వెలుగు రేఖలు ప్రసరించని చీకటిలో
ఏ ఉదయ కుసుమమూ విచ్చుకోదు
నిరాశా నిస్పృహలను తరిమేసి
దిగంతాలను తాకి వచ్చే
వేకువపిట్టనొకదాన్ని ఈ భూగోళంపై వదలాలి
తానుగా నడవలేని నేలపై నిలబడి
ఏ స్వేచ్ఛాగీతమూ గొంతు విప్పే సాహసం చెయ్యదు
పంజరాల్ని బద్దలు కొట్టి
గురి కుదిరిన బాణాన్నొకదాన్ని కుటిల రాజనీతిపై సంధించాలి
తుఫాను ముంచెత్తి వెళ్ళిందని తెలిసాక కూడా
ఏ పక్షీ చెదిరిపోయిన గూటిని నమ్ముకోదు
రాబందుల రెక్కలు కత్తిరించి
తరాల అంతరాలను ఛేదించే ఆత్మగల నినాదాన్ని
మోసపు పెత్తనం నెత్తిమీద పెట్టి ఊరేగించాలి
విశ్వాసాన్ని కూడదీసుకోలేని జన కూడలిలో
ఏ రేపటి పసితనమూ గుబాళించదు
నిజం చెప్పాలంటే
దురహంకారం మెడలు విరిచి
విశాల ప్రపంచాన్ని ఒడిసిపట్టుకునే
గర్భాశయానికి ఏ నేలైనా తలవొంచి నిలబడాలి
మునుముందుగల ఆలోచనల్ని చిత్తుకాగితాల్లా చించిపారేసే చట్టసభల్లో
అభివృద్ధి అమాంతంగా ఆత్మహత్య చేసుకునే తీరుతుంది
మగపురుగుల వ్యర్ధాలతో కుళ్ళిపోతున్న శాసన సభల్ని ఉమ్మనీటితో కడిగి
పాతికేళ్లుగా గుర్తించని అస్తిత్వాన్ని
సజీవమైన మారణాయుధం చేయాలి
మూడొంతుల నీటితో లేని భూమినూహించలేనట్టే
కనీసం మూడో వంతు మా హక్కునివ్వకుండా
కుదిరే పని కాదు
మాకు ఐదు వూళ్ళు చాలవు
యావద్దేశంలో సగం అడుగులు మావే కావాలి
మా సంతకాలకు
మీ ఫోర్జరీలను రద్దు చేస్తున్నాం
*
ఆత్మ గల నినాదాన్ని
ధన్యవాదాలు సర్
మంచి కవిత.
థాంక్యూ సర్
బాగా రాసారు మహిళా రిజర్వేషన్ గురించి. అన్నీ పార్టీ మగజాతివల్ల ఇప్పటిదాకా అది ముందుకెళ్లలేకపోయింది. ఈ మగ సమాజం లో బహుశా అదంత సులభం కాదు.
ధన్యవాదాలు సర్