ఇవి కథలు కావు మనం మర్శిన యాదులు.. కాలంతో పాటు ఊరుక్కుంట మన జీవునాన్ని బొంద వెట్టుకుంటే, అసోంటప్పుడు గిసొంటి వొయ్యి సదివిత తోలు కప్పుకున్న పెయ్యి నేను బతికే ఉన్నా అని మనకు యాజ్జేస్తుంటది.. బతుకు తన్లాటలో రికామ్ లేకుంట పని జేశి మంచం ఎక్కినంక పండుడుకు, నిద్ర కు నడుమ ఎన్నో ఆలోచనలను, బతుకుల ఖాళీ అనిపించిన జాగలను ఈ మట్టి ముచ్చట్లు గుండె గాజాలల్ల రింపి పోతాయ్..
రాజీ రాసినయి కథలు కావు, బతుకులు.. మనం సూశిన బతుకులు.. మనం బతికిన బతుకులు.. మనం దాటొచ్చిన బతుకులు.. ఇట్లా రాయాల్నంటే ఆ బతుకులు కండ్లతో కాదు మనసుతోటి సూడాలే.. ఆ బతుకులను సూషి గుండె గల్మల పదను జేరాలే.. ఆళ్ళ కనుగుడ్లల్ల తిరిగిన కన్నీళ్లను కింద వదనీయకుండ పెన్నుల పోషి అక్షరాలని చేశి పుస్తకంగా రాశి మనతోని గిన ఆ కండ్ల పొన్న రెండు సుక్కలు కార్పిచ్చింది..
అర్రాసు.. ఇంకో ఆరు కథలతో రాశిన తెలంగాణా జీవిత చిత్రం.. ఒక్కో కథ ఒక్కో గోస.. వందలొటు కీసల వెట్టుకున్నాందుకు ఒక పొల్లగాడు పడ్డ అవమానం కాన్నుంచి, సొంత అక్క ఇంట్లకు ముద్దుగ సూస్కున్న బిడ్డెను ఇచ్చి అన్యాలామైపోయిన అంజన్న దాకా ఏడు కథలు మన గుండెను గట్టిగ తాకుతాయి.. కొన్ని కథలు మనల్ని ప్రశ్నిస్తే, కొన్ని కథలు మనల్ని నిందితులలెక్క చూపిస్తాయి.. పూలుగు, భీమి, జీతగాడు, అగ్గిపూల దారి, రాటిబాయి ఇట్లా ప్రతి కథ మనల్ని ఆళ్ళ జీవునంలోకి జెరశేపు అట్లా తీస్కాపొయ్యి ఆళ్ళతోని బతికిపిస్తది.. ఆళ్ళతోటి కూడి ఏడిపిస్తది.. ఎందుకంటే ఇవన్నీ మన సుట్టుపక్కల జరిగి మన సమాజం మరిశిపోయిన పుండ్లు.. ఈ కథలు సదివినంత షేపు ఆ పుండ్లల్ల ముల్లు కట్టె వెట్టి మాల్లోకపారి ఆ పచ్చి నిజాలను కండ్ల ముంగట సూపెట్టినట్టు అగుపిచ్చింది..
రాసుడు అందరితోటి అటో ఇటో అయితది.. కానీ ఇట్లా ఒక మాండాలికాన్ని పట్టుకుని కథల బీరిపోయి సదివిపిచ్చుడు అందరితోని గాదు.. దానికి ఆ యాస మీద పట్టొక్కటే కాదు, ప్రేముండాలే.. ఆ బతుకులల్ల తొంగి సూడాలే.. ఆ కథలు చెప్పాల్ననే ఖాయిషు ఉండాలే.. ఇవన్నీ రాజికి బగ్గ ఉన్నాయ్.. పదేండ్ల సంది రాజిని సూత్తన్న.. తాను నడిచిచ్చిన, బతికొచ్చిన మట్టి మీద ప్రేమ అప్పుడెట్లుందో ఇప్పుడు అంతకన్నా ఎక్కువుంది.. ఇసోంటి కథలు చెప్పాల్నాంటే ఈ కాలంల రాజీ పూర్తిగా అర్హురాలు.. మనం మర్శిన మాటలను మల్ల యాది జెస్కుంట, దిమాగ్ కు పని చెప్పుకుంట కండ్ల తోటి కాదు గుండెతోటి సదువుతాం.. ఈ ఏడు కథలే కాకుంట రాజవ్వ ముచ్చట్లని చానా ఇగురాలు ఈ వొయ్యిల రింపి తెలంగాణా యాసను మన గల్మలకు ఒంపింది.. ఇసోంటి అర్రాసు పుస్తకాలు మరెన్నో రావాలే.. ఆధునిక సాహిత్యం అని బాదుకు వెట్టిన మన బతుకులు మల్ల పుస్తకాలకెక్కాలే..
చివరగా.. రాజితోని కూసుంటే మూలకున్న ముప్పై ముచ్చట్లు చెప్తది.. ఆ ముచ్చట్లే కథలైతయ్.. ఆ కథలే పుస్తకాలైతయ్.. రేపు రేపు ఈ పుస్తకాలే తెలంగాణా యాసను దాసుకునే అల్మారిలైతయ్.. ఈ రాజక్క “అర్రాసు” ముచ్చట్లు తప్పకుంట సదవాలే..

నిజంగ జరిగిన విషయాలు, నేను చూసిన విషయాలు: రాజీ కన్నా
తెలంగాణ మాండలికంలో మీరు ఇంత పట్టు ఎలా సాధించారు? 







Add comment