ఒకానొక కాలంలో…

సామాజిక సమస్యలను, ప్రస్తుత సందర్భాలను గమనించి వాటిని కథలు చేసే రచయితలకు స్థలకాలాలను సరిగ్గా రాయాల్సిన అవసరం కథా రచనకి సంబంధించిన “టెక్నికల్” అంశం మాత్రమే కాదు.

త పక్షం ముగింపు వాక్యాలతో ఈ వ్యాసం మొదలుపెడదాం –

“నేను హిస్టారికల్ ఫిక్షన్, సైన్స్ ఫిక్షన్, ఫాంటసీ లాంటివి ఏవీ రాయటంలేదు. ఈ రోజుల్లో మన చుట్టుపక్కల జరుగుతున్న సంఘటన ఆధారంగా కథలు రాస్తాను” అని మీరు అనచ్చు. అలాగైతే ఈ స్థలకాలాదుల గురించిన అవగాహన మిగిలిన వాళ్ల కన్నా మీకే ఎక్కువ అవసరం. అది అవసరం మాత్రమే కాదు. సామాజిక సమస్యలను, ప్రస్తుత సందర్భాలను గమనించి వాటిని కథలు చేసే రచయితలకు స్థలకాలాలను సరిగ్గా రాయాల్సిన అవసరం కథా రచనకి సంబంధించిన “టెక్నికల్” అంశం మాత్రమే కాదు. అది ఒక బాధ్యత కూడా. ఆ బాధ్యత గురించి మళ్లీ కలిసినప్పుడు.” అని చెప్పాను. ఇప్పుడు ఆ సంగతులు చెప్పుకోడానికి ఊతంగా ఒక కథా శకలం ఇస్తున్నాను. చదవండి తరువాత వివరంగా మాట్లాడుకుందాం.

***

ప్రేమగులాబీ

నిఖిల్ స్కూటర్ సీటుపై ఉన్న వర్షపు నీటిని తుడిచి, మళ్లీ తన వాచ్ చూసుకున్నాడు. ఏడు దాటుతున్నా శ్రావ్య ఇంకా రాలేదని చికాకుగా ఉంది. నెక్లెస్ రోడ్‌లో ఉన్న ఆ కేఫ్‌ వీకెండ్ కబుర్లతో సందడిగా ఉంది. బయట రెయిలింగ్ పైన వేసిన సీరియల్ లైట్లు మిణుగురు పురుగుల్లా మెరుస్తున్నాయి. వాటిని చూస్తూ మరో పావుగంట్ గడిపిన తరువాత ఆమె వచ్చింది.

“సారీ” అంది వస్తూనే. నిఖిల్ అదేమీ వినలేదు. ఆమెని చెయ్యిపట్టుకోని లాక్కెళ్లి రెస్టారెంట్‌లో కూర్చోపెట్టాడు. ఆమెకు ఇష్టమైన వేడి వేడి షుగర్‌లెస్ ఫిల్టర్ కాఫీలు రెండు ఆర్డర్ చేశాడు.

అప్పటికే శ్రావ్య తడిసి ముద్దై ఉంది. దుపట్టా భుజాలకు అతుక్కుని ఉంది.

“చెప్తే నమ్మవు. యూనివర్సిటీ చుట్టూ పోలీసులు. బయటికి రావటం చాలా కష్టంగా ఉంది.”

నిఖిల్ నవ్వాడు. “రేపు టాంక్‌బండ్ మీద ర్యాలీ ఉందట” అని కాఫీ కప్పును ఆమె వైపు నెట్టాడు. “అది వదిలెయ్. నీకో న్యూస్ చెప్పాలి” అన్నాడు. ఆమె ఆసక్తిగా ముందుకు వంగింది.

“నేను నాన్నతో మాట్లాడాను. వచ్చే వారం మీ అమ్మానాన్నతో మాట్లాడటానికి ఒప్పుకున్నాడు.” శ్రావ్య ముఖం వెలిగిపోయింది. “అవునా? నిజమా? సూపర్” అంది.

ఆ తరువాత వాళ్లు చాలాసేపు రిసెప్షన్ ఎలా చేసుకోవాలి, ఫోటోలు ఎలా తీయించుకోవాలి, చిన్న ఫంక్షన్ చేసుకోవాలా లేక డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలా అనే దాని గురించి మాట్లాడుకున్నారు. ధోతీ కట్టడం రాదని అతను చెప్పినప్పుడు మాత్రం ఆమె అతన్ని ఆటపట్టించింది. నగల గురించి అతను ఆమెను వెక్కిరించాడు.

బయట, కొంతమంది విద్యార్థులు జెండాలు ఊపుతూ, నినాదాలు చేస్తూ వెళ్లారు. కానీ వాళ్ల గొంతులు కేఫ్‌కి ఉన్న అద్దాలను దాటి రాలేకపోయాయి. ఒక పోలీసు జీప్ సైరన్ మోగించుకుంటూ వచ్చి ఆగిండి. పోలీసులు ఆ వాన్‌లో నుంచి దిగగాని కొంతమంది స్టూడెంట్స్ డివైడర్ దూకి పరుగెత్తారు. నలుగురైదుగ్గురు పోలీసులతో వాదనకి దిగారు. నిఖిల్ వాళ్లని చూసినా పెద్దగా పట్టించుకోలేదు. శ్రావ్య మాత్రం అటు చూసి మళ్లీ అతని వైపు తిరిగి గట్టిగా నిట్టూర్చింది –

“మన జీవితం సింపుల్‌గా ఉండాలని నేను కోరుకుంటున్నాను. నువ్వు, నేను. ఏ డ్రామా వద్దు, ఏ రాజకీయం వద్దు, ఏమీ వద్దు.” అంది మెల్లగా. అతను ఆమె చేతిని నొక్కుతూ తల ఊపాడు.

వర్షం ఎక్కువైంది. వారిద్దరూ తమ టేబుల్ దాటి వేరే ప్రపంచమే లేదనట్లుగా, కాఫీ తాగుతూ కూర్చున్నారు.

***

ఈ కథ ఎక్కడ నడుస్తోందో సులభంగానే తెలుస్తోంది. నక్లెస్ రోడ్, టాంక్‌బండ్‌ల ప్రస్తావన ఉంది కాబట్టి హైదరాబాద్ కథాస్థలి. ఎప్పుదు జరుగుతోంది? ఇది కూడా పెద్ద కష్టం కాదు. యూనివర్సిటీ చుట్టూ పోలీసులు, టాంక్‌బండ్ పైన ర్యాలీ, విద్యార్థుల నిరసనలు – ఇది ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర సాధన కోసం ఉద్యమం జరుగుతున్న రోజులు. స్థలం తెలిసింది, కాలం తెలిసింది. కనీసం అవి తెలిసేలా రచయిత రచన ఉంది. ఇక ఇందులో లోపం ఏముందని అనిపిస్తోందా? ఒక రచయిత ఒక కథ రాసినప్పుడు అందులో ఒక స్థలాన్ని కాలాన్ని ఎంచుకున్నప్పుడు ఆ స్థలంలో, ఆ కాలంలో జరుగుతున్న చరిత్రని రికార్డ్ చెయ్యాలి. ముఖ్యంగా ఆ చరిత్రకి, చెప్తున్న కథకి సంబంధం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ పని చెయ్యాలి. నేను ముందే చెప్పినట్లు ఇలా చెయ్యటం కేవలం కథలు రాసే టెక్నిక్కులలో ఒకటి కాదు. అది రచయిత బాధ్యత కూడా.

ఈ విషయం ఇంకా వివరంగా అర్థం చేసుకోడానికి ఇదే కథని కొంచెం వివరంగా పరిశీలిద్దాం. ఈ కథ ఇలాగే ముందుకెళ్తే ఏం జరిగే అవకాశం ఉంది? మూడు రకాలుగా కథ నడిచే అవకాశం ఉంది.

మొదటి మార్గం: ఈ వర్షన్‌లో ఆ ప్రేమికుల ప్రేమకి జరుగుతున్న ఉద్యమం అడ్డంకి అవుతుంది. అబ్బాయి స్వస్థలం విజయవాడ. అమ్మాయిది కరీంనగర్. ఆమె తండ్రి తెలంగాణా రాష్ట్రానికి మద్దత్తుగా ప్రొఫెసర్ ఉద్యోగం వదిలిపెట్టిన వ్యక్తి అయ్యుంటే? ఉద్యమ నేపథ్యంలో ఆంధ్ర-తెలంగాణా కుటుంబాల మధ్య సంబంధాల గురించి కథ నడపచ్చు. కథ ఈ దిశలో నడవబోతుంటే ఫర్లేదు. కానీ పైన ఇచ్చిన కథాశకలంలో ఉద్యమ నేపథ్యాన్ని చెప్పీ చెప్పనట్లు ప్రస్తావించాల్సిన అవసరం ఏముంది? సస్పెన్స్ కోసమా? అయితే కొంత క్షమించవచ్చు. కానీ, ఇలాంటి కథనం వల్ల కథ ఫ్లేవర్ ఉన్నట్టుండి మారిపోయే ప్రమాదం ఉంటుంది.

రెండో మార్గం: అసలు కథే ఉద్యమం గురించి. ప్రేమ కథ అనే ఆసరా తీసుకోని ఉద్యమం గురించి చెప్పాలనుకున్న కథ. మళ్లీ పైన చెప్పిన సమస్యే వస్తుంది. పైపైన ఉన్న ఫ్లేవరే స్వీట్‌గా ఉంటుంది కానీ లోపల చాలా కారంగా ఉంటుంది అంటే ఎలా? తీపి కరిగి కారం తగిలినప్పుడు కలిగే షాక్ పాఠకులు మెచ్చుతారని నేననుకోని.

1994లో 1942 A Love Story అనే సినిమా వచ్చింది. అందులో ఒక ప్రేమ జంట కథ ఇలాగే అప్పుడు జరుగుతున్న స్వతంత్ర పోరాటం (అది క్విట్ ఇండియా సంవత్సరం) నేపథ్యంలో సాగుతుంది. ఈ కథా, నేపథ్యాల మధ్య సమన్వయం లేకపోవటం, ఉన్నట్టుండి ఫ్లేవర్ మారిపోవటం ఈ సినిమా పరాజయానికి కారణాలుగా చెప్తారు. ముఖ్యంగా ఒక ప్రేమ కథ చూస్తున్న ప్రేక్షకులు, స్వతంత్ర పోరాటం కథలోకి రాగానే ప్రేమ కథకి ప్రాధాన్యత ఇవ్వకుండా పోరాటం గురించి చూడాలని కోరుకున్నారు. కానీ సినిమా ఆ దిశలో వెళ్లకపోవటంతో నిరాశకి గురైయ్యారు. (AR రెహమాన్ పాటలు బాగుంటాయి కాబట్టి కాస్త నిలబడిందీ సినిమా)

మూడో మార్గం: కథలో ఉద్యమం పాటికి ఉద్యమం నడుస్తూ ఉంటుంది. ఆ ఉద్యమం కథని ఏ విధంగానూ ప్రభావితం చెయ్యకుండా, వీళ్లిద్దరికీ పెళ్లైపోతుంది లేదా ఇద్దరూ విడిపోయి ఒకరు అమెరికాకి, మరొకరు దుబాయ్‌కి వెళ్లిపోతారు. ఇలా కథ నడిస్తే అది చాలా దుర్మార్గమైన కథ అవుతుంది. కథ జరుగుతున్న కాలంలో ఉన్న ఒక సందర్భాన్ని నేపథ్యంగా వాడుకుంటూ, ఆ నేపథ్యం కథని ఏ మాత్రం ప్రభావితం చెయ్యనట్లు కథ రాయటమనేది రచయిత ఆ కథకి, దాంతోపాటు చరిత్రకి చేసే ద్రోహం అవుతుంది. ఎందుకు? చెప్తాను రండి.

రచయిత ఒక కథని ఒక నిర్దుష్టమైన స్థల కాలాలలో నడుపుతుంటే ఆ స్థలంలో, ఆ కాలంలో జరుగుతున్న సంఘటనలని బాధ్యతగా, కథలో రసస్పందన చెడకుండా రికార్డ్ చెయ్యాలి. ఆ పని బాధ్యతతో చెయ్యాలి. ఇది కదా చెప్పుకున్నాం. ఇక్కడ బాధ్యత అనే పదం గురించి కొంచెం చెప్పుకోవాలి. ఎందుకు బాధ్యతగా చెయ్యాలి? ఎందుకంటే ఇలాంటి సందర్భాలలో రచయిత బాధ్యతగా వ్యవహరించకపోతే, పాఠకులు, విమర్శకులు రచయిత నిబద్దతని ప్రశ్నించే అవకాశం ఉంటుంది.

మళ్లీ ఒకసారి పైన ఇచ్చిన కథ చదవండి. అందులో తమ చుట్టూ జరుగుతున్న ఉద్యమం గురించి ప్రధాన పాత్రలు ఎంత అభావంగా ఉన్నాయో చూశారా? ఆ ఉద్యమం పట్ల వాళ్లకి వ్యతిరేకత లేదా చులకన భావం కూడా ఉన్నట్లు వాళ్ల మాటల్లో ధ్వనిస్తోంది. అది కేవలం పాత్రల అభిప్రాయం అయితే ఫర్వాలేదు. అది రచయిత అభిప్రాయం కూడా అయితే? ఇది ఇంకా కథ మొదలే కాబట్టి ఇలా ఉంది, ముందు ముందు ఆ రచయిత భావన మరింత స్పష్టంగా వ్యక్తమైతే? చరిత్ర ఆ రచయితని క్షమించదు. క్షమించకూడదు కూడా.

మరి రచయిత బాధ్యతగా ఉండాలంటే ఏం చెయ్యాలి? అన్నింటికన్నా ముందు –

ఒక స్థలానికి మరో స్థలానికి, ఒక కాలానికి మరో కాలానికి మధ్య ఉండే తేడాలు రచయితకి తెలియాలి. ఒకే కాలంలో రెండు ప్రాంతాలలో, ఒక ప్రాంతం రెండు కాలాలో ఎలా ఉంటాయో అన్న అవగాహన ఉండాలి. వాటి మధ్య ఉన్న వ్యత్యాసాలు గుర్తించగలిగి ఉండాలి. స్థలం అంటే భౌగోళికం కాదు. కాలం అంటే కేలండార్‌లో డేట్లు, వాచ్‌లో టైమ్ కాదు. ప్రతి స్థల కాలాలలో ఉండే కులం, జెండర్, కుటుంబం వ్యవస్థ, సమాచార లభ్యత, ఆ సమాచారం ఎవరికి అందుబాటులో ఉంది, ఎవరికి నిషిద్దమై ఉంది లాంటి సామాజిక వ్యవస్థ, ఆర్థిక అసమానత, వృత్తులు, వ్యాపారం, కరువు లాంటి ఆర్థిక వ్యవస్థ, సాకేతిక పరిజ్ఞానం, చట్టం, అధికారం లాంటి రాజకీయ స్థితిగతులు, సాంప్రదాయం, నమ్మకాలు లాంటి సాంస్కృతిక అంశాలు, మొదలైనవన్నీ కలిపితేనే అది ఒక నిర్దుష్టమైన స్థల కాలాలను సూచిస్తుంది. వీటిల్లో ఒకటి సరిగ్గా ఉంచి మరొకటి సరిగ్గా ఉంచకపోతే అది మీరు అనుకున్న స్థల కాలాలని సూచించకపోవచ్చు లేదా అసంబద్ధంగా మారచ్చు. దాని కన్నా ప్రమాదకరమైనది మీరు రచయితగా కొన్ని అంశాలని ఉద్దేశ్యపూర్వకంగా విస్మరించి చరిత్రకి ద్రోహం చేస్తున్నారని పాఠకులకి అనిపించచ్చు.

రచన అంటే కేవలం వినోద సాధనం కాదు. రచన ద్వారా పాఠకులు, తద్వరా సమాజం ఒక దృక్పథాన్ని అలవరచుకుంటాయి. రాముణ్ణి కృష్ణుడిని నమ్మినా నమ్మకపోయినా రామాయణ, భారత, భాగవతాలు మన సమాజానికి అనేక విషయాలలో ఒక perspectiveని ఇచ్చాయి అని ఖచ్చితంగా చెప్పచ్చు. అంత పాత పురాణాలు వద్దనుకుంటే 80లలో వచ్చిన వామపక్ష భావజాల సాహిత్యం, స్త్రీ వాదం, దళిత వాదం, మైనారిటీ బహుజన సాహిత్యాలు సమాజంలో కొన్ని వర్గాలని ఖచ్చితంగా ప్రభావితం చేశాయి. అందువల్ల రచయిత ఒక సందర్భాన్ని కథలో చూపించేటప్పుడు అది ఒక సాంస్కృతిక జ్ఞాపకంగా మారబోతోందన్న స్పృహతో రాయాలి.

చివరిగా మరో విషయం చెప్పి ఈ భాగం ముగిస్తాను. నేను కొన్ని సందర్భాలలో వాడిన ఒక వాక్యాన్ని మీకు పరిచయం చేస్తాను. “ఈ రోజు చెప్పులతో నిన్నటి రోడ్డు మీద నడవకూడదు.” ఈ కింది వాక్యాలు చదవండి.

1940లో బ్రాహ్మణ కుటుంబంలో భర్త చనిపోతే ఆ స్త్రీని విధవను చేసేవారు. విధవ అవ్వడం కాదు, చేసేవారు. నుదుట బొట్టు చెరిపి, తాళిబొట్టు, నల్లపూసలు తెంచి, తల గొరిగించి, ముండమోపించి, రవిక లేకుండా తెల్ల చీర కట్టించి మూలన కూర్చోపెట్టేవాళ్లు.

ఈ వాక్యాలలో “తలగొరిగించడం”, “ముండమోపించడం” లాంటి పదాలు చదివితే ఇబ్బందిగా అనిపించిందా? బాధగా అనిపించిందా? ఇవే వాక్యాలు ఏవైనా కథలో వస్తే కనీసం “శిరోముండనం” అని రాసి ఉండాల్సింది అని అనిపిస్తుందా? ఎందుకు?

ఎందుకంటే ఆ పదాలు ఇప్పటి కాలానికి నాగరికంగా అనిపించటంలేవు. ఆ కాలంలో బ్రాహ్మణ ఇళ్లల్లో ఈ మాటలు తరచుగా వినిపించేవే మరి. అంటే ఒక మనిషి అప్పుడు పలికిన మాటలు, ఇప్పుడు పలకాలంటే ఇబ్బందిపడుతున్నామన్న మాట. ఎందుకు? అప్పటి నుంచి ఇప్పటికి మనుషులుగా మనం ఎంతో కొంత మారామనే కదా అర్థం. భర్త చనిపోయిన స్త్రీ పట్ల ఎలా వ్యవహరించాలి, ఎలా మాట్లాడాలి అన్న చిన్న స్పృహ అప్పటి కన్నా ఇప్పుడు మెరుగైనట్లే కదా? ఇదే కాదు కాలానుగుణంగా ఎన్నో విలువలు మారుతూ వస్తున్నాయి. సామాన్యంగా మార్పు అభివృద్ధి దిశగా ఉంటుంది. ఉండాలి కూడా. జండర్ స్పృహ, కులరాజకీయాలు, ప్రజాస్వామ్యం, విజ్ఞానశాస్త్రం అన్నీ ఒక శతాబ్దం క్రితం ఉన్నట్లు ఈ రోజులు లేవు. కనీసం ఒక దశాబ్దం క్రితం ఉన్నట్లు ఈ రోజు ఉండవు. నిన్న ఉన్నట్లు కూడా ఈ రోజు ఉండవు. ఇలా evolve అయితేనే మోధోపరంగా సమాజం ముందుకు వెళ్తున్నట్లు.

కాబట్టి ఒక విషయం గురించి మీ తాతగారికి ఉన్న అభిప్రాయానికి, మీ నాన్నగారికి ఉన్న అభిప్రాయానికి ఈ రోజు మీకు ఉన్న అభిప్రాయానికి తేడా ఉంటుంది. రేపు మీ కొదుకు, మనవడు కూడా మీ లాగా ఆలోచించడు. ఎవరైనా ఆ కాలపు పరిమిత జ్ఞానంలోనే వ్యవహరించారు. అలాంటప్పుడు మా ముత్తాత దుర్మార్గుడు. మా నాయనమ్మని చదువుకోనివ్వలేదు అనచ్చా? ఇది వర్తమానంలో ఉన్న అవగాహన ఆధారంగా గతానికి తీర్పు చెప్పడం. ఈ రోజు చెప్పులతో నిన్నటి రోడ్డు మీద నడవడం. అలా నడుస్తూ ఆ కాలంలో మనుషులతో – “చూడండి నేను ఎంత వేగంగా నడుస్తున్నానో, మీరు ఎంత వెనకబడి ఉన్నారో” అనడం.

మరి అలాంటి కథలు చాలామంది రాశారు కదా? ఓల్గా రామాయణలోని స్త్రీ పాత్రలతో ఇప్పటి ఫెమినిజాన్ని ప్రస్తావించారు కదా? అదెలా సాధ్యమైంది? వచ్చే సంచికలో మాట్లాడుకుందాం.

*

అరిపిరాల సత్యప్రసాద్

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు