ఇప్పుడు నేను పూర్తిగా ముక్కలైపోయాను. నన్ను తిరిగి మట్టిముద్దగా చేసే సమయం అయింది. ఈసారి ఏ రూపం ఇస్తావో ఇక నీ దయ. అవివేకం అని తెలిసినా ఒకటి కోరతాను. ఇప్పుడు తయారు చేసే బొమ్మకి మాత్రం ‘కోరుకోవడం ఎలానో’ నేర్పకుండానే బయటికి పంపు.
చుట్టూ బొమ్మలు పరచుకుని, నియమాలు పెట్టుకుని, నేను సృష్టించుకున్న ఆటలో నేనే బొమ్మనై పోయి, ఆట ఆపడం ఎలానో మర్చిపోయి, ఇదంతా మొదలవక ముందటి నా స్థానాన్ని, రూపాన్ని, నైరూప్యాన్ని, గుణాన్ని, నిర్గుణాన్ని తెలుసుకోగోరి దిమ్మరినైపోయాను యుగాల క్రితమే.
***
ఒకదాని వెనక మరొకటి లెక్కలేనన్ని వీధులు, ఎన్నాళ్ల పాటైనా నడవొచ్చు. రంగురంగుల గాలి బుడగలు, భవనాలు, దుకాణాలు, మిఠాయిలు, మనుషులు.. ఎన్నేసి ఆకర్షణలని! ఇంకా ఎందుకు వెలితి పడతావు, ఏం తక్కువైందని వెతుక్కుంటావు? నువ్వుగా ఉన్నది, నీచుట్టూ ఆవరిస్తున్నదీ ఒకటి కాదని, నువ్వు అడక్కుండా నిన్ను చేరుకున్నది ఏదీ లేదని ఎప్పటికి గమనిస్తావు? ఆనంద తాండవమూ, విలయపు వినోదమూ- అంతా కలిపి ఒకటే లీలలో వేర్వేరు అంకాలంటే ఎట్లా నమ్ముతావు?
అరచేతిలో ఉండచుట్టుకుపోయింది ఊలుబంతి. ఏ దారంతో ఏ కొస దగ్గర మొదలుపెట్టాలో, ముడులు విడుతున్నాయో కొత్తవి పడుతున్నాయో తెలీని అయోమయం! క్షణిక సుఖలాలసతో, అనాది దుర్బలత్వం రాజుకుని మెరిసిన నిప్పురవ్వంతటి ప్రాణం. అనుభవాగ్నిలో దహించుకుపోయాక కూడా పరోక్ష ప్రమాణాల కోసం వెతుకులాట.
***
క్షణానికొకసారి భిక్షాపాత్ర రిక్తమైపోతూ ఉంది. రూపం మారిపోయి, నామం మరుగునపడిపోయి నా ఉనికి మొత్తం ఒట్టి శూన్యంగా మిగిలింది. “నేను పరిపూర్ణుడిని, నిర్వాణానికి పూర్తిగా అర్హుడిని” అనే మొదటి సత్యం తథాగతుడి నోట పలికినప్పుడు విస్మరించి వారణాశి వైపుగా పాతబాటలో సాగిపోయిన సన్యాసిని నేనేనని, అంతులేని శోధన తర్వాత గుర్తుకొచ్చింది.
****
Add comment