అలల కొలబద్దతో కొలిచినా తరగని తీరపు దూరమేదో
భయపెడుతూ ఉంది
బతుకుతీరమెక్కడో తెలియనపుడు సముద్రమంత పెద్ద అగాధం ఇంకొకటి ఉండదు
ప్రయాణపు సంసిధ్ధతకు ముందు
చలికాలపు రాత్రుళ్ళలో
పేర్చుకున్న సంభాషణల చలినెగళ్ళ
చిటపటలు చెవులకు చుట్టుకునే ఉన్నాయి
అతడు ఒక ఎడారిని ఇక్కడ వొదిలి
మంచు కవాచాల్ని లాగులా వేసుకొన్న ఖండంతో
కరచాలనం కోసం వెళతానన్నపుడు
ఆమె తన బక్క కౌగిలి వెచ్చదనాన్ని కానుకిచ్చింది
ఇద్దరి పక్కటెముల మధ్యనించి
బూడిదగా రాలుతున్న కాలాన్ని గుప్పిట పట్టి
తన గుప్పిట్లోకి వొదులుతూ ప్రశాంత జీవితాన్ని వాగ్ధానం చేశాడతడు
ముడతల ముసలి తల్లిదండ్రుల కళ్ళ వెన్నెల
కన్నీళ్ళుగా రాలుతున్న కురుస్తున్న రాత్రి సమయాన
ఆమె తన కళ్ళ మీది చెమరింపుని తప్పదా అనే
ప్రశ్నతో కప్పిపుచ్చాలని ప్రయత్నించినపుడు
అశక్తకు నిర్వచనంలా ఉన్న అతడామెను
తన బాహువుల మధ్య బందిస్తూ తన మొరటు చేతులతో,
ఆకలితో ఆఫ్రికా ఖండంలా వెన్నెముక పొడుచుకొచ్చిన
ఆమె వీపును అనునయించాడు
రాలి ఆ మట్టిని ముద్దాడాల్సిన కన్నీటి బిందువుకు రెప్ప సమాధిని కానుకిస్తూ
క్షామపు మోడులా చిక్కిపోయిన మొండెం,
చంద్రుడంత తలను మోస్తున్న తన బిడ్డని చూపి
వాడికి కాసింత కండని వాగ్ధానం చేయమని అడిగిందామె చివరిగా
అతడు మధ్యదరా హృదయం మీద తేలుతున్న పడవలో
ఆశల బరువుతో వాలిపోయిన
అనేక కనుల మధ్య చేరిపోయాడు
వీడ్కోలుగా చెయ్యూపుతూ
ఒక ప్రపంచాన్ని రెండు భాగాలుగా విడగొట్టటానికి
మధ్యధరాను ఎవరో ఉపయోగించుకున్నారు
తల మంచు పాదం ఎడారి గా మిగిల్చి
ఆ సముద్రానికి.
నాకు కవిత్వం మీద ప్రేమ కలిగించింది తిలక్. శ్రీశ్రీ కంటే ముందే అమృతం కురిసిన రాత్రి నా అల్మారాలోకి వచ్చింది. తర్వాత శ్రీశ్రీ. నా జీవితంలో 1993 మేలిమలుపు. ఎందుకంటే అప్పుడే నేను మిత్రజ్యోతి సాహితీ సాంస్కృతిక సంస్థలో చేరాను. అందులో సభ్యులందరూ కవిత్వాభిమానులే! ఎండ్లూరి సుధాకర్ వర్తమానం మాకప్పుడు సూపర్ హిట్. అప్పటికి పాపులర్ అయిన కవులందరినీ చదివే వాళ్ళం. అప్పుడే రాయడం మొదలెట్టాను. 1990 చివరి సంవత్సరాల నుంచి 2002 వరకూ బాగా రాశాను. తర్వాత పలు కారణాల వల్ల బాగా తగ్గించేశాను. దాదాపు పదిహేను సంవత్సరాలేమీ రాయలేక పోయాను. అది నా సంక్షోభకాలం. రాయడమే కాదు చదవడం కూడా మానేశాను. ఈ మధ్యనే మళ్ళీ రాయడం మొదలెట్టాను. నాకప్పటికప్పుడు కలిగిన భావనలను అక్షరాలు మారుస్తాను అదే నా కవిత్వం. నిజానికి కవిత్వం నా Asylum. అది నన్ను “నువ్వు మనిషివి” అని గుర్తు చేస్తుంది. నాదైనా ఇతరులదైనా! |
పెయింటింగ్: సత్యా బిరుదరాజు
…అనునయించి చెప్తున్నంత అందమైన కవిత్వ మ్… వాహ్…
.. అద్బుతంగా చెప్పిన ఆర్టిస్ట్ వారికి ????????????????????
ధన్యవాదాలు….:)