ఐదు దశాబ్ధాల “ఐ” కవిత – ‘తిరగబడు’ 

“తిరగబడు” స్వచ్ఛంద కవితా సంచలనం – 1969 డిసెంబర్ లో స్వేచ్ఛాసాహితీ ప్రచురణలుగా వచ్చింది. పదిమంది యువకులు (పెండ్యాల వరవరరావు, పెండ్యాల యాదగిరిరావు, పెండ్యాల కిషన్ రావు, నెల్లుట్ల సంజీవరావు, దేవులపల్లి సుదర్శన్ రావు, ఎక్స్ రే (పుల్లట చలపతిరావు – శ్రీపతి), లోచన్ (రాజలోచన్ ), వడ్డేపల్లి సుధాకర్, టంకశాల అశోక్, ఐ (పిసిఎన్- పి.సి నరసింహారెడ్డి) శ్రీకాకుళ ఉద్యమ  సెగ తాకి,  దిగంబర కవుల ప్రేరణతో  “తిరగబడు” కవులై పుట్టుకొచ్చారు. ఎక్కువమంది వరంగల్ ప్రాంతానికి చెందినవారే. అప్పట్లో హన్మకొండ చౌరస్తాలోని కోహినూర్ హోటల్ అప్పటి యువకవుల అడ్డా. దానికి తోడు కాళోజీ ‘మిత్రమండలి’. అప్పటికే ‘దిగంబరకవిత్వం’ ఒక ఊపు ఊపేస్తోంది.
కథకుడు పింగళి రంగారావు (వినడానికో కథ) దిగంబర కవుల వలెనే, వరంగల్ నుండి ఒక సంకలనం తెస్తే ఎలా వుంటుందని సూచనప్రాయంగా తెలపడం, వి.వి దాన్ని కార్యరూపంలోకి తీసుకురావడం ఆ తర్వాత ఆ సంకలనం నిజంగానే ఒక సంచలనం అయింది. విరసం ఏర్పడడానికి బలమైన పునాది అప్పటికే  “తిరగబడు” కవులు వేసారనే చెప్పాలి. అప్పటికే చాలామంది లబ్ధప్రతిష్టులైన వారు వున్నప్పటికీ ఒక స్పష్టతతో ముందుకొచ్చినవారు తిరగబడు కవులు అని చెప్పొచ్చు. ఇందులో టైటిల్ కవిత రాసింది “ఐ” అనబడు పి.సి నరసింహారెడ్డి(3 జూలై1943 — 19 ఆగస్టు 2020). ‘తిరగబడు’ తో పాటు ‘గురి’, ‘ఒంటరి గుంపు’ అనే మరో రెండు కవితలు కూడా వున్నాయి.
పి.సి.ఎన్ గద్వాల దగ్గర్లోని ‘పెంచికలపాడు’ లో పుట్టిండు. ఎస్వీ యూనివర్సిటీలో భాషాశాస్త్ర ఆచార్యులుగా పనిచేసిండు.  ‘ఐ’ పేరుతో కవిత్వం రాసినట్టుగానే  ‘శుక్తి’ పేరుతో   చిత్రలేఖనం (శ్రీశ్రీ -మరో ప్రస్థానం, చలసాని ప్రసాదరావు ‘కళ’ సంచికలకు, నార్ల చిరంజీవి ‘కొమ్మలు – రెమ్మలు’ కవితలకు బొమ్మలు ) వేసిండు. ‘సృజన’ పత్రికకు అక్షరాలు రాసిన వ్యక్తిగా చెబుతారు.
*
తిరగబడు
~
కనురెప్పలు గ్రుడ్లమీద ఆరగట్టి
నోట్లో నాలుకను అణచిపెట్టి
శక్తినంతటినీ అవయవాలలో తొక్కిపట్టి
ఇంకా ఎందుకోసం..,
చుట్టూ భయం కార్చిచ్చులా వ్యాపిస్తుంటే
బ్రతుకులు బండరాళ్ళీడుస్తుంటే
శునకాలు కనకపు సింహాసనాన కొలువుతీరి
వెక్కిరిస్తుంటే
ఇంకా దేనికోసం…
కోర్కెల్ని కాల్చేసి, నాల్కల్ని చింపి, ఎముకల్నెండబెట్టి
చర్మం వొలుస్తూ వుంటే
పళ్ళమధ్య బాధని బిగబట్టి
కనుగుంటల్లో కన్నీటిని మురగబెట్టి
ఇంకా ఎవరికోసం…
దశాబ్దం కింద చచ్చి
ఈనాటికీ శ్మశానం అందుకోలేక
బంధుమిత్రుల కన్నీటికోసం కాచుక్కూర్చొని
ఇంకా బతికున్నానని భ్రమపడుతున్న
శవంలా పడివున్నావ్ 
 తిరుగబడు!
*
తిరగబడమని కవి ఎందుకు అంటున్నాడు? అంతకు ముందరి దశాబ్ధకాలంలో ఏం జరిగి వుంటుంది? యువతరానికి ఏం సందేశమిస్తున్నాడు? గోడకు కొట్టిన చెండు తిరుగొస్తది కదా! చర్యకు ప్రతిచర్య వుంటుందని న్యూటన్ మూడోగమన నియమం చెబుతుంది కదా! వింటినారిని బలంగా వెనక్కి లాగి పట్టుకుని ఎంతకాలం సహనంగా వుండగలుగుతాం. ఆవేశంతో గాక ఆలోచనతో లక్ష్యాన్ని చేధించగలగాలి కదా! మరి వాస్తవానికి  ఏం జరుగుతుంది?
“కనురెప్పలు గ్రుడ్లమీద ఆరగట్టి, నోట్లో నాలుకను అణచిపెట్టి, శక్తినంతటినీ అవయవాలలో తొక్కిపట్టి” ఇంకా ఆలోచించడమెందుకని? కవి ప్రశ్నిస్తున్నాడు. suppression is going to be blast అంతే కదా? మరి దీనికొక ఉత్ప్రేరకం అవసరమెందుకు పడుతున్నట్టు? అంటే న్యూటన్ ప్రతిపాదనకు షరతులు వర్తిస్తున్నాయా? లేదంటే అణగదొక్కబడుతున్న వారు తిరగబడాలి కదా? కనకపు సింహాసనాల కొలువుదీరిన శునకాలకు బుద్ధి చెప్పాలంటే ఏం చెయ్యాలో కవి సందేశమిస్తున్నట్టుగా వుంది. సరిగ్గా ఇదే సమయంలో కె.జి సత్యమూర్తి (శివసాగర్ ) లాంటివాళ్ళు అజ్ఞాతంలోకి వెళ్ళడం జరిగింది. ముందస్తు విప్లవ కార్యాచరణకు సిద్ధపడడానికి ‘తిరగబడు’ మని యువతరాన్ని టార్గెట్ చేసిండు కవి.
శవంలా పడివున్నావని, శివంగిలా తిరగబడమని ఉద్భోధచేస్తున్నట్టు అనిపిస్తుంది. ‘ఐ’ రాసిన కవితకు ఐదు దశాబ్ధాలు నిండినప్పటికీ ఇంకా శవాల్లా బతుకుతున్న జనాలకు ఇప్పటికీ ఏదో పిలుపును అందిస్తూనే వున్నట్టు అనిపిస్తుంది. ‘ఐ’ కి జోహార్లు.
*

బండారి రాజ్ కుమార్

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు