ప్రేమకు మూడు ముళ్ళు మొలకెత్తాయి
నూరేళ్ల పంట చుట్టూ
ఏడడుగుల ప్రదక్షిణాలు!
కొస దొరకని మల్లె చెండు కోసం
నిశివేళల అన్వేషణలు!
ఏనాటికి తీరని దేహ దాహాలు
పూలతోటలో ఎడబాటు పూసింది
నిశ్శబ్దంగా ఘనీభవిస్తున్న ఒంటరితనం!
* * *
ఇక ఇప్పుడు
వాడిపోయిన మల్లెమాలలోని
దారాల వెక్కిరింతలు
గడిచిపోయిన దేహాల కవ్వింతలు
లెక్కించుకోవాలి!
మదిలో మోగుతున్న అనుభూతుల్ని
దేహం మీద ప్రకంపనాలని
కొలుచుకోవాలి!
రెప్పల్లేని నిరీక్షణల నేత్రాల్ని
మబ్బుల్లేని వెన్నెల రాత్రులని
జయించాలి!
ఒకే ఒరలో
రెండు కత్తుల స్వైర విహారం
రెండు మనసుల్లో
ఒకే నిట్టూర్పు విస్పోటనం!
తెల్లని పగలులో తప్పించుకున్నా
రంగుల చీకట్లో
ఊపిరాడని బందీని!
వెచ్చటి జ్ఞాపకాలని తాగుతూ
మెత్తటి స్పర్శల్ని నెమరేసుకుంటున్నా!
నడిచొచ్చే అక్షరమాలో
ఎగిరొచ్చే శబ్ద తంత్రో
కదలని క్షణాలకు ప్రాణం పోస్తుంది!
గాయపడిన ఏకాంతాలకు
సాంత్వన గీతాలు
వేధించే స్వప్నాలకు
తీయని లేపనాలు ఎక్కడ దొరుకుతాయి?
* * *
నన్ను స్పర్శిస్తూ దొరకని చిలిపి గాలిలా నీవు
అంతు దొరకని భూమ్యాకాశాల
నిరంతర అన్వేషిలా నేను!
దూరాల్ని దాటి ప్రయాణిస్తున్నా
గమ్యం చేరుకోలేని ఒంటరి సున్న
సమాధానం దొరకని శేషం
నన్ను సముదాయించుకోలేని నేను!
*
చిత్రం: రాజశేఖర్ చంద్రం
Add comment