ఐడెంటిటీ 

   మన ఆలోచనలూ, వ్యక్తిత్వమూ రూపుదిద్దుకోడానికి , మనల్ని మనం తెలుసుకోడానికి జీవితంలో అనేక సంఘటనలు ఉపకరిస్తాయి. కాలక్రమంలో చాలా ఘటనలు మర్చిపోయినా కొన్ని  మాత్రం అలా గుర్తుండిపోతాయి.నామట్టుకు నా ఆలోచనల్లో స్పష్టత క్రమంగా నన్ను నేను తెలుసుకోవడంతో సాధ్యమైంది.
    మా నాన్నకు ఎస్సీ క్యాటగిరిలో రేషన్ షాపు అలాట్ కావడంతో మేము ప్రక్కనే ఉన్న గూపన్పల్లి నుండి నిజామాబాద్ టౌన్ కు మారాము. అమ్మ బట్టలు కుట్టేది.ప్రొద్దున్నే చుట్టూ ఉన్న పల్లెల నుండి పాలు , ఆకుకూరలు , టమాటాల గుల్లలతో మా చుట్టాలు వచ్చి వీధుల్లో/ అంగడి బజార్లో అమ్ముకొని మా ఇంటివైపు వస్తే కొన్ని కూరగాయలు ఇచ్చి అమ్మ వేడిగా చేస్తున్న చపాతీ చాయ్ లో ముంచుకొని తినిపోయేవాళ్ళు
  మా నాన్న అప్పటికే కౌన్సిలర్ గా ఎన్నిక అయ్యారు. వచ్చే పోయే వాళ్ళతో ఎప్పుడూ సందడే.అంత చిన్న ఇంట్లో మాతోపాటు , నిజామాబాద్ లో వైద్యాలు , ఆపరేషన్లు చేయించుకునే చుట్టాలు , ఏవో పనుల మీద వచ్చే జనం రోజులతరబడి ఉండేవాళ్ళు.తలచుకుంటే ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. how could they afford అని.ఇప్పుడు ఒక్క పూట ఎవరైనా భోజనానికి వస్తే ఎంత  హైరానా పడతాం?!
  కాన్వెంట్ లో చదువు…మధ్యాహ్నానికి ఇంటికొచ్చి వేడన్నం , కమ్మటి పప్పుచారుతో తిని, ఆవకాయ ముక్క కడుక్కొని జేబులో వేసుకొని వెళ్ళేవాళ్ళం.తిండికి బట్టలకు ఏ లోటూ లేదు.నాన్న ఎప్పుడూ అంబేద్కర్ మీటింగులు , పంచాయితీలు అంటూ తిరిగేది.
  నాకెందుకో చెల్లెలాగ అమ్మ దగ్గర కుట్లు నేర్చుకోవడం , నోట్ బుక్ లో ముగ్గులు వేసుకోవడం, వంటలు నేర్చుకోవడం అంటే చిరాకుగా ఉండేది.నాన్న వెంట మీటింగులకు పోవాలంటే ఆసక్తిగా ఉండేది.మా క్రాఫ్ట్ టీచర్ ఎప్పుడూ నామీద అమ్మకు కంప్లైంట్ చేసేది.వారానికి ఒక్కరోజు ఆ రోజు కూడా క్లాస్ లో ఉండదు.సూదిదారం పట్టదు అని.
నేను డిగ్రీలో ఉన్నప్పుడు నాన్న దగ్గరకి ఏదో భూమి పంచాయతీ విషయమై ఒక వితంతువు ..భూస్వామి భార్య ..పేరు సుశీలమ్మ అనుకుంటా..ఆమె కొడుకును వెంటబెట్టుకొని వచ్చేది.
ఆమె కొడుకుకు ఇరవైరెండు , ఇరవైమూడెండ్లు ఉండేవేమో.చాలా హ్యాండ్సమ్ గా.. మంచి డ్రెస్ లు, షూ వేసుకొని..చేతికి బ్రాస్లెట్ పెట్టుకుని స్టైల్ గా హీరోలాగా ఉండేవాడు..చదువుకుంటూ వ్యవసాయం చూసుకుంటున్నాడు…. వాళ్ళమ్మతోపాటు వచ్చి కూర్చునేవాడు.నేనూ చెల్లె ఎంత బాగున్నాడు అనుకునేవాళ్లం.
ఒక్కోసారి అంకుల్ ఉన్నాడా అంటూ ఒక్కడే వచ్చేవాడు.ఆ అబ్బాయిని చూస్తే హీరోలను చూస్తే కలిగే ఆకర్షణ లాంటి  ఫీల్ ఉండేది.ఆ అబ్బాయి కూడా నావైపు ఆసక్తిగా చూసేవాడు.పలకరింపుగా నవ్వేవాడు..అతనిపేరు  విక్రాంత్ రెడ్డి లాంటిదేదో ఉండేది.( మా నిజామాబాద్ లో రెడ్డిలకు ఉన్నంత వైవిధ్యమైన పేర్లు ఎవరికీ ఉండవు అనేది జగమెరిగిన సత్యం.ఆడవాళ్ళకూ పేరు ప్రక్కన రెడ్డి మస్ట్)
 కాలేజీలో ఎన్ఎస్ఎస్ క్యాంప్ కు లిస్ట్ సార్ట్ అవుట్ చెయ్యమని మేడం చెప్పారు.లిస్ట్ రెడీ చేస్తూ ఊరిపేరు చూసాను.ఆ అబ్బాయి వాళ్ళ ఊరు.అంతే కాదు మా నడిపి మేనత్తను ఇచ్చిన ఊరుకూడా.
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన రోజు వచ్చింది. వారం రోజుల క్యాంప్. మధ్యలో ఇంకో ఊరు ఉన్నా ఈ ఊర్లో మూడు  రోజుల స్టే.ఇప్పటిలా ఆటోలు బస్సులు ఉంటే రోజుకు మూడు సార్లు ఇంటినుండి తిరిగేంత దగ్గరి పల్లెలు. కానీ క్యాంప్ రూల్స్ ప్రకారం అక్కడే ఉండాలి.కొత్త కొత్త డ్రెస్సులు ,చివరి రోజుకు అమ్మ దసరాకు కొన్న పర్పుల్ కలర్ చీర సర్దుకున్నా.
  కొంచం పెద్ద ఊరే.ఊరిమధ్యలో గ్రామ పంచాయతీ కి ఆనుకుని ఉన్న హాల్ లో మా స్టే. బస్ దిగగానే అక్కడి పరిసరాలు శుభ్రం చేస్తూ మా బావ కనబడ్డాడు.పరిగెత్తుకుని వెళ్ళి బావా అని చెయ్యిపట్టుకున్నాను…మా మేనత్తలు వయసులో నాన్న కన్నా చాలా పెద్దవాళ్ళు..కాబట్టి బావలు కూడా  మాకన్నా చాలా పెద్దవయసు వాళ్ళు…నాన్నకు తమ్ముళ్ళలా ఉంటారు.వాళ్ళ పిల్లలు మాతోటి వాళ్ళు.
 ” బుజ్జమ్మా ..కాలేజోళ్లతోని అచ్చినవా.. ఇడ ఓళ్ళకు నువ్వు మామ బిడ్డెవని జెప్పకు..నేను తెలనట్లే ఉండు”అన్నాడు.
  ” ఎందుకే బావ. ..అక్క , సునీత మంచిగున్నర..అత్తమ్మ పనికి పోయిందా..నేను ఈడికి ఒచ్చిన అని చెప్పు .. మూడ్రోజులు ఉంటా ” అన్నాను
 బావ వినిపించుకోకుండా నా లగేజ్ బ్యాగ్ లోపల పెట్టీ వెళ్ళిపోయాడు.రాత్రి అన్నం వడ్డించేటప్పుడు నాకు ఒక గుడ్డు అదనంగా  పెట్టిపించాడు.
  తర్వాత రోజు చిన్నపాటి సర్వే చేశాము.ఇంకో రోజు అంగన్వాడీ లో పౌష్టికాహారం మీద చార్ట్స్ తయారు చేసి పెట్టాము.మధ్యలో రెండురోజులు వేరే తాండాకు వెళ్ళాము.అక్కడ భూసార పరీక్షలు చేశాము.ఎయిడ్స్ అవేర్నెస్ ప్రోగ్రాం చేశాము..రిపోర్ట్స్ నిజామాబాద్ కు పంపాము.
  క్యాంప్ పనుల్లో వారం ఎలా గడిచిపోయిందో తెలియలేదు..చివరి రోజు మీటింగ్ కు ఏర్పాట్లు చేశాము.పెద్ద పెద్ద డాక్టర్స్ , రాజకీయ నాయకులు వచ్చారు.సాయంత్రం పర్పుల్ చీర కట్టుకుని అందంగా రెడీ అయ్యాను.మా ప్రోగ్రాం ఆఫీసర్ మేడం కు అసిస్ట్ చేస్తూ , గెస్టులను రిసీవ్ చేసుకుంటూ బిజీగా ఉన్నాను. పంచాయతీ వార్డు సభ్యులు సుశీల భూపాల్రెడ్డి , ఆమె కొడుకు కూడా వచ్చారు.నేను దగ్గరికి వెళ్ళి ఆమెను స్టేజ్ మీదకు తీసుకొచ్చాను.నన్ను గుర్తుపట్టిందో లేదో కానీ నవ్వింది.
  స్పీచులు అవుతున్నాయి.అందరూ మా మేడం మీద ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.మేడం గారి భర్త పిల్లలు కూడా వచ్చారు.
  మా వసతి వెనక సందులో కొట్టం ప్రక్కకు, ఖాళీ స్థలంలో టెంట్లు వేశారు..భోజన ఏర్పాట్లు జరుగుతున్నాయి.నేను టాయిలెట్ కు వెళ్ళాలని కొట్టం వైపు వెళ్ళాను. భోజనాల దగ్గర ఏదో గొడవ అవుతుంది. భయంగా పరిగెత్తి అక్కడకు వెళ్ళాను.
  ” నీ అమ్మని.. ఈళ్లకు కండ్లు నెత్తిమీదికెక్కినయి.. పంచాయతిల బలె జమైన్రుర కొడుకులు.. శీరి పడేస్త ఒక్కొక్కొన్ని.. ఒళ్ళకు జెప్పుకుంటరో సూస్త..” మా బావను బండబూతులు తిడుతూ విక్రాంత్ రెడ్డి.
   ” కాదు పటేల.. ఇన్ల నా తప్పేం లేదు..కరణం బాపు ఏం జెప్తే అదే జేసిన ” బావ సంజాయించ బోయాడు.
  ” నీ అవ్వ..మల్లగదే మాటంటవ్ రా..నీ.. బాడుకవ్..”చెయ్యి లేపబోయాడు
  నాకు కాళ్ళు గజగజ వణికిపోయాయి. గుడ్లనిండా నీళ్ళు.బావ చుట్టూ మగవాళ్ళ గుంపు.చెప్పిన మాట విననందుకో , వెంటనే పనేదో  చెయ్యనందుకో తనకన్నా వయసులో  పెద్దవాడిని ఎన్ని మాటలన్నాడు.
 మా బావ తల్లి స్వయాన నా తండ్రికి తోడబుట్టింది..ఆ మాటలు నన్నే అన్నట్టు , నా శరీరం కంపించింది.కాళ్ళూ చేతులు స్పర్శ కోల్పోయినట్టు అనిపించింది..వేరేవాళ్ళు వచ్చి సర్దిచెప్పి బావను ఇంటికి పంపారు.
 “పెద్దపటేల్ పెంటకు ఉన్నంత ఓపిక గంగడికి..ఎంత పని జేసినా ఈదొర ఏదోఒకటి అంటడు ” వెనకనుండి మాటలు వినిపిస్తున్నాయి.
  మేడం స్టేజ్ దగ్గర నన్ను పిలుస్తున్నారని ఒకమ్మాయి వెతుక్కుంటూ వచ్చింది.నాకు అత్తమ్మ ఇంటికి పోవాలనిపించింది..బావ తోని, వాళ్ళ పిల్లల తోని మాట్లాడాలనిపించింది. మాదిగ ఇండ్లు ఊరు దాటి , మాలపల్లి దాటి చాలా దూరం పోవాలి. ఒక్కరోజూ పోలేకపోయాను..
  కన్నీళ్ళు ఆపుకుంటూ మేడం దగ్గరికి వెళ్ళాను.కన్నీళ్లతోనే బెస్ట్ వాలంటీర్ ప్రైజు అందుకున్నాను..
  ఆరోజు అర్థమైంది..నా వాళ్ళను మనుషులుగా చూడనివాడు ఎంతటి గొప్పవాడైనా నాకు పురుగుతో సమానం.
 తర్వాత ఆ సంగతి మా బావతో ప్రస్తావించినా అది చిన్న మామూలు విషయంగా కొట్టిపడేశాడు..
  అది చిన్న విషయం కాదు అని నాకు అర్థం అయ్యింది..నా అస్తిత్వ0..ముఖ్యంగా అట్టడుగు కులం , భూస్వామ్యం , శ్రమదోపిడీ , దురహంకారం ఇవన్నీ నావాళ్ళల్లో ఎంతటి ఆత్మన్యూనతను నింపాయో అర్థమైంది.
  వారంరోజుల పాటు ఎంతో రెస్ట్లెస్ గా గడిపాను.
లైబ్రరీలో మెట్ల కింద పడేసిన పుస్తకాల్లో ఒక దుమ్ము పట్టిన చిన్న పుస్తకం ఆసక్తి కలిగించింది..
ఆ పుస్తకం నాలోని ఆలోచనలకు మరింత స్పష్టమైన రూపం ఇచ్చింది..
                     ( సశేషం)

రజిత కొమ్ము

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు