ఆ రోజు డిశంబర్ 11, 1967…..క్లాసులు పూర్తి చేసుకుని, హాస్టల్ 1 లో నా గది కి వచ్చి ఆ సాయంత్రం పూట అలా నడుం వాలుద్దాం అని పక్క మీద పడుకోగానే ….ఎక్కడి నుంచో ఒక చిన్న రణగొణ నాదం..అప్పటి వరకూ ఏ నాడూ వినని శబ్దం..తరుముకుంటూ వస్తున్నట్టూ….అర సెకన్ లోనే దాని స్థాయి ప్రళయ నాదం లా పెరిగిపోయి, మరొక సెకన్ లో నేని ధభీమని నేల మీదకి పడిపోవడం, గది అంతా ఊగిపోవడం, నేను చదువుకునే బల్ల, దాని మీద పుస్తకాలూ, పెన్నులూ కదిలిపోయి, బల్ల మీద నుంచి జారిపోవడం …అంతా అర క్షణం లో జరిగిపోయింది. హఠాత్తుగా లైట్లు పోయాయి. నాకు చెమట్లు పట్టేసి గది బయట వరండాలోకి రాగానే పక్క గదుల్లోంచి రావూ, మూర్తీ, పండాలై, రాధాకృష్ణన్, దాల్జీ ఇలా అందరూ అరుచుకుంటూ బయటకి వచ్చేశారు….అప్పుడు అందరికీ అర్ధం అయింది. అప్పుడు జరిగిన ఆ భయంకరమైన సంఘటన మేము ఏనాడూ ఊహించని ఒక భూకంపం అని. బొంబాయికి సుమారు 350 కి,మీ దక్షిణంగా, పశ్చిమ కనుమలలో కొయనా నది మీద ఉన్న అతి పెద్ద ఆనకట్ట దగ్గర రికట్ర్ స్కేల్ మీద 6.5 నమోదు అయిన భూకంపం వచ్చినట్టూ…ఆ ప్రకంపనల ప్రభావం వలననే బొంబాయి లో కూడా భూమి కంపించినట్టూ బేటరీ రేడియోల ద్వారా విని అందరం ఆశ్చర్య పోయి, బతికి బయట పడినందుకు ఆనందపడిపోయాం. ఆ నాటి కొయనా భూకంపం లొ సుమారు 200 మంది చనిపోగా, వల కోట్ల ఆస్తి నష్తం జరిగింది. నా జన్మలో ఏదైనా మర్చిపోగలనేమో కానీ ఆ నాటి ఆ ప్రళయ నాదం, ఆ అనుభవం మర్చిపోయే అవకాశం లేదు.
ఇప్పుడు ఇదంతా ఎందుకు వ్రాయవలసి వచ్చిందీ అంటే….నేను చదువూ, సంధ్యా, క్రికెట్టూ, టేబుల్ టెన్నిసూ, నాటకాలూ వగైరాలకి అతీతంగా సాంకేతిక నీ సమాజ సేవకి అన్వయించే అవకాశం కొయనా భూకంపం వలన, అది జరిగిన ఐదారేళ్లకి కలిగింది…అంటే సుమారు 1970-71 ప్రాంతాలలో. అప్పటికి అసలు కొయనా లో ఆ భూకంపం రావడానికి ప్రధాన కారణం అక్కడి రిజర్వాయర్ లో భారీగా చేరిన నీళ్ళ వలన పెరిగిన ఆ నీటి బరువు అని నిర్ధారించారు. ఆ పశ్చిమ కనుమల ప్రాంతం లో ప్రతీ ఏడూ సుమారు 200 అంగుళాల దాకా కురిసే వర్షం నీరు ఎక్కడా అడ్డూ అదుపూ లేని కారణం చేత చిన్న చిన్న కాలవలు గా మారి, కొయనా నది ద్వారానూ, ఇతరత్రానూ ఆ రిజర్వాయర్ కి చేరుతుంది. అందు చేత అంత బరువు.
కాలం లో కాస్త ముందుకి వెళ్తే…
1973 ప్రాంతాలలో అనిల్ దాతే అనే పొడుగు జులపాల మహారాష్ట్రియన్ యువకుడు మా డిపార్టెమెంట్ లో హీట్ ట్రాన్సఫర్ & థెర్మొడైనమిక్స్ లో లెక్చరర్ గా చేరాడు. అతను బొంబాయి వాడే. అక్కడ స్థానిక విక్టోరియా జూబిలీ టెక్నికల్ ఇన్ స్టిట్యూట్ లో ఇంజనీరింగ్ చదివి, యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్, ఇంగ్లండ్ కి వెళ్ళి, లండన్ లో ఇంపీరియల్ కాలేజ్ లో డాక్టరేట్ చేసి జీన్స్ పంట్లాం తో దిగిమతి అయిన వాడు. చెప్పొద్దూ, సాధారణంగా అమెరికా, లండన్ ల నుంచి దిగుమతి అయి, ఎత్తులో ఉండే వాళ్ళని చూస్తే నా బోటి దేశవాళీ వాళ్ళకి ఒళ్ళు మండుతూ ఉండేది. కానీ ఈ అనిల్ అలా కాకుండా మా స్టాఫ్ హాస్టల్ బేచ్ లో కలిసిపోయాడు. పైగా మంచి క్రికెట్ ఆటగాడు. అందగాడు కూడానూ. ఎందుకో తెలియదు కానీ మా ఇద్దరికీ భలే స్నేహం కుదిరిపోయింది. అతి త్వరలోనే మేము టెక్నాలజీ ట్రాన్సఫర్, ప్రపంచీకరణ మొదలైన విషయాల మీద మాట్లాడుకోవడం మొదలు పెట్టాం. అతని దగ్గరే నేను మొదటి సారి “Appropriate Technology”, “Intermediate Technology” “Decentralized development” లాంటి మాటలు విన్నాను. అతను లండన్ లో ఇంపీరియల్ కాలేజ్ లో చదువుతున్నప్పుడు E.F. Schumacher అనే ఎకనమిస్ట్ స్థాపించిన Intermediate Technology Development Group, ITDG) లో ఉన్నాడో, పరిచయం ఉందో లేదో తెలియదు కానీ ఆ మేధావి అలోచనా విధానం చాలా నిర్మాణాత్మకంగా ఉంది. ఆ షుమాకర్ అనే ఆయన జర్మనీ లో పుట్టి ఇంగ్లండ్ లోనూ అమెరికాలోనూ చదువుకున్న ఆర్ధిక శాస్త్రవేత్త. 1955 లో ఆయన ఒక సారి బర్మా వెళ్ళినప్పుడు అక్కడి స్థానిక పరిస్ఠితులని గమనించి “Budhist Economics” అనే కొత్త సిధ్ధాంతాన్ని ప్రతిపదించారు. ఆ ప్రతిపాదన సారాంశం ఏమిటంటే “”బడుగు దేశాలలో గ్రామాలలో ఉండే స్థానికులకి అక్కడి వనరుల మీద, వారి శక్తియుక్తుల మీద ఆధారపడిన ఉద్యోగ కల్పన ద్వారానే ఉత్పాదన, ఆర్ధిక సంపద పెంపుదల జరగాలి. అంతే కానీ స్థానికత తో ముడిపడకుండా దిగుమతి చేసుకున్న సాంకేతిక వలన అభివృధ్ది జరగదు.” షుమాకర్ గారి ప్రతిపాదనలకి ప్రాతిపదిక మహాత్మా గాంధీ గారి గ్రామీణ ఆధారిత ఆర్ధిక పురోగతి సిధ్ధాంతాలూ, వాటిని రూపొందించిన ఆర్ధిక శాస్త్ర వేత్త జె.సి. కుమరప్ప గారి వివరణలూ. E.F. Schumacher గారు 1973 లో ప్రచురించిన “Small is Beautiful” అనే మహత్తరమైన చిన్న గ్రంధం ప్రపంచవ్యాప్తంగా చాలా మందికి భగవద్గీత తో సమానం.
ఇక ఎప్పుడయితే మేము ఇద్దరమే కాక, సత్య తల్వార్, నీలిమ సక్సేనా, ఏ,జి. రావు, అత్వంకర్ లాంటి మిత్రుల సమాలోచనలు మొదలయ్యాయో, అప్పుడే అనిల్ దాతే కి మా ఐఐటి లోనే అలాంటి టెక్నాలజీ కి గ్రూప్ ఒకటి మొదలు పెడదాం అనే ఆలోచన వచ్చింది. అందరం కలిసి, మా డైరెక్టర్ కేల్కర్ గారిని కలిసి ఆయన అనుమతి తో “Appropriate Technology Unit” (ATU) అనే పేరిట ఒక సంస్థ ఏర్పాటు చేశాం. దానికి అనిల్ దాతే అధ్యక్షుడు. అన్ని డిపార్ట్మెంట్స్ నుంచీ ఒకరిద్దరు ఆసక్తి ఉన్న ప్రతినిధులతో కూడిన ఆ “అటు” గ్రూప్ అప్పుడు స్వఛ్చంద సంస్థ. ఏవైనా గ్రామాలలో “Sustainable Development” కార్యక్రమాలు చేపడదాం అనేదే మా ఉద్దేశ్యం.
ఈ ““Appropriate Technology Unit” (ATU)” తొలి సమావేశాలలో ఎవరో యాదాలాపంగా అలనాటి కొయనా భూకంపం, తదుపరి పరిణామాలలో ఆ కొయనా నదీ పరీవాహిక ప్రాంతాల గ్రామాలలో చెక్ డామ్ లనే చిన్న, చిన్న ఆనకట్టలు కట్టే విషయం ప్రస్తావనకి వచ్చింది. ఎందుకంటే అత్యధికంగా వర్షం పడే ఆ నీటిని వడిసి పట్టుకుని, ఎక్కడికక్కడే నిలవ చేసి సాగు నీరుగానూ, తాగు నీరు గానూ వాడుకోడానికి ఆ పరీవాహక ప్రాంతం లో ఉన్న పల్లెటూళ్ళలో చెక్ డామ్..అనే చిన్న చిన్న ఆనకట్టలూ, వాటికి రిజర్వాయర్లూ వందల సంఖ్యలో నిర్మించడం ఆ రోజుల్లో వచ్చిన ఒక ప్రతిపాదన.
అప్పుడు నా దగ్గర “హోమ్ పేపర్” చేస్తున్న ఒక మరాఠే అనే స్ట్యూడెంట్ తనది ఆ ప్రాంతమే కాబట్టి ఆ ప్రయత్నం చేద్దాం సార్ అన్నాడు. ఆ రోజుల్లో ఐఐటి లో బి.టెక్ చదువుకునే వాళ్ళు ఆఖరి సంవత్సరం లో..అంటే ఐదో ఏడు ఒక లెక్చరర్ సహాయంతో ఏదో ఒక సాంకేతిక అంశం మీద ఏడాది పాటు పరిశోధన చేసి దాన్ని ఒక థీసిస్ రూపం లో సమర్పించి, పరీక్ష లో నెగ్గాలి. ఈ విషయం లో నేనూ, మూర్తీ భిన్నంగా ఉండే వాళ్ళం. ఎందుకంటే బాగా చదివే విద్యార్ధుల హోమ్ పేపర్ బాధ్యత కోసం ప్రొఫెసర్లూ, లెక్చరర్లూ పోటీ పడేవారు కానీ నేనూ, మూర్తీ మటుకు క్లాసులో వెనకబడిన వారిని మాత్రమే తీసుకుని, వారితో వ్యక్తిగతమైన పధ్దతిలో, స్నేహంగా ఉంటూనే అద్భుతమైన పరిశోధనా పత్రాలు చేయించే వాళ్ళం. అది మాకూ, ఆ విద్యార్ధులకీ చాలా సంతృప్తిని ఇచ్చేది. అలాంటి విద్యార్థే ఈ మరాఠే అనే కుర్రాడు. తెలివైన వాడే కానీ అతనికి సమాజ సేవ మీద ఉండే తపన వలనే ఆ ధ్యాసలో పడి క్లాస్ లో గొప్పగా మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసేవాడు కాదు.
ఇహనేం….మా “అటు” తలపెట్టిన తొలి కార్యక్రమాలలో నేనూ, మరాఠే అనే ఆ విద్యార్థీ ఆ చెక్ డామ్ నిర్మాణం చేపట్టాం. ముందుగా అప్పుడు దొరికిన ఆధారాల ద్వారా అక్కడి భౌగోళిక పరిస్థితులు, చిన్న చిన్న కాలవల వివరాలు, నిర్మాణానికి స్థానికంగానే దొరికే రాళ్ళూ, రప్పలూ, ఇసుకా, సిమెంటూ…వగైరా సమాచారం అంతా సేకరించి ఏ కాలువ మీద మొదటి చెక్ డామ్ కట్టగలం, దాని డిజైన్ తయారు చేశాం. ఈ తతంగానికి సుమారు మూడు నెలలు పట్టింది. ఇక చెయ్య వలసినది అల్లా మేము ఆ గ్రామానికి వెళ్ళి స్థానికులతో మాట్లాడి, వాళ్ళని ఒప్పించి పని పూర్తి చెయ్యడం. అదెంత పని లే అనుకున్నాం….కానీ…
బొంబాయి నుంచి ముందు రైలు లో పూనా వెళ్ళి, అక్కడి నుంచి ఆ కొయనా నది పుట్టుక ప్రాంతం అయిన మహాబలేశ్వర్ మీదుగా రెండు బస్సులు మారి ఆరు గంటల సుదీర్ఘ ప్రయాణం తర్వాత సాయంత్రం సమయానికి నేనూ, మరాఠే ఆ ఊరు చేరాం. హమ్మయ్య అనుకుని బస్సు దిగబోతుంటే గ్రామ రౌడీలలాంటి నలుగురు…నమ్మండి, నమ్మక పొండి… మా ఇద్దరికీ అసలు ఏం జరుగుతోందో అర్ధం అయే లోపుగానే మా ఇద్ద్దరినీ కాలర్ పట్టుకుని, బలవంతంగా మళ్ళీ బస్సులో కూచోబెట్టి ఆ కండక్టర్ కి కోపంగా ఏదో మరాఠీ లో చెప్పి బస్సు ఆగకుండా పంపించేశారు. జరిగిన విషయం ఏమిటంటే “ఎక్కడో బొంబాయి నించి ఎవరో కుర్రాళ్ళు ఇక్కడికి వచ్చి, మన ఊళ్ళో మన మంచికి మనం ఏం చెయ్యాలో చెప్తారుట.” అనే కబురు వాళ్ళకి ముందే ఎలాగో వెళ్ళింది. దాంతో “మనం ఏమన్నా వెర్రి పప్పలమా? మా ఊరికి ఏం కావాలో బొంబాయి వాడికేం తెలుసు. అసలు వాడికేం సంబంధం?” అని ఆ ఊరి పెద్దలకి చాలా కోపం వచ్చింది. చచ్చినట్టు మేము మళ్ళీ బొంబాయి వెళ్ళి పోయి “ఇప్పుడెలా?” అని తలలు పట్టుకున్నాం. అప్పుడు నాకు ఓ ఐడియా వచ్చింది. ఎందుకంటే..ఈ మరాఠే కి మరాఠీ భజన గీతాలు పాడడం బాగా వచ్చును. వాటిల్లో సరళమైన వాటికి నేను కాస్త లయబధ్దంగానే కంజీరా వాయించగలను. అంచేత ఈ సారి ఇద్దరం మరీ కాషాయాలు కాకుండా మెడ లో రుద్రాక్షలు వేసుకుని, లాల్చీ, పజామాలతో ఆ ఊరు వెళ్ళగలిగితే ఎలా ఉంటుందీ అనేదే నా ఆలోచన. అది తల్చుకుంటే నాకు ఇప్పటికీ నవ్వు, ఆశ్చర్యం కలుగుతాయి. కానీ అప్పుడే పాతికేళ్ళు దాటిన ఆ వయసు, ఆవేశం, పౌరుషం అటువంటివి. ఎలాగో అలాగ ఆ ఊళ్ళో అడుగుపెట్టి పని అయేటట్టు చూడడమే మాకు కావలసినది.
చెప్పొద్దూ. ఈ ఆలోచన అద్భుతంగా పని చేసింది. ఆ తరవాత అంతా సినిమా కథ లాగానే జరిగింది. ఈ సారి మేము ఆ ఊళ్ళో బస్సు దిగినప్పుడు మరాఠే చేతిలో తంబూరా, నా చేతిలో కంజీరా ఉన్నాయి. ఇద్దరం ముందు అక్కడి చిన్న గుడి దగ్గర చెట్టు క్రిందన కూర్చుని మరాఠీ భజనలు పాడడం మొదలు పెట్టాం. మెల్లగా జనం పోగయ్యారు. సుమారు వెయ్యి గడప ఉన్న ఆ ఊళ్ళో మేము తిష్ట వేసి, అక్కడి పెద్దలతోటీ, యువకుల తోటీ స్నేహం చేసుకోడానికి నాలుగైదు రోజులు పట్టింది. ఒక సారి వాళ్ళకి మా మీద నమ్మకం కుదిరాక ఇక మేము వచ్చిన పని పది రోజులలోనే అయింది. వర్షం నీరు వృధాగా పోకుండా, వరద వచ్చి ఊరు ములిగిపోకుండా, కాలవలు ఒరిసి పోకుండా, బురద పేరుకు పోకుండా ఉండే మా మొత్తం చెక్ డామ్ ల ప్రణాళిక వాళ్ళకి వివరించి ఒప్పించగలిగాం. వాళ్ళతో కలిసి ఒక చెక్ డామ్ నిర్మాణం పూర్తి చేశాం. అప్పటి అసలు ఫొటోలు లేవు కానీ, అలాంటిదే మరొక ఫొటో ఇక్కడ జతపరుస్తున్నాను.
అనివార్యంగా, నాకు ఎంత ఆసక్తి ఉన్నా, నా డాక్టరేట్ పనీ, టీచింగ్ మొదలైన అనేక వ్యాపకాల వలన నేను ఈ ‘Appropriate Technology” కార్యక్రమాలలో అనుకున్నంత గా పాల్గొన లేక పోయాను. ఆ “ATU” విభాగం పునాదులు బలపడే సమయం లో నేను అమెరికా వలస వచ్చేసి, ఈ అత్యాధునిక అమెరికా సాంకేతిక ప్రపంచం లో ములిగి పోయాను. ఆ నాటి ATU అనిల్ ఆధ్వర్యం లో “Center for Technology Alternatives for Rural Areas” (CTARA) అనే పేరిట పూర్తి స్థాయి డిపార్త్ మెంట్ గా ఎదిగింది అనీ, అనేక కార్యక్రమాలు చేపట్టి విజయవంతంగా నడుస్తోంది అని గూగుల్ ద్వారా తెలుసుకున్నాను.
1973 లో తీసిన మెకానికల్ క్లాస్ ఫొటో ఇక్కడ జతపరుస్తున్నాను. ఈ ఫొటొలో ఫేకల్టీ అందరం ముందు వరసలో కుర్చీలలో కూర్చున్నాం. సరిగ్గా గమనిస్తే వాళ్ళలో పొడుగు జులపాలు ఉన్న వాడు అనిల్ దాతే అయితే చిన్న జులపాల వాడే భవదీయుడు. నాకు ఒక పక్కన మా డిపార్ట్మెంట్ హెడ్ ప్రొ. సుఖాత్మె, రెండో పక్కన ఇప్పుడు అమెరికా లో ప్రముఖ ఆచార్యుడు, కవి. నాకు ఆత్మీయ మిత్రుడూ డా. చంద్రుపట్ల తిరుపతి రెడ్డి. కుర్చీలలో ఎడం వేపు నుంచి మొదటి వ్యక్తి ఇప్పుడు అమెరికాలో ఉన్న మరొక ఆత్మీయ మిత్రుడు డా. ప్రభాకర రెడ్డి. ఆ విద్యార్ధులలో చాలా మంది అమెరికాలోనే ఉన్నారు కానీ ఏమో, ఎక్కడో?
1974 లో నేను అమెరికా వచ్చినప్పుడు సాగనంపడానికి బొంబాయి శాంతాక్రజ్ విమానాశ్రానికి వచ్చిన అనిల్ దాతే ని అదే ఆఖరి సారి చూడడం. ఆ తరువాత ఏడాది పాటు ఉత్తరాలు వ్రాసుకున్నా, అనిల్ దాతే తో పాటు ఆ నాటి అనేక స్నేహాలు కాలగర్భం లో కలిసిపోయినట్టుగా ఉన్నా, నా జ్ఞాపకాల పొదిలో పదిలంగానే ఉన్నాయి.
ఇందిరా గాంధీ, జై రామ్ రమేష్ ల జ్ఞాపకాలతో మరొక సారి కలుద్దాం.
*
Add comment