ఎప్పుడో ఒకప్పుడు
సింధూరమై పలకరిస్తావేమోనని
ఎదురు చూసా!
పోరాట క్షేత్రంలోనే
అడుగులు వెతుక్కుంటావని
అనుకున్నా!
ఇంత అమానుషంగా
నా నమ్మకంపై
నెత్తుటి బొట్లు రాలుస్తావని
అనుకోలేదు
స్వేచ్ఛగా గొంతెత్తి పాడిన
క్షణాలన్నీ ఏమైపోయాయి?
సంవత్సరాల పాటు
కాలపు వధ్యశిలపై వేలాడుతూ
దరిద్ర సరిహద్దుల మీద వుండి కూడా
స్వేచ్ఛా పోరాటాన్ని కలగన్నావ్!
ఒకే ఒక క్షణం లో
పోగులు పోగులు గా
ఎందుకు చీలిపోయావ్?
నీ కనురెప్పల మధ్య నుంచి
నీకు నువ్వుగా చిట్లిపోయి
కీకారణ్యాల సమూహం లోకి నెట్టేశావ్
అందర్నీ తడిసిన కట్టెల్ని చేసావ్
కానీ,
ఒక్కటి గుర్తుంచుకో!
రెండు వడలిపోయిన కళ్ళు
నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాయి
ఇదంతా ఎవడో ఒకడు
నమోదు చేసి తీరుతాడు
లేదూ, చరిత్రగా
అనుభవాలు పండిన ఆకులతో
లిఖిస్తారు
అప్పుడు చీకటి గూడా
గొంతెత్తి వురిమి మాట్లాడుతుంది.
*
Add comment