ఒకానొక కుట్ర ఊసు!

అద్గద్గో అక్కడెక్కడి సిలిగురి లోని చారూమజుందార్, కానూసన్యాల్, బెంగాల్,బీహార్, తమిల్నాడు, దేశం మొత్తాన్నించి యెలిపోవొచ్చి పార్వతీపురమ్ లో కుట్ర చేసారండీ. 

పార్వతీపురం పట్నం మీరెవుళేనా,యెపుడేనా సూసేరా? సింగారించుకొని విటులకోసం వీధిల నిలబడే వేశ్య లాగ… పట్నానికి నాలుగుదిక్కులున్న పల్లెల, కొండాకోనల జనాల కోసం కాసుల్తో కాచుకొని వుంతాది. నాలుగు దిక్కులా రోడ్లతోటీ,రోడ్లకానించిన నానా రకాల దుకాణాలుంతాయి. దుకాణాలవతల సావుకోర్ల,బ్రేమ్మర్ల,కరణాల భవంతులు, ఆ భవంతులవతల కాపూ, కంసాలీ, మేదరీ, కుమ్మరీ నానా కులాల వీధుల తరాత మాలా, మాదిగా, సచ్చరా సబ్బండజాతుల పాకలుంతాయి,             సిన్మాహాళ్ళు, సారాకొట్లు, సానివాడలుంతాయా? ఆటికి దగ్గిరిగా పోలీసు టేసన్ , మేజిస్ట్ఱేటు కోర్టు, కోర్టుకి అవతల మందులూ,డాక్టర్లూ యెపుడోగానీ ఉండని ధర్మాసుపత్రీ ,దర్మాసుపత్రికి అవతల భూముల తనఖా బెంకూ, భూముల రిజిస్ట్రేషన్ కార్యాలయమూ, సబ్ కలట్రు బంగ్లా, కార్యాలయమూ…అక్కడికి కూతవేటు దూరాన సబ్ జెయిలూ …ఇంచీమించుగా ఇదండీ పార్వతీపురం స్ట్రక్చరు.

ఇక్కడొక కుట్ర జరిగిందండీ! పేద్ద కేసు నడిచింది…పార్వతీపురం కుట్రకేసు! విని ఉంటారు. దగ్గిర దగ్గిర నూటాయేభయి మంది కుట్రదారులూ, ఆ నూటా యాభయిమందీ కుట్రచేసారని చెప్పడానికి వెయ్యిమంది సాక్షులు!

నమ్మరా? అదేమరి…అందికే కాలిపోద్ది అవతలోళికి!ఫుల్ పవర్సున్న గవర్మెంటోడు అబద్దపు కేసు పెడతాడండీ? అంత కర్మ ఆడికి యేటొచ్చిందండీ? గవర్మెంటోడికి గానీ, గవర్మెంటు దన్నున్నోడికి గానీ అబద్దం చెప్పల్సిన అవుసిరిం లేదండీ. గవర్మెంట్ గానీ, గవర్మెంట్ దన్నున్నోడు గానీ ఈ దేశం ల యేటి చేస్తే యెవుడడ్డు ఆళ్ళకి సెప్పండీ?  సేతిల లాఠీ ఉన్నోడే  ఆడు లాఠీ ఊపినట్ట లా ఊగుతాదొరే అని  మాసెడ్డ గోరోజినం సూపుతుంటే … పుల్ పవర్సున్నోళికి అడ్డేటి? గవర్మెంటోడు తలుసుకుంటే…పలానీ కారణంతోటి నిన్ను జెయిల్ల యెడతన్నానని సెప్పక్కర్లేదు. జెయిల్ల యెట్టీసి అప్పుడు సెప్తాడు. కావాలంతే…ప్రొఫెసర్ సాయిబాబానడుగు.నిజిమో అబద్దమో తెలస్తాది!పలానీ కారణంతోటి నిన్ను కాల్సిపారేస్తన్నానని సెప్పక్కర్లేదు, కాల్సిపారీసింతరాత కారణం సెప్తాడు… కావొలిస్తే…తూతుకుడి జెనాన్నడుగు…తెలిసిపోద్ది.

గవరమెంటు సంపీసి సెపుతాది, గవరమెంటు దన్నున్నోడు ముందుగాల లిస్టిచ్చి మరీ సంపుతాడు… యెవుళడ్డు?

అందికనీ అది నిజింగే కుట్రే! మీకు తెల్దండీ పార్వతీపురం మంచిదేనండీ.అక్కడ ధర్మం నాలుగు పాదాలతోటి నాలుగు వీధులా నడస్తాదండీ. అక్కడి సావుకార్లు,  బ్రేమ్మర్లు, కరణాలు, లాయిర్లు,పోలీసులు,కలక్టర్లు, డాక్టర్లు ఆళ్ళేటి ఈళ్ళేటి ఆకరికి సారాకొట్లోలూ,సానివాడలోల్లూ ధర్మదేవతని నాలుగు వీధుళ్ళంటా నాలుగుపాదాలతోని నడవాలని మాసెడ్డ తాపత్రయం పడీవోళ్ళు. ఇపుడు సూడండీ … సాధువులూ,సన్నాసులూ,జైశ్రీరామని కర్రా,కత్తీ, సాలకపోతే తుపాకీ పట్టుకొని…గవర్మెంటుకి సపోర్టుగా ధర్మదేవతని నాలుగుపాదాల నడనీయడానికి నానా పర్రాకులూ పడతన్నారే అలాగ పార్వతీపురం ల విబుధజనులు పాటుపడేవారు.

కానీ ఆ సుట్టుపక్కల కొండాకోనల్లున్న కోదులు, పల్లెల్లంట ఉన్న పేదారోదా మాసెడ్డ ఇబ్బంది పెట్టీసీవోరు. దోపిడీ రాజ్జెం అనీవోరు. సావుకార్లు దోచీస్తన్నారనీవోరు. రెవిన్యూ,ఫారెస్ట్,పోలీసులంతా అవినీతి పరులనీవోరు. కూలీల కష్టం దోచుకున్నారనేవారు. భూస్వాముల, సావుకార్ల రాజ్జమిది అనీవోరు. ప్రజల రాజ్జెం రావాలంతే పోరాడాలనేవోరు.అన్నీ అబద్ధపు కూతలే కూసీవోరు.

కోదోళ్ళ దగ్గర యేటున్నాయి? గోచీ గుడ్డలున్నాయి. సావుకార్లకి అవి కావాలా? గోచీగుడ్డలా దోచీస్తారు? అని యెవరమేనా అడిగామనుకోమ్ డీ… సావుకార్లు దోచీ బట్టే కోదోళ్ళు గోచీ గుడ్డతో మిగిలారు, ఆళ్ళ కొండఫలం, కండబలం దోచీసుకొని ఆళ్ళని గోచీగుడ్డలతో మిగిల్చారని అనే వాళ్ళండీ! కండబలం…కొండఫలం కాజేసిన దొంగవాడు అని తెల్లోళ్ళని ఉద్దేశించి అల్లూరి సీతారామరాజు అన్నాడని శ్రీశ్రీ రాసిన పాటని ఇపుడు ఈల్లూ యెత్తుకున్నారు.  యెవరూ? కోదోల్లు కాదండీ. కోదోళ్ళని అలా అనమని నేర్పేరే  మేస్టర్లు…సత్తెం,కైలాసం ఆళండీ! ఇపుడు సూడండీ అర్బన్ నక్సలైట్లలగే అంటన్నారని గద్దెమీది పెద్దలు మొత్తుకోవడం లేదా, అలాగండీ!

వొకళేటండీ సేనామంది…బోడి యెద్దుకి పొడవడం నేర్పినట్ట నేర్పినారు. కత్తులూ,కటార్లూ, తుపాకులూ వొట్టీసుకొని దింపీసినారండీ ఉధ్దానికి. వోలమ్మ…కుట్ర సేసినారండీ  అద్గద్గో అక్కడెక్కడి సిలిగురి లోని చారూమజుందార్, కానూసన్యాల్, బెంగాల్,బీహార్, తమిల్నాడు, దేశం మొత్తాన్నించి యెలిపోవొచ్చి పార్వతీపురమ్ లో కుట్ర చేసారండీ.

అవునండీ…యెక్కడెక్కడోళ్ళో వొచ్చేరండీ. ఓకే. వొచ్చినారండీ! యెవులి మీద కుట్ర చెయ్యాల? దోచేస్తండ్రు సావుకార్లు, అవినీతిపురుగులు అధికార్లు అని అన్నారా…ఆళ్ళమీద కుట్ర చెయ్యాల. పార్వతీపురం మీద చెయ్యాల! యేటి చేసారూ? గవర్మెంటు మీద కుట్ర చేసారు. ఢిల్లీ యెర్ర కోట మీద ఆళ్ళ యెర్ర జెండా యెగరేయాలని కుట్ర చేసారు! యేమంటే…తీగ ఇక్కడుంది గానీ డొంక అక్కడుందంటారా? ఇక్కడి తీగల ఊసూ వొదిలేరా? పీకలు తీసీసి మేడలకి యేళాడగట్టేరు. అక్కడితోటి ఆగినారా?నానా పర్రాకులూ పడి ,నానా శంకలూ నాకి,గడియకొక గండంగా  గద్దె మీద  పెద్దలు కూకుంటే…

సీట్ల పైన కూర్చుండే మంత్రులార ఖబర్దార్…కోట్ల గొతులొక్కసారి, గర్జిస్తాయ్,గర్జిస్తాయ్… అనంటారా? కుట్ర కాదండీ? కోట్లమందితోటి  నువ్వు కుట్ర చేస్తన్నట్టే గదా? నీ మాటలూ, పాటలూ,రాతలూ అవేగదా?

యేమంటావూ? అవేవే కుట్ర కావా? అవన్నీ తిరుగుబాట్లా? విప్లవాలా? విప్లవం కుట్రకాదా? తిరుగుబాట్లనీ, విప్లవాలనీ తెళ్ళోడూ…ఇలాగే కుట్రలన్నాడూ, పితూరీలన్నాడూ అంటావా?

వోయ్…తెళ్ళోడికయినా, నళ్ళోడికయినా  పాలకభాష వొకటేనివోయ్! నీకొక భాష వుంటాది, నిన్ను పాలించినోలికొక భాష వుంటాది. నీకొక ధీరీ వుంటాది, నీ పాలకుడికి ఇంకో ధీరీ ఉంటాది. ఆడు సిమ్మాసనమ్మీద ఉన్నాడు గాబట్టీ ఆడు సేసిందే శేసనమయిపోతాది. సిమ్మాసనమ్మీంచి దించుతావేటోనని బెంగా బెదురూతోటి ఆడు శాసనాన్ని ఆడికి దన్నుగా వోడీసుకుంతాడు.  సిమ్మాసనాన్నించి జెనం ఆడ్ని దించిందాకా జెనాన్ని రెచ్చగొట్టి కుట్ర చేస్తన్నావు నువ్వని ఆడు అంతానే ఉంతాడు. జెనం ఆడ్ని దించేరోజు కోసం సూస్తుండు…అంతేమరీ!

కొసకి, ఒక పాత ఊసు –

సాయింత్రిమ్ యేళ. మేరంగి కొండలు అప్పుడికి సల్ల బడిపోనాయి. కొండగాలీ సల్లబడిపోనాది. సాయింత్రిమ్ టీకొట్టు మూసేముందర భూషణం మాష్టారు ఒచ్చి టీ తాగీసి, ఉన్న ఆఖరి అగ్గిపుల్లతో సిగరెట్ వెలిగించుకొని టీ కొట్టు నుంచి బయటికి వచ్చారు. యెప్పటివో ఊసులు నీనూ, మేస్టారూ మాటాడుకుంటూ వూరి కొసకి వచ్చాము. పార్వతీపురం నుండి తిరిగొచ్చి పెదమేరంగి సెంటర్లో బస్ దిగి నడిచొస్తున్న అప్పల్రాజు సావుకారి యెదురైనాడు. భూషణం గారికి నమస్కరించి, గురువా అగ్గిపెట్టి ఇయ్యిమీ, గెజివిలు పీకేస్తన్నాయి, సేన సేపు నుంచి సిగరెట్ కాల్సలేదన్నాడు. మేస్టారు జేబులు తడిమి అగ్గిపెట్టి తగలక పోవడంతో – లేదోయ్ అనన్నారు.

అప్పల్రాజు సావుకారి సిరాగ్గా మొకం పెట్టి – వోసీ…అగ్గిపెట్టి లేకుండా అడివెలాగ అంటించేసావండీ అని మాసెడ్డ కోపగించేడు.

పాపం మేస్టారికి యేమి చెప్పాలో బోధపడక సావుకారి వేపు దీనంగా చూస్తన్నారు.

అడివి అంటించీలేదు… అడివి అంటుకుంది అని మేస్టారు చెప్పారని నేను సావుకారికి బదులిచ్చేను.

వోసె…అంటుకుందని సెప్పినంత మాత్రాన బొక్కల తోసేత్తారా? తోసీత్తే మేస్ట్రుగోరు యెలిపోనారా అమాయికుడా? యెళ్ళండీ! మేస్ట్రుగోరు తక్కువోళ్ళు కారండీ…మీకు తెల్దండీ..ఇతగాను కాకపోతే ఇతగాని లాటోళ్ళు అంటించీసినారు కారండీ అడివిని? వొట్టినే యెట్టిందా గవర్మెంటు ఇలాటోలందరి అనూపానులూ తెలిసే యెట్టింది…అని సావుకారి బలమయిన వాదన చేసాడు..

(అడివంటుకుంది…అనే కధ భుషణం గారు రాసేరు. ఎమర్జెంసీ లో జెయిల్లో ఉన్నారు. పై సంభాషణ నేపధ్యమది)

మేస్రుగోరో- పార్వతీపురం కుట్ర కేసుల కూడా మీరు ముద్దాయిలే కదండీ-అనడిగేసి సావుకారి వెళిపోయేడు.

పార్వతీపురానికి తూర్పువేపు పాతిక కిలోమీటర్ల దూరమ్ల్ లో ఉంటుంది మేరంగి…!

మేరంగి కొండల్లో మెరిసింది మేఘమూ, సంగమొలసా కొండల్లో సాగిందీ వొర్షమూ…వో జాలరన్నా..(శివసాగర్ పాట )

 

*

అట్టాడ అప్పల్నాయుడు

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు