మనమిద్దరం ఈ జనసంచారంలో
LH -8 ముందు కూర్చుని ఉన్నాం.
నీ ముఖంలో ఎందుకో ఒక చిర్రాకు కనిపించింది
స్ట్రీట్ లైట్ వెలుగు కింద
అన్నావు ఇలా నాతో నువ్వు
వెనుకగా చూపిస్తూ ఇద్దరిని
నిట్టూర్పుగా ఒక నిచ్చ్వాసని వదులుతూ-
ఎందుకు తనలా అతనితో బాయ్స్ హాస్టల్ కి వెళుతుంది?
తను చేసే చేష్టలేమీ నచ్చడం లేదు నాకు
చూడు ఎన్నెన్ని రంగులో తనలో
బ్లాంకెట్లు రూం స్ప్రేలు బిస్కెట్ పాకెట్లు ఎలా అందరికీ కనబడేలా తీసుకుని వెళుతుందో
కొంచెమైనా సిగ్గు లేదా ఎవరేమైనా అనుకుంటారని
తనిలాంటి అమ్మాయిని తెలిసి
నా రూమ్మేట్ అయినందుకు
నాకు ప్రళయమంత కోపమొస్తుంది
ఎందుకో మరి నేను నీ మాటలకి బదులివ్వలేదు
నాలోపలే ఎన్నెన్నో ‘ఎందుకులు’ కుప్పలు తెప్పలుగా
అది తన జీవితమని తనిష్టమని
అవన్నీ తీక్షణంగా ఆలోచించడానికి మనమెవరని చెప్పాలనిపించింది నాకప్పుడు
కానీ వహించాను కాసింత నిశ్శబ్దాన్ని
★
ఈ పొద్దు
నువ్వు బాయ్స్ హాస్టల్లోంచి అప్పుడే నిద్రలేచి
మైకంలో కళ్ళు నులుముకుంటూ నడిచి రావడం చూసాను
రాత్రి తాగి అక్కడే పడుకుండిపోయానని
ఎవరికో చెబుతుంటే విన్నాను
ఇప్పుడు కూడా అవే ‘ఎందుకులు’ నాలో సుడిగుండాలులాగ
నను చూసి స్తబ్ధగా నిలబడి నువ్వు
బహుశా గతం గుర్తుకు వచ్చి
గతములోలా లేని నువ్వు మరి ప్రస్తుతములా మారిన నీకు గుర్తొచ్చి
ఎక్కడో పర్వరీణం
కానీ అడగను నిన్ను ఏంటి ఇదంతా అని
ఎందుకని అడిగితే
ఒకటే మాటగా చెబుతాను
ఇది నీ జీవితం నీ ఇష్టం
మధ్యలో ఎవరిని నేను నిన్ను ప్రశ్నించి తప్పుపట్టడానికి??
*
ఒకవేళ మనం ఇదంతా ఎందుకని హితం కోసం ప్రశ్నిస్తే వాళ్ళు అర్థం చేసుకోవచ్చు లేదా అర్థం చేసుకోకపోవచ్చు. అర్థం చేసుకున్న కూడా పట్టించుకోకుండా తన ఇష్టానుసారం తను ఉండచ్చు. అలాగే మనం వాళ్ళలో తప్పును ఎత్తిచూపుతున్నామని మనతో గొడవ కూడా పెట్టుకోవచ్చు. అర్థం చేసుకునే మనస్తత్వం ఉంటే తమ ప్రవర్తనల్ని మార్చే ప్రయత్నం కూడా చేయొచ్చు.
తన ప్రవర్తన కూడా అలాగే ఉన్న కూడా తన తప్పుల్ని దాచి తన రూమ్మేట్ గురించి అలా తను మాట్లాడటం సరైనది కాదు….కాబట్టి ఎవరి ఇష్టానుసారం వాళ్ళని ఉండనివ్వాలని , మధ్యలో వాళ్ళను ప్రశ్నించేది మనమెవ్వరమని చెప్పడం బాగుంది లిఖిత్… అక్కడ వాళ్ళ ప్రవర్తనను చెప్పాలని ఉన్న కూడా వాళ్ళ ప్రతిస్పందన ఎలా ఉంటాదోనని చెప్పలేకపోవడం.. దాన్ని ఇలా కవితలో చెప్పడం బాగుంది విఖిత్🤝