

    అక్షర గంగోత్రుల కోసమంటూ మా ఇంటికి వచ్చీపోయే అతిథిగా రావొద్దు !!

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు