రాను రాను
ఒక రాజ్యం మరో రాజ్యాన్ని
కబళించే యుద్ధాలు
యోధులు వీరులు త్యాగాలు
వ్యూహప్రతివ్యూహాలు కుయుక్తులు కుట్రలు
ఇప్పుడు యుద్ధం తీరుతెన్నులు మారాయి
అంతా కొడితే ఒక అవగాహన ఒప్పందం
రూపం పేరు మార్చుకుంటుంది
ఆయా దేశాల మూలుగులు పీల్చడం ముఖ్యం
యుద్ధ తంత్రాల
రూపురేఖలు మారాయి
ఏదేమైతేమి ఎదుటివారిపై
ఏదో రూపంలో దాడి ముఖ్యం
శత్రువు మీద పై చేయి సాధించడం ప్రధానం
యుద్ధం అనేక రూపాల్లో
అన్ని అతిక్రమణలను అధిగమించి
నీకు తెలియకుండానే నిన్ను ఆక్రమిస్తున్నది
ఇప్పుడు తుపాకులు
ఎక్కు పెట్టవలసిన పనిలేదు
బాంబులను ఉపయోగించాల్సిన
అవసరం అసలే లేదు
యుద్ధం రూపం మారింది
ఫేస్బుక్ వాట్సప్ ఇన్స్టాగ్రామ్
ట్విట్టర్ పిట్ట కిచకిచలు
నిశ్శబ్దంగా నీ మీద దండెత్తుతాయి
నిన్ను నిరుత్తరుడుని నిరాయుధుడిని చేస్తాయి
మసి పూసి మారేడు కాయ చేయడం
బట్ట కాల్చి మీదేయడం
సామాజిక మాధ్యమాలు
ఎదుటివాని సాధ్యాసాధ్యాలు
తల లేని తలకాయలు మార్చబడును
తెల్లారేసరికి పుకార్లు, షికార్లు చేయబడును
నీకు తెలియకుండానే చాప కింద నీరులా
ఒక సైబర్ యుద్ధం కొనసాగుతుంది
నీ స్థల కాలాలను దురాక్రమిస్తుంది
కులం అలాగే ఉంటుంది
బలం బలగం అలాగే ఉంటుంది
వర్గం అలాగే ఉంటుంది
శ్రమ కర్మ సిద్ధాంతంగా మారుతుంది
కర్త క్రియలు నిష్క్రియలైపోతాయి
దేశభక్తి పేర ప్రాంతం పేర
బాధ్యత నుంచి ప్రజల నుంచి
శాసనసభలు తప్పించుకుంటాయి
సేవ సంక్షేమం అర్థాలు మారుతాయి
ఎన్నికల చుట్టూ పైసా పేకో తమాషా దేకో
బడితె ఉన్నోడిదే బర్రె
పోచమ్మ దగ్గర ఓటర్ జెడ్తి ఇచ్చే గొర్రె
మీడియా నీ చేతిలో ఉంటే చాలు
ఐడియాలు అవే పుట్టుకొస్తాయి
శత్రువు లోపల ఉన్నాడో
బయట ఉన్నాడో కనిపెట్టేసరికి
ఐదేళ్లకోసారి కాలం నెట్టుకొస్తుంది
ఓట్లు నోట్ల వర్షమై కురుస్తుంది.
*
Add comment