కాకరాల వీర వెంకట సత్యనారాయణ కాకరాలగా సుపరిచితులు. రంగస్థల, సినిమా, టీవీ రంగాలలో పనిచేసారు. నాటకాన్ని, నాటక రచయితలను విశ్లేషించగల విమర్శకుడు. మంచి నటుడు. నటన వృత్తిగా జీవిస్తున్న కళాకారుడు. కాకరాల తెలుగు సమాజానికి తన నటన, కంఠం, రచన ద్వారా పరిచయమైన వాడు. తొంభై ఏళ్ల దరిదాపులలో హైదరాబాద్ లోని చండ్ర రాజేశ్వరరావు వృద్ధాశ్రమంలో సేద తీరుతున్నారు.
ఏడు పదుల కళారంగ అనుభవముంది. తెలుగుసమాజ పరిణామక్రమాన్ని తన అనుభవం నుండి అంచనా వేస్తూ తన తోటి మిత్రులతో జీవిస్తున్నారు. ఎవరైనా కాకరాల అంతరంగాన్ని కదిలిస్తే ఒక నిరంతర సంభాషణ కొనసాగుతుంది. సాహిత్యం, సమాజం, కళలు నుండి గురజాడ మొదలుకొని గరికపాటి రాజారావు వరకు ఉన్న కళాత్మక సంవేదనలను ఒక ధారగా చెబుతారు.
ఎవరీ కాకరాల?!
తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి స్వస్థలం. బ్రాహ్మణ సంప్రదాయ కుటుంబం నుండి వచ్చిన వారు. పౌరోహిత్యం జీవికగా ఉన్నవారు. సంప్రదాయ కట్టుబాట్లను దూరం చేసుకుని నాటకం, కళలు పట్ల ఆసక్తిని పెంచుకొని ఆ వైపుగా జీవితాన్ని మలచుకున్నారు. శరీరం, మనసు సహకరించనంతకాలం తనలోని సృజనాత్మకత వెలుగులో పనిచేసారు.
తెలుగునాట గరికపాటి రాజారావు ప్రజా కళలు ప్రచలితం కావడానికి పునాది వేసారు . ఆనాటికే తెలుగు నేలపై కమ్యూనిస్టు పార్టీ భావజాలం వ్యాప్తి చెందడం దీని వెలుగులో ప్రజాకళలను, జానపద, గ్రామీణ, మౌఖిక సంస్కృతిలో ఉన్న అనేక కళారూపాలను పలికించినవాడు. అలా గరికపాటి అందించిన కళాత్మక స్ఫూర్తితో ఎందరో యువ కళాకారులు తయారయినారు.
‘కళ, కళ కోసం కాదు, ప్రజల కోసం’ అనే ఎరుక తెలుగు సమాజంలో నెలకొంది . భారతదేశంలో పీపుల్స్ ఆర్ట్స్ థియేటర్ ప్రారంభం కావడం ప్రజలు ,సమాజం, సంస్కృతి కలగలిసిన ప్రయాణం మొదలైన కాలం. ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ సాధిస్తున్న విజయాల పరంపరలో ప్రజాకళలు అనేక రూపాలలో వ్యాప్తి చెందాయి. సంప్రదాయ కళాకారులు, అభ్యుదయ కళాకారులు అనే విభజన జరిగింది. ప్రజలు సహజంగానే సమాజచలనంలో ఉన్న అనేక రుగ్మతలకు ఎత్తిపట్టే కళారూపాల వ్యక్తీకరణను సొంతం చేసుకున్నారు. తమకు సంబంధించిన రోజువారి సమస్యలతో అనుసంధానించుకున్నారు. కాకరాల ఈ ప్రజాసంస్కృతికి ఒక చేర్పు.
కాకరాలను ప్రజాకళలకు మాత్రమే కుదించలేం . తిరుగుబాటు ,ప్రజాక్షేత్రం, ప్రగతిశీలత ఈమూడింటి కొనసాగింపు కాకరాల. జీవితంలో భాగమైన రచన ,ఆచరణ ఇవన్నీ కాకరాల జీవనయానంలో జీర్ణమైనాయి . సినిమా జీవిక అయినా రంగస్థలాన్ని వీడలేదు. ఈ మానసికత కాకరాలను ప్రజాపక్షం వైపు నిలబెట్టింది. కందుకూరి, గురజాడ తనని ప్రభావితం చేసిన నాటక రచయితలని చెబుతారు.
కాకరాల ప్రజాఉద్యమాల వెలుగులో తనని తాను విశాలం చేసుకున్నారు. ఏదో ఒకదశలో, మలుపులో కాకరాల ఆగలేదు. కళాభిరుచి అనే దగ్గర నిలబడలేదు. మానవప్రవృత్తి లోని అనేక అంశాలతో కాకరాల ప్రభావితమైనాడు. తొలి రోజులలో మద్రాస్ బతుుదెరువు అయినా 1980 తర్వాత హైదరాబాద్ శాశ్వత నివాసగృహమయింది. తెలంగాణ సాంస్కృతిక జీవితం కాకరాలను మరింతగా ప్రజలకు చేరువచేసింది . ఉమ్మడి కమ్యూనిస్టుపార్టీ చీలికతో విప్లవ భావజాలం వైపు ప్రయాణం చేసారు.
తన ప్రతి మజిలీ వెనుక ఉన్న రాపిడిని అనుభవించారు. సహచరి సూర్యకాంతం, ఇద్దరు ఆడపిల్లల తండ్రిగా, కాకరాల విప్లవ భావజాలానికి , విప్లవ రచయితల సంఘంకు దగ్గరయినారు. ఇది హఠాత్పరిణామం కాదు. నిరంతర తపన, ప్రజాస్వామిక సంస్కృతి పట్ల ఉన్న ఆరాటం కాకరాలను ప్రజాఉద్యమాలలో భాగం చేశాయి. తన జీవనక్రమాన్ని విప్లవోద్యమ కార్యక్రమాల వైపు మళ్ళించారు. రంగుల ప్రపంచం ఓవైపు, సినిమా, టీవీల నటన వీటిమధ్య నడవాల్సిన జీవితం నిర్బంధపు అంచులలోకి నెట్టబడింది. దీనిని ప్రజాపక్షం నుండి స్వీకరించారు.
తను నమ్మిన భావజాలం, సాహిత్యం తన సంతతిని కూడా విప్లవ భావజాలం వైపు ప్రయాణించేటట్లుగా తయారు చేసింది. ఇద్దరు పిల్లలు విప్లవవోద్యమం వైపు అడుగులు వేశారు. సహచరి సూర్యకాంతంతో కాకరాల హైదరాబాదు మహానగరంలో మిగిలారు. దేనికి వెరవని, చలించని స్వభావం కాకరాలది. జీవితంలోని శూన్యత కాకరాల దరి చేరలేదు . రాహుల్ సాంకృత్యాయన్ రచనల నుండి జీవన వాస్తవికతను గ్రహించి ప్రజా ఉద్యమాల వైపు స్థిరంగా నిలబడ్డారు. జీవితంలోని అనేక ఎగుడు దిగుడులకు తలవంచకుండా తన వికాసం నుండి రచనాక్రమాన్ని ఏర్పరచుకున్నారు. కాకరాల రచనలో నాటకం ప్రధాన వ్యాపక మైనా తన ఊపిరి ప్రజా రంగస్థలం. సమాజంలోని అనేక మార్పులను గమనించిన కాకరాల ఒక దేశ నిర్మితిలో తలెత్తిన క్షీణ సంస్కృతి పట్ల కాకరాలకు ఆందోళన ఉంది.
ఒక వ్యక్తి జీవనక్రమాన్ని ఎలా అంచనా వేస్తాం?!
వ్యక్తిగా విడివడి కాకరాల సమూహంగా స్థిరపడ్డారు. తనలోని వ్యక్తివాదాన్ని వదులుకొని సామూహికతలోని తీవ్రతను అనుభవించారు. శ్రీశ్రీ, కాళోజి ఇలా అనేక మందితో కాకరాల సాన్నిహిత్యం ప్రజలతో. మమేకమైనది . విప్లవోద్యమ ప్రభావం నూతన మానవునిగా కాకరాలను మలిచింది. తెలుగు సమాజపు నడకకు కాకరాల సజీవ సాక్ష్యం . కళారంగంలో వస్తున్న వాణిజ్య సంస్కృతి పట్ల కాకరాలలో యావగింపు ఉన్నది. వీటన్నిటి మధ్య నటన, రచన, ఉద్యమాచరణను కాకరాల విడవలేదు
కాకరాలను తెలుగు సమాజం ఎలా జ్ఞాపకం పెట్టుకుంటుంది. జీవితాన్ని ప్రజాకళలకు అంకితం చేయడమే కాదు, తన ఇద్దరు పిల్లల ఆశయాలకు అడ్డు చెప్పలేదు. విప్లవోద్యమం మా చిరునామా అని ప్రకటించుకున్నారు. బిడ్డలు అడవి దారి పట్టినప్పుడు పిల్లలను నిలవరించ లేదు.స్థిరంగా, ధైర్యంగా నిలబడ్డారు. తన సహచరి సూర్యకాంతం దూరమైన చింత వెంటాడుతుంది. మనుషులను ఎలా అంచనా వేస్తాము. ఏ భౌతిక మానసిక నిర్ధారణలో నుండి మనుషుల మానసిక స్థితిని అంచనా వేయగలం?! విరసం చిరునామాగా కాకరాల కొనసాగుతున్నారు. జీవితంలోని అనేక మజిలీలను సమాధానాలు వెతుక్కుంటూ ఒక ప్రజాస్వామిక సాంస్కృతిక ఆవరణ కాకరాల భావన . ఆవైపుగా కాకరాల ప్రయాణముంది. ఒక కళాకారుడు, ప్రజలసంపదగా ,సాంస్కృతిక కార్యకర్తగా వుంటూ ప్రజలతో కలగలిసిన ప్రయాణమిది.
స్త్రీలు, పిల్లలు, నిరుపేదలు సమానత్వాన్ని కోరుకుంటారు అనే రాహుల్జీ మాట కాకరాల కళా యాత్రకు స్పూర్తి.
*
Add comment