ఏ దిక్కు నుండి రమ్మంటవ్ !

వేణు ఊడుగుల ఇటీవల రాసిన కవిత “పగడపు కన్నీరు”. “నీదీ నాదీ ఒకే కథ” సినిమాతో దర్శకుడిగా పేరుపొందిన కవి. ఇప్పుడు “విరాటపర్వం” విడుదలకు సిద్ధంగా వుంది. రాశిలో కన్నా వాసిలో గొప్ప కవిత్వం రాసిన వారిలో వేణు ఒకరు. ఇప్పటికైతే సాహిత్యలోకానికి ఒక కవిత్వ సంపుటి బాకీ వున్నాడు. త్వరలో తీసుకొస్తాడేమో చూడాలి. మానవసంబంధాలు ఇతివృత్తంగా రాసిన ఈ కవిత హృద్యంగా వుండి, మనసుని, గుండెని మెలిపెడుతుంది.
పగడపు కన్నీరు
~
నిన్ను తనివితీరా చూసుకుని పోదమనుకుంటిమి
కడచూపుకైనా నోచుకోకపోతమా అనుకుంటిమి
పుడమిలోనెంచగల బిడ్డవైనావనుకుంటిమి
నీరున పుట్టిన పొలములెక్క
నువ్వు పచ్చగుండాలనుకుంటిమి
మేడారంల బెల్లమిస్తిమి
ఉప్పలమ్మకు కల్లు శాకపోస్తిమి
తొలిపొద్దు నుండి మలిపొద్దు దాక
అరుగు మీద కూర్చొని
పిట్టకుబెట్టినట్టు ఎదురుచూడబడ్తిమి
వానలేని పిడుగోలే ఎగిరొస్తవనుకుంటిమి
మంచానికి ఒకపక్క నేను
మరోపక్క మీ నాయిన
ఒకరికి తెల్వకుండ ఒకరం
కన్నీళ్లు పెట్టుకుంటిమి
పండుగలకు రాకపోతివి
పెళ్లిల్లకు రాకపోతివి
పోనీ చావులకన్న వచ్చినవా ఎప్పుడైనా?
మీ పెద్దమ్మలు పాయే
మీ పెద్దనాయినలు పాయే
ఇప్పుడు మావంతు వచ్చె!
ఉండొచ్చు బిడ్డా
నీ కథ నీకుండచ్చు
మా కథ మాకుండచ్చు
లాభమేమి జరిగెను చెప్పు
బతకడానికి పోయినోడివి
మేం బతికుండగ రాకపోతివి
ఉడుత చప్పుడు కూడా ఉప్పెన రీతిగా తోచె
ఇక ఈ మాయ జీవముతో
మా ఋణానుబంధం తీరిపోయింది
అమర గాలి భస్మమైపోయింది
అసురసంధ్య వేళకు ముందే
కట్టెలన్నీ కాలి బూడిదగుతాయి
అయినా దు:ఖం దూరమవ్వదు
ఆత్మలు నిర్మలం కావు
నా మనవళ్లు మనవరాళ్ళను
ఊరంతా వినబడేటట్టు గట్టిగట్టిగా ఏడ్వమను
ముత్యపు కన్నీరు
కంఠహారంగా రాల్చమను
పగడపు కన్నీరు
పూలపాన్పుగా వేయమను
చుట్టాలను హత్తుకుని వలపోయమను
లేదంటే గుణహీనులనుకుందురు
చెప్పిన కాకి నెపముల చాలించి
దింపుడుకల్లం ఆశల్ని వధించు
కాటికాడ మా చెవులల్లో ఎంతసేపు పిలిచినా
మేమైతే రాము…
ఎట్లొస్తమ్ చెప్పు
ఏ దిక్కునుండి రమ్మంటవ్ చెప్పు
మేం పిలిచినప్పుడు నువ్వొచ్చినవా ఎప్పుడైనా!
*
బతికున్నంతకాలం జీవితానికి సరిపడా దు:ఖాన్ని మూటగట్టుకోవడం, ముగింపు తర్వాతి వేదనను మోసుకుతిరగడం, ఏమీచేయలేకపోయాననే ఆత్మన్యూనతను గుండె కొక్కేనికి వేలాడదీసుకుని కుంగిపోవడం, మానవసంబంధాలు ఎంత ఉదాత్తమైనవో నేర్పే తాత్విక ధోరణి కనిపిస్తుంది. నాణేనికి రెండువైపులా విస్తరించిన సంఘర్షణను చెబుతూనే పాటించాల్సిన సంయమనాన్ని, నిర్వర్తించవలసిన విద్యుక్తధర్మాన్ని, ఏ రోకు ఒరిగిపోకుండా కాపాడుకుంటూ సమన్వయం చేసుకోవాల్సిన మనస్సంబంధిత మానవ నైజాన్ని పొడచూపుతుంది. విడదీయరాని ప్రేమపాశాలు, చావుకు ముందూవెనకా వుండే మానసికపరమైన అనుబంధాలు, అనురాగాలు, అవ్యాజమైన ఆర్తి నిండినగుండెగొంతుకలో కొట్లాడే తత్వం మనిషితనాన్ని ప్రశ్నిస్తుంటాయి.
*
ఎంతగనం తండ్లాడి తండ్లాడి జీవిడ్శిండ్లో, బతికున్నప్పుడు ఎదురుసూపుల్లోనే ఎంత తల్లడమల్లడయిన్లో, కన్నోళ్ళపానమెంత కొట్టుకున్నదో, బిడ్డల మీద ఎంతగనం మనసు గుంజిందో “ఎత్తుగడ” లోనే ప్రారంభవాక్యం చెబుతుంది.
“నిన్ను తనివితీరా చూసుకుని పోదమనుకుంటిమి”
“అనుకుంటిమి” అనే suffix లోనే ఎడతెగని దు:ఖపుజీర, ఒక జీవితకాలపు సఫకేషన్, ఊపిరాడనితనం వుంది. ఎంత అణచుకుంటే, ఎంత మానసిక పరివేదనకు గురైతే ఒక మనాది వాక్యం పెల్లుబుకుతుంది? పోయేటప్పుడు కూడా పొడిబారిన ‘ఆ తడి కండ్లలోని వెలుగు’ వెంటాడుతున్నట్టు అనిపిస్తుంది. కవి అప్రస్తుతమై, కవిత్వప్రక్రియ నిరర్ధకమై జీవితమే దృశ్యకావ్యంగా పాఠకుడికి దర్శనమివ్వడం ఈ కవితలోని గొప్పదనం.
*
ఒకటి తల్లిదండ్రులవైపు, రెండోది పిల్లల వైపు రెండు దిక్కులా ఆలోచింపజేసిన విధానం హృదయాన్ని ద్రవింపజేస్తుంది. ఎక్కువమంది పాఠకులు తల్లిదండ్రులవైపే మొగ్గుతరు. మొగ్గాలి కూడా!
*
కనిపించని పార్శ్వాల్లో కుటుంబం, పిల్లల పెంపకం, ఆర్ధిక స్థితిగతులు, ఆధునిక జనజీవిత ప్రభావం ప్రత్యేకంగా ఇమిడే అంశాలు. కొడుకు తల్లిదండ్రులను చూడడానికి కూడా రాకపోవటానికి కారణమేంటి? కొడుకును వూరికి రాకుండా అడ్డుపడుతున్న విలోమ చరాలు ఏమై వుంటాయి? కొడుకు తన జీవితాన్ని వెతుక్కుంటూ దూరదేశాలకు వలసెల్లిపోయిండా? చిమ్మిచ్చిపోత్తె తడిసిపోయేంత దగ్గరపట్లనే వుండి రాలేకపోతాండా? కొడుకు పరిస్థితి తెల్వదు. అయితే “ఉండొచ్చు బిడ్డా/నీ కథ నీకుండొచ్చు/మా కథ మాకుండచ్చు/లాభమేమి జరిగెను చెప్పు” అని తల్లి అనడంలో కొడుకు పట్టింపులేనితనం, అతని కుటుంబ పరిస్థితుల మీద రకరకాల ఊహాగానాలకు తావిస్తుంది. కుటుంబసంబంధ బాంధవ్యాల పట్ల మనిషికి ‘పట్టువిడుపు’ వుండాలని మాత్రం తెలుస్తుంది. మొండికేశి బతికితే చివరికి మిగిలేది బూడిదే అనే సత్యాన్ని ఏరుకపరుస్తుంది.
*
పిల్లల మీద తల్లిదండ్రులకు వుండే expectations, వారి సామర్ధ్యాన్ని సరిగా అంచనా వేయడంలోని లోపాల్ని పరోక్షంగా ఎత్తిచూపుతుంది. ఇల్లువదిలి వెళ్లిపోయిన సిద్ధార్ధుడు బుద్ధుడై జ్ఞానోదయంతో తిరిగి దర్శనమిస్తాడని తల్లిదండ్రులు ఆశించి వుండొచ్చు. నెరవేరని కోర్కెలు తీరాలని సాధారణంగా మొక్కులప్పజెప్పుతం. మేడారంల సమ్మక్కకు బెల్లమిచ్చుడు, ఇంటికాడి ఉప్పలమ్మకు కల్లుబొట్లు శాకబోసుడు ఇవన్నీ కొడుకు రావాలని ఆశించి చేసిన పనులు. ఇట్లజేత్తెనన్న వత్తడని ఒక పురా నమ్మకం. పిట్టకుబెట్టినట్టు ఎదురుసూసుడు సుదీర్ఘమైన ప్రక్రియ. ఇది కాలాన్ని తెలిపే element.
వానలేని పిడుగోలే ఎగిరొస్తడనుకునుడు – సంశయాన్ని తెలియజేసే ప్రతీక. వస్తే వస్తడు. లేకుంటే లేదు. 50 – 50 ఛాన్స్ వుంది. మొక్కులప్పజెప్పిన్రు కదా.. ఫలితం కనబడకపోదా అన్నది వాళ్ళ ‘ఉగ'(ఎట్లజేశినా వాడు రాడనేది బహుశా వాళ్ళకు ముందే తెలిసిన విషయమై వుంటుంది). దీనికిముందు ఏదో ఒక బలమైన సంఘటన మూలకమై వున్నదని అర్థమవుతుంది.
*
Expectations నెరవేరనపుడు అసంతృప్తికి లోనై బాధపడి, కండ్లనిండా దు:ఖం తీసుకునుడు, ఒగలకు తెల్వకుంట ఒకలు ఏడ్వడంలోని మతలబు ఏమై వుంటది? ఏడ్ఛే సంగతి ఇద్దరికీ తెలుసు. కాని ఒకరికొకరు ఎదురుపడకూడదనుకోవడం వారి మానసికస్థైర్యాన్ని ప్రతిబింబిస్తుంది.
*
నిరాశా, నిస్పృహల నుండి arguments వినిపిస్తాయి. అది సాధారణమే. కొలుపుబెట్టుకుంట ఏడ్సుడు పల్లెల్లో అందరికీ పరిచయమే. మునుంబెట్టి అందరుబోతాన్లు. ఇగ మేం సుత సావుదలకువచ్చినం. ఇగనన్న వత్తడో రాడో అన్నది ఆ కొలుపుకు పూర్తిపాఠం.
compramise అవడం,సయోధ్య కుదుర్చుకోవడం, వానికేం బాధలున్నయో, చెప్పుకోలేని ఎతలు ఎన్నున్నయో కొడుక్కు!అనుకుంటనే లోకరీతిని జెప్పుడు వారి పరిణతిని తెలుపుతుంది.
“ఉడుత చప్పుడు కూడా ఉప్పెనరీతిగా తోచె” అనటంలో ఆఖరి నిమిషంలో జీవి ఎంత అగులుబుగులైందో, పోయేపానాన్ని ఉగ్గబట్టుకుని ఎంతసేపు నిలుపుకున్నరో అని అనిపించకమానదు. ఇవన్నీ highly intensive vibrations గా చెప్పొచ్చు. ఆ రెండు చిలకల పానం ఇక్కడున్నది. ఇంగేమున్నది అంత అయిపాయే. అయినా ఎడ్డినాకొడుకు ఏడ్తడో లేదో.. ఏడ్వకపోతే లోకం ఏమనుకుంటదోనని సచ్చిన తల్లిగుండె ఎంత పోరు బెడ్తాందో, కొడుకు మీదమాటబడొద్దని ఇంకెన్ని బుద్ధులు జెప్తాందో అనిపిస్తుంటది. ఆఖరి ఘట్టానికొచ్చినంక దింపుడుగల్లం ఆశలేముంటయో జెప్పున్రి. సచ్చినంక కొడుకు మీద అలుగుడు సూత్తె ఎంత పాయిరంగ సాదుకున్నరో, పురుగుబూశి ముట్టకుంట ఎంత గావురంగ సూసుకున్నరో తల్సుకుంటే ఎవ్వలకైనా దుక్కం ఆగదు. ముగింపు ఒక సెటైర్ లా వీపు మీద గట్టిగ సర్శినట్టనిపిత్తది.
*
ఉద్వేగపూరితమైన అనుభూతిని మిగిల్చిన కవిమిత్రునికి శనార్తులు.
*

బండారి రాజ్ కుమార్

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు