ఒకనాటి రష్యా, ఆనాటి స్ఫూర్తి

మేము కొందరం మిత్రులం ఒక బృందంగా ఏర్పడి ఉత్సాహంగా రష్యాకి ప్రయాణం కట్టాం. అక్కడ ఏమేమి చూశాం? మాకేమనిపించింది? ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పే ప్రయత్నం ఈ వ్యాసం. కానీ ఇది మా మిత్రబృందం అంతా కూడబలుక్కొని వ్రాసినది కాదు; నన్ను  కదిలించిన కొన్ని సంఘటనలూ, సందర్భాలూ మాత్రమే. నా అభిప్రాయాలతో మిగతా సభ్యులకు ఏకీభావం లేకపోవచ్చు.

మొదట మా బృందం గురించి. అంతా అరవైలు దాటిన వారే. అంతా సోవియట్ ప్రచురణలతో, రష్యన్ సాహిత్యంతో సాన్నిహిత్యం కలిగి ఉన్నవారే. తెలుగు భాషనీ, సాహిత్యాన్నీ ప్రేమించేవాళ్లే. పాతికేళ్లకు పైగా స్నేహితులు కొందరైతే, మిగతావాళ్లు బాల్యమిత్రులు. అంచేత అందరి అభిరుచులు, ఇష్టాయిష్టాలూ కలుస్తాయి. భాష, వాతావరణం మనవి కాకపోయినా, ఆ వారం రోజులూ, పైదేశంలో ఉన్నామనే భావన కలగలేదు మాకెవ్వరికీ. ‘మా రష్యా ప్రయాణం’ అంటున్నానుగానీ, మేం చూసిందల్లా రెండు ప్రధాన నగరాలైన సెయింట్ పీటర్స్‌బర్గ్ (ఒకప్పటి లెనిన్‌గ్రాడ్), మాస్కోలు; ఒక్కొక్క నగరంలో మూడేసి రోజులు. అంచేత ఈ రచనకు చాలా పరిమితులు ఉంటాయని మనవి.

ఒక ప్రాంతపు భౌగోళిక నిర్దిష్టతలే ఆ ప్రదేశపు చరిత్రనీ, జీవన విధానాలనూ, సంస్కృతినీ నిర్దేశిస్తాయని మనకు తెలుసు. రష్యాకి కూడా ఈ సూత్రం వర్తిస్తుంది – కాకపోతే మరింత విస్తారమైన స్థాయిలో. రష్యన్ చరిత్ర, సంస్కృతి, సాహిత్యం, రాజకీయాలు, ప్రపంచవ్యాప్తంగా సోవియట్ ప్రయోగం నాటిన బీజాలు, రెండవ ప్రపంచ యుద్ధం – వీటిని ప్రస్తావించకుండా ఆ దేశాన్ని గురించి మాట్లాడడం అసాధ్యం.

అన్ని వివరాలనూ ఏకరువు పెట్టకుండా రెండేరెండు విశిష్ట ప్రదేశాల గురించి ముచ్చటిస్తాను.

సెయింట్ పీటర్స్బర్గ్: ‘లెనిన్గ్రాడ్ దిగ్బంధం, రక్షణల ప్రదర్శనశాల

మాస్కో నగర శివార్లలో ఏంటీ-టాంక్ బారికేడ్‌లు – ఇక్కడే హిట్లర్ సైన్యాల తిరోగమనం మొదలైంది

రెండవ ప్రపంచ యుద్ధపు తొలి దశలోనే  నాజీ సైన్యాలు లెనిన్‌గ్రాడ్‌ని ముట్టడించాయి. ‘లెనిన్‌గ్రాడ్ నగరాన్ని భూతలం నుండి శాశ్వతంగా తొలగించడమే నా లక్ష్యం’ అని హిట్లర్ ప్రకటించాడు. 1941 సెప్టెంబర్  నుండి 1944 జనవరి వరకూ 900 రోజులపాటు సాగిన భయంకరమైన నగర దిగ్బంధంలో పౌరులు ఆకలితో, చలికి వణుకుతూ ఎనిమిది లక్షలమంది నగరవాసులు మరణించారు.

కుటుంబానికి, రోజుకి 125 గ్రాములు (పావు కిలోలో సగం) బ్రెడ్డు రేషన్‌గా ప్రకటించారు. కార్మికుల కుటుంబాలకు మాత్రం ఇందుకు రెట్టింపు 250 గ్రాములు. సరఫరా వ్యవస్థ కుప్పకూలి, ఏ వస్తువూ సమయానికి అందేదికాదు. మొదట పాత కాగితాలూ, గోడలకు అంటించిన కాగితం, రంపం పొట్టు, తోలు వస్తువులు, ఆకులూ, గడ్డి, వీటన్నింటినీ ఉడకబెట్టుకొని, లేదా పచ్చిగా తిన్నారు. మొదట గుర్రాలూ ఆ తరువాత పావురాలూ, ఎలుకలూ, కుక్కలూ, పిల్లులూ ఆహారంగామారి అంతరించాయి. కొందరు నరమాంస భక్షకులుగా అవతరించి, బాగా దృఢంగా తయారయ్యారు. వీళ్లు చీకటిపడ్డాక గుంపులుగా వీధుల్లో తిరుగుతూ, దారినపోతున్న వాళ్ల నెత్తిన ఒక్క దెబ్బకొట్టి లాక్కుపోయేవారు. ఆ పూటకి తిండి దొరికిపోయిందన్నమాటే. యుద్ధం ముగిసాక, వీళ్ల ప్రస్తావనను రికార్డులలోంచి తొలగించారు.

దిగ్బంధపు దినాల్లో ఇళ్లల్లో రోజువారీ జీవనం ఎలా ఉండేది? ఒక గదిలో ఆనాటి పరిస్థితుల్ని కళ్లకు కడతారీ మ్యూజియంలో. చీకటి, నూనె దీపాలు. చలి. రేడియోలో నిరంతరంగా వినిపించే మెట్రొనోం ధ్వని…’ఠక్, ఠక్, ఠక్…’. స్థానిక రేడియో స్టేషన్ ప్రసారాలను చేస్తే జర్మన్‌లు తమ సాధనాల ద్వారా వాటి స్థానాలను పసిగట్టే ప్రమాదం ఉన్నది. మెట్రొనోం వేగంగా కొట్టుకుంటే వైమానిక దాడుల హెచ్చరిక. లేదంటే నగరం ఇంకా సోవియట్ల ఆధీనంలోనే ఉన్నట్లు సూచన. 900 రోజుల పాటు కొనసాగిన ఆ శబ్దం, లెనిన్‌గ్రాడ్ నగరపు గుండెచప్పుడు. మరోవైపు లెనిన్‌గ్రాడ్ రేడియో స్టేషన్, ఎప్పటికప్పుడు తన స్థానాన్ని మార్చుకుంటూ ప్రసారాలను కొనసాగించే ప్రయత్నాలను చేస్తూనే వచ్చింది.  అయితే రేడియో మాస్కో, ఇతర స్టేషన్‌లను వినడం నగరవాసులకు సాధ్యపడేది.

ప్రజల ఆత్మస్థైర్యాన్ని కాపాడేందుకు, సోవియట్ ప్రభుత్వం విశ్వప్రయత్నం చేసింది. జర్మన్‌ల దాడుల మధ్య, ప్రక్కనే ఉన్న లగోడా సరస్సు మీదుగా ఆహార పదార్థాలనూ, సైనిక సామగ్రినీ అందజేసే ప్రయత్నం కొనసాగుతూనే ఉంది. నగర జనాభాలోని పురుషులంతా మరణించగా వారి శాతం ఇరవైకి పడిపోయింది. వాళ్లలో ఎక్కువమంది వృద్ధులే. ఎనభై శాతానికి చేరుకున్న స్త్రీలూ, పిల్లలూ అసాధారణమైన ఆత్మస్థైర్యాన్ని ప్రదర్శిస్తూ, కార్మికులుగా అవతారమెత్తారు. ఫ్యాక్టరీలు పనిచేయడం, ఆయుధాల తయారీ మొదలయ్యాయి. వేసవిరాకతో మంచు కరగడం మొదలుకాగానే, ‘కూరగాయలు పండిద్దాం’ అని పార్టీ పిలుపునిచ్చింది. పార్టీ సందేశాలను ప్రజలకు చేర్చే కరపత్రాలు, పోస్టర్లు అనేకం ఈ మ్యూజియంలో కనిపిస్తాయి. దిగ్బంధ కాలంలో స్థానిక ప్రభుత్వం ప్రింటింగు వ్యవస్థను సమర్థవంతంగా కాపాడుకున్నదని ఈ మ్యూజియంలో తెలిసింది. అలాగే లొంగిపొమ్మని కోరుతూ జర్మన్ విమానాలు వెదజల్లిన కరపత్రాలను కూడా అక్కడ మనం చూస్తాం. ఇవిగాక, డైరీలు, నోట్సు, ఆదేశాలు, తీర్మానాలు, తుది వీడ్కోళ్లు.

ఒక్కరొక్కరుగా మరణిస్తున్న తన కుటుంబ సభ్యుల పేర్లను, తేదీలనూ నమోదు చేసిన పదకొండేళ్ల బాలిక తాన్యా సవిచేవా డైరీ, ఏడుగురి చావుల్ని గుర్తుపెట్టాక, ఒక చోట అర్థాంతరంగా ‘మా ఇంట్లో ఇంకెవ్వరూ మిగల్లేదు, నేను తప్ప’ అనే చివరి వాక్యంతో ముగిసిపోతుంది. ఆమె డైరీలోని పుటలను ఈ మ్యూజియంలో చూడవచ్చు.

ఇంకా ‘లెనిన్‌గ్రాడ్’ పేరుతోనే కొనసాగుతూన్న మ్యూజియం

లెనిన్‌గ్రాడ్ పౌరులు కొందరు, వారి వద్దనున్న కొద్దిపాటి ఆయుధాలతో, గడ్డకట్టిన నేవా నదిని రాత్రులలో, ఎముకలు కొరికే చలిలో దాటుకుంటూ, జర్మన్‌ల మోహరింపుని ఛేదించడానికి పదేపదే ప్రయత్నించి విఫలమవుతూ వచ్చారు. మా గైడు ఎలీనా, అక్కడున్న ఒక నమూనాని చూపిస్తూ ఆనాటి ప్రయత్నాలను మాకు వివరిస్తున్నప్పుడు దుఃఖంతో ఆమె నోట మాటరాలేదు. కాసేపు ఆగి, కన్నీరు కారుస్తూ ఆమె మాతో ఇలా అన్నది: “మా తాత, అతని సోదరులు, మూడవ దాడిలో మరణించారు”. ఐదు విఫలయత్నాల అనంతరం, ఎర్ర సైన్యపు ‘ఆపరేషన్ ఇస్క్రా’ విజయవంతమైంది.

‘మన మహిళలు సరికొత్త నైపుణ్యాలను నేర్చుకుంటున్నారు!’ అని ప్రకటిస్తున్నఒక పోస్టర్ మా దృష్టిని ఆకర్షించింది. చిత్రంలో లేత్ మెషీన్ వద్ద ఆత్మ విశ్వాసంతో నిల్చున్న మహిళ ఒక కార్మికురాలు.  యుద్ధరంగానికి తరలిన పురుష కార్మికుడి పేరు (అలెక్సీ)కి బదులుగా తన పేరును (ఇవనోవా) సూచించే గుర్తింపు కార్డును ప్రవేశపెడుతున్నది.

ఈ మ్యూజియంకి కూడా ఒక చరిత్ర ఉన్నది. జార్‌ల పాలనలో రాజధానిగా ఉన్న సెయింట్ పీటర్స్‌బర్గ్‌ (లెనిన్‌గ్రాడ్) లోని రాజకీయ సమీకరణలను, మాస్కోలో ఉన్న స్టాలిన్, ఒక కంట కనిపెడుతూనే ఉండేవాడు. జర్మన్‌ల దిగ్బంధం ముగిసిపోయాక, లెనిన్‌గ్రాడ్ పార్టీ నాయకత్వం బలపడుతున్నదని అతడు గ్రహించాడు.  యుద్ధానంతరం కొనసాగిన ప్రక్షాళనలో, తనకు ప్రత్యర్థులుగా మారగల స్థానిక నాయకులను అంతమొందించే కార్యక్రమం మొదలుపెట్టాడు. నగరవాసుల సహకారంతో నెలకొల్పిన ఈ మ్యూజియంకు పెరుగుతోన్న జనాదరణకు భయపడి, దాని డైరెక్టర్‌ని కూడా అరెస్టుచేయించి, చంపించాడని అంటారు. 1953లో మూతబడిన ఈ మ్యూజియం, పురజనుల ఒత్తిడితో, గోర్బచేవ్ హయాంలో 1989లో తిరిగి తెరవబడింది. అప్పటికే ప్రజలు బహూకరించిన  వస్తువులు కొన్ని నాశనమయ్యాయి.

మాస్కో: నోవోడెవిచీ సమాధులు

అది శ్మశానవాటికా? కానే కాదు. పురాతనమైన మహా వృక్షాల నీడల్లో, పూల బాటలతో మాస్కో నగరం మధ్య విస్తరించిన పచ్చని ప్రశాంతత, పరిశుభ్రత. సందర్శకులంతా వేరెవరికీ వినిపించని స్వరంలో మాట్లాడుకుంటూ, నిశ్శబ్దంగా ఆ సమాధుల మధ్య నడుస్తూ, వాటిపై పుష్పగుచ్ఛాలను వదిలి వెళ్తున్నారు. నేపథ్యంలో పక్షుల కిలకిలలు. అప్పుడే వాన వెలిసింది. చాలా సమాధులపై వారివారి శిల్పాలను, కృషినీ, ప్రతీకాత్మకంగా మలిచారు. నిజానికి అదొక బహిరంగ శిల్ప ప్రదర్శనశాల. 27 వేల మంది అక్కడ పూడ్చబడ్డారని ఒక అంచనా.

లోపలికి అడుగుపెట్టగానే ఎదురుగా గొగోల్ సమాధి; ప్రక్కనే ఆంటన్ ఛెఖోవ్. కలియజూస్తే అలెగ్జాండ్రా కొల్లెన్‌టాయ్. అబ్బో…ఎంతో  ఉత్తమాభిరుచికి నిదర్శనంగా నిలిచిన వ్లాదిమిర్ మయకోవ్‌స్కీ శిల్పం…అదిగో! విశ్వవిఖ్యాత సినీదర్శకుడు సెర్గెయి ఐసెన్‌స్టెయిన్…. సోవియట్ విమానాల రూపకర్త, ఎయిరోనాటికల్ ఇంజినీర్ ఆంద్రేయి త్యుపోలెవ్, సోవియట్ రాకెట్ సైన్స్‌కి ఆద్యుడైన సెర్గేయి కోరొలెవ్‌లు…ఎర్ర సైన్యపు ప్రముఖ ఉన్నతాధికారులు,… నికితా కృశ్చేవ్‌తోసహా అత్యున్నత సోవియట్ కమ్యూనిస్టు నాయకులూ, శాస్త్రవేత్తలూ, వ్యోమగాములూ, సంగీతకారులూ, బ్యాలే కళాకారులూ… కొన్ని పేర్లు సుపరిచితాలు. ఎందరో తెలియని వ్యక్తులు. వాళ్లంతా మా రాకకై ఎదురు చూస్తున్నట్లనిపించింది. వాళ్లందర్నీ అక్కడ పలకరించిన భావన.

శ్మశానవాటికను కూడా ఇంత సుందరంగా, కళాత్మకంగా తీర్చిదిద్దడం సాధ్యమేనా? నన్ను బాగా ఆకట్టుకున్నది మయకోవ్‌స్కీ విగ్రహం (ఎర్రటి గ్రానైట్ పలకపై కొట్టొచ్చినట్లు – రూపొందించిన శిరస్సు – గంభీరంగా, తీక్షణంగా మనవైపు చూస్తూ, ప్రశ్నిస్తూ, నిలదీస్తూ).

అలెగ్జాండ్రా కొల్లెంటాయ్

యుద్ఢాలూ, విప్లవాలూ వస్తాయి; పోతాయి. అపారమైన జననష్టాన్ని వెంట తీసుకొస్తాయి. నియంతలు మరణిస్తారు; వారు సృష్టించిన విధ్వసం అంతమవుతుంది. రష్యా ఒక విషాదభరితమైన గాథ; మరణించిన, గాయపడ్డ సైనికుల, సామాన్యుల త్యాగాలు, వారి రక్తంతో, కన్నీటితో తడిసిన చరిత్రపుటలు మనల్ని కలవరపరుస్తాయి. అంతులేని కష్టాలమయమైన గతం ఇంకా భూతంలాగా ఆ దేశాన్ని పీడిస్తున్నది.  అప్పుడనిపించింది…రష్యన్ సాహిత్యం, సంస్కృతి మాత్రమే ఎప్పటికైనా ఆ దేశానికి ఆశాకిరణాలుగా, మార్గదర్శకాలుగా, ప్రేరణగా నిలుస్తాయని.

పుష్కిన్, టాల్‌స్టాయ్, గోర్కీ, ఛెఖోవ్, గొగోల్, డాస్తొయెవ్‌స్కీ, అలెగ్జాండ్రా కొల్లెంటాయ్, ఛింగిజ్ ఐత్మతోవ్,…ఈ మహారథులే రష్యన్ అస్తిత్వానికి మూల స్తంభాలు. రష్యన్ ప్రజల వెన్ను దన్ను.

మాస్కో నుండి తిరిగి వస్తూ, విమానాశ్రయానికి వెళ్లే దారిలో, పాతికేళ్లపాటు వుప్పల లక్ష్మణరావుగారు పనిచేసిన ప్రగతి ప్రచురణాలయం కార్యాలయం వద్ద ఆగి ఫొటోలు తీసుకున్నాం. అక్కడ ఇప్పుడేవో ప్రభుత్వ కార్యాలయాలున్నాయి. వాళ్లెవరికీ దాని గతం తెలియదు. సోవియట్ సాహిత్యానికీ, తెలుగు ప్రజలకీ మధ్య వారధిగా నిలిచిన లక్ష్మణరావుగారినీ, ఇంకాఅనేకుల్నీ తలుచుకుంటూ బయలుదేరాం.

ఒకప్పటి మాస్కో శివార్లను దాటుతూంటే, మా గైడు ఏంటీ-టాంక్ బారికేడ్‌లను చూపించింది; ‘జర్మన్ సైన్యం ఇక్కడి వరకూ వచ్చింది’ అని చెప్పింది. సరిగ్గా అక్కడే సోవియట్ ఎర్రసైన్యం ఎదురుదాడికి దిగింది. హిట్లర్ తన లక్ష్యాలుగా చేసుకున్న – మాస్కో, లెనిన్‌గ్రాడ్, స్టాలిన్‌గ్రాడ్ – వీటిల్లో ఏ ఒక్క నగరాలన్నీ స్వాధీనం చేసుకోలేకపోయాడు. నిజానికి ఆ మూడు నగరాల్లోనే వీరోచితమైన ప్రతిదాడి మొదలైంది. సోవియట్ రెడార్మీ, జర్మన్ సైన్యాన్ని  బెర్లిన్ వరకూ వెంటతరిమింది.

మా బృంద సభ్యుడు, మిత్రుడు అయిన డా. యస్. జతిన్ కుమార్ మా యాత్రా విశేషాలను వివరిస్తూ, ‘సోవియట్ సాహిత్య భాస్కరులు’ అనే పుస్తకాన్ని వెలువరించారు. ఆసక్తి ఉన్నవారు చదవగలరు.

పేజీలు 180. వెల రూ. 140. ప్రతులకు నవోదయ బుక్ హౌస్.

*

Unudurti Sudhakar

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • నేనూ నా మిత్రుడు సేతుపతి ఆదినారాయణా 2018 లో నెల్లాళ్ళపాటు మాస్కోలో ప్రయాణించేం. సందర్భం FIFA world cup సందర్భంగా. ఫుట్బాల్ కోలాహలం. ప్రపంచం నలుమూలల్నించి వచ్చిన పుట్బాల్ ఆట ప్రేమికులు. బరంపురం వాళ్ళం కదా వుప్పల లక్షణరావు గారు పనిచేసిన మాస్కో ప్రచురణాలయం కనుక్కో లేకపోయేం. మాకు మాస్కో ఏర్పాట్లు చేసిన ఒడియా మిత్రుడు మాకు చాలా మట్టుకు మాస్కో తిప్పేడు. మేం వెళ్ళిన మిగతా స్ధలాలు ఖజాన్ పిట్స్బర్గ్ ఇంకొన్మి స్థలాలు.. మీరుదహరించిన పుస్తకం కొనుక్కుంటాను.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు